కరీంనగర్

పారా హుషార్..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 16: ఖరీఫ్ సీజన్ మొదలైంది. అన్నదాతల్లో సాగు సందడి ఆరంభమైంది. రోహిణీ కార్తెలో పలకరించిన తొలకరి వర్షాలతో దుక్కులు దున్ని, విత్తనాలు విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. విత్తనాల కోసం దుకాణాల బాట పడుతున్నారు. ఏటేటా పెరుగుతున్న ధరాభారాన్ని తట్టుకోలేక చౌకగా లభించే విత్తనాలపై దృష్టి సారిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ‘సందేట్లో సడేమియా’లా వ్యాపారులు పలు రకాల బ్రాండ్ల పేరిట మార్కెట్‌లో ప్రవేశించిన నకిలీ విత్తనాలు అంటగట్టేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు పంటలకు గిట్టుబాటు ధర రాక, మరోవైపు నకిలీ విత్తనాలు వెరసి యేటా అన్నదాతలు నష్టపోతూనే ఉన్నారు. ఈ క్రమంలో రైతుకు అండగా నిలువాలని ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు ఏకరాకు రూ.4వేలు పెట్టుబడి సాయం అందించగా, ఆ సాయం అందుకున్న రైతులు విత్తనాలు కొనేందుకు సిద్ధమవుతుండగా, నకిలీ విత్తనాల ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ విత్తనాలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 4.30లక్షలకుపైగా హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ జిల్లాలో లక్షా 35వేల 830 హెక్టార్లలో, జగిత్యాల జిల్లాలో లక్షా 33వేల 913హెక్టార్లలో, పెద్దపల్లి జిల్లాలో 96వేల 487 హెక్టార్లలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 70వేల 338 హెక్టార్ల చొప్పున పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసారు. ఇందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచారు. గత ఖరీఫ్ సాగు కంటే ఈసారి ఎక్కువగా పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వ పెట్టుబడి సాయంతో అన్నదాతలు ఆశల సాగుపై ఉత్సాహం పెరగడంతోపాటు ఈసారి ఆశాజనకంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో వానకాలం సాగుకు సన్నద్ధమయ్యారు. ప్రతిసారి రైతు మెడపై నకిలీ విత్తనాల కత్తి వేలాడుతూ నష్టపోతుండగా, రైతులు నకిలీ విత్తనాల బారినపడకుండా ఉండేందుకుగాను ఇప్పటికే టాస్క్ఫోర్స్ బృందాలు ఎరువులు, విత్తనాల దుకాణాలపై గట్టి నిఘా పెట్టాయి. పలు దుకాణాలపై దాడులు కూడా నిర్వహించారు. అయినా, పలు బ్రాండ్ల పేరిట నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి సాయం అందుకుని సంతోష పడాలో..ఏ ఏ విత్తనాలు నకిలీవి తెలియని పరిస్థితుల్లో బాధ పడాలో అర్థంకాని పరిస్థితిలో కర్షకులు కలవరపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సాగు ముమ్మరం కానున్న దరిమిలా నకిలీ విత్తనాలపై ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
* మంత్రి ఈటల రాజేందర్
జమ్మికుంట, జూన్ 16: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష పాటించి, అన్ని వర్గాల ప్రజల సుఖశాంతులతో జీవించాలని అల్లాహ్‌ను, ఖురాన్ పఠనం చేసిన ముస్లిం సోదరులకు రంజాన్ శుభకాంక్షలు తెలిపారు. పేద ముస్లింలకు ఉచితంగా బట్టలను అందించి, అందరు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ముస్లిం యువతి, యువకులకు స్వయం ఉపాధి కల్పన కోసం లక్ష రూపాయల రుణానికి 80శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తుందన్నారు. మైనార్టీల సంక్షేమానికి దేశంలో ఎక్కడ లేని విధంగా షాదీముబారక్, గురుకుల పాఠశాలతోపాటు అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. నిరుపేదలైన మైనార్టీ కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లనిర్మాణం చేసి అందజేస్తామన్నారు. అబాది జమ్మికుంటలోని ఈద్గా, కొత్తపల్లిలోని ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కొత్తపల్లి మజీద్ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు యం ఎ హుస్సేన్, యండి నసీరోద్దిన్, ఖదీర్, టిఆర్‌ఎస్ నాయకులు పోడేటి రామస్వామి, తక్కళ్ళపెల్లి రాజేశ్వర్‌రావు, దేశిని కోటి, చందారాజు, శీలం శ్రీనివాస్, పోనగంటి మల్లయ్య, ఎక్కటి సంజీవరెడ్డి, ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, రహీం, ఫజిల్ రహమాన్‌తోపాటు ముస్లింలు, నాయకులు పాల్గొన్నారు.