కరీంనగర్

నేడు గవర్నర్ నరసింహన్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 20: రాష్ట్ర గవర్నర్ ఇ.ఎల్.నరసింహన్ శనివారం జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు వస్తున్నారు. నగరంలోని ప్రముఖ విద్యా సంస్థ వాణినికేతన్ విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకలకు గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం గవర్నర్ పర్యటన షెడ్యూల్‌ను రాజ్‌భవన్ అధికారులు విడుదల చేసారు. శనివారం ఉదయం 10:30 గంటలకు రాజ్‌భవన్ నుంచి గవర్నర్ బయలుదేరి, 10:35 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి 10:40 హెలిక్యాప్టర్‌లో బయలుదేరి, 11:20 గంటల వరకు కరీంనగర్ కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌లో దిగుతారు. ఇక్కడి నుంచి వాణినికేతన్ స్కూల్ గోల్డన్ జూబ్లీ వేడుకలు జరిగే సర్కస్ మైదానానికి 11:30 గంటలకు చేరుకుని, పూర్వ విద్యార్థులనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు సర్కస్ మైదానం నుంచి బయలుదేరి కలెక్టరేట్ హెలిప్యాడ్‌కు చేరుకుని, ఇక్కడి నుంచి 1:10 గంటలకు హెలిక్యాపర్‌లో బయలుదేరి 1:55 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. ఇక్కడి నుంచి బయలుదేరి 2గంటల వరకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. గవర్నర్ పర్యటన సందర్భంగా వాణినికేతన్ విద్యా సంస్థల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. అటు పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. సర్కస్ మైదానంలో శుక్రవారం సాయంత్రం బాంబు డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్‌లు తనిఖీలు నిర్వహించారు. శనివారం ఉదయం మరోమారు తనిఖీలు నిర్వహించనున్నారు. కాగా, కరీంనగర్ పర్యటన సందర్భంగా గవర్నర్ నాలుగవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఉన్నతాధికారులు భావించినప్పటికీ పర్యటన షెడ్యూల్‌లో ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో హరితహారం ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది.

ఉగ్రవాద రక్కసి పీచమణుద్దాం
* ర్యాలీలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సీపీ కమలాసన్ రెడ్డి పిలుపు

కరీంనగర్, జూలై 20: కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు, శాంతి, సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక అవగాహన ర్యాలీకి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఈర్యాలీని ప్రారంభించారు. సర్కస్ మైదానం నుంచి మొదలైన ఈ ర్యాలీ ప్రతిమ మల్టీఫ్లెక్స్, బస్టాండ్, తెలంగాణ తల్లి విగ్రహం, వెంకటేశ్వర దేవాలయం, అమరవీరుల స్థూపం, టవర్ సర్కిల్ మీదుగా రాజీవ్ చౌక్ వరకు కొనసాగింది. ర్యాలీ ప్రారంభానికి ముందు దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల హింసాత్మక చర్యలు, ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ వివిధ రకాల నినాదాలతో ప్లకార్డులు చేతబూని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కుల, మత వర్గ విబేధాలను విడనాడి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద ఉన్మాద చర్యలతో దేశవ్యాప్తంగా అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. యువత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలను నియంత్రించాలని సూచించారు. సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఐక్యంగా పోరాడాలని, దేశ సమైక్యత కోసం ముందుకురావాలని పిలుపునిచ్చారు. మత సామరస్యానికి మద్ధతుగా వచ్చే నెల 12న కరీంనగర్‌లో 4కె రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శశాంక, సైనిక అధికారులు సతీష్‌కుమార్, ఉమాశంకర్, అడిషనల్ డీసీపీ సంజీవ్ కుమార్‌తోపాటు పలువురు పోలీస్ అధికారులు, కమిటి సభ్యులు, అన్ని వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.