కృష్ణ

పుష్కరాల మహోత్సవాలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 10: కృష్ణా పుష్కరాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దుర్గగుడికి తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు సిద్ధం చేశామని, సాధారణ భక్తులకే అగ్రతాంబూలం ఇస్తూ అందరికీ ముఖమండప దర్శనం మాత్రమే కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లు ఇవో ఎ సూర్యకుమారి తెలిపారు. బుధవారం ఉదయం ఇవో కార్యాలయంలో విలేఖరుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో దుర్గమ్మ దర్శనం జరిగే విధంగా కెనాల్‌రోడ్ వినాయకుడి గుడి నుండి ప్రత్యేక క్యూమార్గాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ క్యూమార్గంలోకి ప్రవేశించిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని మల్లిఖార్జునమహామండపం మెట్ల మార్గం గుండా కిందకు చేరుకొని అర్జున వీధిలోని భోజనం చేసి మహాప్రసాదాలైన లడ్డూ, పులిహార, భవానీప్రసాదం కొనుగోలు చేసుకునే విధంగా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆమె వివరించారు. అర్జున వీధిలో దేవస్థానం ఆధ్వర్యంలో రోజుకు సుమారు 25వేల మంది భక్తులకు బఫే పద్ధతిలో ఉచితంగా భోజనాలను ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. రోజుకు సుమారు 2లక్షల పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే అవకాశం ఉందన్నారు. విఐపిల కోసం పున్నమిఘాట్, స్టేట్‌గెస్ట్‌హౌస్, రెండు కీలక ప్రాంతాల్లో దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయటం జరిగిందని ఈవిఐపిలు అక్కడే నుంచే నేరుగా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వారిని తిరిగి ఎక్కిన చోటే దింపే విధంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ మాట్లాడుతూ అమ్మవారి నివేదన, అలంకారం, నైవేథ్యం తదితర వాటికోసమే ఈ రెండు గంటలపాటు అమ్మవారి దర్శనం నిలుపుదల ఉంటుందని, పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. భక్తుల క్యూమార్గాన్ని తగ్గించడానికే అంతరాలయ దర్శనం, శఠగోపం సేవలను రద్దుచేసినట్లు వివరించారు. విఐపి దర్శనం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పరిమితం చేసినట్లు వివరించారు. సాధారణ భక్తులు అమ్మవారిని త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు వీలుగా విస్తృతస్థాయిలో అమ్మవారి సన్నిధిలో ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవిధంగా ఏర్పాట్లను పూర్తిచేయటం జరిగిందని ఆమె వివరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన 700 మంది సిబ్బంది, 600 మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలు, 1000 మంది ఎన్‌సిసి వలంటీర్లు తదితరుల సేవలను వినియోగించుకోవడం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో దుర్గగుడిని తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అనూరాధ వివరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెవిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో మల్లికార్జున మహా మండపాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా పలు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని కృష్ణా పుష్కరాల అనంతరం ఈ పనులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాల ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ప్రిన్సిపల్ సెక్రటరీ జెవిఎస్ ప్రసాద్ ఆవిష్కరించారు. పోస్టల్ డైరెక్టర్ కె.సోమసుందరం మాట్లాడుతూ పోస్టల్ కవర్ విలువ రూ.10, ఇదేవిధంగా పుష్కర జలాలు కావల్సిన వారు రూ.30 చెల్లిస్తే పోస్టల్ శాఖ వారు బాటిల్‌ను అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో దేవస్థానం సహాయక ఇవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, దేవస్థానం స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్ పాల్గొన్నారు.

పుష్కరాలకు తరలొస్తున్న బంధువులు, మిత్రులు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 10: కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని ఆపై కృష్ణా పుష్కరాలు ఇంకేముంది ఇప్పుడు అందరి చూపూ విజయవాడపైనే అన్ని దారులూ బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంతకే. రాష్ట్భ్రావృద్ధికి సిఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు చేస్తున్న కృషిపై నవ్యాంధ్రలో ఉన్న ప్రతి ఇంటిలోనూ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా నూతన రాజధాని అమరావతి, దానిలో చేపట్టే ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై అంతటా ఆసక్తి నెలకొంది. రాజధానిలో చేపట్టే ఆకాశహార్మ్యాలపై ప్రభుత్వం విడుదల చేసిన చిత్రాలు ప్రజల్లో మరింత ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. ఇటువంటి సమయంలో కృష్ణా పుష్కరాలు రావడం, వాటి విజయవంతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయడం జరుగుతుంది. గత ఏడాది గోదావరి పుష్కరాలను దేశం గర్వపడేలా సిఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ పుష్కరాలకు వచ్చిన కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం రానీయ్య లేదు. ఆ తీపి గుర్తులు మరచిపోకముందే కృష్ణా పుష్కరాలు రానే వచ్చాయి. వీటి నిర్వహణపైనా సిఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇప్పటికే ఘాట్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ముఖ్యంగా విద్యుద్దీపాల వెలుగులో దగాదగా మెరసిపోతున్న ప్రకాశం బ్యారేజ్ దృశ్యాలు ఆంధ్రా జనాలను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఎలాగైనా విజయవాడ వెళ్లాలని సీమాంధ్రులు తీర్మానించుకుంటున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత బిరబిరా పారే కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసి మోక్షం పొందాలని, అదే సమయంలో తమ కలల రాజధాని అమరావతిని కనులారా వీక్షించాలని తహతహలాడుతున్నారు. దీంతో ఇప్పటికే లక్షలాది మంది విజయవాడకు కృష్ణానది ప్రవహిస్తున్న ప్రాంతాలకు చేరుకోడానికి రైళ్లు, బస్సుల్లో ప్రయాణానికి రిజర్వేషన్లు చేసుకున్నారు. మరికొందరు తమ వాహనాల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇక విజయవాడ వాసుల హడావుడి అంతా ఇంతా కాదు. దసరా, సంక్రాంతి సంబరాల కంటే ఘనంగా పుష్కరాల పుణ్యదినాలను జరుపుకోడానికి సిద్ధమవుతున్నారు. నేటి అర్ధరాత్రి నుంచే కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండడంతో పుష్కర సంబరాలకు రావాలంటూ ఇప్పటికే బంధువులకు, మిత్రులకు ఆహ్వానాలు పంపారు.
తరలొస్తున్న చుట్టాలు...
గతంలో గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ఏ విధంగా విజయవంతం చేసిందో జనాలకు ఎరుకే. ముఖ్యంగా పుష్కరాల సందర్భంగా ప్రతి రోజూ రాత్రి నిర్వహించే గంగా హారతిని ఇంకా ఎవరూ మరిచిపోలేదు. మరోసారి ఆ మహోత్తర ఘట్టాన్ని కళ్లారే చూసే అదృష్టం కృష్ణా పుష్కరాల రూపంలో వచ్చింది. ఈ సుందర దృశ్యాన్ని ఈసారి చూడకపోతే మరో 12ఏళ్ల పాటు నిరీక్షించాల్సిందే. అందుకే ఎలాగైనా పుష్కర సంబరాలు చూడాలనుకుంటున్నారు. బంధువుల నుంచి పిలుపురావడంతో మూటాముళ్లు సర్దుకుని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు చుట్టాలు, మిత్రులు బంధువుల ఇళ్లకి చేరుకున్నారు. నగరానికి వస్తున్న బంధువులు, మిత్రులతో కృష్ణానదికి చేరువలో ఉన్న రైల్వేస్టేషన్లు, కాంప్లెక్సులు కిటకిటలాడుతున్నాయి. పుష్కరాలు ప్రారంభమైతే ఈ తాకిడి మరింత అధికంగా ఉండడం ఖాయం.
మార్కెట్లకు పుష్కర కళ...
కృష్ణా పుష్కరాల సంబరాలు నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుండడంతో నదీ తీరం వెంబడి సందడి నెలకొంది. 12 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను సాధారణ పండుగల్లాగే ఘనంగా జరుపుకోడానికి నదీ ప్రాంతవాసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ బంధువులకు, మిత్రులకు ఆహ్వానాలు పంపారు. సుమారు రెండు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలకు ఇంటికొచ్చే అతిథులకు ఏ లోటు రాకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తున్నారు. బియ్యం, నూనె, పప్పు దినుసులు, కూరగాయలు భారీగా కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులతో షాపులు కళకళలాడుతున్నాయి. శ్రావణ మాసం కూడా ప్రారంభం కావడంతో నిత్యావసర దుకాణాలతో పాటు వస్త్ర, బంగారు షాపులు కూడా సందడిగా ఉన్నాయి. ఫ్యాన్లు, ఎసిలు, ఫ్రిజ్‌ల అమ్మకాలు కూడా పెరిగినట్లు ఎలక్ట్రానిక్ వ్యాపారులు చెబుతున్నారు. సందిట్లో సడేమియాలా కొందరు వ్యాపారులు వినియోగదారుల జేబులకు కన్నం వేస్తున్నారు. అధికారులు పుష్కర పనుల్లో హడావుడిగా ఉండడంతో నిత్యావసర వస్తువులకు కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పండగ రోజులు కావడంతో చేసేదేమీ లేక వ్యాపారులు చెప్పిన ధరలకే కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

పరమ పవిత్రంగా
పుష్కర హారతి
బెంజిసర్కిల్, ఆగస్టు 10: కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణమ్మకు ఇవ్వనున్న పుష్కర హారతిని పరమ పవిత్రంగా నిర్వహించనున్నట్లు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను స్పష్టం చేశారు. హారతి సందర్భంగా ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల నుండి వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. హారతితో పాటు అదే సమయంలో బాణాసంచా కాల్చడం జరిగే ఏర్పాటు చేశామన్నారు. హారతికి సంబంధించి పురోహితులకు స్పష్టమైన సూచనలు, సలహాలు అందించడంతో పాటు అవసరమైన విధి విధానాలపై వారికి తర్ఫీదు ఇవ్వటం జరిగిందని బుధవారం కలసిన విలేఖర్లకు తెలిపారు. పవిత్ర సంగమం వద్ద హారతి కార్యక్రమం కోసం ప్రత్యేక వేదికను అత్యంత సుందరంగా విద్యుత్ దీపాలతో, పుష్పాలతో అలంకరించి నవహారతులను కృష్ణమ్మకు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.