కృష్ణ

డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కోలాహలంగా స్నాతకోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 30: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలం 18వ, 19వ స్నాతకోత్సవ వేడుకలు స్థానిక ఎ కనె్వన్షన్ ఫంక్షన్ హాలులో భారీ పోలీసు బందోబస్తు మధ్య కోలాహలంగా జరిగాయి. పట్టాలు, డిగ్రీలు, బహుమతులు అందుకోవటానికి ఆంధ్ర, తెలంగాణ, రెండు రాష్ట్రాల నుంచి వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ నిర్ణీత సమయానికి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొ.టి.రవిరాజు, రిజిస్ట్రార్ జి.అనూరాధ, సిద్ధార్థ, ఉస్మానియా , ఆంధ్ర, కర్నూలు వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్, డాక్టర్ ఆర్ శశాంక్, డాక్టర్ బి.ప్రభాకరరావు, డాక్టర్ ఎస్‌వి కోమల్, డా.జిఎస్ రామ్ ప్రసాద్, శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల (తిరుపతి) ప్రొ.డాక్టర్ ఎస్.దత్తాత్రేయ రావు, గుడివాడ హోమియో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిసిటి స్వామి తదితరులు వర్సిటీ ఛాన్సలర్ అయిన గవర్నర్ నరసింహన్‌తో పాటు ముఖ్య అతిథి డాక్టర్ కిర్పాల్ సింగ్ భుగ్‌లను వేదికపైకి తోడ్కొని వెళ్లారు. ముఖ్య అతిథి డాక్టర్ భుగ్‌ను వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ టి.వేణుగోపాలరావు సభకు పరిచయం చేయగా గవర్నర్ నరసింహన్ గౌరవ డాక్టరేట్‌తో హర్షధ్వానాల మధ్య ఘనంగా సత్కరించారు. ఈ స్నాతకోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేల 337 మంది పట్ట్భద్రులకు పట్టాలు అందజేశారు. 13 మంది అభ్యర్థులకు పిహెచ్‌డి, 12 మందికి సూపర్ స్పెషాలిటీ, 32 మందికి ఎండిఎంఎస్, పిజి డిప్లొమాలను అందజేశారు. అత్యున్నత ప్రతిభ కనపరచిననందులకు గాను 97 మందికి గోల్డ్ మెటల్స్, 46 మందికి సిల్వర్ మెడల్స్, 42 మందికి నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు మాట్లాడుతూ వర్సిటీలో హెచ్‌డి వీడియో కాన్ఫరెన్స్‌లో విధానం, ఇ-క్లాస్‌రూమ్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. పిహెచ్‌డి విద్యను అందించేందుకు 31 కేంద్రాలను గుర్తించి 131 మందిని గైడ్‌లుగా గుర్తించామన్నారు. ప్రస్తుతం 94 మంది రీసెర్చి చేస్తున్నారని, యూనివర్శిటీకి సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి, లేబరెటరీలు, సమగ్ర పరిశోధన సదుపాయాలతోకూడిన ప్రాంగణం అవసరమన్నారు. డాక్టర్ ఎన్.సుబ్బారావు వందన సమర్పణ చేశారు.

నయవంచకుని నయారూపం
* నీలి చిత్రాలతో నగదుకు బ్లాక్‌మెయిల్
పాయకాపురం, మార్చి 30: నయవంచకుని నయారూపం బట్టబయలైంది...! భార్య చెల్లెల్ని కూడా వదలని ఆ మృగాడు పక్కింటి మహిళ పై కనే్నశాడు. నమ్మిన మహిళకే ప్రత్యక్ష నరకం చూపించి ఆమె నీలి చిత్రాల్ని సెల్‌ఫోన్‌లో బంధించిన నరరూప రాక్షసుడు ప్రస్తుతం కటకటాల వెనుక ఊచలు లెక్కిస్తున్నాడు. అజిత్‌సింగ్‌నగర్ సిఐ బాల మురళీకృష్ణ కథనం ప్రకారం కృష్ణలంకకు చెందిన మండవ రవికాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు వివాహమైంది. కాగా, భార్య చెల్లెలు శ్రీదేవి పై కనే్నసిన రవికాంత్ ఆమెతో సన్నిహితంగా ఉండటం మొదలెట్టాడు. ఎట్టకేలకు శ్రీదేవి తన భర్తకు విడాకులిచ్చి అజిత్‌సింగ్‌నగర్ రామలింగేశ్వరపేటకు మాకాం మార్చింది. రామలింగేశ్వనగర్‌లో నివాసం ఏర్పాటు చేసి శ్రీదేవితో సహజీవనం సాగిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీదేవి ఇంటికి సమీపంలో ఉంటున్న మరో మహిళ (39)తో పరిచయం ఏర్పడింది. ఈమె కూడా భర్త నుండి విడాకులు పొందింది. ఈమె ఇద్దరు సంతానం ఉన్నత చదువులు చదువుతున్నారు. సదరు మహిళ తన తండ్రి పెన్షన్‌తో జీవనం సాగిస్తుంది. ఏలాగైతేనేం.... రవికాంత్ సదరు మహిళతో చనువు పెంచుకుని మోసపూరిత మాటలు చెప్పి ఈమెతో చనువు పెంచుకున్నాడు. సదరు మహిళతో గడిపిన శృంగార దృశ్యాల్ని తన సెల్‌ఫోన్‌లో బంధించి మహిళను బ్లాక్‌మెయిల్ చేసి తనకు డబ్బులు అవసరమైనప్పడల్లా ఆ మహిళను బెదిరించడంతో నిస్సహాయురాలైన మహిళ తన తండ్రి నుండి తీసుకున్న రూ.6 లక్షల్ని రవికాంత్‌కు ఇచ్చింది. తనను వేధించవద్దని వేడుకుంది. నిస్సహాయురాలైన ఆ మహిళ చివరకు భర్త సన్నిదే తనకు రక్షగా భావించింది. విడాకుల విషయాన్ని కూడా పక్కన పెట్టి తన భర్త చెంతకు చేరాలని ఆకాంక్షించింది. విషపాములాంటి రవికాంత్ ఆ విషయాన్ని ఏలాగో గ్రహించాడు. మహిళ నగ్న చిత్రాల్ని ఆమె భర్తకు చేరవేశాడు. ఆమె కాపురాన్ని మరోసారి చిన్నాభిన్నం చేశాడు. అన్ని వైపుల నుండి ఆమెకు తీవ్ర నిరాశ ఎదురవ్వడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

279 జీవోను సవరించకుంటే
ప్రభుత్వ పతనం తప్పదు
* ధర్నా చౌక్‌లో పలు కార్మిక సంఘాల నేతల హెచ్చరిక
* నగరంలో మున్సిపల్ కార్మికుల భారీ రాలీ
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 30: రాష్ట్రంలోని 40వేల మున్సిపల్ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే 279 జీవోను ప్రభుత్వం తక్షణమే సవరించకుంటే కార్మిక ఉద్యమంలో ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరిస్తూ తక్షణమే ప్రభుత్వం తన తప్పిదాన్ని సరిదిద్దుకోకపోతే కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని పలువురు మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చరిగారు. జీవో 279 రద్దు కోరుతూ ఎపి మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐటియుసి రాష్ట్ర డెప్యూటీ జనరల్ సెక్రటరీ ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ జీవోను అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని బడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే రాష్ట్రంలోని పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించి ప్రస్తుతం పనిచేస్తున్న సిఎంఇవై, డ్వాక్రా సంఘాల కార్మికులను తొలగించే చర్యలకు పూనుకొంటోందన్నారు. జీవోలో పేర్కొన్న కార్మిక వ్యతిరేక నిబంధనలను తొలగించాలంటున్న విపక్ష కార్మిక నేతలపై అధికార పార్టీ కార్మిక సంఘాల నేతలు విష పూరిత ఆరోపణలు చేస్తూ కార్మికులను పక్కదోవ పట్టిస్తున్న వైనం మరింత గర్హనీయమన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను ఏ ఒక్కరినీ తొలగించమని, జీతం కూడా తగ్గించమని చెబుతున్న పాలక నేతలు జీవోలో పేర్కొన్న నిబంధనలపై తగు సమాధానం చెప్పకపోవడం శోచనీయమన్నారు. విపక్ష కార్మిక సంఘాల టిఎన్‌టియుసి, టిడిపి నాయకులు చేస్తున్న విష ప్రచారాలు కార్మిక ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. ఇప్పటికే విపక్ష, వామపక్ష కార్మిక నేతలు దశల వారీగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కార్మికుల ఉద్యమాన్ని ఇకనైనా గుర్తించి 279 జీవో సవరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురికాకతప్పదన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వంత పాడుతున్న టిఎన్‌టియుసి కి కార్మికసంఘంగా చెప్పుకొనే అర్హత లేదన్నారు. ప్రస్తుతం ఇస్తున్న జీతానికి ఒక్క రూపాయైనా తగ్గదని చెబుతున్న పాలకులు దినసరి వేతనాన్ని 295గా ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి గౌతంరెడ్డి మాట్లాడుతూ డ్వాక్రా రుణ మాఫీలో మాట తప్పి మోసం చేసిన చంద్రబాబు ఆ సంఘాలు పనిచేస్తున్న పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించి వారికి మరింత ద్రోహం చేశారని ఆరోపించారు. మహిళా ఓట్లతో అధికారంలోకి వచ్చిన టిడిపి పాలకులు మహిళ కన్నీళ్లలో కొట్టుకుపోక తప్పదని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎపి మున్సిపల్ ఎంప్లారుూస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు, సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు, సిఐటియు నగర కార్యదర్శి ముజఫర్ అహ్మద్, ఎం డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు తలపెట్టిన భారీ ర్యాలీతో నగర రహదారులు ఎర్ర జెండాలతో అరుణమయమైనాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నగర పోలీసులు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు చేపట్టి ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పర్యవేక్షించారు.

దుర్గమ్మ సేవలో గవర్నర్ నరసింహన్
ఇంద్రకీలాద్రి, మార్చి 30: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను బుధవారం ఉదయం ఉభయరాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉదయం 9-50గంటలకు నరసింహన్, ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ రమేష్‌ను వెంటబెట్టుకొని ఇంద్రకీలాద్రికి వచ్చారు. అమ్మవారి రాజగోపురం వద్ద ఆలయ ఇవో యస్‌యస్ చంద్రశేఖర్ అజాద్, దేవస్థానం ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గా ప్రసాద్, స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్, నగర పొలీస్ కమిషనర్ లడ్హా, సబ్ కలెక్టర్ సృజన, అసిస్టెంట్ కలెక్టర్ సలోని తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. గవర్నర్, ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ రమేష్ సుమారు 20 నిమిషాలు పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆస్థాన మండపంలో వీరికి అర్చకులు దివ్య ఆశీస్సులు అందజేసి అమ్మవారి చిత్రపటాలు, ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం కొద్దిసేపు వీరు విఐపి లాంజ్‌లో ఉండి మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా ఆలయ ఇవో ఆజాద్ దుర్గగుడిపై చేపట్టనున్న అభివృద్ధి పనులను వివరించారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ నేరుగా ఇంద్రకీలాద్రికి వచ్చి గవర్నర్, ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ రమేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

హరిత - నీలం ప్రాజెక్టు పరిధి ప్రాంతాల్లో
క్షేత్ర స్థాయి పరిశీలన
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 30: నగరంలో చేపట్టనున్న బ్లూ అండ్ గ్రీన్ సిటీ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలుచేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈసందర్భంగా వీరపాండియన్ చైనా సంస్థ ప్రతినిధులు, మంగళగిరి కమిషనర్ టివి రంగారావుతోపాటు అర్బన్ గ్రీనింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రమోహనరెడ్డితో కలిసి బుధవారం ఉదయం కృష్ణానదీ పరివాహక ప్రదేశాలైన రైవస్ కాల్వ, ఏలూరు, బందర్ కాల్వల గట్ల తోపాటు బిఆర్‌టిఎస్ రోడ్డు వెంబడి గులాబి తోట, మధురానగర్ అల్లూరి సీతారామరాజు వంతెన వరకూ, సాంబమూర్తి రోడ్డు అలంకార్ సెంటర్ వరకూ గల కాల్వగట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వారు ఏలూరు కాల్వ గట్ల ఆధునీకరణ తోపాటు కాల్వలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక అందజేయాలని సూచించారు. అలాగే మోడల్ కెనాల్ గెస్ట్, దుర్గాఘాట్, పున్నమి ఘాట్‌లను కలుపుతూ సుమారు రెండు కిలో మీటర్ల మేర ఒకే ఘాట్‌గా అభివృద్ధి పర్చేందుకు గాను అక్కడ ఉన్న నివాసాలను తొలగించి జి ప్లస్ త్రీ భవనాల్లో పునరావాసం కల్పించాలన్నారు. ఇప్పటికే పూర్తయిన సర్వేలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎపిఐఐసి కాలనీలో నర్సరీ, బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకూ అభివృద్ధి పర్చిన వాకింగ్ ట్రాక్‌లను పరిశీలించిన వారు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు మరిన్ని సదుపాయాల కల్పనలపై దృష్టిసారించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎసిజి పి అరుణ్‌బాబు, సిఇ ఎంఎ షుకూర్, సిటీప్లానర్ ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.

హంస, ఉగాది పురస్కారాలకు ఎంపికకు
ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన 14 మందితో కమిటీ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 30: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8న జరిగే దుర్ముఖ నామ సంవత్సర ఉగాది వేడుకలు సందర్భంగా వివిధ రంగాల నుంచి హంస, ఉగాది పురస్కారాలకు ఎంపిక కోసం శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన 14 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో విజయవాడ కల్చరల్ సెంటర్ సిఇవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కూచిపూడి నాట్యారామం ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్ శాసనమండలి సభ్యులు వివివి చౌదరి, మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఐనాక్, పద్మశ్రీ శోభానాయుడు, ప్రముఖ మృదంగ విద్వాంసుడు పద్మశ్రీ యల్లా నాగేశ్వరరావు, సినీ రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ రచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి, ప్రముఖ భాషా సేవకులు పొట్లూరి హరికృష్ణ, చిత్రకారుడు టి.వెంకట్రావు, ప్రముఖ నటుడు టి.వెంకట్రావు, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, ప్రముఖ నటులు పెద్ది రామారావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ డి.విజయభాస్కర్ సభ్యులుగా నియమితులయ్యారు.
సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానం, హంస పురస్కారాలు, సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానం, వైద్యం, ఇంద్రజాలం, మూకాభినయం, హరికథ, బుర్రకథ, జర్నలిజం, సామాజిక సేవ, కమిటీ సిఫార్సు చేసిన ఇతర సేవా రంగాలలో ఉగాది పురస్కారాలకు తగు అభ్యర్థులను ఈ కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ఈ పురస్కారాలకు నగదు బహుమతి, హంస ప్రతిమ, శాలువా, ప్రశంసాపత్రం అందజేయబడుతుంది.

కాల్వగట్లకు పచ్చదనం శోభ
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 30 : అపరిశుబ్రతకు నెలువుగా ఉండే నగర కాల్వగట్లన్నీ ఆహ్లాద, వినోద కేంద్రాలుగా మారనున్నాయి. ఒకపక్క రాజధాని అభివృద్ది, మరోపక్క పుష్కరాల సందర్భంగా ఇబ్బిడి ముబ్బిడిగా విడుదలవుతున్న నిధుల కారణంగా అపరిశుబ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నగర కాల్వగట్లను ఆధునీకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నగరంలోని కెనాల్ రోడ్డు గట్టును సుందరీకరించిన అధికారులు ఒకొక్కటిగా మిగిలిన అన్ని గట్లను కూడా సుందరీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచంలో నదీకాల్వలతో సుందర నగరంగా ప్రఖ్యాతి గాంచిన వెన్నీస్ నగరానికి ధీటుగా కృష్ణానదీకి చెందిన మూడు కాల్వలు ప్రవహిస్తున్న విజయవాడ నగరాన్ని కూడా అంతే స్థాయిలో సుందరీకరించేందుకు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేక చొవర చూపుతూ ప్రోత్సహిస్తున్న వైనం విశేషం. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, విఎంసి కమిషనర్ వీరపాండియన్‌తో పాటు జిల్లా కలెక్టర్ బాబు ఏ కూడా నదీకాల్వల పచ్చతోరణంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆధునిక హంగులతో అభివృద్ది పర్చేందుకు శ్రీకారం చుట్టిన విషయం విధితమే. ఈదశలో విఎంసి ప్రధాన కార్యాలయం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకూ ఉన్న కెనాల్ రోడ్డు కాల్వగట్టును ఇప్పటికే పూర్తిస్థాయిలో అందమైన గ్రీనరీతో పచ్చతోరణం కట్టిన విషయం నగర ప్రజలందరికీ తెలిసిందే. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి వన్‌టౌన్ వెళ్ళేందుకు మార్గంగా ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడూ ఈకాల్వగట్టును చూసి ఔరా అనక తప్పదు. ఇదే స్ఫూర్తిగా తీసుకొని కళాక్షేత్రం వద్దగల మూడు కాల్వల గట్టు ప్రాంతాలను కూడా సుందరీకరించేందుకు నగర పాలక సంస్థ అధికారులు పూనుకొన్నారు. రాష్ట్ర రాజధాని నగరంగా గుర్తింపు పొందిన విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ది పథంలో నడిపించేందుకు గాను చైనా బృందంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన రివర్ ఫ్రంట్ సిటీ లో భాగంగా బ్లూ అండ్ గ్రీన్ సిటీ ప్రాజెక్టులకు చైనా బృందంతో శ్రీకారం చుట్టిన విఎంసి, ప్రకాశం బ్యారేజీ నుంచి భవానీపురం వరకూ ఉన్న కృష్ణానది ఒడ్డు మొత్తాన్ని ఒకే టూరిజం స్పాట్ బండ్‌గా అభివృద్ధికి సన్నాహాలు చేస్తుండగా మరొపక్క అందుకు ధీటుగా నగరంలో ఉన్న నదీ కాల్వగట్లను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ది పర్చేందుకు అంచనాలు తయారు చేస్తున్నారు. కాల్వగట్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడమే కాకుండా ఆహ్లాద, వినోద ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నారు. నగర మొత్తం మీద సుమారు 50 కిలో మీటర్ల మేరక కాల్వగట్లను సుందరీకించి నగరానికి పచ్చతోరణం తీర్చిదిద్దనున్న తరుణంలో అందుకు ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

క్రికెట్ బెట్టింగ్‌ల జోరు!
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 30: టి-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్‌లు తారస్థాయిలో జరుగుతున్నాయి. అడ్డూఅదుపు లేకుండా జరుగుతున్న బెట్టింగ్‌లను నియంత్రించాల్సిన పోలీసులు చతికిలపడ్డారు. తమకేమీ పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు కొన్నిచోట్ల క్రికెట్ బుకీలతో చేతులు కలిపి బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు సైతం ఎదుర్కొంటున్నారు. దీంతో జిల్లా క్రికెట్ బెట్టింగ్‌లకు అడ్డాగా మారుతోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమయ్యే బెట్టింగ్‌లు నేడు మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించాయి. దీంతో టి-20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభమైన నాటి నుండి నేటివరకు కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. టాస్ వేసే దగ్గర నుండి మ్యాచ్‌లో చివరి బంతి వరకు పలు రూపాలలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. బాల్ బాల్‌కి, రన్ రన్‌కి బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఆరోజు జరిగే మ్యాచ్‌లతో పాటు మరుసటి రోజు జరిగే మ్యాచ్‌లపై కూడా పెద్దఎత్తున బెట్టింగ్‌లు కాస్తుండటం విశేషం. ఈ నెల 12న మ్యాచ్‌లు ప్రారంభమవ్వగా ఆదివారం ఫైనల్స్ జరగనున్నాయి. బుధవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు గెలుపుపై పెచ్చు పందాలు జరిగాయి. ఉదయం న్యూజిలాండ్ జట్టుపై 30 పైసలు పెచ్చు ఇచ్చిన పందెపు రాయుళ్ళు సాయంత్రం అర్ధ రూపాయి ఇచ్చారు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పెచ్చు పందెం మరింత పెరగడం విశేషం. అలాగే గురువారం జరగనున్న రెండో సెమీ ఫైనల్ వెస్టిండీస్ - భారత జట్ల మధ్య కూడా బుధవారమే పెద్దఎత్తున పందాలు జరిగాయి. భారత్‌పై భారీస్థాయిలో బెట్టింగ్‌లు జరిగాయి. బెట్టింగ్‌ల విషయంలో క్రికెట్ బుకీలు చక్రం తిప్పుతున్నారు. తమ ఇళ్ళ వద్దనే భారీ ఏర్పాట్లు చేసుకుని ఫోన్‌లో బెట్టింగ్ రాయుళ్లను ఆహ్వానిస్తున్నారు. వేలు, లక్షల్లో బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఇంత పెద్దఎత్తున జిల్లాలో విచ్చలవిడిగా బెట్టింగ్‌లు జరుగుతున్నా పోలీసు శాఖ మామూళ్ల మత్తులో జోగుతోంది. నిర్వాహకుల నుండి భారీగా ముడుపులు తీసుకుని బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్‌లు జరిగే ప్రాంతాల వైపు కనె్నత్తి చూడటం లేదనే విమర్శలను పోలీసులు ఎదుర్కొంటున్నారు. మ్యాచ్‌లు ప్రారంభమై పక్షం రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక బుకీని కూడా అరెస్టు చేయకపోవడం ఈ విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
నిర్దేశించిన సమయానికి
ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తి చేయాలి
* కలెక్టర్ బాబు.ఎ
గన్నవరం, మార్చి 30: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భాగంగా గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బాబు ఎ సూచించారు. బుధవారం సాయంత్రం ఎయిర్‌పోర్టు విస్తరణ పనుల ప్రగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విస్తరణకు అవసరమైన అనుమతుల మంజూరుకు తనవంతు సహకారం అందిస్తామన్నారు. రన్‌వే విస్తరణలో భాగంగా మూడు హైమ్యాక్స్ స్తంభాలను తొలగించి వేరే చోట ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ మార్పును తక్షణం చేపట్టాలన్నారు. అవసరమైతే ట్రాన్స్‌కో సహకారం తీసుకోవాలని ఎయిర్‌పోర్టు ఇంజనీరింగ్ విభాగం అధికారి ప్రభాకర్‌ను సూచించారు. అలాగే స్టుష్ ప్రాజెక్టు మేనేజింగ్ కన్సలెన్సీ చేపట్టిన నాల్గవ టెర్మినల్ పనులు 50 శాతం పూర్తయినట్లు సంస్థ మేనేజర్ అనిల్‌దీక్షిత్ వివరించారు. పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టు పనులు పూర్తయితే అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను ఇక్కడి నుండి నడపడానికి ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్, సింగపూర్, గల్ఫ్ తదితర దేశాలకు చెందిన విమానయాన సంస్థలు వస్తున్నట్లు ఆయన వివరించారు. జరుగుతున్న పనుల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో అనుకున్న సమయాని కంటే ముందుగా పనులు జరిగేలా చూడాలని అధికారులను కోరారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక లావాదేవీల్లో వివాదం..
మహిళ దారుణ హత్య
నూజివీడు, మార్చి 30: నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. దండుగుల వెంకటరత్నం, భార్య రుక్మిణి (50) గ్రామంలోని బిసీ కాలనీలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కోడలు ఉన్నారు. వీరంతా కూలీ పనులు చేసుకునేవారే. నూజివీడు మండలం గొడుగువారిగూడేనికి చెందిన మల్లెల చంటి కుటుంబ సభ్యులతో రుక్మిణికి ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయి. డబ్బు కోసం చంటి బుధవారం ఉదయం మీర్జాపురం గ్రామంలోని రుక్మిణి ఇంటికి వచ్చాడు. డబ్బులు లేవని రుక్మిణి సమాధానం చెప్పింది. డబ్బులు ఇచ్చేవరకు వెళ్ళనని చంటి భీష్మించుక్కూర్చున్నాడు. ఆ సమయంలో ఇతర కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్ళారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి రుక్మిణి హత్యకు గురై ఉంది. డబ్బుల కోసం ఇంటికి వచ్చిన చంటి రుక్మిణిని లోబర్చుకునే ప్రయత్నం చేసి, ఇద్దరు కలిసి మద్యం సేవించారని స్థానికులు చెబుతున్నారు. మృతదేహం పడి ఉన్న సంఘటన పరిశీలిస్తే పక్కనే సుత్తి ఉంది. సుత్తితో రుక్మిణి తలను ఛిద్రం చేసి చంటి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు మద్యం సేవించిన తరువాత ఘర్షణకు దిగి వుంటారని, దీంతో మద్యం మైకంలో రుక్మిణిని చంటి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూరల్ ఎస్‌ఐ కృష్ణప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చంటి పరారులో ఉన్నాడని చెప్పారు.

త్వరలోనే పారిశ్రామికవాడగా ‘బందరు’
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 30: బందరు పోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుందని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. త్వరలోనే పోర్టు నిర్మా ణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. పోర్టుతో పాటు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికవాడగా మార్చేందుకు ప్ర భుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందు లో భాగంగా వేల కోట్ల రూపాయల పె ట్టుబడులతో భారీ పరిశ్రమలు ఈప్రాంతానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఆసక్తి కలిగిన రంగాల్లో పరిశ్రమల యూనిట్ ఏర్పాటు చేసుకుని వారితో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలని కోరారు. నిరుద్యోగుల జీవనోపాధికి పరిశ్రమల శాఖ ఎన్నో అవకాశాలు కల్పిస్తోందన్నారు. వీటిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 198 రకాలైన పరిశ్రమల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ తగిన గైడెన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తోందని చెప్పారు. రోల్డుగోల్డు, కలంకారి, ఆక్వా రంగ ఉత్పత్తుల ఎగుమతులు, తదితర రంగాలు ఈప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ఈవిధంగా అధిక డిమాండ్ కలిగిన రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకుని చక్కని జీవనోపాధి పొందాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిపర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నవ్యాంధ్రను అభివృద్ధి చేయాలని యువతకు తగిన శిక్షణ ఇచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చి 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నారని వివరించారు. సదస్సులో మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వెంకట్రావ్, పరిశ్రమల శాఖ ఎడి విజయకుమార్, ఇమిటేషన్ జ్యూయలరీ పార్కు అసోసియేషన్ ప్రతినిధులు సుబ్బారావు, పంచపర్వాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

చెరకు సాగుకు వెనకాడుతున్న రైతులు!
తోట్లవల్లూరు, మార్చి 30: మారుతున్న కాలానుగుణంగా రైతులకు చెరకు సాగు భారంగా మారుతోంది. పండించే పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవటంతో రైతులు చెరకు సాగుపై అనాసక్తి చూపుతున్నారు. కృష్ణానదీ పరీవాహక ప్రాంతమైన లంక భూముల్లో రైతులు చెరకు పంటను విస్తారంగా సాగు చేస్తారు. మండలంలోని వివిధ గ్రామాల్లో మెట్ట, మాగాణి, లంకల్లో కలిపి ప్రతి ఏడాది సగటున 7 నుంచి 8 వేల ఎకరాల వరకు చెరకు పంట సాగవుతోంది. ఒక ఎకరం చెరకు విత్తనం నాటాలంటేనే పొలం దుక్కులు, విత్తన సేకరణ, రవాణా, కూలీల ఖర్చులతో కలిపి సుమారు రూ.42వేల వరకూ ఖర్చవుతోందని రైతులు అంటున్నారు. అదే కౌలు రైతుకైతే అదనపు ఖర్చులు ఉంటాయి. ఏడాది పాటు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగు చేసిన పంటను ఫ్యాక్టరీకి తరలించడానికి తలకుమించిన భారమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరకు పంటను నరికి ఫ్యాక్టరీకి తరలించాలంటే ప్రధానంగా కూలీల సమస్య ఎదురవుతోంది. గతంలో తెలంగాణ జిల్లాల నుంచి చెరకు నరకడానికి వలస కూలీలు మండలంలోని వివిధ గ్రామాలకు భారీగా వచ్చేవారు. కానీ మూడేళ్లుగా పరిమిత సంఖ్యలో కూలీలు వస్తున్నా, నరుకుడు కూలీని ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. టన్ను చెరకు నరికి శుభ్రం చేయాలంటే కూలీలు రూ.350 నుంచి 400 వరకు డిమాండ్ చేస్తున్నారు. వేసవి ఎండలు కూడా ముదరటంతో టన్ను చెరకు ఫ్యాక్టరీకి తరలించాలంటే రూ.900ల నుంచి వెయ్యి రూపాయల వరకు కూలీలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. సాగు ఖర్చు పెరిగిన నేపథ్యంలో చెరకు రైతులకు కెసిపి యాజమాన్యం ఇచ్చే మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదు. అన్ని ఖర్చులు భరించి ఒక ఎకరం సాగుచేస్తే రూ.20 వేలు కూడా మిగలడం కష్టతరమవుతోందని రైతులు అంటున్నారు. ఈ సంవత్సరం ఇతర పంటలు వేసిన బాగా పండి మంచి రాబడులు వచ్చాయని, కాని చెరకు రైతులకు మాత్రం పెట్టిన పెట్టుబడి రావటం కూడా కష్టమవుతోందని ఆవేదన చెందుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. చెరకు పంట వేస్తే బ్యాంక్ వారు రుణం ఇచ్చేవారని, దాంతో కొంతవరకు బయట డబ్బులు వడ్డీకి తేకుండా పెట్టుబడికి సరిపోయేవని, కాని ఇప్పుడు రైతులకు బ్యాంకు ల వారు పంట రుణాలు ఇవ్వటానికి సవాలక్ష నిబంధనలు పెట్టి ఇవ్వటంలేదని రైతులు చెపుతున్నారు. కెసిపి కర్మాగారం వారు ఈ ఏడాది టన్ను చెరకుకు రూ.2482 ఇస్తామని ప్రకటించారు. టన్నుకు రూ.3వేలైనా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సరైన మద్దతు ధర లభించక పోవడంతో సాగుపై విముఖత ప్రదర్శిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
జగ్గయ్యపేట రూరల్, మార్చి 30: విజయవాడ - హైదరాబాదు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చిల్లకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం పాలెఅన్నవరం గ్రామానికి చెందిన లక్కా సందీప్(28) గుంటూరు జిల్లా రేపల్లెలో కోర్టు పని నిమిత్తం బైక్‌పై బయలుదేరాడు. షేర్‌మహమ్మద్‌పేట అడ్డరోడ్డు వరకూ వచ్చిన యువకుడు తిరిగి వెనక్కు వెళ్లే క్రమంలో బలుసుపాడు అడ్డరోడ్డు వద్ద యు టర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సందీప్ కోదాడ పట్టణంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మృతుని సోదరుడు సైలేష్‌బాబు ఫిర్యాదు మేరకు చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
విస్సన్నపేట, మార్చి 30: స్థానిక సిపిఎం కార్యాలయం సమీపంలో బుధవారం పుట్టా షణ్ముక గంగాధర్(30) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన షణ్ముక గంగాధర్ తమ బంధువులు ఇటీవల ప్రారంభించిన రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. నాలుగు నెలలుగా రెస్టారెంట్ సమీపంలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని భార్య తనుజా, మూడేళ్ల కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. పెళ్లయ నాలుగేళ్లయం దని, భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు గాని, భేదాభిప్రాయాలు లేవు. మూడురోజుల క్రితం భార్య గ్రామాంతరం వెళ్ళడంతో ఒంటరిగా ఇంట్లో ఉన్న షణ్ముక గంగాధర్ ఎంతకీ డ్యూటీకి రాకపోవడంతో రెస్టారెంట్ యజమాని వేణు అతని ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టగా లోపలి నుండి స్పందన రాలేదు.
ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన వేణు కిటికీ తలుపులు తెరిచి చూడగా షణ్ముక గంగాధర్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వేణు సమాచారాన్ని పోలీసులకు తెలియపరిచాడు. పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని కిందికి దించి శవపంచనామా చేశారు. పోస్టుమార్టం కోసం తిరువూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
సారా రహిత గ్రామంగా దేవరగుంట
నూజివీడు, మార్చి 30: నూజివీడు మండలం దేవరగుంట గ్రామాన్ని సారా రహిత గ్రామం అధికారులు, ప్రజా ప్రతినిధులు బుధవారం ప్రకటించారు.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవోదయం కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ సిఐ జె శ్రీనివాస్ గ్రామంలోని ప్రముఖులు, అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కాపుసారా తయారీ, విక్రయాలను అరికట్టాలని, దీనికి అందరూ సహాకరించి, కాపుసారా రహిత గ్రామంగా అభివృద్ధి చేయాలని అధికారులు కోరారు. దీంతో కాపుసార రహిత గ్రామంగా దేవరగుంటను చేద్దామని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎంపిపి టి శ్రీనివాసరావుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాదంలో లక్ష ఆస్తి నష్టం
కూచిపూడి, మార్చి 30: మొవ్వ మండలం గూడపాడు గ్రామంలోని అంబేద్కర్ నగర్‌లో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో లక్ష రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు మొవ్వ అగ్నిమాపక కేంద్రం అధికారి ఎన్‌ఎం రామకృష్ణ తెలిపారు. గూడపాటిలోని కాకి నాగార్జున ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో పూరింటితో పాటు పశువుల పాక పూర్తిగా దగ్ధమయ్యాయి. విలువైన ఫర్నిచర్, గృహోపకరణాలు, దుస్తులు మొత్తం దగ్ధమయ్యాయన్నారు. మొవ్వ ఆర్‌ఐ ఎ శ్రీనివాసరావుకు విఆర్‌ఏ హరికృష్ణ సమాచారం అందించినట్లు తెలిపారు.