కృష్ణ

విలేఖర్ల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, అక్టోబర్ 21: విలేఖర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ అన్నారు. ఆదివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏపీయుడబ్ల్యుజె కార్యవర్గ ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత మాట్లాడుతూ పాత్రికేయులు ఆచితూచి వార్తలు రాయాలన్నారు. వారికి ఉన్న హక్కులు, స్వేచ్ఛను కాపాడుకోవాలన్నారు. నియోజకవర్గంలో విలేఖర్ల ఇళ్ల స్థలాల మంజూరు విషయంలో ఆయన సానుకూలంగా స్పదించారు. కృత్తివెన్నులో విలేఖర్లకు నివేశన స్థలాల మంజూరు, ప్రెస్‌క్లబ్ స్థలం ఏర్పాటుపై ఆయన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేట్ స్కూల్స్, కళాశాలల్లో విలేఖర్ల పిల్లలకు రాయితీలు, హెల్త్ కార్డుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. యూనియన్ నాయకులు యు వెంకట్రావ్, శ్రీనివాసరావు, బాబు, మోజెస్ తదితరులు విలేఖర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కాగిత దృష్టికి తీసుకు వెళ్లారు. తొలుత యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఇటీవల మృతి చెందిన పలువురు పాత్రికేయులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలి
* పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన
పామర్రు, అక్టోబర్ 21: నియోజకవర్గంలోని ప్రతి గ్రామ టీడీపీ నేతలు నిరంతర ప్రక్రియగా గ్రామదర్శిని కార్యక్రమాలు నిర్వహించి సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేయాలని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతల సమన్వయ సమావేశం నిర్వహించి కల్పన మాట్లాడారు. గ్రామదర్శిని ద్వారా ప్రజలకు చేరువై ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలన్నారు. నూతన ఓటు హక్కు పొందే వారికి సహకరించి ఓటును కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేస్తున్న సేవలను ప్రచారం కల్పించాలన్నారు. అప్పుడే పార్టీ పటిష్టత పెరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్తా సైనికుల్లా పని చేసేలా నాయకులు వెన్నుదన్నుగా నిలవాలన్నారు. పామర్రు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బూరగడ్డ రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెదపారుపూడి, పామర్రు, మొవ్వ, పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల పార్టీ నేతలు పాల్గొని వివిధ సమస్యలపై చర్చించారు.

సమాజాభివృద్ధికి సాహిత్య రంగం దిశానిర్దేశం చేయాలి
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 21: సాహిత్యరంగం సమాజాభివృద్ధికి దిశానిర్దేశం చేసేదిగా ఉండాలని శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు అన్నారు. స్థానిక మహతి లలిత కేళావేదికలో ఆంధ్ర సారస్వత సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల విశిష్ట సేవా పురస్కార ప్రదానోత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఆదివారం నిర్వహించిన 3వ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్జునుడు మాట్లాడుతూ కవులు సమాజానికి మేలు చేసే రచనలు చేయాలన్నారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం తక్కువగా ఉన్నదన్నారు. సాహితీ ప్రియులు అధికారంలోకి వచ్చి సాహిత్య, సాంస్కృతిక విభాగం నిర్వహించినప్పుడు సాహిత్య రంగానికి ప్రోత్సాహం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగం సమాజానికి మేలు కలిగిస్తుందన్న భావన ఏర్పడిన నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాహిత్య రంగాన్ని ప్రోత్సహిస్తారన్నారు. అనంతరం వివిధ సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతులు, సామాజిక సేవా కార్యకర్తలు డా. సామల రమేష్‌బాబు, తెలుగు రచయతల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్, ఎ రాజ్యలక్ష్మి, కె భవానీ, ముదిగొండ శాస్ర్తీ, గడ్డం రాజులకు పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్ష కార్యదర్శులు కొట్టి రామారావు, కొల్లూరు రామ్మోహనరావు, ఎల్‌ఎస్ శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.