కరీంనగర్

ప్రశాంతంగా సింగరేణి సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ, జూన్ 20: సింగరేణి వారసత్వ ఉద్యోగాల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ సంఘాలు తలపెట్టిన నిరవధిక సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. మంగళవారం 6వ రోజుకు చేరుకుంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి చెందిన నేతలు, సానుభూతి పరులు మాత్రమే విధులకు హాజరవుతుండగా సింగరేణి వ్యాప్తంగా మెజార్టీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. కోల్ బెల్ట్ వ్యాప్తంగా వారసత్వ ఉద్యోగాల కోసం జరుగుతున్న సమ్మె విజయవంతంగా నడుస్తుంది. ఎక్కడిక్కకడా జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యం తీరును, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సింగరేణి బెల్ట్ ఏరియాలో జాతీయ కార్మిక సంఘాల నేతల అరెస్ట్‌ల పర్వం రోజు రోజుకు ఎక్కువవుతుంది. ఒక పక్క కార్మికులను అక్కడే ఉంచుకొని ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్‌లలో యాజమాన్యం ఉత్పత్తులను కొనసాగిస్తుంది. కార్మికులను నిర్బంధించి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తులు చేస్తుందని, అదేవిధంగా సమ్మెకు ముందు ఓపెన్‌కాస్టులపై నిల్వ ఉంచుకున్న బొగ్గును ఉత్పత్తిగా తప్పుడు లెక్కలను చూపిస్తుందని జాతీయ కార్మిక సంఘాల నేతలు రియాజ్ అహ్మద్, జనక్ ప్రసాద్, వై.గట్టయ్య, సీతారామయ్య, రాజారెడ్డి ఆరోపిస్తున్నారు. అరెస్ట్‌లు ఎన్ని చేసిన వారసత్వపు సమ్మె కొనసాగుతూనే ఉంటుందని, సింగరేణి యాజమాన్యం కార్మికులను బెదిరింపులకు గురి చేసే కుట్రలను మానుకోవాలని హెచ్చరించారు. రామగుండం రీజియన్ ఏరియాలో ప్రశాంతంగా కొనసాగింది. కార్మిక కుటుంబాల మహిళలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. టూటౌన్ పోలీసులు నిరసన చేసిన నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో దశరథం గౌడ్, అయాజ్, యాదగిరి తిరుపతి, రాజారత్నం, ఎల్.ప్రకాష్, అన్నా రావు, శ్యాంసన్ తదితరులున్నారు.
పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
*జగిత్యాల కలెక్టర్ శరత్
కోరట్ల, జూన్ 20:తెలంగాణ రాష్ట్రంలోని పేద, కులవృత్తుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం మండలంలోని సంగెం గ్రామంలో గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు ఆర్థికంగా అభివృద్ది చెందినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. గ్రామాలు అభివృద్ది చెందాలంటే గ్రామాల్లోని అన్ని వర్ణాలు, కుల వృత్తులు అభివృద్ది చెందాలన్నారు. అందులో బాగంగానే గొల్ల, కుర్మలకు గొర్రెలను, మత్స్యకారుకలు చేపల పెంపకం చేపట్టిందన్నారు. గ్రామంలో 11 యూనిట్లకు గొర్రెలను ఆయన పంపిణి చేశారు. వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో అర్హులైన వారందరికి గొర్రెలను పంపిణి చేస్తామన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని వినియోగించుకుని గొల్ల, కుర్మలు అభివృద్ది చెందాలన్నారు. గొర్రెలు ఆనారోగ్యం బారిన పడితే సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశామని, వాటిని వినియోగించుకోవాలన్నారు. గొర్రెలకు కావాల్సిన పశుగ్రాసం పెంచుకోవాడానికి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వాటి ద్వారా పశుగ్రాసం పెంచాలని సూచించారు.

కళంకిత ఎంపిపి దిగిపో...!
* తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
* పార్టీలకతీతంగా ఎంపిటిసిల నిరసన

చిగురుమామిడి, జూన్ 20: అందరి అంచనాలు తలకిందులయ్యేలా చిగురుమామిడి మండల సర్వసభ్య సమావేశాన్ని 12 మంది ఎంపిటిసిల్లో 10 మంది బహిష్కరించారు. ఎంపిటిసిలు ఆలస్యంగా స్పందించినప్పటికీ లేటెస్ట్‌గా ఎంపిపికి షాక్‌ట్రీట్‌మెంట్ ఇచ్చి, మండలంలో ప్రజలకు జవాబుదారిగా ఉన్నామని నిరూపించారు. కళంకిత ఎంపిపికి మద్దతునిచ్చే ప్రసక్తే లేదని, తమ పదవీకాలం పూర్తయ్యే వరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కళంకితుడిని ఎంపిపిగా అంగీకరించేది లేదని తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా, ప్రజా సేవకులుగా ఉంటామని స్పష్టం చేశారు. కళంకిత ఎంపిపికి అధ్యక్ష స్థానంలో కూర్చుని ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించే నైతిక అర్హత అతడికి లేదని, తక్షణమే ఎంపిపి పదవికి రాజీనామా చేయాలని చిగురుమామిడి ఎంపిటిసిలు ఏకతాటిపైకి వచ్చి మూకుమ్మడిగా సోమవారం మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. ప్రతి మూడు నెలలకోమారు జరిగే సర్వసభ్య సమావేశం ఉదయం 11:30కి ప్రారంభం కావాల్సి ఉండగా, అరగంట పాటు ఎంపిపి కిష్టయ్య సభ్యులకు తెలియకుండానే వ్యక్తిగత కారణాలతో వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 12:30కు ప్రారంభమైంది. ఎంపిపి కిష్టయ్యతో పాటు అధికారులు ఎంపిపి సమావేశ మందిరంలోకి వచ్చారు. రేకొండ-2 ఎంపిటిసి మైలారపు మల్లయ్య లేచి కళంకిత ఎంపిపి అధ్యక్షత వహించే సభలు, సమావేశాలను ఎంపిటిసిలమంతా బహిష్కరిస్తున్నామని మరో ఎనిమిది మంది సభ్యులతో కలిసి బయటికి వెళ్లారు. గత మూడేళ్లలో జరిగిన సభలు, సమావేశాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఎంపిపి ఒంటెద్దు పోకడతో, ఏకచత్రాధిపత్యంతో వ్యవహరిస్తూ ఎంపిటిసిలను భాగస్వామ్యం చేయకపోవడం సిగ్గుచేటని అభివర్ణించారు. ఈరోజు మండల చరిత్రలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పారు. మండల ప్రజలు ఏబాధ్యతతో మమ్మల్ని ఎన్నుకున్నారో వారి సమస్యలను తాము పరిష్కారం చేయలేకపోయామని, ఇలాంటి ఎంపిపి సారథ్యంలో తాము ఉన్నందుకు పశ్చాత్తాప పడుతున్నామని అన్నారు. ఎంపిపి ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఉద్దేశం ఇప్పటికైనా ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని, మా నిరసనను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇది 10 మంది ఎంపిటిసిల నిరసన కాదని, యావత్తు మండల ప్రజల గొంతుక అని అన్నారు. ఎంపిపి రాజీనామా చేయని పక్షంలో జిల్లా కల్టెర్‌కు, జడ్పీ సిఇవో మండలంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని నివారించి, పాలన వ్యవస్థ మెరుగు పడేలా చర్యలు చేపట్టాలని, ఎంపిపిని పదవి నుంచి తక్షణమే తప్పించాలని వినతిపత్రం ఇస్తామన్నారు. సుష్మాసింగ్ సభకు హాజరు కాకపోయినప్పటికీ తాను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎంపిటిసిలు పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలపడంపై ప్రజలు, రాజకీయ విశే్లషకులు, వివిధ పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.

ఉమ్మడి జిల్లాలో గొర్రెల పంపిణీ ప్రారంభం

* వెంకట్రావుపల్లిలో యూనిట్లను అందించిన మంత్రి
* మిగతాచోట్ల పంపిణీ చేసిన ఎంపి, ఎమ్మెల్యేలు
*గొల్ల, కుర్మ కుటుంబాల్లో హర్షాతిరేకాలు

కరీంనగర్, జూన్ 20: గొల్ల, కుర్మలు ఆర్థికంగా బలపడాలనే సంకల్ఫంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఉమ్మడి జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మొత్తం 84,957 మంది లబ్దిదారులు ఉండగా, మొదటి విడతగా 42,669 మంది లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు వారికి అవసరమైన 8,53,380 గొర్రెలు, 42,669 పొట్టేళ్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకుని పంపిణీ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. మొదటిరోజు ఉమ్మడి జిల్లాలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ పథకం లాంఛనంగా ప్రారంభం కాగా, ఇప్పటికే లాటరీ పద్ధతి ఎంపిక చేసిన లబ్ధిదారులకు మాత్రమే గొర్రెల యూనిట్లను అతిథులు అందజేశారు. హుజురాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ లబ్ధిదారులకు పదహారు మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయగా, కరీంనగర్ మండలం చర్లబూత్కూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితరులు ఇరవై మందికి గొర్రెల యూనిట్లను అందజేశారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల యూనిట్లను అందించడంతో గొల్ల, కుర్మ కుటుంబాల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
*జగిత్యాల ఎస్పీ అనంతశర్మ
జగిత్యాల, జూన్ 20: అన్ని రకాల భద్రత కోసం ప్రార్థన మందిరాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అనంతశర్మ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లో పలు ముస్లీం ప్రార్థన మందిరాలను జగిత్యాల డిఎస్పీ కర్ణాకర్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్బంగా జిల్లా ఎస్పీ అనంతశర్మ మాట్లాడుతూ అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, మత సామరస్యానికి విఘాతం కల్గిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, జిల్లాలోని కొడిమ్యాల, జగిత్యాల ఘటనలను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మసీదుల మందు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే విచ్చిన్నకర శక్తులు దరిదాపుల్లోకి కూడారారని, ఎవరైన దుందుడుకు చర్యలకు పాల్పడితే సిసి కెమెరాల్లో నిక్షిప్తమై నిందితులు త్వరగా అచూకి లభ్యమవుతుందన్నారు. అన్ని రకాల భద్రత కోసం విధిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంపై వివిధ మసీదు పెద్దలకు జిల్లా ఎస్పీ అనంతశర్మ పలు సూచనలు సూచనలు చేశారు. ఆయన వెంట టౌన్ సిఐ ప్రకాష్ ఎస్సైలు ఉన్నారు.

కస్తూర్బా పాఠశాలల్లో వౌలిక వసతులు

*విద్యాశాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజీవ్ ఆచార్య ఆదేశం

కరీంనగర్, జూన్ 20: కస్తూర్భా గాంధి బాలికల పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని వౌళికవసతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజీవ్ ఆచార్య అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో కస్తూర్భా గాంధి బాలికల పాఠశాలలో బాలికలకు యూనిఫాం, నోట్ బుక్స్ పంపిణీ, మరుగుదొడ్లు, కంపౌండ్‌వాల్ తదితర వౌళిక వసతుల ఏర్పాట్లపై ఆమె వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ప్రతీ వారం మూడు గుడ్లు ఖచ్చితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. కొత్తగా ఏర్పాటైన కస్తూర్భా బాలికల పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతులలో ఇంగ్లీష్‌మీడియం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తరగతికి 40 మంది విద్యార్థులను చేర్పించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారులు పాఠశాలలను పర్యవేక్షించాలని, మెనూలో ఉన్న ప్రకారం విద్యార్థులకు ఆహారం సరిగా అందుతుందా? లేదా? చూడాలని ఆమె ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

కులవృత్తులు ఆర్థికంగా బలపడాలి

హుజూరాబాద్ రూరల్, జూన్ 20: గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా బలోపేతం కావాలంటే కులవృత్తులు బలపడాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ మండలం వెంకట్రావ్‌పల్లి గ్రామంలో మంగళవారం ఆయన గొర్రెల పెంపకం దారులకు, గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంతో పోలిస్తే కుల వృత్తులు నమ్ముకుని జీవిస్తున్న వారి స్థితి దయనీయంగా ఉందన్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలని ఇందుకు టిఆర్‌ఎస్ ప్రభు త్వం, సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చేపల పెంపకం చేపట్టారని, తాజాగా గొర్రెల పంపిణీకి శ్రీకారం చుడుతున్నామని, ఇందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తోందన్నారు. ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలతో పాటు ఒక పొట్టేలును ఇస్తున్నామని, మొత్తం 400 కోట్లతో మొదటి విడత 1500 యూనిట్లు పంపిణీ జరుగుతోందన్నారు. హుజూరాబాద్ మండలా నికి 175 యూనిట్లు మంజూరు కాగా వెంకట్రావ్‌పల్లి గ్రామానికి 14 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. మొదటి దఫా మొత్తం 1200 యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ రంగంలో అందరికి ఉపాధి కల్పించడం సాధ్యంకాదని, అందుకే స్వయం ఉపాధిని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. యువత, చదువుకున్న వారు నిరాశ చెందకుండా వృధాగా కాలాయాపన చేయకుండా ఏదో ఒక పనిని ఎంచుకుని అందులో నైపుణ్యం సాధించాలని, శిక్షణ పొందాలని, ఇందుకు ప్రభుత్వం కూడా శిక్షణ ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు. వివిధ వృత్తుల్లో అధునిక పద్దతుల్లో యువత నైపుణ్యం సాధించాలన్నారు. నైపుణ్యం కలిగిన వారికి పనిచేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, వారికి డిమాండ్ కూడా ఉందన్నారు. వివిధ కార్పోరేషన్ల ద్వారా కుల వృత్తులకు సంబంధించిన ఆధునిక పరికరాలు కూడా అందజేస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, వారి కుటుంబాలు నిలబడతాయన్నారు. వివిధ పట్టణాల్లో మాంసం విక్రయాలు ఎక్కువగా ఉంటాయని, ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుండి గొర్రెల్ని తీసుకురావాల్సి వస్తోందని, ఇక ఈ పరిస్థితి మన రాష్ట్రానికి ఉండబోదన్నారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ మాట్లాడుతూ పంపిణీ చేసిన గొర్రెల్ని వెంటనే విక్రయించవద్దని కోరారు. దీన్ని ఒక ఆదాయ వనరుగా వినియోగించుకోవాలని, జిల్లా వ్యాప్తంగా 5లక్షల 50 వేల గొర్రెల్ని పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం గొర్రెపిల్లను మంత్రి ఈటలకు బహుకరించి, గొంగళితో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జెడి విక్రం కుమార్, ఎంపిపి వొడితల సరోజినిదేవి తదితరులు పాల్గొన్నారు.

యువకుడి దారుణ హత్య
*కుటుంబ కలహాలే హత్యకు కారణం
* మామ, బావమరిదిలే నిందితులు

కరీంనగర్, జూన్ 20: కుటుంబ కలహాలతో ఓ యువకుడు దారుణ హత్య కు గురైన సంఘటన కరీంనగర్ మండలం గోపాల్‌పూర్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన అనుముల నాగిరెడ్డి అలియాస్ హరికృష్ణ (28) అనే యువకుడు అతని మామ, బావమరిది చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..కరీంనగర్ మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన హరికృష్ణకు, ఇదే గ్రామానికి చెందిన లావణ్యతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. అయితే హరికృష్ణ, లావణ్యల మధ్య తరచుగా గొడవలు పడుతుండేవారు. ఈ గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి నచ్చజెప్పడంతో సద్దుమణిగాయి. మళ్లీ ఇంతలోనే హరికృష్ణతో విడాకులు కావాలంటూ లావణ్య కోర్టులో కేసు వేయగా, ఆ కేసు విచారణ చివరి దశకు చేరుకోగా, మళ్లీ మనసు మార్చుకొని తన భర్త వద్దే ఉంటానంటూ కోర్టుకు తెలపడంతో మళ్లీ ఇద్దరు కలిసి కాపురం చేశారు. రెండు సంవత్సరాల పాటు వీరి కాపురం సజావుగా సాగగా, ఇటీవలీ కాలంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగడం, దీంతో లావణ్య పక్కనే ఉన్న పుట్టింటికి వెళ్లడం, ఇంటికి వచ్చిన కుమార్తెను చూసిన ఆమె తండ్రి, సోదరుడు ఆవేశానికి గురై హరికృష్ణతో పాటు అతని కుటుంబసభ్యులను దూషించడంతో హరికృష్ణ ఇదేమిటని ప్రశ్నించాడు. దీంతో అప్పటికే ఆగ్రహంగా ఉన్న మామ ఏసురెడ్డి, బావమరిది రామకృష్ణలు హరికృష్ణపై కత్తితో దాడి చేయడంతో అక్కడే కుప్పకూలగా, ఇది గమనించిన గ్రామస్థులు నర్సయ్య, మల్లయ్యలు అడ్డుపడగా వారు సైతం గాయపడ్డారు. వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న హరికృష్ణను కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి ఒంటిగంట సమయంలో మృతి చెందాడు. కాగా, మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు నిందితుల ఇంటి ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. నిందితుల ఇంటిపై దాడి చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పడంతో సద్దుమనిగింది. ఇదిలా ఉండగా, లండన్‌లో బిటెక్ పూర్తి చేసిన హరికృష్ణ అక్కడే విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తుండగా, వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఆ జీవితానికి స్వస్తి పలికి స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో హరికృష్ణ దారుణ హత్యకు గురికావడం గ్రామంలో కలకలం రేపింది. నిందితులు ఏసురెడ్డి, రామకృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.