కరీంనగర్

మేడారం జాతరకు 531 బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 22: ఈనెల 31నుంచి ఫిబ్రవరి 2వరకు జరనున్న మేడారం జాతరకు ఉమ్మడి జిల్లానుంచి 531 ఆర్టీసీ బస్సులు నడుపనున్నట్లు ఆసంస్థ ప్రాంతీయ మేనేజర్ కె.చంద్రశేఖర్ తెలిపారు. మూడు రోజుల పాటు నిరంతరంగా 6పాయింట్లనుంచి భక్తులను తరలించేందుకు ఆర్టీసీ విస్తృత సేవలందించనున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ నుంచి 90 బస్సులు, హుజురాబాద్ నుంచి 40, గోదావరిఖని నుంచి 125, పెద్దపల్లి నుంచి 128, మంథని నుంచి 113, యైటింక్లైన్ కాలనీ నుంచి 35 బస్సులు తిప్పనుండగా, వీటితో పాటు మరో 391 బస్సలు అంతర్గతంగా వివిధ గ్రామాల నుంచి నేరుగా మేడారం వరకు నడపనున్నట్లు తెలిపారు. భక్తులకు రవాణా అసౌకర్యాలు కలుగకుండా ఇతర రీజియన్లనుంచి 140 బస్సులు సమకూర్చుతున్నట్లు వివరించారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులను కరీంనగర్‌మేడారం వయా హుజురాబాద్, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి మీదుగా, పెద్దపల్లి నుంచి కమాన్‌పూర్, మంథని, కొయ్యూర్, కాటారం, భూపాలపల్లి, గోవిందరావుపేట, తాడ్వాయి మీదుగా మేడారం, హన్మకొండ, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి నుంచి మేడారం, మంథని నుంచి కొయ్యూరు, కాటారం, భూపాలపల్లి, గోవిందరావుపేట, తాడ్వాయి వరకు, గోదావరిఖని నుంచి కొయ్యూరు, కాటారం, భూపాలపల్లి, గోవిందరావుపేట, తాడ్వాయి వరకు, యైటింక్లైన్‌కాలనీ నుంచి బేగంపేట ఎక్స్‌రోడ్, మంథని, కొయ్యూర్, కాటారం, భూపాలపల్లి, గోవిందరావుపేట, తాడ్వాయి మీదుగా మేడారం వరకు బస్సులు తిప్పనున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మేడారం వెళ్ళే ప్రయాణీకులు వినియోగించుకోవాలని సూచించారు.

నీటి కోసం రైతుల ఆందోళన
* బ్యాంకు ప్రారంభానికి వచ్చిన ప్రజాప్రతినిధుల ఘెరావ్
పెద్దపల్లి రూరల్, జనవరి 22: రబీ పంటకు ఎస్పారెస్పీ కాల్వల ద్వారా సాగు నీరు అందక పోవడంతో తమ పంట పొలాలు ఎండి పోతున్నాయని, వెంటనే కాల్వ నీరు విడుదలకు చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళనకు దిగారు. ఎండి పోయిన వరి నారు చూపుతూ తమ గోడు మీకు కనిపించడం లేదా, ఎస్పారెస్పీ కాల్వల ద్వారా పూర్తి స్థాయిలో నీరు ఎందుకు సరఫరా జరగడం లేదని రైతులు ప్రజాప్రతిననిధులను ప్రశ్నించారు. మండలంలోని అప్పన్నపేట గ్రామం లో సోమవారం టీస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ఎమ్మెల్సీ భానుప్రసాద రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు సహకార బ్యాంకును సోమవారం ప్రారంభించారు. అప్పటికే సమావేశం జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన రైతులు సాగు నీరు కోసం ఆందోళన మొదలు పెట్టారు. సమావేశం ముగించుకొని వెళ్తున్న ప్రజాప్రతినిధులను చుట్టిముట్టిన రైతులు కాల్వ నీరు లేక పంటలు ఎండి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వద్దకు వెళ్లి సాగు నీరు సరఫరా జరగడం లేదని మీరు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు వారబంధి ప్రకారం కాల్వల ద్వారా నీరు సరఫరా చేస్తామని ప్రకటిస్తేనే తాము రబీలో వరి పంటలు సాగు చేశామని, తీర వారంలో మూడు రోజులే నీరు రావడం వల్ల పంటల పొలాలకు నీరు అందక ఎండి పోతున్నాయని వారి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందని రైతులు, వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పెద్దపల్లి సీ ఐ గోపతి నరేందర్, ఎస్సై జగదీష్‌లు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నించినా వారు వినలేదు. బ్యాంకు దగ్గర నుంచి కాలి నడకన వెళ్తున్న ఎమ్మెల్యేను రైతులు వెంటాడినంత పని చేశారు. ఎమ్మెల్యే సుమారు అర కిలో మీటర్ దూరంలో ఉన్న రాజీవ్ రహదారి వద్దకు వెళ్లిన తర్వాత కూడా వదలని ఆందోళన కారులు పలు నినాదాలు చేశారు. ఆందోళన నేపథ్యంలో రోడ్డుపై కొద్ది సేపు వాహనాలు నిలిచి పోయాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే రైతులను తప్పించుకొని వాహనంలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కార్పొరేషన్‌లో బొమ్మకల్ విలీనంపై నిరసన
కరీంనగర్ రూరల్, జనవరి 22: కార్పొరేషన్‌లో రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామాన్ని విలీనం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు, రైతుల ఆధ్వర్యంలో సోమవారం బొమ్మకల్ స్టేజి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ మండలంలోని గ్రామాలను కార్పోరేషన్‌లో విలీనం చేస్తే ఆర్థికభారం పెరిగి రైతులు, కూలీ పనులు చేసుకునేవారికి చాలా ఇబ్బందులు వస్తాయని, కేవలం రాజకీయ లబ్ధికోసమే గ్రామ పంచాయతీలను విలీనం చేయడం వారి పార్టీ నాయకులకు మేలు చేసేందుకేనని అన్నారు. ఇప్పటికైనా ప్రజల అభిప్రాయాలు తీసుకొని గ్రామ పంచాయతీల విలీనాన్ని ఆపివేయాలని కోరారు. లేనియెడల బొమ్మకల్‌ను కార్పోరేషన్‌లో విలీనం చేస్తే దశల వారి ఆందోళన చేపట్టి అధికార పార్టీ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజెపీ, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు, రైతు సంఘాల నాయకులు, గ్రామ కమిటీ నాయకులు పాల్గొని మద్ధతు తెలిపారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే
* సింగరేణి డైరెక్టర్ (పా) పవిత్రన్ కుమార్ * మొదటి విడతలో 1191 దరఖాస్తులు
యైటింక్లయిన్‌కాలనీ, జనవరి 22: వృత్తి పరంగా సింగరేణి బొగ్గు గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుందని సంస్థ డైరెక్టర్ (పా) పవిత్రన్ కుమార్ అన్నారు. సోమవారం ఆర్జీ-2 రెస్క్యూ స్టేషన్‌లో రామగుండం రీజియన్ స్థాయి గ్రీవెన్స్ డే ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన కార్మికుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రీవెన్స్ డేలో వచ్చిన సమస్యలను తాను స్వయంగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా మొదటి విడతలో 1191 దరఖాస్తులు వచ్చిన్నట్లు ఇందులో 831 దరఖాస్తుల సమస్యలను పరిష్కరించానని వెల్లడించారు. మొదటి విడతలో రామగుండం మూడు రీజియన్ల నుంచి 277 దరఖాస్తు రాగా ఇందులో 233 పరిష్కారించామని తెలిపారు. ఆర్జీ-1లో 142 మంది దరఖాస్తు చేసుకోగా 123 పరిష్కరించామని, ఆర్జీ-2లో 49 మంది దరఖాస్తులు చేసుకోగా 49 పరిష్కరించామని, ఆర్జీ-3లో 86 మంది దరఖాస్తు చేసుకోగా 61 పరిష్కరించామని వివరించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. గ్రీవెన్స్ డే ద్వారా 90శాతం కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, ప్రతి దరఖాస్తును వెబ్‌సైట్‌లో పెట్టి సాధ్యనమైనంత వరకు పరిష్కరించేలా చూస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం రీజియన్ల జిఎంలు విజయపాల్ రెడ్డి, విజయబాబు, రాజేందర్ రెడ్డి, అధికారులు ఆనంద రావు, రమేష్, పద్మానాభం తదితరులున్నారు.

ఇంజనీరింగ్ విద్యార్ధులు సామర్థ్యాన్ని పెంచుకోవాలి
*ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
కొడిమ్యాల, జనవరి 22: ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సామర్థ్యాలను పెంచుకోవాలని అప్పుడే ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. కొండగట్టు జెఎన్‌టియు కళాశాలకు మొదటి సారిగా రావడంతో విద్యార్థులతో మాట్లాడారు. అలాగే విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు డిప్యూటి సిఎంకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులతో ఎర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, విదేశాలలో చదువుకు తోడ్పాటుతుందన్నారు. రాష్ట్రంలోని మాడల్ స్కూల్ కేజీవీవీ గురుకుల పాఠశాలలు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉత్తమ ఫలితాలు అందిస్తున్నాయన్నారు. ఈ సందర్బంగా విద్యార్ధుల సమస్యలను నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. జెఎన్‌టియు కళాశాలలో నూతనంగా గ్రంథాలయం, ఆడిటోరియం, పరిసరాలలో విద్యుత్ సౌకర్యం, నీటి వసతి కల్పిస్తామన్నారు. అలాగే ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఈ కళాశాలతో పాటు ట్రిపుల్ ఐటి కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని విద్యార్థులు తమ ప్రతిభను మెరుగు పరుచుకోవాలన్నారు. సివిల్ సర్వీసుల వైపు దృష్టి సారించాలన్నారు. తెలంగాణ బిడ్డలుగా గర్వంగా చెప్పుకోవాలన్నారు. ఎమ్మెల్యే బొడిగే శోభ మాట్లాడుతూ కొండగట్టు జెఎన్‌టియు కళాశాలను యూనివర్సిటి స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రజాప్రతినిధులు, ఉపముఖ్యమంత్రి, సహాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీనంగర్ ఎంపి వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే శోభ, ఎంఎల్‌పి నారదస్ లక్ష్మన్‌రావు, జడ్పీ చైర్మన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ శరత్, ఉపకులపతి వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ యాదయ్య, టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు రవిశంకర్, ప్రిన్సిపల్ రమణ, ఎంపీపీ స్వర్ణలత, జెడ్పీటిసి ప్రశాంతి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీను, ఎంపిటిసి విమళ, అధ్యాపకులు సిబ్బంది, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కొండగట్టు టు కరీంనగర్
* అభిమానుల కోలాహలం మధ్య పవన్ టూర్ * కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రాత్రి బస
* విడిది పరిసరాల్లో అభిమానుల సందడి * నేడు మూడు జిల్లాల కార్యకర్తలతో పవన్ భేటీ

కరీంనగర్, జనవరి 22: ప్రముఖ సీనీ నటుడు, జన సేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ‘చలోరే చల్’ పేరిట కొండగట్టు నుంచి కరీంనగర్ వరకు నిర్వహించిన టూర్ అభిమానుల కోలాహలం మధ్య కొనసాగింది. సోమవారం మధ్యాహ్నం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు చేరుకున్న పవన్‌కళ్యాణ్‌కు ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన గోత్ర నామాలతో అర్చకులు అర్చన చేశారు. సుమారు అరగంట పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పవన్‌కు ఆలయ అధికారులు స్వామి వారి పట్టు శాలువాను కప్పి, స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించగా, ఆలయ అర్చకులు మంగళ శాసనాలు అందించి ఆశీర్వదించారు. పూజల అనంతరం బయటకు రాగానే అభిమానులకు పవన్ అభివాదం చేయడంతో అభిమానుల కేరింతలు హోరెత్తాయి. పవన్ జిందాబాద్, సీఎం పవన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పూజల అనంతరం రాజకీయ యాత్రకు సంబంధించి ప్రకటన చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కొండగట్టులో ఏలాంటి రాజకీయ యాత్రకు సంబంధించిన ప్రకటన చేయకుండానే కరీంనగర్ బయలుదేరారు. అభిమానుల కోలాహలం, భారీ కాన్వాయ్ మధ్య మధ్యాహ్నం 3గంటల సమయంలో కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని శే్వత హోటల్‌లో ఆయన విశ్రాంతి తీసుకుని, సాయంత్రం విలేఖరుల సమావేశం నిర్వహించి, ఇక్కడ కూడా రాజకీయ యాత్రకు సంబంధించిన ప్రకటన చేయకుండానే ముగించారు. అనంతరం ముఖ్య నాయకులతో పవన్ సమావేశమై చర్చించి, పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. రాత్రికి హోటల్‌లోనే బస చేయనున్న పవన్ మంగళవారం ఉదయం నగర శివారులోని శుభం గార్డెన్స్‌లో పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. మొత్తానికి అభిమానుల కోలాహాలం, భారీ కాన్వాయ్ నడుమ కొండగట్టు నుంచి కరీంనగర్ వరకు పవన్ పర్యటన సాగగా, ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకుగాను పోలీసు శాఖ అన్ని చర్యలు చేపట్టింది. హోటల్ వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసింది.