కరీంనగర్

జూన్ 30 నాటికి అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 25: రాష్ట్రంలో పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, భూ ప్రక్షాళన చేసి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు అందించడం సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వాస్తవానికి డిసెంబర్ 31నాటికే మిషన్ భగీరథ బల్క్ వాటర్ అన్ని గ్రామాలకు అందించాలనే లక్ష్యం కాగా, రైల్వే క్రాసింగ్‌లో అటవీ అనుమతులు, రోడ్ కటింగ్ అనుమతులు పొందడంలో ఆలస్యం జరగడంతో జాప్యం జరిగిందని, జూన్ 30నాటికి జిల్లాలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ బల్క్ వాటర్ అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనుల క్యూరింగ్ సరిగా చేయాలని, పనుల నిర్వహణలో ఎక్కడా ఏజెన్సీల నిర్లక్ష్యం ఉందో ఇంజనీర్లు అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టి గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబర్ చివరి నాటికి ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు అందించాలని, ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు ఐరన్ ధరలు పెరగడం, భూములు అందుబాటులో లేకపోవడం, రాష్ట్రంలో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నందున నైపుణ్యం గల కార్మికులు దొరకక ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని తెలిపారు. జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా దసరాలోపు నిర్మించేందుకే మండలానికొక ఔట్‌సోర్సింగ్ ఎఇలను నియమించాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను 15రోజుల్లోగా సేకరించాలని, నిర్మాణాలకు ఇసుక ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్‌కు సూచించారు. ఇళ్ల నిర్మాణాలను 60సి కింద కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. షార్ట్ టెండర్ నోటీసులు ఆహ్వానించి, ఇళ్ల నిర్మాణాల బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించాలని తెలిపారు. నిర్మాణాలలో నాణ్యత, క్యూరింగ్, సిమెంట్ మిక్సింగ్‌లలో ఎలాంటి రాజీ పడకూడదని ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలపై పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని కలెక్టర్‌కు సూచించారు. రైతుల ఆత్మ గౌరవానికి ప్రతీక ‘రైతుబంధు’ పథకమని అన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు భద్రత, భరోసాను ఇస్తాయని చెప్పారు. గత కొనే్నళ్లుగా గ్రామాలలో పరిష్కారం కాని భూ సమస్యలను భూ ప్రక్షాళనలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సరి చేశారని తెలిపారు. ఒక్కొక్క టీం ఒక్కో గ్రామంలో పది రోజులు సర్వే నిర్వహించి, గ్రామ సభలు నిర్వహించి కొత్తగా పక్కాగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని అన్నారు. అయినప్పటికినీ ఇంకనూ గ్రామాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని స్పెషల్ టీములను ఏర్పాటు చేసి చివరి భూముల వరకు సర్వే చేయించి రైతులందరికి పక్కా పట్టాదార్ పాస్ పుస్తకాలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎంపి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బొడిగె శోభ, వొడితెల సతీష్‌కుమార్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, మేయర్ రవీందర్ సింగ్, సుడా చైర్మన్ రామకృష్ణారావు, గ్రంధాలయ చైర్మన్ రవీందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, ఆర్‌డిఓ ఆయేషామస్రత్ ఖానం, మిషన్ భగీరథ ఎస్‌ఇ అమరేందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రాఘవాచారి, ఆర్‌డిఓలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ పనులపై మంత్రి అసహనం, ఆగ్రహం
ప్రజల ‘దూప’ తీరాక నీళ్ళిస్తారా..? ఇప్పటికీ ఐదు వాయిదాలు అయిపోయినయి..అయినా లక్ష్యం చేరలేదు. మళ్లీ ఇప్పుడేమో జూలై 31 అంటున్నారు..ఇదైనా నమ్మచ్చా అంటూ మంత్రి రాజేందర్ మిషన్ భగీరథ పనులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిధులు ఇస్తున్నాం.. సదుపాయాలు కల్పిస్తున్నాం..అటు సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు..అయినప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేమిటీ అని మిషన్ భగీరథ అధికారులను ప్రశ్నించారు. మార్చి వరకు ఇస్తామని ప్రజలకు చెప్పి, మే నెల పూర్తవుతున్నా..నీళ్లు అందించలేకపోతే ఏలా అంటూ నిలదీశారు. వేసవిలో నీళ్ళిస్తే ప్రజలు బిందెలు పట్టుకుని రోడ్లపై వచ్చేవారా ? మీ నిర్లక్ష్యం వల్ల చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారు. ఏజెన్సీలు మీరు చెప్పినట్టు వింటున్నాయా ? లేక ఏజెన్సీలు చెప్పినట్టు మీరు వింటున్నారా అర్థం కావడం లేదని తెలిపారు. ఇప్పటికైనా నిర్ణయించుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. లేనిపక్షంలో ఇక ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు.