కృష్ణ

పోలీసు శాఖలో సస్పెన్షన్‌ల పరంపర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లా పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లపై వేటు వేస్తూ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన నాలుగైదు రోజుల్లో ఒక హోంగార్డు, ఒక కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేసిన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తాజాగా గురువారం మరో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసాంఘీక కార్యకలాపాలు, జూద క్రీడలను నిలువరించాల్సిన రక్షకులే ఆ జూద క్రీడల్లో పాల్గొంటున్నారన్న ఆరోపణలు పోలీసు శాఖ కీర్తిని అప్రతిష్ఠ పాలు చేస్తున్నాయి. దీంతో అవినీతికి కేరాఫ్‌గా మారిన పోలీసు శాఖను గాడిన పెట్టేందుకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు నడుం బిగించారు. ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే అవినీతి ఆరోపణలు, అసాంఘీక కార్యకలాపాల్లో పాల్గొన్నారన్న ఆరోపణల మీద నలుగురు ఎస్‌ఐలు, ఒక ఎఎస్‌ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఎనిమిది మంది కానిస్టేబుళ్లను విధుల నుండి సస్పెండ్ చేశారు. తాజాగా హనుమాన్ జంక్షన్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ వీర్ల శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. జూద క్రీడలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిర్వహిస్తున్న విస్తృత దాడుల్లో భాగంగా ఈ నెల 24వతేదీన మొవ్వ మండలం కొడాలి గ్రామంలో పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు జూదగాళ్లు పట్టుబడగా ఒకరు వీర్ల శ్రీనివాసరావు కావడం గమనార్హం. శ్రీనివాసరావుపై 38/2020 అండర్ సెక్షన్ ఏపీ గేమింగ్ చట్టం సెక్షన్ 9(1) ప్రకారం కేసు నమోదు చేశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ఎస్పీ అవనిగడ్డ డీఎస్పీని ఆదేశించారు. డీఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా శ్రీనివాసరావును విధుల నుండి తొలగిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత నాలుగు రోజుల క్రితం మైనర్ బాలికను పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పి శారీరకంగా అనుభవించటంతో పాటు గర్భవతిని చేసిన హోంగార్డు ఫణీంద్రను, జూదగాళ్ల నుండి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడిన చిలకలపూడి కానిస్టేబుల్ నవీన్‌లను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రవీంద్రనాథ్ బాబు జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించిన నాటి నుండి పోలీసు శాఖలో అవినీతిని రూపుమాపేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ ఒక్కరిపై ఏ చిన్న అవినీతి ఆరోపణ వచ్చినా పూర్తి స్థాయి విచారణకు ఆదేశించటంతో పాటు సస్పెండ్ చేస్తూ వస్తున్నారు. పీడీఎఫ్ రైస్ అక్రమ తరలింపుదారులకు సహకరించాడనే ఆరోపణలపై గతంలో కోడూరు ఎస్‌ఐ ప్రియకుమార్, నాగాయలంక పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రవీంద్రనాథ్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే లోక్ ఆదాలత్‌లో భాగంగా భార్యాభర్తల నుండి పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేసి వారి మధ్య రాజీ కుదుర్చి కేసును పరిష్కరించాడన్న ఆరోపణపై పెనుగంచిప్రోలు ఎస్‌ఐ మహ్మద్ అశ్వక్, పేకాట నిర్వాహకుల నుండి పెద్ద మొత్తం సొమ్ము వసూలు చేసి జూద క్రీడలకు అనుమతించాడన్న ఆరోపణలపై కలిదిండి ఎస్‌ఐ వై సుధాకర్ సస్పెండ్ చేశారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సీరియర్ సైనేడ్ కిల్లర్ కేసు విషయంలో సమగ్ర దర్యాప్తులో విఫలమవ్వటంతో ఎనిమిది మంది హత్యకు కారకుడయ్యాడన్న ఆరోపణలపై గుడివాడ ఎస్‌ఐ చిరంజీవిపై సస్పెన్షన్ వేటు వేశారు. తన వియ్యంకుడిని తీవ్ర మనస్థాపానికి గురయ్యేలా చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన ఎఎస్‌ఐ శ్రీమన్నారాయణపై కూడా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వేటు వేశారు. వీరితో పాటు మొత్తం ఎనిమిది మందిపై ఎస్పీ గతంలోనే సస్పెన్షన్ వేటు వేసి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. సస్పెన్షన్ వేటుల పరంపర కొనసాగుతున్నా ఇంకా పోలీసు శాఖలో కొంత మంది అవినీతికి పాల్పడటం, అసాంఘీక కార్యకలాపాల్లో పాల్గొంటుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.