కరీంనగర్

ఆశలపల్లకిలో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 23: ఖద్దర్ చొక్కా ధరించే నేతల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై ఎట్టకేలకు కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు బుధవారం సీట్ల పెంపుకు సంబంధించి నోట్ సిద్ధం చేస్తున్నట్లు, ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఏ ప్రాతిపదికన తీసుకుంటుందో తెలియనప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లేదా నాలుగు సీట్లు పెరిగే అవకాశం మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు తాజా ప్రకటనతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఊరట కలుగగా, ఆశావాహుల ఆశలు చిగురించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు పార్లమెంట్, 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పాత కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉండగా, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మరో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెరాస ఎంపిలు అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై లేవనెత్తగా, కేంద్ర మంత్రులు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతీ పార్లమెంట్ పరిధిలో అదనంగా రెండు సీట్లు పెరుగుతాయన్న ప్రచారం మాత్రం జరుగుతున్నా..ఉమ్మడి జిల్లాలో మూడు లేదా నాలుగు సీట్లు పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన సంగతి తెలిసిందే. విభజనతో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రెండు నుంచి మూడు జిల్లాలకు విస్తరించింది. జిల్లాల విభజన నేపథ్యంలో సీట్ల పెంపును ఏ ప్రాతిపదికన తీసుకుంటుందో తెలియనప్పటికీ సీట్ల పెంపు శుభసూచకంగా మాత్రం అధికార టిఆర్‌ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. సీట్ల పెరుగుతాయనే విశ్వాసంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, మంచి పేరున్న నాయకులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్న విషయం విధితమే. టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారికి సీటు ఖాయమంటూ ఆ పార్టీలో అప్పుడే చర్చ మొదలైంది. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సిఎం కెసిఆర్ నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలిన శాతాలను ఎమ్మెల్యేల వారీగా కెసిఆర్ ప్రకటించిన సంగతి కూడా అందరికి తెలిసిందే. సర్వేలో హుజూరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఈటల రాజేందర్ 90శాతం ప్రజల మన్ననలు పొందగా, సిరిసిల్ల ప్రాతినిథ్యం వహిస్తున్న మరో మంత్రి కెటిఆర్ 60శాతం ప్రజల మన్ననలు పొందారు. మిగిలిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 55, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 56, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌బాబు 53, వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు 39, చొప్పదండి ఎమ్మెల్యే శోభ 62, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి 54, మంథని ఎమ్మెల్యే మధు 39, ధర్మపురి ఎమ్మెల్యే 47, రామగుండం ఎమ్మెల్యే సత్యనారాయణ 50, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు 41 శాతం ప్రజల మన్ననలు పొందారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి 68 శాతం ప్రజాభిమానం లభించింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 13నియోజకవర్గాలుంటే, 12 నియోజకవర్గాలు టిఆర్‌ఎస్ ఖాతాలోనే పడ గా, కేవలం ఒక జగిత్యాల మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో పడింది. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని టిఆర్‌ఎస్ తపనపడుతోంది. ఎంపి కవిత ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సర్వేలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పనితీరుపై 68శాతం మంది ప్రజలు మద్ధతు ప్రకటించడంతో అధికార పార్టీ నేతల్లో కొంత కలవరం మొదలైంది. మొత్తానికి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం ఒక స్పష్టత ఇవ్వడంతో ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఊరట లభించగా, అటు ఆశావహుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి.