కృష్ణ

సఫాయి కార్మికులకు ఎస్సీ కార్పొరేషన్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 17: గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య చర్యలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అత్యాధునిక యంత్ర పరికరాల ద్వారా పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సఫాయి కర్మచారులకు సబ్సిడీతో కూడిన యంత్ర పరికరాలు అందిస్తోంది. బ్యాంక్‌లతో ఎలాంటి సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుడికి సబ్సిడీ రుణాలతో పారిశుద్ధ్య యంత్ర పరికరాలను అందచేయనున్నారు. 2వేల జనాభా కలిగిన ప్రతి గ్రామ పంచాయతీకి ఈ ఆధునిక యంత్ర పరికరాలు సమకూరనున్నాయి. పంచాయతీల్లో రెండు వేల జనాభాకు ఒక పవర్ ఆటో, మండలానికి ఒక ట్రాక్టర్, డ్రైనేజీ క్లీనింగ్ మిషన్లు అందించనున్నారు. జిల్లాలో మొత్తం 970 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రాథమికంగా 1500 పవర్ ఆటోలు అవసరమవుతాయని గుర్తించారు. అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. దరఖాస్తులు అందిన నెలరోజుల వ్యవధిలోనే వీటిని పంపిణీ చేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్వీవీ సత్యనారాయణ బుధవారం ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ఈ పథకం గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రవేశ పెట్టినా అంతగా సఫలం కాలేదు. ప్రాచార లోపం కారణంగా అటకెక్కింది. ఈ సంవత్సరం మాత్రం పథకానికి సార్థకత చేకూరేలా చర్యలు తీసుకుంటున్న ఈడీ తెలిపారు. కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే యంత్ర పరికరాలను ఆయా గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి ధృవీకరణ పత్రాన్ని జత చేసి దరఖాస్తులను నేరుగా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందచేయాల్సి ఉంటుంది. ట్రాక్టర్, డ్రైనేజీ క్లీనింగ్ మిషన్ల కోసం ముగ్గురి నుండి ఐదుగురు అభ్యర్థులు బృందంగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాలి. గ్రూపులో కనీసం ఒకరైనా డ్రైవింగ్ లైసెన్సు కచ్చితంగా కలిగి ఉండాలి. లబ్ధిదారులు రుణంలో రెండు శాతం తమ వాటాగా భరించాల్సి ఉంటుందని సత్యనారాయణ వివరించారు.

‘శ్రీ కొండలమ్మ’ తల్లికి భక్త నీరాజనం
* అంగరంగ వైభవంగా అమ్మవారి గ్రామోత్సవం
* 20వేల మందికి అన్న సమారాధన
గుడ్లవల్లేరు, అక్టోబర్ 17: జిల్లాలోనే అత్యంత శక్తి స్వరూపిణిగా భక్తులచే కొలవబడుతున్న మండల పరిధిలోని వేమవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారికి భక్తుల నీరాజనాలు పలికారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా దుర్గాష్ఠమిని పురస్కరించుకుని బుధవారం అమ్మవారు శ్రీ కనక దుర్గా దేవిగా భక్తులకు కరుణాకటాక్షాలు ప్రసాదించారు. విశేష పూజాదికాలు అనంతరం అమ్మవారి గ్రామోత్సవం, మధ్యాహ్నం భారీ అన్న సమారాధన నిర్వహించారు. అమ్మవారి గ్రామోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య) జెండా ఊపి ప్రారంభించగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి ప్రారంభించారు. అంతకు ముందుగా ఇరువురు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బెల్లంకొండ ఏడుకొండలు, కార్య నిర్వహణాధికారి గోగినేని లీలాకుమార్ అమ్మవారి శేష వస్త్రాలు, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఉదయం 9.30ని.లకు ఆలయం వద్ద ప్రారంభమైన అమ్మవారి గ్రామోత్సవంలో జానపద ఇంద్రజాల ప్రదర్శన, డప్పు వాయిద్యములు, బ్యాండ్ మేళం, తీన్‌మార్ డప్పులు, మహిళా కోలాటం, గరగ నృత్యాలు, బుట్టబొమ్మల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేమవరం, వడ్లమన్నాడు, పద్మాలపాలెం, కవుతరం గ్రామాల గుండా అమ్మవారి గ్రామోత్సవం తిరిగి ఆలయానికి చేరుకుంది. మధ్యాహ్నం నిర్వహించిన అన్న సమారాధనలో 20వేల మంది భక్తులు పాల్గొన్నారు.