కరీంనగర్

‘గోలివాడ’ పనులపై మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జనవరి 21: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న పంప్ హౌస్ పనులను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషితో కలిసి పనులను పరిశీలించారు. పంప్ హౌస్ పనులు అనుకున్న మేరకు పురోగతి కనిపించకపోవడంపై మంత్రి హరీష్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, అన్నారం పంప్ హౌస్ పనులు పురోగతిలో నడుస్తుండగా గోలివాడ పంప్ హౌస్ కాంక్రీట్ పనులు మాత్రం ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయో చెప్పాలని మండిపడ్డారు. ఇక్కడ భూసేకరణ పూర్తయ్యింది... కంకర దగ్గరనే ఉంది... ఇసుక అందుబాటులోనే ఉండగా... పనులు ఎందుకోసమని ఆలస్యంగా కొనసాగిస్తున్నారని, అధికారులంతా అసలు ఏం చేస్తున్నారో చెప్పాలని సీరియస్ అయ్యారు. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తామని సంబంధిత నిర్మాణ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మంత్రికి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పంప్ హౌస్‌లన్ని సకాలంలో పూర్తయితే రైతాంగానికి తొందరలోనే నీరు ఇవ్వగలుగుతామని, అయితే పనులను వేగిరం చేయకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్యే లేదని మంత్రి హరీష్ రావు సంబంధిత ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ కంపెనీ అధికారులను హెచ్చరించారు. ఎలాగైనా జూన్ వరకు పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా మంథని నియోజక వర్గంలోని సుందిల్ల బ్యారేజీ పనులు, అన్నారం పంప్ హౌస్ నిర్మాణం పనులను కూడా మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట ఇంజనీరింగ్ ఇన్ ఛీఫ్ మురళీధర్ రావు, ఎస్ ఇలు సుధాకర్, కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మయ్య, ఇంజనీర్లు నరేష్, సత్యనారాయణ ఉన్నారు.

కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమి పూజ
- పనులను ప్రారంభించిన మంత్రులు నాయిని, ఈటల, డీజీపీ

గోదావరిఖని, జనవరి 21: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం పోలీస్ కమీషనరేట్ భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్ షిప్‌లోని మహాత్మ గాంధీ స్టేడియం వద్ద గల హెలిప్యాడ్‌కు ఉదయం 10గంటలకు చేరుకున్నారు. కాగా వీరికి పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ వారికి బొకే అందజేసి స్వాగతం పలికారు. అక్కడ్నుంచి నేరుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అనంతరం సిబ్బంది నుంచి హోం మంత్రి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదనంతరం కమీషనరేట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మంత్రులు నాయిని, ఈటెల, డీజీపీ మహేందర్ రెడ్డి భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. 25 కోట్ల రూపాయల వ్యయంతో కమీషనరేట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. భవన నిర్మాణానికి ఎన్టీపీసీ సైతం కొంత సహకారానందించింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పుట్ట మధు, దాసరి మనోహర్, ఐజిలు నాగిరెడ్డి, మల్లారెడ్డి, కలెక్టర్ దేవసేన, ఎన్టీపీసీ రామగుండం ఇడి డికె దూబే, సింగరేణి ఆర్జీ-1 జి ఎం విజయపాల్ రెడ్డితోపాటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీసు అధికారులు పాల్గొన్నారు.

క్రీడా హాబ్‌గా కరీంనగర్
* ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సిద్ధం * రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్, జనవరి 21: మరిన్ని పోటీలకు, క్రీడా వసతులకు కేంద్ర బింధువుగా కరీంనగర్‌ను క్రీడా హాబ్‌గా మార్చుతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. క్రీడా రంగంలో కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో ఉంచాలని కోరారు. క్రీడా రంగ అభివృద్ధికి ఎన్ని నిధులైనా విడుదల చేయడానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉందని తెలిపారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో రూ.1.16కోట్ల వ్యయంతో నిర్మించిన యోగా, బాక్సింగ్, రెజ్లింగ్ హాళ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ క్రీడా పాఠశాల విద్యార్థులు అన్ని పోటీలలో ముందంజలో ఉన్నారని, నేనే స్వయంగా వీరి ప్రతిభను హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో వీక్షించానని తెలిపారు. మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో క్రీడాకారులు విజయం సాధించి జిల్లా కీర్తీ ప్రతిష్టలను పెంపొందించాలని అన్నారు. గత రెండు సంవత్సరాలలో జరిగిన నాలుగు జాతీయ స్థాయి క్రీడా పోటీలకు కరీంనగర్ వేదికగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాస లక్ష్మణ్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి అశోక్‌కుమార్, ఓలంపిక్ అసోసియేషన్ బాధ్యులు మహిపాల్, జనార్దన్‌రెడ్డి, రమేష్‌రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు.

పూటకోమాట..రోజుకో పథకం..!
* ఇది కెసీఆర్ నైజం * ఉమ్మడి కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం
గంగాధర, జనవరి 21: బంగారు తెలంగాణ రాష్ట్ర పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూటకోమాట..రోజుకో పథకం పేరుతో ప్రజలను మభ్యపెట్టడమే కానీ, తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజలకు కెసీఆర్ చేసిందేమీ లేదని ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విమర్శించారు. గంగాధరలో చొప్పదండి నియోజకవర్గ స్థాయి లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ మిషన్ రిజర్వుడ్ కానిస్టెన్సీ (ఎల్‌డిఎంఆర్‌సి) ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు అనేక ఆశలతో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగా ప్రజల ఆశయాలను వమ్ము చేయడంలో ముఖ్యమంత్రి అనేక జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను మోసం చేశాడన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, నిరుపేదలకు మూడెకరాల భూమి వంటి అనేక పథకాలను అటకెక్కించిన ఘనత మాటల మాంత్రికుడు కెసీఆర్‌కే దక్కిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల పేరుతో వేలాది కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినా అది వారి దళారులకే దక్కాయన్నారు. ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయంబర్స్‌మెంటు పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలు ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశం కల్పించిన ఈ పథకం ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుతో నిరుపేద విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని పరోక్ష ఎన్నికలను రద్దు చేశారని, ప్రస్తుత ముఖ్యమంత్రి పరోక్ష ఎన్నికలను తెరమీదికి తీసుకువచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను ముందస్తుగా జరిపించడానికే ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పరోక్ష, ప్రత్యక్ష ఎన్నికలను తెరమీదికి తీసుకువచ్చాడని ఆయన విమర్శించారు. ప్రజలను చైతన్యపర్చి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాహుల్‌గాంధి నాయకత్వంలో రాష్ట్ర, కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24న గంగాధరలో చొప్పదండి నియోజకవర్గ స్థాయి ఎల్‌డిఎంఆర్‌సి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ప్రతీ ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఎల్‌డిఎంఆర్‌సి చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి బొమ్మ వెంకన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ గౌడ్, సుద్దాల దేవయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు గునుకొండ బాబు, మేడిపల్లి సత్యం, బండ శంకర్, రామిడి రాజిరెడ్డి, ఉప్పుల అంజనీప్రసాద్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ప్రతాప్, బత్తిని సత్యనారాయణ, కోల లింగారెడ్డి, సంకటి శ్రీనివాస్, చిప్ప చక్రపాణితో పాటు నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, బోయినిపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

గవర్నర్ సీఎం, మంత్రుల భజన చేయడం సరికాదు!
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
కరీంనగర్ రూరల్, జనవరి 21: గవర్నర్ తన హుందాను మర్చి ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రులను పొగడడం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం సీపీఐ 9వ మహాసభ కార్యక్రమానికి కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్‌లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు భారంగా మారాయని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి భయపడుతూ కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తున్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు, మేధావులు, రచయితలు, జర్నలిస్టులు ప్రశ్నిస్తే వేధిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు. గవర్నర్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులకు అనుకూలంగా మాట్లాడుతూ తన హుందా తనాన్ని తక్కువ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నియంత పాలనను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమాన్ని మర్చి కార్పోరేట్, పెత్తందారి వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ ఒక్కటి సరిగా అమలు కావడం లేదని, దీనిపై ప్రశ్నించిన కొంత మందిపై దాడులు చేయిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తుందని అన్నారు. కేంద్రం ప్రజాసంక్షేమాల పేరిట మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ అభివృద్ధికోసమే పథకాలు ప్రవేశపెడుతున్నామని మభ్యపెడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజాసంక్షేమం కోసం పాటుపడకపోతే ప్రజలే ప్రభుత్వాన్ని పథనం చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాలువ నర్సయ్య, కన్నం లక్ష్మినారాయణ, నాయకులు ఉప్పలయ్య, కేదారి, పంబాల శ్రీను, బోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు.