కరీంనగర్

కాళేశ్వరం కట్టాల్సిందే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 22: జీవకోటికి నీరే జీవనాధారం. బీడు భూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిందే. దీనికి అవసరమైన పర్యావరణ అనుమతులు వెంటనే ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేయాలి. దీనిని ఎవరూ అడ్డుకున్న ప్రజలు ఊరుకోరు అంటూ మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అయితే, గులాబీ నీడన ప్రజాభిప్రాయ సేకరణ ఏకపక్షంగా జరిగిందంటూ సిపిఐ, సిపిఎం, దాని అనుబంధ సంఘాలు, రైతు సంఘాల నాయకులు పలువురు తమ నిరసన రూపంలో కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు. అలాగే ప్రజాభిప్రాయ సేకరణ ఏకపక్షంగా జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి-8 పనుల పర్యావరణ అనుమతులపై మంగళవారం నగర శివారులోని రాజశ్రీ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా సాగింది. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షతన, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి రవిదాస్ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ సాగగా, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, బొడిగ శోభ, కరీంనగర్ ఎంపిపి వాసాల రమేష్, వివిధ మండలాల జడ్పీటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, రైతులు, రైతు సంఘాల నాయకులు, వివిధ కుల వృత్తుల వారు, ప్రజలు పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్టుపై వారివారి అభిప్రాయాలను తెలియజేశారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన ఈ సేకరణ మద్యాహ్నం 2గంటల వరకే పూర్తయింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా 13జిల్లాల ప్రజలకు లాభం జరుగుతుందని, కాళేశ్వరం ఎప్పుడు పూర్తవుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, గీత కార్మికులు, గొల్ల, కుర్మలు, రైతులు ఇలా అన్ని కుల వృత్తుల వారికి నీరే ఆధారమని, ప్రాజెక్టుల ద్వారా 24 గంటల నీరు వస్తుందని, అందరు సుఖ సంతోషాలతో జీవిస్తారని అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు అని, ఎస్సారెస్పీ ప్రాజెక్టు పైభాగంలో అనేక ప్రాజెక్టులు నిర్మించడం వల్ల చుక్క నీరు రాని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ముందుచూపుతో గోదావరి నదిలో నీరు వృధాగా పోతున్న తరుణంలో మేడిగడ్డ వద్ద 200టిఎంసిల నీటిని నిల్వచేసేందుకు ఆనకట్ట నిర్మించి రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీలో నీరు నింపి 360రోజులు కాలువల ద్వారా భూములకు నీరందించే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని, పర్యావరణ అనుమతులు వెంటనే ఇప్పించాలని కోరారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ ప్రజలందరికీ ఒక వరంలాంటిదని, దీని ద్వారా 13 జిల్లాల్లో 18లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు వెంటనే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ జీవకోటికి ప్రాణాధారమైన నీరు కావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తీరాలని అన్నారు. ప్రజలు ఈ ప్రాజెక్టును కోరుకుంటున్నారని, అందుకే త్వరగా పూర్తి చేయాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితేనే జిల్లాలో రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం కలుగుతుందని, కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో సిఎం ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును ఎవరూ వ్యతిరేకించడం లేదని, త్వరగా అనుమతులిచ్చి పూర్తి చేయాలని కోరారు. రిటైర్డ్ సిఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలంగాణలోని 30లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పర్యావరణానికి ఏ విధమైన నష్టం జరగదని, ప్రజలకు లాభం జరుగుతుందని, పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని, నిర్ణీత కాలంలో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. గోపాల్‌పూర్‌కు చెందిన మంద రాజమల్లయ్య మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ భూములు సస్యశ్యామలం అవుతాయని, ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు. బద్దిపెల్లి నుండి శ్రీనివాస్ మాట్లాడుతూ నీటి కరువుతో అల్లాడుతున్న క్రమంలో ప్రజలకు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, కావాలని ఎవరైనా అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరని అన్నారు. రేకుర్తికి చెందిన పవన్‌కుమార్ మాట్లాడుతూ జీవకోటికి నీరే ప్రాణాధారం అలాంటి నీటిని అందించే కాళేశ్వరంను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. బొమ్మకల్‌కు చెందిన మల్లయ్య మాట్లాడుతూ బాబ్లీ వద్ద కట్టిన ఆనకట్టల వద్ద ఎస్సారెస్పీకి నీరు రావడం లేదని, అందుకే కాళేశ్వరం ద్వారా రివర్స్ పంపింగ్‌తో ఎస్సారెస్పీని నింపి 24గంటలు నీరిచ్చే చర్యలు చేపట్టారని అన్నారు. బల్మూరి ఆనందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ త్వరగా పూర్తి చేయాలని కోరారు. రామడుగు ఎంపిపి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జీవకోటికి గాలి, నీరు ముఖ్యమని, నీరుంటేనే చెట్లు ఉంటాయని, చెట్లు ఉంటేనే వాతావరణం బాగుంటుందని, వాతావరణం బాగుండాలంటే నీరు అవసరమని, అందుకే ప్రజలు కోరుకునే కాళేశ్వరం నిర్మించి సస్యశ్యామలం చేయాలన్నారు. మైలారంకు చెందిన కుసుమ నవీన మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అవసరమని తెలిపారు. కరీంనగర్ ఎంపిపి వాసాల రమేష్, తోటపల్లికి చెందిన బోయినపల్లి ప్రభాకర్‌రావు, ఎలగందులకు చెందిన ప్రభాకర్, చొప్పదండికి చెందిన మల్లారెడ్డి, చర్లబూత్కూర్‌కు చెందిన సత్యనారాయణ తదితరులు తమతమ అభిప్రాయాలను తెలియజేశారు. వీరితోపాటు మెజారిటీ ప్రజలు తమ చప్పట్ల ద్వారా ఆమోదాన్ని తెలిపారు. అయితే, గులాబీ నీడన ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందంటూ, అందులో అసలైన రైతులు, నిర్వాసితులు లేరని, అంతా ఏకపక్షంగా జరిగిందంటూ, ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలంటూ సిపిఐ, సిపిఎం, దాని అనుబంధ సంఘాలు, రైతు సంఘాల నాయకులు పలువురు తమ నిరసనల రూపంలో కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు. ఏకపక్షంగా ప్రజాభిప్రాయణ సాగిందంటూ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఎస్‌ఇ వెంకటరాములు, ఇఇ నూనె శ్రీ్ధర్, డిఇ నర్సింగారావు, కరీంనగర్ ఆర్‌డిఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.