కృష్ణ

నేడు తెప్పోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 10: దసరామహోత్సవాల ముగింపులో ఆఖరి ఘట్టమైన తెప్పోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం వైభవంగా నిర్వహించేందుకు దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరామహోత్సవాల సందర్భంగా ఈసంవత్సరం తిథుల్లో హెచ్చుతగ్గులు రావటంతో 11రోజుల పాటు అమ్మవారికి రోజుకొక ప్రత్యేక అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవతగా ఉన్న శ్రీకనకదుర్గాదేవి సర్వాభరణాలు ధరించి శ్రీ మల్లేశ్వరస్వామి సమేతంగా హంసవాహానంపై జల విహారాన్ని చేసే కార్యక్రమమే తెప్పోత్సవం. హంసవాహనాన్ని సోమవారం ఉదయానే్న సిద్ధం చేశారు. ఆదివారం ఉదయానే్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. భక్తులు ఘాట్‌లో కూర్చుని ప్రశాంతమైన వాతావరణంలో తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి హంసవాహనం పవిత్ర కృష్ణా నదిలో మూడు సార్లు జలవిహారం చేయిస్తారు. హంస వాహనంపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసి వేదపండితులు మంత్రోచ్ఛారణలు చేస్తుండగా హంస వాహనం జలప్రవేశం చేస్తోంది. ఈమహోత్సవానికి తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈమహోత్సవం తర్వాత శమీపూజ, పారువేటోత్సవం వన్‌టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో జరుగుతుంది. తొలుత శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం నుండి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పుష్కర ఘాట్‌కు చేరుకుంటుంది. తెప్పోత్సవం తర్వాత ఉత్సవమూర్తులను దేవస్థానం ఇవో వన్‌టౌన్ పోలీసులకు అందచేసారు.

శ్రీ దుర్గాదేవికి 35 కిలోల నేతి లడ్డూ బహూకరణ
కలిదిండి, అక్టోబర్ 10: మండల పరిధిలోని పల్లెపాలెంలో కొలువైయున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి తిరుమాని వినయ్ దంపతులు 35 కిలోల నేతి లడ్డూను సోమవారం బహూకరించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు వెంకటేశ్వరరావు, శ్యాంబాబు, దున్నా రామారావు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

దుర్గాదేవికి మంత్రి ఉమ ప్రత్యేక పూజలు
మైలవరం, అక్టోబర్ 10: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి దత్తత దేవాలయమైన మైలవరంలో వేంచేసియున్న శ్రీ కోట మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి సోమవారం మహిషాసుర మర్థిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా మంత్రి ఉమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ చరిత్ర, ప్రాశస్త్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి పశువుల ఆసుపత్రి ఎదుట శ్రీ దుర్గా మోటార్స్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారిని మంత్రి దర్శించి పూజలు నిర్వహించారు. అక్కడి నుండి టాక్సీ స్టాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలలో భాగంగా అక్కడ అమ్మవారిని మంత్రి ఉమ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయా శిబిరాలలో మంత్రి ఉమకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి అమ్మవారి పసుపు, కుంకుమలు, తీర్థ ప్రసాదాలు అందించారు. రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, పచ్చని పైర్లతో అలరాడాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని ఉమ పూజలు నిర్వహించారు.

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాంశాలు
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 10: మండల పరిధిలోని పోతేపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ నూకాలమ్మతల్లి సోమవారం శ్రీ మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. రాత్రి నాట్యాచార్య యేలేశ్వరపు పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో శ్రీ బాలాత్రిపుర సుందరి నృత్య నికేతన్ విద్యార్థులు ప్రదర్శించిన అదిగో అల్లదిగో, మహిషాసురమర్దిని స్తోత్రం, బ్రహ్మాంజలి, వేడుకుందామా.. అన్నమాచార్య కీర్తన, వినాయక శబ్ధం తదితర నృత్యాంశాలను అంజలి, దాక్షాయని, పావని, పూర్ణచంద్రిక, హేమశ్రీ, రమ్యశ్రీ ప్రదర్శించారు.

కొలువు తీరిన నూతన పాలకవర్గం
హనుమాన్ జంక్షన్, అక్టోబర్ 10: స్థానిక అభయాంజనేయస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. పాలక మండలి చైర్మన్‌గా పావులూరి రామారావు, తొమ్మిది మంది సభ్యులు అలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన పాలకమండలి చైర్మన్, సభ్యులకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారయణరావు, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు డా వల్లభనేని వంశీమోహన్ పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దెందులూరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హాజరుకాలేదు. తన నియోజకవర్గ పరిధిలోని దేవాలయానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చింతమనేని ప్రభాకర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఉదయం నుంచి డప్పు వాయిద్యాలతోను, ద్విచక్ర వాహన ర్యాలీలతో సందడి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చింతమనేని రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అభయాంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కెవిఆర్ నాగేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

డ్వాక్రా మహిళలకు రెండవ విడత రుణమాఫీ

కూచిపూడి, అక్టోబర్ 10: ఎన్నికల సందర్భంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీలో భాగంగా రెండవ విడత రూ.3 వేలను ఈ నెలలో అందజేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య పేర్కొన్నారు. ఈ విడత బ్యాంకులలో జమ చేసే 3 వేలను డ్వాక్రా మహిళలు వినియోగించుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. స్థానిక పసుపర్తివారి ధర్మచెరువులో రైతు బజారు నిర్మాణాలను సోమవారం రామయ్య బృందం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాట్య క్షేత్రం, పర్యాటక కేంద్రమైన కూచిపూడిలో నిర్మించే రైతు బజారు ప్రయోగాత్మకంగా, ఆదర్శప్రాయంగా నిర్మాణాలు చేసేందుకు నిబంధనలు సైతం అధిగమించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రైతులకు రూ.24వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించే విధంగా అమ్ముకునేందుకు దేశంలో పంజాబ్ రాష్ట్రం తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి సారిగా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశ పెట్టారన్నారు. వీటి మూలంగా దళారీల ప్రమేయం లేకుండా రైతులు పండించిన కూరగాయలు తదితర పంటలు తామే అమ్ముకునేందుకు వీలుగా రైతు బజారుల నిర్మాణాలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గతంలో వామపక్షాలు విమర్శించి అడ్డుకునేవని నేడు వాటితో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వంత పాడుతోందన్నారు. చైతనైతే అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని లేకపోతే వౌనం పాటించాలని రామయ్య ప్రతిపక్షాలకు సూచించారు. వైకాపా అధ్యక్షులు జగన్మోహనరెడ్డిపై సిబిఐ కేసులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఈ కేసుల్లో జగన్మోహనరెడ్డికి శిక్ష తప్పదని ఆయన జోస్యంచెప్పారు. ఆర్థిక దర్యాప్తులలో జగన్మోనరెడ్డికి జైలుశిక్ష తప్పదన్నారు.

భాషను సుసంపన్నం చేసేందుకు సాహిత్యం దోహదం
గుడివాడ, అక్టోబర్ 10: ఏ భాషనైనా సుసంపన్నం చేసేందుకు ఆ భాషలోని సాహిత్యమే దోహదపడుతుందని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ కొడాలి సోమసుందరరావు అన్నారు. తెలుగు భాషా వికాస సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయంలో ప్రముఖ కవి హెచ్‌ఆర్ చంద్రం రచించిన తెలుగు వెలుగు శతక కావ్యాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొడాలి మాట్లాడుతూ ఇప్పటికే పలు శతకాలను రచించిన చంద్రం తెలుగు భాషపై మక్కువతో తెలుగు వెలుగు శతకాన్ని రచించారన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సాహితీవేత్తలు చేస్తున్న కృషి అభినదంనీయమన్నారు. ముందుగా గ్రంథాలయ ఉద్యమ పితామహులు అయ్యంకి వెంకటరమణయ్య, సరస్వతీదేవి చిత్రపటాలకు ప్రముఖ రచయిత పి నాగలక్ష్మి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రచయిత హెచ్‌ఆర్ చంద్రం, సమీక్షకులు డాక్టర్ కొడాలి, తుమ్మోజు రామలక్ష్మణాచార్యులును సాహితీవేత్త పిన్నమనేని భూపతిరాయుడు సన్మానించారు.
నూజివీడు ప్రాంతంలో భారీ వర్షం
నూజివీడు, అక్టోబర్ 10:నూజివీడు ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం వర్షం కురవటంతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆదివారం కూడా మధ్యాహ్నం రాత్రి సమయాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు రెండు దుక్కులకు పైగా వర్షం పడి ఉంటుందని రైతులు తెలిపారు. ఈ వర్షంతో భూగర్భ జలాలు పెరుగుతాయని, అయితే జామ వంటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు చెప్పారు. మామిడి పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుంది.
ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
అవనిగడ్డ, అక్టోబర్ 10: స్థానిక 2వ వార్డుకు చెందిన బొర్రా జగదీష్‌ను గుడివాకవారిపాలెం వద్ద ఆటో ఢీకొట్టటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కరెంట్ పని చేస్తుండే జగదీష్ నాగాయలంక నుండి ద్విచక్ర వాహనంపై అవనిగడ్డకు వస్తుండగా అవనిగడ్డ నుండి నాగాయలంక వెళుతున్న ఆటో గుడివాకవారిపాలెం వద్ద ఢీకొట్టింది. మోటారు సైకిల్‌తో సహా కింద పడిపోయిన జగదీష్ కుడి కాలు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ప్రమాదానికి గురైన ఆటోలోనే అవనిగడ్డకు తరలించగా ప్రాథమిక చికిత్స చేసి మచిలీపట్నం వైద్యశాలకు తరలించారు. అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.