కరీంనగర్

మల్లన్న సన్నిధిన చీఫ్‌విప్ తులాభారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, డిసెంబర్ 13: నియోజకవర్గ పరిధిలోని గొల్లపెల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో వెలసిన భక్తుల పాలిట కొంగు బంగారమైన దొంగ మల్లన్నగా సుప్రసిద్ధులైన మల్లన్నకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్, ధర్మపురి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్, తన సహధర్మచారిణి స్నేహలత సమేతంగా తులాభారం నిర్వహించుకుని, బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంతుకు ముందు ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి, దైవాలకు పట్టువస్త్రాలు సమర్పించుకున్నారు. దేవాలయ ఇఓ శ్రీనివాస్, అర్చకులు రాజేందర్, జడ్పీటీసీ గోస్కు శైలజ జలంధర్, ఎంపిటిసి సంతోష్, సర్పంచ్ భీమ సంతోష్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
* జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
జగిత్యాల టౌన్, డిసెంబర్ 13: టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. 2017-18 విద్యా సంవత్సరంలో టెన్త్ ఫలితాల్లో నూటికి నూరు శాతం సాధనకు ప్రణాళిక బద్దంగా పటిష్ట కార్యచరణ చేపట్టాలన్నారు. బుధవారం దేవిశ్రీ గార్డెలో టెన్త్ ఫలితాలపై విద్యాశాఖ, ఎంపిడివోలు, తహసీల్దార్‌లు, దత్తత అధికారులతో నియోజక వర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. టెన్త్‌లో ఎస్‌ఎ సాధించిన ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌ఏ 1లో సాధించిన మార్కుల అధారంగా విద్యార్థులను అంచనా వేసి ఏ స్థాయిలో ఉన్నది గుర్తించి ఉపాధ్యాయులు మండల గ్రూపులుగా పాఠశాల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక తరగతులు, డిజిటల్ తరగతులు ఆప్‌లైన్, ఆన్‌లైన్ షెడ్యూల్‌ను వెంటనే రూపోందించాలని అన్నారు. ఉత్తేజం ద్వారా స్నాక్స్ మెను రూపొందించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు రోజు విద్యార్థులను పంపుటకు, ఏ రోజుకు ఆరోజు హోంవర్క్స్ చేసేలా అవగాహన కల్పించాలన్నారు. దత్తత అధికారులు వారానికి రెండు నుంచి మూడు సార్లు తప్పని సరి సంబంధిత పాఠశాలను సందర్శించాలన్నారు. పరీక్షల సన్నద్దానికి స్టడి మెడిరియల్, మోడల్ పరిక్ష పత్రాలు తయారు చేయలన్నారు. సబ్జెక్ట్ టీచర్లు వంద శాతం ఉత్తీర్ణత తేవాలని, లేని పక్షంలో చర్యలకు అండర్ టేకింగ్ తీసుకోవలన్నారు. గత సంవత్సర రికార్డును పదిల పర్చాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంపిడివోలు, తహసీల్దార్, మండల విద్యాధికారులు, హెచ్‌ఎం ఉన్నారు.

అటో స్టార్టర్లు వాడొద్దు.. విద్యుత్ పొదుపు చేయాలి
* రైతులకు అవగాహన సమావేశంలో సెస్ డైరెక్టర్ విజయరామారావు
ముస్తాబాద్, డిసెంబర్ 13: ప్రభుత్వం జనవరి నెలారంభం నుంచి వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా చేయనుందని, అటోస్టార్టర్లు వినియోగించి విద్యుత్ దుర్వినియోగం చేయొద్దని, రైతులు విద్యుత్‌ను పొదుపు చేసి, సెస్ అభివృద్ధికి సహకరించాలని సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, మాజీ ఎంపిపి కల్వకుంట్ల గోపాల్‌రావు, సెస్ ఎఇఇ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ముస్తాబాద్‌లోని మండల సెస్ కార్యాలయంలో బుధవారం విద్యుత్ వినియోగంపై అవగాహనా సమావేశంలో వక్తలు మాట్లాడారు. అటోమెటిక్ స్టార్టర్ల వినియోగంతో సాగునీటి బావుల్లో భూగర్భ జలాలు అడుగంటడమేగాక విద్యుత్ పంప్‌సెట్లు కాలిపోవడం జరుగుతుందని, అక్రమ కనెక్షన్లను రెగ్యూలరైజేషన్ చేసుకోవాలని, సాగుబడి మేర విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని దీనిపై రైతులకు సెస్ ప్రతినిధులు, సెస్ సిబ్బంది అవగాహన కల్గించాలని సూచించారు.

కలెక్టరేట్ ముందు సీఐటీయూ ధర్నా
* పెరిగిన నిత్యావసర వస్తువుల తగ్గించాలని నిరసన
* కలెక్టర్‌కు వినతి పత్రం
సిరిసిల్ల, డిసెంబర్ 13: పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. దేశంలో నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయని, విద్య, వైద్యంతో పాటు పప్పులు, నూనెలు, కూరగాయలు ధరలు గత సంవత్సరం పోల్చితే ప్రస్తుతం 30 శాతం ధరలు అధికంగా పెరిగాయన్నారు. పెరిగిన ధరల వలన సామాన్య కుటుంబాలు రెండు పూటల కడుపు నిండా తినలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. ఇదే క్రమంలో కార్మికుల వేతనాలు తీవ్రంగా పడిపోతున్నాయని, ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారంగా కార్మికులకు నెలకు రూ.18 వేల వేతనం వస్తేనే కుటుంబాలు గడిపే పరిస్థితి ఉంది, కానీ కార్మికుల వేతనం నెలకు రూ.6వేలు మించడం లేదన్నారు. సరైన వేతనం రాక పెరిగిన ధరల వలన కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, పెంచిన ధరలు తగ్గించేందుకు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పంతం రవి, మూషం రమేశ్, ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, ఆకు భూమయ్య, మోర అజయ్, అన్నల్‌దాస్ గణేశ్, నక్క దేవదాస్, ఎగమంటి రాజమల్లు, గడ్డం ఎల్లయ్య, హరిప్రసాద్, మేఘ అంజనేయులు, కొండ వేణులు పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పనులను వేగవంతం చేయాలి
* జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్
జగిత్యాల రూరల్, డిసెంబర్ 13: ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ శరత్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వెల్గటూర్ మండలం రాంనూర్, చెగ్యాం, తాళ్ల కొత్తపేట, కోటిలింగాల, ముక్కట్రావ్‌పేట్‌లలో ఆర్‌అండ్‌ఆర్ పనులను జరుగుతున్నాయన్నారు. కాలనీల్లో వౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. సిసిరోడ్లు, డ్రేనేజీలు, వీధి దీపాలు, అప్రోచ్ రోడ్లు మంజూరులు తీసుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కాలనీల నిర్మాణాల విషయమై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, చెగ్యాంలో 179 ఇండ్లకు చెల్లించిన పరిహారం విషయమై ఆర్‌అండ్‌బి అధికారులతో తిరిగి ప్రతిపాధనలు వేయించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి రాజేశం, జిల్లా రెవెన్యూ అధికారి శ్యాంప్రకాష్, ఆర్డీఓ నరేందర్, పంచాయితీరాజ్ ఇఇ మనోహర్‌రెడ్డి, ఎస్‌డిసి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ పరిధిలో ఔషద మొక్కలు విరివిగా నాటండి
* మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస రావు
గోదావరిఖని, డిసెంబర్ 13: రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఔషద మొక్కలను విరివిగా నాటాలని, ఉత్సాహవంతులకు ఈ మొక్కలను ఉచితంగా అందజేయడం జరుగుతుందని మున్సిపల్ కమీషనర్ భువనగిరి శ్రీనివాస రావు తెలిపారు. తెలంగాణ సామాజిక సాంస్కృతిక చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం ప్రాంగణంలో బుధవారం ఔషద మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి కమీషనర్ భువనగిరి శ్రీనివాస రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్‌బెల్ట్ ప్రాంతంలో విశేషంగా ఔషద మొక్కలు నాటాలని, వాటి వినియోగంతో వివిధ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం చేకూర్చవచ్చని తెలిపారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన హరితహారం పిలుపులో భాగంగా ఔషద మొక్కలు, నీడనిచ్చె మొక్కలను కార్పొరేషన్ పరిధిలో విరివిగా నాటడం జరుగుతుందని తెలిపారు. ట్రస్టు అధ్యక్షులు ఆమంచ గౌతం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, ఎల్.రాజయ్య, ఎరుకల పోశం, సత్తయ్య, అల్లి గంటయ్య, కె ఆర్.సదానందం, అహ్మద్ పాషా తదితరులున్నారు.

జనవరిలో సర్పంచుల ‘పవర్’కు ‘చెక్’!?
* స్థానికం నేపథ్యంలో అధికారుల యోచన
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 13: వచ్చే ఏడాది జనవరి నెలాఖరుతో గ్రామ సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేసే దిశగా అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2013 జూలై నెలాఖరులో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 2న సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల నిబంధనల మేరకు ఆరు మాసాల ముందుగానే పంచాయితీ సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దుచేసి ప్రత్యేకాధికారులు, కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఇస్తారు. స్థానిక సంస్థలన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టగా, ఇందులో భాగంగానే పంచాయితీల్లో రిజర్వేషన్ల కోసం జనాభా సేకరణ చేపట్టారు. అన్ని సక్రంగా ఉంటే 2018 ఏప్రిల్‌లోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. దీంతోసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేయటం అనివార్యం కాగా, 2018 జనవరి చివరి వరకు మాత్రమే గ్రామాల్లో రాజులుగా వెలుగొందే అవకాశాలు కనిపిస్తుండటం గమనార్హం. ఈతరుణంలోగ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, పూర్తి చేయాలని ఆయా విభాగాల అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే అత్యధిక పంచాయితీల్లో సర్పంచ్‌లు జనరల్ ఫండ్‌ను జీరో చేయగా, ఎన్‌ఆర్‌ఈజిఎస్, పంచాయితీ నిధులతో కలిపి నిర్మించే సిమెంటు రహదారుల కోసం ప్రతిపాదనలు కూడా ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈనిధులతో నిర్మించే పనులు సత్వరమే పూర్తి చేయాలంటూ మండల ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈసారి సర్పంచ్ ఎన్నికలకు రసవత్తరమైన పోటీ ఉండటం తథ్యమని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం బిఆర్‌జిఎఫ్, ఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులు నేరుగా గ్రామ పంచాయితీలకే విడుదల చేస్తోంది. గతంలోజిల్లా పరిషత్‌లకు నిధులు మంజూరుచేస్తే, వాటిని మండలాలకు అక్కడినుంచి గ్రామాలకు కేటాయించేవారు. గత ఆర్ధిక సంవత్సరం నుంచి కేంద్రం దీనికి చెక్ పెట్టగా, ఆనిధులు సరాసరి పంచాయితీలకే వచ్చి చేరుతున్నాయి. దీంతోరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ పదవికి అత్యధిక మంది పోటీలో ఉండే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

ముంపు గ్రామాలలో భూముల పరిహారం అందకుండానే..
విద్యుత్ లైన్లు తొలగింపు అన్యాయం
* రైతు సమన్వయ కమిటీల సమావేశంలో సభ్యుల ఆందోళన
* సెస్ చైర్మన్ నేతృత్వంలో విద్యుత్ సమస్యలపై సమావేశం
సిరిసిల్ల, డిసెంబర్ 13: మిడ్ మానేరు ముంపు గ్రామాలలోని వ్యవసాయ భూములకు పరిహారం అందకముందే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల తొలగింపు అన్యాయమని రైతు సమన్వయ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) రైతు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది. సెస్ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో పలు అంశాలపై సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండలాల సభ్యుల సమావేశం నిర్వహించారు. ఆటో స్టార్టర్ల తొలగింపు, అనుమతి లేని విద్యుత్ కనెక్షన్లు, అధిక విద్యుత్ సామర్థ్యం, ఫ్యూజు ఆఫ్ కాల్స్, ప్రమాద నివారణలు, 24 గంటల విద్యుత్ సరఫరా మొదలైన ఏజెండా అంశాలపై సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్ల నిర్మాణం, ట్రాన్స్ ఫార్మర్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల నాణ్యమైనవి ఉన్నాయా అని సభ్యులు ప్రశ్నించిన దానిపై తాము పరిశీలన చేస్తున్నామని చైర్మన్ సమాధానం ఇచ్చారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజల పురావాస కాలనీల్లోకి వెలుతున్నందున ఇళ్ళలోని విద్యుత్ సర్వీసులను షిఫ్టింగ్‌కు అనుమించాలని కోరగా, విద్యుత్ మీటర్లను షిఫ్టింగ్ చేసుకోవచ్చని, అయితే వాటిపై ఉన్న బకాయలు మాత్రం చెల్లించాలన్నారు. అదనంగా మీటర్ల కోసం ఎలాంటి రసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తమ ఇళ్ళు పునరావాస కాలనీల్లో పూర్తి అయ్యేవరకు ఇళ్ళలోని విద్యుత్ మీటర్లు తొలగించరాదని సభ్యులు కోరారు. చీర్లవంచ, కందికట్కూర్ ముంపు గ్రామాలలో తొలగించిన విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడ ఉన్నాయని, వాటి ఆచూకి తెలుపాలని సభ్యులు జోగినిపల్లి రామచందర్‌రావు ప్రశ్నించారు. వీటిపై విచారణ జరుగుతున్నదని చైర్మన్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. పొత్తూరు-కందికట్కూర్ గ్రామల మద్య మూడు నెలల క్రితం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తొలగించి రోడ్డు కింద పడేవేశారని, అప్పటి నుండి అది అలాగే ఉందని, ఇలాంటివి సెస్ పరిధిలో ఇంకెన్ని ఉన్నాయో తెలుపాలని సభ్యులు ప్రశ్నించారు. తాళ్ళపల్లిలో ఒకే పోలుకు రెండు లైన్లు నడిపిస్తున్నారని, ఎస్సీ కాలనీలో ఇండ్లపై నుండి విద్యుత్ లైన్లు ఉన్నాయని ఆ గ్రామ సభ్యుడు తెలిపారు. చైర్మన్ దీనికి సమాధాన మిస్తూ ఇళ్ళపై నుండి లైన్లు వేయరని, లైన్ల కిందే ఇళ్ళు నిర్మించుంటున్నారని, దానికి ఎవరు మద్దతు నిచ్చారో వారినే అడగాలని అన్నారు. తాళ్ళపల్లిలో లూజ్ లైన్లు చాలా ఉన్నాయని, వాటిని సరిచేయాలని సభ్యుడు కోరాడు. వినియోగదారులు, అధికారుల తిప్పిదం వల్ల లైన్ల నిర్మాణంలో ఇలాంటి సమస్యలు చోటు చేసుకుంటాయని అన్నారు. అయితే సిరిసిల్ల రూరల్ ప్రాంతంలో లూజ్ లైన్లను తొలగించడానికి 1200 పోల్సు వేశామని, మరో 1000 పోల్సు సిద్దంగా ఉన్నాయని, అయితే వీటి మార్పునకు సమయం పడుతుందని చైర్మన్ తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లపై ఫీజులు పోతే సిబ్బంది వచ్చే వరకు ఆగకుండా రైతులే వేసుకోవద్దని, దాని వల్ల ప్రమాదం అవుతుందని, ఇపుడు 24 గంటల కరెంటు సరఫరా అవుతున్నందున రైతులు పంటలు ఎండిపోతాయని బెంగ పడాల్సిన అవసరం లేదన్నారు. గ్రామంలో హెల్పర్లు లేనపుడే రైతులు ఫీజులు వేసుకుంటారని సభ్యులు తెలిపారు. రెండేళ్ళుగా అంకుసాపూర్‌లో విద్యుత్ పోల్స్ వంగిపోయావని, వాటిని తొలగించి, ప్రమాదాలు నివారించాలని కోరగా, వీటిని వెంటనే తొలగించాలని చైర్మన్ సిబ్బందిని ఆదేశించారు. ఎస్సీ కాలనీకి లైన్లు లేవని కోరగా ఎస్టిమేషన్లు వేసి డబ్బు చెల్లిస్తే మంజూరు చేస్తారని, లైన్ల కోసం మంత్రికి విజ్ఞప్తి చేస్తామని చైర్మన్ తెలిపారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ఆటో మెటిక్ స్టార్టర్లు విధానం తెచ్చారని, ఇపుడు 24 గంటల విద్యుత్ ఉంటున్నందున వాటిని తొలగించాలని, లేని పక్షంలో విద్యుత్ వృదా అవుతుందని చైర్మన్ తెలిపారు. రైతులందరూ ఆటో స్టార్లర్లను తొలగించుకోవాలని సూచించారు. అలాగే 24 గంటల కరెంటు వల్ల ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో కమిటీ వేసుకుని, ప్రాంతాల వారిగా మొటార్లు నడుపుకోవాలని, లేని పక్షంలో ఓకే సారి అందరూ బోర్లు వేయడం వల్ల మోటార్లు కాలిపోతాయని, విద్యుత్ వృదా అవుతుందని చైర్మన్ తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, ఎడీ అనిల్‌కుమార్, డీఈ గోపికృష్ణలు పాల్గొన్నారు.

రైతాంగాన్ని అదుకున్న ఘనత టిఆర్‌ఎస్‌దే
* మార్కెట్ కమిటీల్లో మహిళా రిజర్వేషన్ ఇచ్చినం
* జనవరి నుంచి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్
* రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల
చొప్పదండి, డిసెంబర్ 13: గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లే రైతు ఆత్మ హత్యలు పెరిగాయని, కానా తమ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే రైతాంగాన్ని ఆదుకున్న ఘనత తమకే చెల్లుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం చొప్పదండి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరై మాట్లాడారు. ఖరీప్ నుంచి ఎకరాకు 8వేలు రైతులకు అందిస్తామని, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మహిళలకు మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించామని ఇది మహిళా సాధికారితకు నిదర్శనమని తెలిపారు. జనవరి నుంచి రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించి తీరుతామని చెప్పారు. గత ప్రభుత్వాలు అన్ని విదాలుగా రైతులను దగా చేశాయని, కానీ తెలంగాణ రైతులు కష్ట జీవులని, అందుకే రైతాంగాన్ని ఆదుకునే విధంగా పలు పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతు తెలంగాణలో అన్ని కులాలకు సమాన ప్రాతి పదికన పథకాలు అందిస్తున్న ఘనత కెసిఆర్‌దే నని, అందుకే రానున్న 2019 ఎన్నికల్లో తిరగి అధికారంలోకి రావటం ఖాయమని జోస్యం చెప్పారు. అనంతరం మార్కెట్ చైర్మన్‌గా గడ్డం సుమలత చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకే ఒక్క డైరెక్టర్ బండారి స్వామి మాత్రమే పాలకవర్గం నుంచి హజరై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్‌రావు, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుంకె రవిశంకర్, కట్ల సతీష్, జడ్‌పిటిసిలు ఇప్పనపల్లి సాంబయ్య, వీర్ల కవిత, ప్రశాంతి, మాజీ అధ్యక్షులు గడ్డం చుక్కారెడ్డి, ఎంపిటిసి ఎలిగేటి తిరుపతిలు పాల్గొన్నారు.
మంత్రి ఎంపిలకు ఘనస్వాగతం
రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపి బొయినపల్లి వినోద్‌కుమార్‌లకు మార్కెట్ చైర్మన్ గడ్డం సుమలత-చుక్కారెడ్డి ఆద్వర్యంలో బైక్ ర్యాలీతో, డప్పు చప్పుల్లతో, టపాసులు కాల్చుతు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు నలుమాచు రామక్రిష్ణ, లోక రాజేశ్వర్ రెడ్డి, తోట శేశాద్రి, సదాశివ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.