కరీంనగర్

ఎండిన పంటల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 2: జిల్లాలో వర్షాలు సంమృద్దిగా కురిసినప్పటికీ కొన్ని మండలాలు, గ్రామాల్లో మాత్రం వానలు లేక తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి పంట పొలాలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయని, ఎండిపోయే పంట పొలాలను కాపాడేందుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నుంచి పంపింగ్‌తో వరదకాలువ ద్వారా ఖాజీపూర్, పొత్తూర్, తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి పంట మడులను తడిపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివారం ఉదయం మంత్రి రాజేందర్ కరీంనగర్, ఇల్లంతకుంట మండలాల్లో పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం కరీంనగర్‌కు చేరుకున్న మంత్రి రాజేందర్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఇటు ఎండిన పంటలకు నీరందించే ప్రయత్నాలు చేయడంతోపాటుగా అటు ఎండిపోయిన పంటలపై సర్వే చేయాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పారు.
రైతులు ఎవరూ ఆధైర్యపడవద్దని, ఆందోళన చెందవద్దని, అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఎన్నడులేని విధంగా ఎస్సారెస్పీ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందిస్తున్నామని అన్నారు. ఎస్సారెస్పీ కాలువను పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టేందుకు బడ్జెట్‌లో రూ.200కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, ఈ దిశగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అన్నారు. కరీంనగర్‌ను అతిత్వరలోనే ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించుకోబోతున్నామని తెలిపారు.
ఈ ఏడాదిలో డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేస్తామని, ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 1400 ఇళ్ల చొప్పున నిర్మించి తీరుతామని అన్నారు. అలాగే రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని, ఎక్కువగా నేషనల్ హైవేలు సాధించుకున్నామని తెలిపారు. రబీ కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, 48గంటల్లో కొనుగోళ్లు, 72 గంటల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టామని, పంట దిగుబడికి సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణలోనే గొప్ప జిల్లాగా కరీంనగర్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి రాజేందర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, మేయర్ రవీందర్ సింగ్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డిలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఖాజీపూర్‌లో ఎండిన పంట పొలాలను పరిశీలించిన మంత్రి
కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండలం ఖాజీపూర్‌లో ఎండిపోయిన పంట పొలాలను ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని, ఎండిపోయిన పంటలను కాపాడేందుకు ప్రయత్నిస్తామని, రైతులను అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. లింగయ్య అనే రైతు తన మూడెకరాలలో పొలం వేయగా, నీరు లేక ఎండిపోయిందని మంత్రి ఎదుట వాపోగా, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, బొడిగ శోభలతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

ఎవరినీ ఉపేక్షించం
* మహదేవ్‌పూర్, మంథని ఘటనలపై మంత్రి రాజేందర్

కరీంనగర్, ఏప్రిల్ 2: తప్పుచేసిన వారు ఎవరైనా, ఎంతటివారైనా, పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించబోమని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. చట్టం అందరికి సమానమేనని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్‌లో ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో మహదేవ్‌పూర్, మంథని ఘటనలపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుట్కా, మట్కా, గుడుంబా, ల్యాండ్ మాఫియాలపై యుద్ధం ప్రకటించామని, ఉక్కుపాదం మోపడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహదేవ్‌పూర్ అడవుల్లో వన్య ప్రాణులను హతం చేయడమేకాకుండా అడ్డుకున్న అటవీ అధికారులపై దాడి చేసిన ఘటనతోపాటు మంథనిలో దళిత యువకుడు మధుకర్ మృతి సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసు అధికారులకు చెప్పడం జరిగిందని తెలిపారు. తప్పు చేసిన వారిలో మా పార్టీ వారు ఉన్న సరే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో పైరవీలకు తావులేదని అన్నారు. తప్పుచేసిన వారికి శిక్షలు తప్పవని మంత్రి రాజేందర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, మేయర్ రవీందర్ సింగ్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డిలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

నాట్యమండలి పునర్జీవానికి కృషి
రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణచారి
ధర్మపురి, ఏప్రిల్ 2: దశాబ్ధాల చరిత్ర కలిగిన ధర్మపురి శ్రీ లక్ష్మినర్సింహా నాట్యమండలి పుర్జీవం కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి అన్నారు. ధర్మపురి దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై నాట్యమండలి అశీతి మహోత్సవాల సందర్భంగా ఆదివారం ఆయన ప్రసంగిస్తూ 1936లో ప్రారంభమైన నాట్యమండలి ప్రస్థానం నేటి వరకు విజయపథాన సాగిందని, ఎందరో త్యాగధనుల నిస్వార్థ కళాసేవల ఫలితంగా ఉభయ రాష్ట్రాల్లోనే గొప్ప కీర్తిని గడించిందన్నారు. ధర్మపురి నాట్యమండలి ఉత్సవాలను రానున్న కాలంలో మరింత చైతన్యవంతంగా తీర్చిదిద్దడానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక కళలు, నాటకాలు, సాంస్కృతిక రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రాచీణ వృద్ధ కళాకారులకు పింఛన్లు ఇప్పించడంతో పాటు చారిత్రక ప్రాశస్త్యం కలిగిన క్షేత్రాల అభివృద్ధి కోసం చర్యలు చేపడుతామన్నారు. ధర్మపురి లక్ష్మినర్సింహా నాట్యమండలికి ప్రభుత్వం నుండి ఐదు లక్షల రూపాయలను అందజేసేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ధర్మపురి క్షేత్రం వేదాలకు, శాస్త్రాలకు పుట్టినిల్లులాంటిదని, నాట్యమండలి అభివృద్ధి కోసం తమవంతుగా ఐదు లక్షల ప్రభుత్వ నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ధర్మపురి క్షేత్ర సమగ్రాభివృద్ధికి, దేవస్థానం అభివృద్ధికి సిఎం కెసిఆర్ కంకణబద్ధులై ఉన్నారని అన్నారు.

నిబద్ధతే విద్యాభివృద్ధికి కొలమానం
* సమాజ నిర్మాణ కర్తవ్యం ఉపాధ్యాయుళ్ళదే
* విద్యాసమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధిచూపుతాం
* రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 2: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుల చిత్తశుద్ధే రాష్ట్రంలో విద్యారంగ అభివృద్దికి కొలమానమని, రాష్ట్ర ఆర్దికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం నగరంలోనిర్వహించిన రాష్ట్రోపాధ్యాయ సంఘం 70 వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, సమాజ నిర్మాణ కర్తవ్యం పంతుళ్ళదేనని, దశాబ్దాల తరబడి సీమాంధ్రుల కబంధహస్తాల్లో నలిగిపోయిన తెలంగాణను స్వరాష్ట్రంలో స్వర్ణమయంగా మార్చుకోవటంలోకీలకభూమిక పోషించాల్సింది ఉపాధ్యాయులేనన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు మలిదశ పోరాటం వరకు ఉద్యమకారులతో కలిసి ప్రజల్లో చైతన్యజ్వాలలు రగిల్చి, వారిలో పోరాట ఉగ్గుపాలు పోసింది రాష్ట్రోపాధ్యాయ సంఘమేనన్నారు. గతమెంతో ఘనచరిత్ర కలిగిన ఉపాధ్యాయోద్యమ సంస్థ తమ హక్కులు, సమస్యలతో పాటు బంగారు తెలంగాణలోవిద్యార్థులను భాగస్వాములను చేసేందుకు వారిని జాగృతపర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గ్లోబలైజేషన్ మూలంగా మానవసంబంధాలు అడుగంటి, యాంత్రిక జీవనం షరామామూలుగా మారిందని, తరిగిపోతున్న మానవీయ విలువు, విద్యాసంబంధాలను కొత్తకోణంలో ఆవిష్కరించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. సమాజం పట్ల శాస్ర్తియ దృక్పదంతోవిద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ, భవిష్యత్‌పై వారికి భరోసానిస్తేప్రభుత్వ ఉపాధ్యాయుల కర్తవ్యం నెరవేరినట్లేనన్నారు. జీనోమ్ యుగంలో కూడా మూసీనది వెంట గుడిసెల్లో జీవనం కొనసాగిస్తుండటం రాష్ట్రంలో విద్యారంగ బలహీనతను చాటిచెబుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. యువశక్తిలో నైపుణ్యం పెంపొందించేలా విద్యార్థులను మేలుకొలిపే బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులదేనన్నారు. ఉద్యోగం కోసమే ఉన్నత చదువులు అనే నానుడి నుంచి విద్యార్థులను బయటకు తెచ్చి, సమాజంలోని వనరులను సద్వినియోగం చేసుకునేలా మార్చేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. విద్యార్థులు మారితే దేశభవిష్యత్ మారుతుందని ప్రఖ్యాత శాస్తవ్రేత్త, మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం మాటల స్పూర్తితో ఉద్యోగం, ఉపాధి అనే అంశాల ప్రాతిపదికన కాకుండా, దేశ భవిష్యత్, రాజకీయ అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ ప్రభుత్వం చిత్తశుద్ది చూపుతూ, వారికిచ్చిన హామీలు అమలు చేసేందుకు కసరత్తు చేయనున్నట్లు స్పష్టంచేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగ పటిష్టత కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘం అలుపెరుగని పోరు చేస్తుండటం అభినందనీయమన్నారు. ప్రైవేట్ నుంచి కార్పోరేట్ సెక్టార్ వైపు దూసుకెళ్తున్న విద్యారంగం మూలంగా పేద, మద్యతరగతి, బలహీనవర్గాల పిల్లలకు అందని ద్రాక్షలా మారే సూచనలున్నాయన్నారు. పాలకుల నిర్లక్ష్యంతోనే విద్యాభివృద్ది కుంటుపడుతుందని, ఇందుకు నిదర్శనమే ఇటీవలి బడ్జెట్‌లో నామమాత్రపు నిధులు కేటాయించటమన్నారు.
విద్యాప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయులు సిద్దంగా ఉన్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత,సిపిఎస్ విధానం రద్దుకోసం దీర్ఘకాలిక పోరాట కార్యక్రమం ఎంచుకుని, ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిల్ల రమేశ్, ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు భుజంగరావు, సదానందగౌడ్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు చందూరి రాజిరెడ్డి, జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సుంకె ప్రభాకర్‌రావు, కటకం రమేశ్, క్రిష్ణమాచార్యులు, గుత్తికొండ విద్యాసాగర్, శ్రీ్ధర్‌లతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల బాధ్యులు, 1000మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

పారిశ్రామికవేత్తలపై ఉన్న ప్రేమ రైతులపై లేదు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
చాడ వెంకటరెడ్డి
సిరిసిల్ల, ఏప్రిల్ 2: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసిన సమయం మాదిరిగానే ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక కార్మిక భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.72లక్షల కోట్ల విదేశాలలో నల్ల ధనాన్ని బటయకు తెస్తానని చెప్పిన ప్రధాని మోడి ఇంత వరకు తేలేదని, కార్పోరేట్ శక్తుల ఆగడాలు మితిమీరి పోయావని, అలాగే టాటా, రిలయన్స్, బజాజ్ శక్తులు కోట్లాది రూపాయల వ్యవహారాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. బడా పారిశ్రామికవేత్తల పది లక్షల కోట్ల అప్పులను కేంద్రం మాఫీ చేసి, రైతులకు మాత్రం మొండి చేయి చూపుతూ వారి రక్తం తాగుతున్నదని అన్నారు. ఉత్పత్తులపై పెత్తనం చేయకుండా కష్టపడి పండించిన పంటలపైనే ప్రభుత్వం ఆంక్షలు పెడుతున్నదని అన్నారు. ప్రభుత్వం కాటన్ వద్దు, కందులు ముద్దు అంటూ ప్రచారం చేసి తీరా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనలేని పరిస్థితి ఉందన్నారు. మిర్చి పంటకు కూడా మద్దతు ధరను ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రభుత్వం కొనుగోలు చేయనందున మిర్చిని కాల్చి వేస్తున్నారని, మిర్చిని బర్మా, శ్రీలంక నుండి దిగుమతి చేస్తే పన్ను విధించకుండా ఎగుమతి చేస్తే పన్ను విధించడం ఎంత వరకు సమంజసమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యేలేనని వెంకటరెడ్డి అన్నారు. వ్యవసాయంపై కేంద్రానికి పారిశ్రామిక విధానం లేదని, తెలంగాణ ప్రభుత్వానికి సాగునీటిపై విధానం లేదని, సమస్యలు చెపుకోవాలన్నా ముఖ్య మంత్రి సమయం ఇవ్వడం లేదని, దీనితో పత్రికల ద్వారా చెప్పుకుంటున్నామని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని, ఇంత వరకు మాఫీ కాకపోగా, వడ్డీ మాత్రం రూ.50 వేలకు పెరిగిందన్నారు. లారీల సమ్మె నాలుగు రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం పరిష్కరించడం లేదని, దీని వల్ల ధరలు పెరుగుతున్నాయని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని అన్నారు. దీనిపై అఖిల భారత సిపిఐ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాసినట్టు చాడ వెంకటరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, రాష్ట్ర కమిటి సభ్యులు కేదారి, మండల కార్యదర్శి పోలు కొమురయ్య, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌కుమార్‌లు పాల్గొన్నారు.