కృష్ణ

పుష్కర ఏర్పాట్లు అదరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఆగస్టు 3: మండల పరిధిలోని కొత్తపేట, దక్షిణ చిరువోల్లంక, వేకనూరు, రామచంద్రపురం, తుంగలవారిపాలెం, పులిగడ్డ గ్రామాల్లోని పుష్కర ఘాట్లను బుధవారం శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న పుష్కరఘాట్‌ను పరిశీలించిన ఆయన పనులు మరింత వేగవంతం చేయాలని, ముళ్ళపొదలు తొలగించాలని, పాత ఘాట్ వద్ద టైల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కరాలు దగ్గర పడుతున్నందున జాప్యం జరగటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డ డిగ్రీ కళాశాలలోని పుష్కర నగర్‌ను పరిశీలించిన ఆయన గ్రౌండ్‌లో గోతులు పూడ్చాలని, సంప్రదాయ వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేయటం ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. పుష్కర నగర్‌లో ఏర్పాటు చేసే వేదికను పరిశీలించి సుందరంగా తయారు చేయాలన్నారు. వేదికపై దివి ఆలయాల ఆకృతులను ఏర్పాటు చేయాలన్నారు. పులిగడ్డ పుష్కరఘాట్‌ను పరిశీలించిన ఆయన ఫ్లాట్‌ఫారం ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కరాల తొలిరోజు అవనిగడ్డ నవజీవన్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఆక్విడక్టు వద్ద కోలాట ప్రదర్శన ఇస్తారని తెలిపారు. రామచంద్రపురంలో రూ.10లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న ఆలయ పనులను పరిశీలించారు. తుంగలవారిపాలెం ఘాట్‌లో కృష్ణవేణి ప్రాభవం ఉట్టిపడేలా అలంకరించాలని మండలి సూచించారు. ఆయన వెంట మండల అధికారులు, ఇంజనీర్ల బృందం, ఆర్డీవో సాయిబాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్‌తో వ్యక్తి దుర్మరణం
బంటుమిల్లి, ఆగస్టు 3: స్నేహితుడి తల్లి చనిపోతే చూడటానికి వెళ్ళి విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన విషాద సంఘటన బుధవారం మండల పరిధిలోని పెదతుమ్మిడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదతుమ్మిడి గ్రామంలోని వైవాకా రోడ్డులో ఒక ఇంట్లో మహిళ చనిపోయింది. ఆమె కుమారుని స్నేహితుడైన గేలం వీర్రాజు(30) ఉదయానే్న పరామర్శించడానికి వెళ్ళాడు. మృతదేహం మార్చురీ బాక్సులో ఉండగా బాక్స్‌ను పక్కకు జరపమని అక్కడెవరో చెప్పారు. బాక్సును పక్కకు జరుపుతూ విద్యుత్ షాక్‌కు గురై వీర్రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పరామర్శించడానికి వచ్చిన యువకుడు మృతి చెందడం అక్కడివారిని, మృతురాలి కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టింది. ఎస్‌ఐ మారగాని నవీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వీర్రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

జాతీయ రహదారి పేరిట ఇసుక అక్రమ రవాణా
* ఎమ్మెల్యే కల్పన ఆగ్రహం
తోట్లవల్లూరు, ఆగస్టు 3: రొయ్యూరు క్వారీలో ఇసుకను ప్రభుత్వ పెద్దలు కొల్లగొడుతున్నారని, జాతీయ రహదారి పేరుతో పెద్దఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రొయ్యూరు క్వారీలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను బుధవారం ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, గ్రామ సర్పంచ్ లుక్కా సుబ్బారావు, ఎంపిటిసి సభ్యుడు మూడే శివశంకర్, మండల వైసిపి కన్వీనర్ జొన్నల రామ్మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటిసి సభ్యుడు మోర్ల రామచంద్రరావు, వైసిపి నాయకుడు చింతలపూడి గవాస్కర్‌రాజు తదితరులతో కలిసి ఆమె పరిశీలించారు. కల్పన ముందుగా రొయ్యూరు క్వారీ నుంచి వస్తున్న దిలీప్ కనస్ట్రక్షన్స్‌కు చెందిన ఇసుక లారీలను కరకట్టపై నిలిపి డ్రైవర్ వద్ద బిల్లులు తీసుకుని పరిశీలించారు. బిల్లుపై సక్రమంగా వివరాలు లేవని గుర్తించారు. ఐలూరులో పుష్కర సమావేశంలో ఉన్న తహశీల్దార్ జి భద్రుని వెంటనే పిలిపించి రొయ్యూరు క్వారీలో ఇసుక తవ్వకాలపై వివరణ అడిగారు. జాతీయ రహదారికి కలెక్టర్ ఆదేశంతో ఇసుక తీసుకెళుతున్నారని భద్రు చెప్పారు. కలెక్టర్ ఆదేశాలు చూపమని ఎమ్మెల్యే అడగ్గా, తమకు లిఖితపూర్వకమైన ఆదేశాలు రాలేదని చెప్పారు. జాతీయ రహదారికి ఎంత ఇసుక అవసరం, క్వారీలో ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక తీయాలి, దాని పరిధులు ఎంత, పర్యవేక్షించే అధికారి ఎవరు? అనే విషయాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఇసుకను రవాణా చేయటం ప్రభుత్వ దోపిడీగా కల్పన ఆరోపించారు. క్వారీలో ఇసుకను పరిమితికి మించి తవ్వుతున్నారని తెలిపారు. సామాన్యులు బండి ఇసుక తీసుకెళ్లటానికి వీలులేకుండా చేసిన ప్రభుత్వం పెద్దలకు మాత్రం దోచిపెడుతోందని కల్పన ఆరోపించారు.

గ్రంథాలయాల్లో ‘సక్సెస్ మంత్ర’
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 3: పాఠకులు, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, భావావిష్కరణ నైపుణ్యాలు పెంపొందించడానికి అవగాహన క ల్పించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య తెలిపారు. గ్రంథాలయ సంస్థ, మైండ్ కేర్ కౌన్సిలింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ‘సక్సెస్ మంత్ర’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రతినెలా మొదటి బుధవారం సాయంత్రం 5గంటలకు కౌనె్సలింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు విడియాల చక్రవర్తి మాట్లాడుతూ కృషి, కసి కలిస్తే పట్టుదల పెరుగుతుందన్నారు. మనలో ఉన్న బలహీనతలను గుర్తించి పారదోలేందుకు కృషి చేయాలన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తథ్యమని చెప్పారు. ఎపిజె అబ్దుల్ కలాం, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, బ్రౌన్ వంటి వ్యక్తుల జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వై కృష్ణారావు, ఉప గ్రంథపాలకులు పి నాగరాజు, పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు.

అన్ని ప్రాంతాల్లో
నిరంతర విద్యుత్
* రూ.117కోట్ల అభివృద్ధి పనులు పూర్తి
* ఎల్‌ఇడి బల్బులతో 45శాతం విద్యుత్ పొదుపు
* ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్
బెంజిసర్కిల్, ఆగస్టు 3: కృష్ణాపుష్కరాల కోసం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఎపిఎస్‌పిడిసిఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా పుష్కరాలు జరుగుతున్న మూడు జిల్లాల్లో సుమారు 117 కోట్ల రూపాయలతో అవసరమైన పనులను చేపట్టామని, ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను 8నాటికి పూర్తి కానున్నట్లు చెప్పారు. పుష్కరాలకు సంబంధించి తొమ్మిది నెలలు ముందుగా పనులను ప్రారంభించి నాలుగు సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే 577 డిటిఆర్ ట్రాన్స్‌ఫార్మర్స్‌ను వినియోగించినట్లు చెప్పారు. వీటితో పాటు ట్రాన్స్ ఫార్మర్స్ ప్రాంతంలో ఫినిసింగ్‌ను కూడా నిర్మించినట్లు చెప్పారు. 175 హైమాస్త్‌లైట్స్‌ను అన్ని పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటికి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 2700 ఐరన్ విద్యుత్ స్థంబాలకు పెయింటింగ్ వేయించడం జరిగిందన్నారు. వీటితో పాటు 2147 డిస్టిబ్యూషన్ బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైస్పీడ్ కండక్టర్లను 267 కిలోమీటర్ల మేర అధునీకరించినట్లు చెప్పారు. ఎల్‌టి వైర్లను 406 కిలోమీటర్ల మేర అధునీకరించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షల ఎల్‌ఈడి బల్బులు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల బల్బులు అమర్చినట్లు తెలిపారు. ఇప్పటికే సెంట్రల్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను విశాఖలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 5న నాటికి నగరంలో సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక 13జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయి కంట్రోల్ సిస్టమ్‌ను విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న స్టీట్ లైట్లను జియోట్యాగ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇక పుష్కరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మోనటిరింగ్ చేసేందుకు అధికారులను నియమించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఏదైనా ప్రాంతంలో విద్యుత్ అంతరాయం కలిగిన సమయంలో హాట్‌లైన్ టీమ్ వెంటనే చేరుకుని అంతరాయాన్ని పునరుద్ధరిస్తుందన్నారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా విద్యుత్‌శాఖ అప్రమత్తతో ఉంటుందన్నారు. ఈవిలేఖర్ల సమావేశంలో జెఎండి దినేష్ పరుచూరితో పాటు ఇతర అధికారులున్నారు.