కరీంనగర్

త్రిశంకు స్వర్గంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మార్చి 30: విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా, అనునిత్యం అప్రమత్తతతో ఉండే వారి జీవితాల్లో మాత్రం నిరంతరం అంతరాయాలు కలుగుతూనే ఉన్నాయి. సూర్యాస్తమయం అనంతరం ఏర్పడే చీకట్లను తొలగిస్తూ, ప్రజలకు వెలుగునిస్తున్న వారి కుటుంబాల్లో అధికారులు, గుత్తేదారులు చీకట్లు నింపుతున్నారు. ఒప్పంద కాలపరిమితి ముగియటంతో గుత్తేదారులు వేతనాల చెల్లింపు నిలిపివేయగా, వేతనాలడిగితే తమకేమి తెలియదన్నట్లుగా యాజమాన్యం వ్యవహరిస్తుంది. దీంతో మూడు మాసాలుగా వేతనాలు రాక, నిత్యం ప్రమాదపుటంచున విధులు నిర్వహిస్తున్న సబ్‌స్టేషన్‌ల ఆపరేటర్లు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత దశాబ్దంన్నర కాలంగా జిల్లాలోని పలు సబ్‌స్టేషన్‌లలో ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్ల పరిస్థితి యాజమాన్యవైఖరితో డోలాయమానంలో పడింది. జిల్లాలోని 210 సబ్‌స్టేషన్ల నిర్వహణ బాధ్యతలు ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ గత రెండు దశాబ్దాలుగా గుత్తేదారులకు అప్పగిస్తోంది. రెండేళ్ళకోమారు టెండర్‌లు పిలుస్తూ, అర్హులైన వారికి కట్టబెడుతోంది. వీటిలో విధులు నిర్వహించేందుకు గుత్తేదారులు సాంకేతిక అర్హతలు గల అభ్యర్థులను ఎంపిక చేసి, వారితోసబ్‌స్టేషన్ల నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా1206మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా 33/11కెవి సబ్‌స్టేషన్‌లలో కొనసాగుతున్నారు. సబ్‌స్టేషన్ల నిర్వహణకోసం యాజమాన్యం గుత్తేదారులకు చెల్లించేమొత్తం నుంచి వీరికి ప్రతినెల వేతనాల రూపంలో అందజేస్తారు. వీటి టెండర్‌కాలం గత డిసెంబర్ మాసం వరకు ముగియటంతో జనవరి నుంచి ఇప్పటివరకు సబ్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నవారికి వేతనాలు నిలిచిపోయాయి. గుత్తేదారులనడిగితే తమ ఒప్పందకాలం ముగిసిందంటూ పేర్కొంటుండగా, యాజమాన్యాన్నడిగితే వేతనాలతో తమకేం సంబంధం, మీరు మాత్రం విధులు నిర్వహించాల్సిందేనన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఎటూపాలుపోని స్థితిలో సబ్‌స్టేషన్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గుత్తేదారులతో ఒప్పందకాలం ముగియకముందే కొత్తటెండర్లు ఆహ్వానించి ఒప్పందం చేసుకుంటారు. గడువు ముగిసిన అనంతరం ఆపరేటర్లను కూడా తొలగించాల్సి ఉంటుంది. అయితే, టెండర్లు పిలవగానే పాతగుత్తేదారులే వాటిని తిరిగి చేజిక్కించుకోవటం, ఆపరేటర్లుగా యధావిధిగా పాతవారినే కొనసాగిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. టెండర్లనిర్వహణలో జాప్యం జరిగినా ఒప్పందం అనంతరం గుత్తేదారులు ఆపరేటర్లకు వేతనాలు చెల్లించేవారు. కానీ, యాజమాన్య నిర్లక్ష్యంతో మార్చి మాసం ముగుస్తున్నా కూడా సబ్‌స్టేషన్ల నిర్వహణకు టెండర్లు పిలవలేదు. దీంతో ఆశలొదులుకున్న గుత్తేదారులు ఆపరేటర్లకు వేతనాలు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఆపరేటర్ల పట్ల స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేనిపక్షంలో నిరవధిక ఆందోళనలు చేపడుతామని తెలంగాణ విద్యుత్ ఒప్పంద కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.రవీందర్‌రెడ్డి హెచ్చరించారు.

వాణిజ్య బ్యాంకుల కన్నా
కెడిసిసిబి ద్వారా ఎక్కువ పంట రుణాలు
* ఉపాధి బిల్లులూ సహకార బ్యాంకుల్లో చెల్లించాలి
* కలెక్టర్ నీతూప్రసాద్

కరీంనగర్ టౌన్, మార్చి 30: జిల్లాలో సహకార బ్యాంకుల ద్వారా ఎస్సీ, బిసి, ఎస్టీ, మైనార్టీ శాఖల ద్వారా మంజూరైన స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన సబ్సిడీ యూనిట్లన్నిటిని మంజూరు చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు విద్యానగర్ శాఖను ఆమె ప్రారంభించారు. ఈసందర్బంగా కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకుల కన్నా కెడిసిసిబి ద్వారా ఎక్కువ పంట రుణాలు మంజూరు చేశారన్నారు. జిల్లాలో స్వయం ఉపాధికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాలు ఎక్కువ మంజూరు చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లులు కూడా సహకార బ్యాంకుల ద్వారా చెల్చించేందుకు ఖాతాలు ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఖాతాలు కూడా సహకార బ్యాంకులో ప్రారంభిస్తామని, జిల్లా పాడి పరిశ్రమ యూనిట్లు ఈ బ్యాంకుల ద్వారా ఎక్కువ మంజూరు చేయాలని కోరారు. అనంతరం సబ్సిడీ ట్రాక్టర్ మంజూరు ప్రతిని కలెక్టర్ లబ్ధిదారునికి అందజేశారు. టెస్కాబ్ చైర్మన్, కెడిసిసిబి అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో సహకార బ్యాంకు శాఖలు 48 ఉన్నాయన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి 60 శాఖలు ఏర్పాటే లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులకే కాకుండా ఇతరులకు కూడా బ్యాంకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కెడిసిసిబి రూ.1400కోట్ల టర్నోవర్ కలిగి ఉందన్నారు. జిల్లాలో రూ.90కోట్లనుంచి రూ.650 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు, ఇతర బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులు సేవలు అందించటంలో ముందుంటాయన్నారు. ఏప్రిల్ 2న సహకార బ్యాంకు ఎటిఎంలను ప్రారంభించనున్నట్లు కొండూరి ప్రకటించారు. బ్యాంకు ద్వారా చదువుకునే పేద విద్యార్థులకు విద్యారుణాలు కూడా మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, కెడిసిసిబి ఉపాధ్యక్షుడు ఉచ్చిడి మోహన్‌రెడ్డి, కార్పొరేటర్లు బండి సంజయ్‌కుమార్, బత్తుల భాగ్యలక్ష్మి, బ్యాంకు డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేల వేతనాల పెంపు హేయనీయం
* కరువు రైతుపై కనికరమేది..?
* రుణమాఫీ హుళక్కేనా..?
* కెసిఆర్ ప్రభుత్వానికి ఉరితీత తప్పదు
* వైసిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.నగేశ్

కరీంనగర్ టౌన్, మార్చి 30: ఓవైపు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుండగా, వేతనాలు లేక కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే, తమకేమి పట్టనట్లు ఎమ్మెల్యేల వేతనాలు పెంచటం అత్యంత హేయనీయమని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కె.నగేశ్ విమర్శించారు. బుధవారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, రైతు రుణమాఫీకి అనేక కొర్రీలు పెడుతూ, కరువు రైతుపై కనికరించకుండా గుత్తేదారులపట్ల ఔదార్యం కనబరుస్తుండటం శోచనీయమన్నారు. నీటికోసం రాష్ట్రం తల్లడిల్లుతుంటే ప్రత్యామ్నాయ చర్యలు వీడి, కొత్త ప్రాజెక్టులపేర లక్షల కోట్ల రూపాయలు గుత్తేదారుల వశం చేస్తుందని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు కూడా డబ్బులు చెల్లించకుండా, ఆమొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్ళిస్తోందని దుమ్మెత్తారు. తన సీటును పదిలపర్చుకోవటం కోసమే ఎమ్మెల్యేలకు భారీగా వేతనాలు పెంచాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆర్దిక వనరులను అధికారపార్టీనేతలు, పాలక ప్రజాప్రతినిధులే దోపిడీ చేస్తుంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రజాకంటక విధానాలు విడనాడకపోతే, ప్రభుత్వాన్ని ఉరితీయక తప్పదని హెచ్చరించారు. ఈసమావేశంలో నాయకులు సంపత్, బోగె పద్మ పాల్గొన్నారు.

ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
* కలెక్టర్ నీతూప్రసాద్
కరీంనగర్ టౌన్, మార్చి 30: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. బుధవారం నగరంలోని భగవతి ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులకు చల్లని తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షల్లో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుచేసినట్లు, ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. జిల్లాలో 14 ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నాయని, రాష్ట్ర పరిశీలకులు సైతం ప్రత్యేక పర్యవేక్షక బాధ్యతలు కొనసాగిస్తున్నారని తెలిపారు. బుధవారం గణితం పేపర్ 2 పరీక్ష జరుగగా, 58,272మంది విద్యార్థులకు గాను, 57,977మంది హాజరుకాగా, 295మంది గైర్హాజరైనట్లు డి ఈవో శ్రీనివాసాచారి తెలిపారు. 72పరీక్ష కేంద్రాలను ప్లయింగ్‌స్వ్కాడ్, 5 కేంద్రాలను రాష్టప్రరిశీలకుడు పరిశీలించినట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో డిఈవో శ్రీనివాసాచారి పేర్కొన్నారు.

తగ్గిన పసుపు ధరలు..
ఆందోళనలో సాగు రైతులు
జగిత్యాల అగ్రికల్చర్, మార్చి 30: ఏడాది కష్టపడి పండించిన పసుపు ధర తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్ని పంటల్లో ప్రధాన పంటైన పసుపుకు పెట్టుబడి శ్రమ ఎక్కువ ఉన్నందున క్వింటాల్‌కు 10వేల ధర ఉంటేనే రైతుకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. పసుపు తవ్వకం అనంతరం ఉడుకబెట్టిన రైతులు బుధవారం జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌కు తరలించగా కాడి క్వింటాల్‌కు 6500-7900,గోల క్వింటాల్‌కు 6300- 7500 ధరలు పలికి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసారు. అలాగే ఏసంగి మొక్కజొన్నను నూర్పిడి అనంతరం రైతులు విక్రయానికి తరలించగా క్వింటాల్‌కు ధర.1385-1420 వరకు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేపట్టగా మొక్కజొన్న ధరలు ఆశాజనకంగా ఉన్నాయని అంటున్నారు. పసుపుకు క్వింటాల్ 10వేలపైగా ఉంటే గిట్టుబాటయ్యే అవకాశం ఉందని, లేకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు అంటున్నారు.

మహిళల రక్షణే పోలీసుల కర్తవ్యం
- శిక్షణ ఐ పి ఎస్ అధికారి సింధూ శర్మ

గోదావరిఖని, మార్చి 30: మహిళల రక్షించడమే పోలీసుల కర్తవ్యమని ఇందుకోసం మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని శిక్షణ ఐ పి ఎస్ అధికారి సింధూ శర్మ అన్నారు. బుధవారం గోదావరిఖనిలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో నిర్వహించిన మహిళా సాధికారిక కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. మహిళలు స్వేచ్ఛగా ఉన్న రోజే నవ సమాజం నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఇందుకోసం మహిళలు ఆయా సందర్భాలాలలో ఎదుర్కొంటున్న సమస్యలతో సతమతం కాకుండా, పోలీసులకు సమాచారం అందిస్తే వాటిని తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు. మహిళలు చైతన్య వంతులై ఉండాలని, ఆకతాయిలు ఇబ్బందులకు గురిచేస్తే తక్షణమే 100కు డయల్ చేస్తే వెంటనే సహకరిస్తామని అన్నారు. మహిళలంతా సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని, అదైర్యంతో ఆత్మహత్య సంఘటనలకు పాల్పడకూడదని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో మహిళా కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలను రంగంలోకి దించి ఎలాంటి సంఘటనలు జరుగకుండా బస్టాండులు, కాలేజీలు, ప్రధాన మార్కెట్ సెంటర్‌లతో పాటు వివిధ కాలనీలలో తిరుగుతూ మహిళలపై నేరాలు జరుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రతిజ్ఞ జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల కోసం రూపోందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో గోదావరిఖని వన్‌టౌన్ సీ ఐ ఆరె వెంకటేశ్వర్, రామగుండం ట్రాఫిక్ సీ ఐ చిలుకూరి వెంకటేశ్వర్లు, టు టౌన్ సీ ఐ చల్లా దేవారెడ్డి, రామగుండం జడ్‌పిటిసి కందుల సంధ్యారాణి, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాష్, అనసూర్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

హరితహారంలో 4.18కోట్ల మొక్కలు నాటుతాం

* కలెక్టర్ నీతూప్రసాద్

కరీంనగర్ టౌన్, మార్చి 30: రెండోవిడత హరితహారం పథకంలో జిల్లావ్యాప్తంగా 4.18కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందిరంలో ఎపివోలు, ఎంపిడివోలతో కలిసి హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, గత ఏడాది నర్సరీల్లో మిగిలిన మొక్కలలో మీటరుకంటే ఎక్కువగా పెరిగినవాటిని పెద్దసంచుల్లోకి మార్చాలని సూచించారు. ఇందిర జలప్రభ కింద విద్యుత్ కనెక్షన్ మంజూరైన అన్ని బ్లాకుల్లోను వెంటనే మోటార్లు బ బిగించాలని ఆదేశించారు. 14వ ఫైనాన్స్ నిధుల్లో 30నిధులను తప్పనిసరిగా తాగునీటి పథకాలకు చెందిన విద్యుత్ చార్జీలు చెల్లించేందుకు వినియోగించాలన్నారు. ఉపాధిహామీలో నిర్మించతలపెట్టిన 10వేల ఐ ఎస్ ఎల్ నిర్మాణాల్లో పెండింగ్‌లో ఉన్నవాటిని వెంటనే పూర్తిచేయాలని, ఇందులో జిల్లా మొదటిస్థానంలో నిలిచేలా సహకరించాలన్నారు. హుస్నాబాద్, చొప్పదండి, ధర్మపురి, మంథని మండలాల్లో ఐ ఎస్ ఎల్ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు. నిర్మాణం పూర్తి అయిన ఐ ఎస్ ఎల్‌లకు వెంటనే చెల్లింపులు జరపాలని తెలిపారు. స్వల్ప విషయాల్లో పెండింగ్‌లో పెట్టవద్దని, ప్రజల్లో అవగాహన కల్పించి ఐ ఎస్ ఎల్ నిర్మాణాలు పూర్తిచేసేందుకు తమవంతు కృషిచేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం చేయటమే కాకుండా వాటిని ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ చెల్లింపులు జరగాల్సిన ఉన్న పాపత బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈకార్యక్రమం తూర్పు డి ఎఫ్‌వో, సోషల్ ఫారెస్ట్ డి ఎఫ్‌వో, ఎపివోలు, ఎంపిడివోలు,తదితరులు పాల్గొన్నారు.

బల్విందర్ మరణంపై 1న విచారణ
* జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాంక
కరీంనగర్ టౌన్, మార్చి 30: గత డిసెంబర్ 22న నగరంలోని లక్ష్మినగర్‌లో తల్వార్‌తో దాడికి దిగి, పోలీసుల కాల్పులతో మరణించిన బల్వీందర్‌సింగ్ కేసుపై ఏప్రిల్ 1న న్యాయవిచారణ చేపట్టనున్నట్లు జగిత్యాల సబ్‌కలెక్టర్ కె శశాంక తెలిపారు. నగరంలోని ధన్గర్‌వాడీ హైస్కూల్ ఆవరణలో గల మండల విద్యాధికారి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10.30గంటలకు విచారణ మొదలవుతుందని, దీనికి హాజరయ్యేందుకు సంబంధించిన వారు తగిన ఆధారాలతో సహా సకాలంలో వచ్చి, సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తహశీల్దార్‌ను ఆదేశించారు.

రాజన్న హుండీ ఆదాయం రూ.81.98 లక్షలు
వేములవాడ, మార్చి 30: శ్రీ రాజేశ్వరస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ.81.98 లక్షల ఆదాయం సమకూరింది. బుధవారం ఆలయ ఆవరణలోని ఓపెన్ కాంప్లెక్స్‌లో ఇవో రాజేశ్వర్ పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. ప్రధాన దేవాలయంతోపాటు అనుబంధ శ్రీ భీమేశ్వరాలయం, శ్రీ బద్దిపోచమ్మ ఆలయం, నగరేశ్వరాలయం, నాంపల్లి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయాల హుండీలను లెక్కించగా నగుదు రూపంలో రూ.81.98 లక్షలు రాగా కానుకల రూపంలో 207గ్రాములు బంగారం, 10 కెజి వెండి ఆలయానికి సమకూరింది.

సంప్రదాయరీతిలో ఉగ్రనారసింహ పుష్పయాగం
ధర్మపురి, మార్చి 30: బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కోరిన కోర్కెలు తీర్చే దైవమైన ఉగ్రనారసింహుని పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం, భక్తజన కోరికల సాఫల్యార్థం నిర్వహించిన పుష్పయాగం దేవస్థాన పౌరోహితులు పురుషోత్తమాచార్య, వేదవిదులు రమేశశర్మల ఆచార్వత్యంలో అర్చకులు నంబి రఘునాథాచార్య, నరసింహ మూర్తి తదితరులు జరిపించారు. ఆలయ మంటపంలో పంచాబ్జమును చిత్రించి, పుష్పపీఠాసీనులజేసి, నలువైపులా ద్వార కుంభాలనుంచి వాసుదేవ పుణ్యాహవాచనం, షోడశాక్షరి మంత్ర పఠనం గావించి, చరుర్వేదాలతో, సంగీతాది కళలతో ఉగ్రనారసింహుని సేవించగా భక్తిశ్రద్దలతో కొలిచారు.

నగర పంచాయతీల్లో ఉపాధి హామీ అమలు
* సిఎంకు చాడ లేఖ
హుస్నాబాద్, మార్చి 30: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన నగర పంచాయతీల్లో ఉపాధిహామీ అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని పట్టణ కార్యదర్శి గడిపె మల్లేష్ బుధవారం విలేఖరులకు అందజేశారు. 2014లో పలు మేజర్ పంచాయతీలను అప్‌గ్రేడ్ చేస్తూ నగర పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతో నగర పంచాయతీల్లోని కూలీలు పనుల్లేక విలవిల్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా సిఎం స్పందించి ఉపాధి హామీ అమలుచేసి ఆదుకోవాలని కోరారు.