కరీంనగర్

మార్చి 1న డిజి ధన్ మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 25: నగదు రహిత సేవలపై అవగాహన కల్పిస్తూ, ప్రజలను చైతన్యపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజి ధన్ మేళా కార్యక్రమాన్ని నగరంలోమార్చి 1న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సర్ప్‌రాజ్ అహ్మద్ తెలిపారు. దీనిపై అన్ని ప్రభుత్వ విభాగాలు, బ్యాంకర్లతో కాన్ఫరెన్స్ హాలులో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త్ధ్వార్యంలో తలపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా నగదు రహిత సేవలను విస్తృతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళే అవకాశముంటుందన్నారు. అన్ని వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన స్టాళ్ళు మేళాలో ఏర్పాటుచేసి, చేతిలో నయాపైసా లేకున్నా తన సెల్‌ఫోన్, క్రెడిట్, డెబిట్, రూపే కార్డు ద్వారా కొనుగోళ్ళు చేపట్టే విధానంపై సందర్శకులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. 50 నుంచి 70 స్టాళ్ళ వరకు మేళాలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, ప్రధానంగా బ్యాంకర్లు మేళాలో విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. నగదు రహిత సేవలు వినియోగించుకుంటే జరిగే లాభాలపై వివరిస్తూ, దేశ ఆర్థికాభివృద్ధిలో తమ పాత్రను వివరించేందుకు అన్ని విభాగాల సిబ్బంది సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచే నేరుగా పర్యవేక్షణ కొనసాగుతున్న నేపథ్యంలో మేళాలో వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార వర్గాలు, వాటి అనుబంధ రంగాలకు చెందిన పరిశ్రమల నిర్వాహకులు తమ స్టాళ్ళను ఏర్పాటు చేసుకోవాలన్నారు. డిజి ధన్ మేళా కార్యనిర్వాహక ప్రతినిధి రాంకుమార్ మాట్లాడుతూ, వంద మేళాలు నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటివరకు తెలంగాణలోని హైద్రాబాద్, నిజామాబాద్, వరంగల్‌లలో మేళాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ మేళాలో ఈ గవర్నెన్స్ సర్వీసుల ప్రదర్శన, ఆధార్ కార్డులు లేనివారికి దిగే అవకాశం, బ్యాంకు ఖాతాలు తెరిచే అవకాశం, ప్రజా పంపిణీ వ్యవస్థలో నిర్వహిస్తున్న డిజిటల్ లావాదేవీల ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. డిజి ధన్ మేళాలో పాల్గొనే వారికి డిజి ధన్ వ్యాపార్ యోజన, లక్కీ ధన్ యోజన పథకాల ద్వారా లక్కీ డిప్‌లు నిర్వహించి, కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొని, విజేతలకు బహుమతులందజేయనున్నట్లు వివరించారు. ఈ సమీక్షలో జాయంట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, డిఆర్‌వో ఆయేషా మస్రత్‌ఖానం, అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

రాజన్న, ప్రజల ఆశీస్సులతోనే బతికాం
* మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్
* రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పొన్నంకు నేతల పరామర్శలు
* ఆసుపత్రి ఎదుట భారీగా కార్యకర్తలు

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 25: మహాశివరాత్రిని పురస్కరించుకుని వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి కరీంనగర్ వస్తున్న క్రమంలో వేములవాడ మండలం సంకేపల్లి వద్ద ఇన్నోవా అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో గాయపడి, కరీంనగర్‌లోని అఫెక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌తోపాటు జడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్‌లను శనివారం పలు పార్టీలకు చెందిన నేతలు పరామర్శించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర మేయర్ రవీందర్‌సింగ్, సిఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపిలు సురేష్ షెట్కార్, సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కోడూరి సత్యనారాయణగౌడ్, పిసిసి ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మినరసింహారావు, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్, మాజీ మేయర్ డి.శంకర్, పిసిసి అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డిలతోపాటు టిఎన్‌జిఓఎస్ నాయకులు, పలు కుల సంఘాల నాయకులు, పలువురు ముస్లిం మత పెద్దలు ప్రభాకర్‌ను కలిసి పరామర్శించారు. అలాగే జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావడంతో ఆసుప్రతితోపాటు పరిసరాలు జనాలతో నిండిపోయాయి. పరామర్శించడానికి వచ్చిన వారితో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వేములవాడ రాజన్న, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కనుకే తాను, తనతోపాటు గాయపడ్డ అందరం ప్రాణాలతో బతికామని అన్నారు. మాకు పునర్ జన్మను ప్రసాదించారంటూ పేర్కొన్నారు.

భార్యను హతమార్చిన భర్త
కొడిమ్యాల, ఫిబ్రవరి 25: మండలంలోని తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన జంకె రజిత (35)ను భర్త రమణరెడ్డి శనివారం అయుధంతో తలపై బాదడంతో రజిత అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామంలో కలకలం రేపిన సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం రమణరెడ్డి రజిత మధ్య కొంత కాలంలో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబ కలహాలతో విసిగిన రమణరెడ్డి ఇంట్లో ఎవరు లేని సమయంలో రజితపై ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వివరించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటన స్థలాన్ని డిఎస్పీ కర్ణాకర్, సిఐ కృపాకర్‌లు పరిశీలించారు. ఎస్సై నీలం రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రాజన్న శివరాత్రి ఆదాయం రూ.64.23 లక్షలు
వేములవాడ, ఫిబ్రవరి 25: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవల టికెట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ.64లక్షల 23వేలు పైగా ఆదాయం ఆలయానికి సమకూరింది. మూడు లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి సేవలో తరించారు. అయితే హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని త్వరలోనే లెక్కిస్తామని ఆలయ వర్గాలు తెలిపాయి. లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.15లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిసింది.

కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 25: అది ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట. శుక్రవారం మహా శివరాత్రి పండుగ కావడంతో ఉపవాస దీక్షలతో కుటుంబీకులు రాత్రంతా జాగరం చేశారు. శనివారం ఉదయం పనుల్లో నిమగ్నమయ్యారు. అంతలోనే ఓ పిచ్చి కుక్క ఇంటిలోకి చొరబడి నిద్రిస్తున్న పదకొండు మాసాల చిన్నారి మారోజు సహస్రాజ్, అరవై ఏళ్ల వృద్ధురాలు మారోజు ప్రమీల, మహిళ లాస్యపై దాడి చేసింది. తొడపిక్కలను కాటేసింది. ముగ్గురిని వరుసగా కరవడంతో భయంతో బోరున విలపించారు. వెంటనే కుటుంబీకులు వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి సహస్రాజ్, వృద్ధురాలు ప్రమీలను కరీంనగర్‌కు తరలించారు.

తిప్పన్నపేటలో వెలసిన గణపతి విగ్రహం
* పూజలు చేస్తున్న గ్రామస్థులు.. అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది
* డబుల్‌బెడ్‌రూం నిర్మాణ స్థలంలో బయట పడడంతో తీవ్రచర్చ
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 25: మండలంలోని తిప్పన్నపేట గ్రామ శివారులో శుక్రవారం రాత్రికి రాత్రే గణపతి విగ్రహం వెలసింది. ఈ విషయం దావణంలా వ్యాపించడంతో స్థానికులు అక్కడకు చేరుకుని పూజలు చేశారు. నిరుపేదలకు నిర్మించే డబుల్‌బెడ్‌రూంల నిర్మాణాలకు కోసం గుర్తించిన స్థలంలో విగ్రహం బయట పడడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. గ్రామంలోని డబుల్ బెడ్ రూం పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు తిప్పన్నపేట గ్రామ శివారులోని సర్వే నంబర్ 571లోని 2ఎకరాల 12గుంటల ప్రభుత్వ స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు స్థలం కేటాయించారు. ఇదే స్దలంలో రాత్రికి రాత్రే గణపతి విగ్రహం బయట పడడంతో గ్రామంలో కలకలం రేగింది. స్థానికులు ఈ విషయం రెవెన్యూ అధికారులకు అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు విచారణ జరిపారు. దీంతో గ్రామస్థులు తమ గ్రామంలో వెలసిన గణపతి ప్రతిమకు ఆలయం నిర్మించి తీరుతామని ఆందోళనకు దిగారు. ఈవిషయమై జగిత్యాల సబ్ కలెక్టర్‌తో విచారణ చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులు తెలపడంతో గ్రామస్థులు శాంతించారు. కాగా గ్రామంలో డబుల్‌బెడ్‌రూం స్థలంలో విగ్రహం బయట పడడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రేపటి సైకిల్ ర్యాలీ విజయవంతం చేయండి
* పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 25: సేఫ్ అండ్ స్మార్ట్ కరీంనగర్‌లో భాగంగా ఈ నెల 27న సైక్లోథావన్ పేరిట నిర్వహించతలపెట్టిన సైకిల్ ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి కోరారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియం నుండి ఎస్సారార్ కళాశాల వరకు సైకిల్ ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. శనివారం సాయంత్రం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ సుహృద్భావ వాతావరణంతోపాటు కాలుష్య నివారణకు దోహదపడాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని అన్నారు. కమిషనరేట్ పరిధిలో వివిధ వర్గాల భాగస్వామ్యంతో నెలకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం ర్యాలీ ప్రారంభ పాయింట్ అయిన అంబేద్కర్ స్టేడియాన్ని సిపి కమలాసన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శశాంకలు సందర్శించి ఏర్పాట్లపై పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి రామారావు, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ తుల శ్రీనివాస రావు, ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులు జనార్దన్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, ఐసో టీం ప్రతినిధి ఘన్‌శ్యాం ఓజా, క్రీడల అధికారి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భద్రతపై భరోసా కల్పిస్తున్న ‘షీ’ బృందాలు
మహిళలు, విద్యార్థినుల భద్రతపై షీ బృందాలు భరోసా కల్పిస్తున్నాయని పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి అన్నారు. షీ బృందాల పనితీరుపై మహిళలు, విద్యార్థినులకు నమ్మకం ఏర్పడిందని చెప్పారు. నగరంలోని అన్ని ముఖ్య కూడళ్లల్లో మాటువేసి ఉండి మహిళలు, విద్యార్థినులను వేధించే వారిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆధారాలు సేకరిస్తూ పట్టుకుంటున్నారని వివరించారు. మొదటి విడత పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెడుతున్నామని, రెండవ విడత పట్టుబడితే కేసులు నమోదు చేయడంతోపాటు రౌడీషీట్లను తెరుస్తామని ప్రకటించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 14 షీ బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 84 మందిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. హాక్‌ఐ అప్లికేషన్‌ను ఇప్పటివరకు 5వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని, ప్రజలు నేరుగా పోలీసు స్టేషన్‌లకు రాకుండా నేరాలతోపాటు ఇతర విషయాలను ఫిర్యాదుచేసే అవకాశం హాక్‌ఐ ద్వారా ఉందని చెప్పారు.