కరీంనగర్

పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 25: కరీంనగర్ జిల్లాలో మూడ్నాలుగు రోజుల నుండి కనీవిని ఎరుగని రీతిలో భారీ వర్షాలు పడి వాగుల్లో వరద ఉదృతి పెరిగిందని, వరదల వల్ల ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు మిడ్‌మానేర్ జలాశయానికి పోటెత్తడంతో గండి పడిందని, ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. నక్కవాగు, చంద్రవాగుల ద్వారా 60వేల క్యూసెక్కుల వరద వస్తోందని, వరద ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కరీంనగర్‌లో సిద్ధంగా ఉంచామని, వరదలో ఎవరైన చిక్కుకుంటే రక్షించేందుకు వీలుగా హైదరాబాద్‌లో హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. వరదల వల్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు మంత్రులు వారివారి జిల్లాల్లో పర్యవేక్షించాలని సిఎం కెసిఆర్ ఆదేశించిన మేరకు ప్రజాప్రతినిధులు వరద పరిస్థితిని గంటగంటకు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సీనియర్ ఐఎఎస్ అధికారి, స్పెషల్ సెక్రటరీ బి.ఆర్.మీనాను జిల్లాకు పర్యవేక్షణ అధికారిగా ప్రభుత్వం నియమించిందని చెప్పారు. పర్యవేక్షణ అధికారితోపాటు కలెక్టర్, జెసి, చీఫ్ ఇంజనీర్లు మిడ్‌మానేర్ ప్రాజెక్టు వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రాణ, పంట నష్టం జరగకుండా నివారించగలిగామని అన్నారు. ప్రజలు ఏలాంటి వదంతులు నమ్మవద్దని, ఎవరూ ఏలాంటి ఆందోళనలకు గురికావద్దని కోరారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 24గంటలు పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. బాధితులను ఆదుకునే చర్యల్లో ప్రతిపక్షాలు కూడా కలిసిరావాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, మేయర్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

లాఠీ నాట్యం.. రాళ్ల వర్షం..!
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 25: గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయాన్ని మంత్రి కెటి ఆర్ సందర్శించారు. అక్కడ నుంచి ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌లోతెగిపోయిన చెరువును పరిశీలించడానికి బయలుదేరారు. సమాచారం అందుకున్న సిరిసిల్ల జిల్లా సాధ న నాయకులు, న్యాయవాదులు, మహిళలు భారీ సంఖ్యలో నాగంపేట మూల మలుపు వద్దకు చేరుకున్నారు. మంత్రి కెటి ఆర్ కాన్వయ్‌ను ఆదివారం రాత్రి అడ్డుకున్నారు. సుమారు గంట పాటు పోలీసులు, టి ఆర్ ఎస్ నాయకులతో వాగ్వివాదానికి దిగారు. జిల్లా విషయంలో స్పష్టం చేయాలని పట్టుబట్టారు. బలవంతంగా పోలీసులు తొలగించేందుకు యత్నించారు. దాంతో వాహనానికి అడ్డుగా బైఠాయించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. విచక్షణరహితంగా చితకబాదారు. మహిళలు అని కూడ చూడకుండా తోసేశారు. ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ నుంచి మంత్రి వాహనం ముందుకు వెళితే నిరసనకారులు రాళ్లతో దాడి చేశారు. అతి కష్టం మీద తిమ్మాపూర్‌కు చేరుకున్నారు. ఆగ్రహించిన ఆందోళనకారులు ప్రత్యేక పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల దాడిలో సిరిసిల్ల మహిళ కౌన్సిలర్ లత, న్యాయవాదులు రమాకాంత్‌రావు, మహేశ్‌గౌడ్, శ్రీనివాస్, ఎబివిపీ, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు రంజిత్‌కుమార్, సద్దామ్‌లతో పాటు మరో 24 మందికి తీవ్ర గాయాలపాలయ్యాయి. రంజిత్‌కుమార్ మంత్రి వాహనానికి అడ్డుగా వెళ్లారు. దాంతో అతని కాలు విరిగిపోయింది. ఆయనతో పాటు సద్దమ్‌లు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యాయవాదులను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.

ఖనిలో ల్యాండ్ మాఫియా
గోదావరిఖని, సెప్టెంబర్ 25: కొంత కాలంగా ప్రశాంత వాతావరణంలో ఉన్న... గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం లో ‘ల్యాండ్ మాఫియా’ పూర్తిగా బరి తెగించి దందాలను కొనసాగిస్తోంది. రౌడీయి జం... గుండాయిజానికి ప్రధాన అడ్డా గా ఉన్న పారిశ్రామిక ప్రాంతం ఇపుడు భూ దందాలకు... భూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఒక పక్క పట్టా భూముల కబ్జాల పర్వం కొనసాగుతుంటే... మరో పక్క నకిలీ ధ్రువీకరణ పత్రాల ముసుగులో ఇక్కడ కోట్ల రూపాయల ‘ఇనాం’ భూముల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇక్కడ పట్టా భూములైన, పోరంబోకు భూములైనా... చివరకు ఇనాం భూములైనా విక్రయాలు జరుగుతున్నాయ. భూములకు విపరీతమైన ధరలు పెరగడంతో ల్యాండ్ మాఫియా ఇక్కడ ‘పాగా’ వేసుకొని దందాను నడిపిస్తున్నా... అడ్డుకునేవారు... నిఖార్సుగా ప్రశ్నించే అధికార యంత్రాంగం కొంత స్తబ్ధుగా ఉండడంతో భూ దొంగలు పెట్రేగిపోతున్నారు. పాఠశాల ముసుగులో పాట్ల దందా(ట)..! కొందరి భూ దొంగల వ్యవహారాలు రోజుకో విధంగా బయటకు పొక్కుతున్నాయి. సుమారు 10 కోట్ల రూపాయల విలువ గల ఎకరాల కొద్దీ ఇనాం భూములను ప్లాట్లుగా చేసి అమ్మకాలు జరుపుతున్న వ్యవహారం పెద్ద ఎత్తున చర్చగా మారింది. అయితే ఈ భూముల అమ్మకాల వ్యవహారంలో రెవెన్యూకు సంబంధించిన పూర్తి స్థాయి ధ్రువీకరణ ఆధారాలు ఉంటే తప్పా అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. సదరు భూ మాఫియాదారులు కోట్లకు పడగలెత్తాలని ఇక్కడి భూములను ఎలాగైనా అమ్మేసి... సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చిన ‘చార్ సౌ బీస్’లు కొనుగోలుదారులకు పెద్ద మొత్తంలోనే టోకరా వేసేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఈ దందా సాగిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ప్లాట్‌కు లక్షల రూపాయలు బయానా పొంది కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయల వరకు ఈ ఇనాం భూములను అమ్మకానికి పెట్టినట్లుగా మస్త్‌గా ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా పక్షం రోజుల క్రితమే గోదావరిఖని పట్టణంలో భూ వివాదాల నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దార వీరాస్వామి అనే వ్యక్తిని మర్మాంగాలు కోసి... ముఖాన్ని చెక్కి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మరువక ముందే రామగుండం డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్‌పైన కూడా దాడికి యత్నించారు. ఈ వ్యవహారానికి కూడా భూ వివాదమే కారణంగా చెబుతున్నారు. అయితే గోదావరిఖనిలో భూ వివాదాల వ్యవహారం రోజు రోజుకూ ముదిరిపోతూ ప్రశాంతతను చెదర గొడుతూ ఇక్కడి ప్రజానీకాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేస్తూ ఉల్లిక్కి పడేలా చేస్తోంది. అయితే కోట్లు గుమ్మరించి కొనుగోలు చేసిన సదరు భూముల అసలు వ్యవహారమంతా కూడా తప్పుడు నివేదికలతో అమ్మకాలు జరిగాయనడానికి పసిగట్టి ఆందోళనకు గురైన భూ బాధితులు అమ్మకందారులను నిలదీసినట్లు సమాచారం. భూ వివాదాల వ్యవహారం రోజురోజుకూ శాంతిని చెదరగొట్టే పరిస్థితులు దాపరిస్తున్న క్రమంలో ఇప్పుడు కొత్తగా వివాదాల్లోని భూములు కొనుగోలు చేసిన బాధితులు, అమ్మకందారుల మధ్య వివాదాలు ఉత్పన్నమై ఎలాంటి నేరపూరిత ఘటనలకు దారి తీస్తుందోనని పారిశ్రామిక ప్రాంతంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల, సెప్టెంబర్ 25:నిజామాబాద్, మహరాష్టల్రో అధిక వర్షాల వల్ల ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లో వరద నీరు చేరడంతో ఈప్రాజెక్ట్ ద్వారా 3.6 కూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్న దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక సూచించారు. ఈమేరకు ఆదివారం ఉదయం సంబంధిత శాక అధికారులతో సమిక్ష సమావేశం నిర్వహించిన అనంతరం గోదావరి ప్రాంత ప్రజల అప్రమత్తం కోసం ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసారు. మండల స్థాయి అధికారులు మండల కేంద్రాల్లోనే మకాం వేసి ఎప్పటి కప్పుడు వరదలకు సంబంధిం చి సమాచారం అందించాలని తెలిపారు. మండల కేంద్రంలో సహాయ చర్యల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని గోదావరి తీర ప్రాంత వైపు వెల్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. అలాగే వర్షానికి సంబంధించి ఎప్పటి కప్పుడు ఎటువంటి సమస్యలున్న 08724 222311కు సమాచారం అందించాలని తెలిపారు.
కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు
గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం బంద్
మహదేవపూర్ : మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు రావడంతో అలాగే ఎగువనున్న ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది 8 మీటర్ల మేర ప్రవహిస్తుంది. దీంతో మండలంలోని పెద్దంపేట, పంకెన, సర్వాయిపేట, వాగులు కమ్మివేయడం వలన గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. గోదావరి నది కమ్మి వేయడం, వాగులు పొంగిపొర్లడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తం అయ్యా రు. ఆదివారం నాడు పంకెన సమీపంలోని గోదావరి మధ్యన రాపల్లికోటకు చెందిన ఇనుముల పోశయ్య 150 గొర్లతో చిక్కుకున్నాడు. ఆయన ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. అప్పటికే వదిలేసిన 150 గొర్లు గోదావరి మధ్యలోనే చిక్కుకున్నాయి.
మానేరు వద్ద మంత్రి కెటిఆర్ పూజలు
గంభీరావుపేట, సెప్టెంబర్ 25: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారి వర్షాలకు పరవళ్లు తొక్కుతున్న గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును మంత్రి కెటిఆర్ ఆదివారం పరిశీలించారు. రెండేళ్ల విరామ అనంతరం భారి స్థాయిలో నీటి వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో జలాశయం వద్ద మంత్రి పూజలు చేశారు. వరదనీరు భారిగా ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా వుండాలని మంత్రి ఆదేశించారు. ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లోను అధికారులను అడిగితెలుసుకున్నారు. ఆయ న వెంట టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్‌రావులతో పాటు ఎంపిపి కమ్మరి గంగసాయవ్వ, జడ్పీటీసీ మల్లుగారి పద్మలతో పాటు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రిని కలువడానికి టీఆర్‌ఎస్ నాయకులను ప్రయత్నించగా ఎవ్వరిని పోలీసులు అనుమతించలేదు. నాయకుల పట్ల పోలీసులు కొంత ఓవర్ ఆక్షన్ ప్రదర్శించారు.
అఖిలపక్ష నాయకుల అరెస్టు
సిరిసిల్ల జిల్లా సాధనకై ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో అఖిలపక్షంకు చెందిన నాయకులు ఎగదండి స్వామి, ఎండి మజార్, మంగళి చంద్రవౌళి, కర్రోల్ల రాజు, ఆవునూరి బాబయ్య, ప్రభాకర్‌లతో పాటు పలువురున్నారు. సమస్యలు చెప్పెందుకు వేళ్లిన తమను పోలీస్‌లు బలవంతంగా లాకేల్లి అరెస్టు చేశారని పలువురు నాయకులు ఈ సందర్భంగా ఆరోపించారు.

మూడు గ్రామాల్లో ‘హైఅలర్ట్’
చిగురుమామిడి, సెప్టెంబర్ 25: బోయిన్‌పల్లి మండలం మాన్వాడ-కొదురుపాక వద్ద కరకట్ట గండిపడిన నేపథ్యంలో మండలంలోని ఎల్లమ్మ వాగు పరివాహక గ్రామాల్లో చిగురుమామిడి తహశీల్దార్ బూరుగు రాజాగౌడ్ హైఅలర్ట్ ప్రకటించారు. ఆదివారం ఇందుర్తి కల్వర్ట్ వద్ద కోహెడ మార్గంలో ఉన్న ఎలమ్మ వాగును పరిశీలించారు. కోహెడ మండలంలోని నారాయణపూర్, వరికోలు, బెజ్జంకి మండలం దేవక్కపల్లి, చిగురుమామిడి మండలం ఓగులాపూర్, ముదిమాణిక్యం, రామంచ గ్రామాల సర్పంచ్‌లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ యంత్రాగం హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. చిగురుమామిడి తహశీల్దార్ రాజాగౌడ్ మూడు గ్రామాల సర్పంచ్‌లు కె.జైపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, పి.తిరుపతిరావులతో మాట్లాడారు.

ముస్తాబాద్‌లో 11 సెం.మీ
వర్షపాతం నమోదు!
వరదలో కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనం
ముస్తాబాద్, సెప్టెంబర్ 25: ముస్తాబాద్ మండ లం జలదిగ్బంధానికి గురైంది. మండలంలో మునుపెన్నడు లేనివిధంగా కుండపోత వర్షం కురిసింది. అత్యిధిక వర్షపాతం కురిసింది. ఆదివారం 11సెం.మీ వర్షపాతం నమోదు అయిం ది. భారీ వర్షాలతో వచ్చిన వరద ఉద్ధృతికి ప్రధాన రహదారులే గాక, ఊరూరా కొత్తగా ఏర్పాటు చేసిన బిటి రోడ్లు సైతం కొట్టుకు పోయాయి. ముస్తాబాద్ ప్రధాన రహదారితో పాటు మోహినికుంట, బందనకల్, మొర్రాయిపల్లె, చీకోడు తదితర గ్రామాల రహదారులు ధ్వంసమైనాయి. దీంతో మండలంలో రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. ఇరుగుపొరుగు గ్రామాలకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. భారీవర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతీ చెరువు కుంటలకు ప్రమాద సూచికలు సూచించాయి. మండలంలో 17గ్రామాల్లో నిండిన చెర్వు కుంటలు పొంగిపొర్లడమేగాక, ఎగువన నుంచి వస్తున్న వరద ఉధృతికి నిండుకుండలా ఉన్న చెరువులకు గండ్లు పడవచ్చని ప్రజలు భయాందోళనకు గురైనారు. యంత్రాంగం, నాయకులు కల్పించుకొని లోతట్టు ప్రాంతాల ఆవాసాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముస్తాబాద్ పెద్దచెరువు మత్తడిపై నుంచి వరదనీరు ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లింది. దీంతో ప్రధాన రహదారి వంతెన మీదుగా 2అడుగుల ఎత్తున వరదనీరు ఉద్ధృతిగా ప్రవహించింది. ఇదే వంతెన రహదారిపై బిజెపి నేత తాండ్ర రాంగోపాల్ ద్విచక్ర వాహనం కొట్టుకుపోగా, అదృష్ఠవశాత్తు ఆయన ప్రాణాలతో బయట పడ్డాడు. రామలక్ష్మణులపల్లె మానేరువాగులో సీతారామచంద్రస్వామి దేవాలయం జలదిగ్బంధనానికి గురైంది. పక్కనే ఉన్న ప్రధాన రహదారి వంతెన సైతం నీటమునడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఎస్సై ప్రవీణ్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ పెద్దచెర్వు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ధ్వంసమైన రహదారుల హెచ్చరికగా అడ్డంగా చెట్లు వేశారు.
బాధితులను ఆదుకుంటాం
తెగిన చెరువు కట్టను పరిశీలించిన మంత్రి కెటిఆర్
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 25: భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని మంత్రి కెటి ఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌లో తెగిపోయిన చెరువు కట్టను ఆయన అదివారం రాత్రి పరిశీలించారు. వివరాలను తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. వర్షాలకు పంట, ఆస్థి నష్టంపై ఆరా తీశారు. మరమ్మత్తులను వెంటనే చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులకు మంత్రి కెటి ఆర్ ఆదేశించారు. ఆయన వెంట టిస్కాబ్ అధ్యక్షుడు రవీందర్‌రావు, జడ్పిటీసీ సభ్యులు ఆగయ్య, శరత్‌రావు, పద్మ, అధికారులు, నాయకులు ఉన్నారు.