కరీంనగర్

ఛివరి ఆయకట్టుకు నీరు..అందని ద్రాక్షేనా..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 23: ఈ రబీ సీజన్‌లో చివరి ఆయకట్టుకు సాగునీరందించి రైతాంగాన్ని ఆదుకుంటామని పదేపదే ప్రకటనలు చేసిన ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలు గానే మిగిలాయి. ఎస్సారెస్పీ నీటిపై ఎన్నో ఆశలు పెట్టుకుని సాగు చేసిన అన్నదాతకు చి‘వరి’కి మిగిలేది అప్పుల కుప్పలు మాత్రమేనని స్పష్టమవుతోంది. నిర్దేశిత లక్ష్యంలో సగం ఆయకట్టుకు కూడా నీరివ్వలేక అధికారులు చేతులెత్తేయగా, సుమారు లక్షకు పైగా ఎకరాలు ఎండుముఖం పట్టింది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొనగా, రబీపై ఆశలు వదులుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎల్‌ఎండి ఎగువ ఆయకట్టులో నాలుగు లక్షల ఎకరాలు, దిగువ ఆయకట్టులో 2లక్షల ఎకరాల్లో రబీ సాగు చేశారు. గతంతో పోల్చితే ఈసారి ఒక్క ఎకరా కూడా ఎండిపోనివ్వకుండా, తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే, ఆచరణలో మాత్రం అధికారుల తీరు ఇందుకు భిన్నంగా ఉండటంతో ఇప్పటివరకు ఆరు తడులు పూర్తి కాగా, చివరి ఆయకట్టుకు చుక్కనీరు అందలేదు. ఫలితంగా బావులు, బోర్ల సాయంతో సాగైన పొలాల్లో పొట్టదశలో ఉన్న వరి ఎండిపోయే స్థితికి చేరింది. దిగువ మానేరు జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా దిగువ ఆయకట్టుకు 8.4 టిఎంసిల నీరు విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. కాకతీయ కాలువ ద్వారా 5.5టిఎంసిలు, డి 83, డి 86 కాలువల ద్వారా మిగతా నీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనికనుగుణంగా ఎనిమిది తడుల ద్వారా పొలాలకు సరఫరా చేసేందుకు కార్యచరణ ప్రకటించారు. దీని ప్రకారం ఎల్‌ఎండి దిగువన నాలుగో తడికి ఏడు రోజులు, 5,6 తడులకు ఆరు రోజుల చొప్పున నీరు విడుదల చేసేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. అధికారులు సైతం ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ, నీటి విడుదల చేస్తుండగా, మధ్యలో నీటి చౌర్యం పెరిగింది. దీంతో కాలువల ద్వారా రోజుకు 17వేల క్యూసెక్కులు పొలాలకు వెళ్ళాల్సి ఉండగా, 11వేల క్యూసెక్కుల వరకు వెళ్ళటం గగనకుసుమంగా మారింది. ఈ క్రమంలో కాలువల మొదటి వరుసలో ఉండే పొలాలకే నీరందక వరి పొలాలు నోళ్ళు తెరుస్తున్నాయి. ఈ తరుణంలో చివరి ఆయకట్టుకు నీరందే ప్రసక్తే లేకపోగా, రైతుల్లో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. మరో రెండు తడులు విడుదల చేయాల్సి ఉన్నా, ఇప్పటికే నిర్దేశించిన మేరకన్నా అదనంగా నీటిని విడుదల చేసినట్లు పేర్కొంటున్న అధికారులు, ఏడోసారి వదిలే నీటిని చివరి తడిగా వినియోగించుకోవాలని అధికారులు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఆశలతో వరి సాగు చేసిన చివరి ఆయకట్టు రైతులు సాగునీటిపై ఆశలు వదులుకోవడమేనా అంటూ వాపోతున్నారు. సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కుతున్న సంఘటనలు జిల్లాలో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైన అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుని చివరి ఆయకట్టుకు నీరందించి పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.

ప్రాజెక్టులైతే మా భూముల్లో నీరు మాత్రం మల్లన్నసాగర్‌కు మళ్లిస్తారా?
* రాస్తారోకోకు దిగిన నిర్వాసిత రైతులు
రామడుగు, మార్చి 23: ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోసుకోవడానికి మా భూముల్లో ప్రాజెక్టులు నిర్మించి చుక్క నీరు లేకుండా చేసి మాకు అన్యాయం చేసి నీళ్లన్నీ మల్లన్నసాగర్‌కు తరలిస్తారా? అంటూ మండలంలోని లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లి, కిష్టంపల్లి రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకోకు దిగారు. ఉదయమే రైతులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నప్పటికీ సమీపంలోనే పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నందున పోలీసులు రైతుల ఆందోళనను అడ్డుకున్నారు. అనంతరం వారికి కాసేపు బందోబస్తు మద్యన అనుమతి ఇవ్వడంతో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 8వ ప్యాకేజీ పనుల్లో సుమారు వెయ్యి ఎకరాల భూములు ప్రజావసరాల కోసం ప్రభుత్వం తీసుకుందని, మిగతా భూముల్లో పంటలు పండించాలనుకుంటే బావులు,బోర్ వెల్లులో ఉన్న నీరు అండర్ గ్రౌండు టనె్నల్ మింగేసిందన్నారు. ఉన్న భూములకు నిర్మాణంలో ఉన్న గ్రావిటీ కెనాల్ వద్ద గేటు ఏర్పాటు చేసి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీరు ఇవ్వకుండా తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతుల ఆందోళనకు మద్దతిచ్చిన టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గజ్జెల కాంతం మాట్లాడుతూ రైతులు రోడ్డుపై వేయకుండా న్యాయపరంగా నీళ్లు ఇచ్చి వారి పంటలను రక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రం డిప్యూటి తహశీల్దార్ రాజ్‌కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వంచ సుదర్శన్ రెడ్డి, పంజాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.