కరీంనగర్

ప్రమాద ఘంటికలు...!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 3: హమ్మయ్య...ఏలాగోలా ఏప్రిల్ గండం గట్టెక్కింది..ఇక మే గండం ముందుంది. ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు..వెరసి జిల్లా చరిత్రలో ఎన్నడూలేని విధంగా భూగర్భ జలాలు అడుగంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో నీటి వనరులు వట్టిపోగా, అక్కడక్కడ ఉన్న వ్యవసాయ బావులపైనే భారం వేసి ఆ బావుల వద్దకు జనం పరుగులు తీస్తోంది. పల్లెలు, పట్టణాలకు తాగునీరందించే రిజర్వాయర్లు సైతం నీళ్లు లేక ఏడారులుగా మారాయి. ఫలితంగా పట్టణ జనం బిందెలు, బకెట్లతో ట్యాంకర్ల వెంట పడుతుండగా, పల్లె జనం బావుల వద్ద బారులు తీరుతున్నారు. నల్లా నీటికి కటకట ఏర్పడగా, మున్సిపాలిటీల్లో రోజు విడిచి రోజు, కొన్నిచోట్ల అయితే మూడు రోజులకోమారు, గ్రామాల్లో వారానికోసారి నల్లా నీరు సరఫరా అవుతోంది. గడిచిన వర్షాకాలంలో సాధారణ సగటు వర్షాపాతం కూడా నమోదు కాకపోవడంతో జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి చుక్క నీరు వచ్చి చేరలేదు. అటు గతేడాదితో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా నీటి మట్టం పడిపోయింది. దాదాపు జిల్లాలో చాలాచోట్ల భూగర్భ నీటి మట్టం పడిపోగా, గంగాధర, ఎల్లారెడ్డిపేట, హుజురాబాద్, వేములవాడ మండలాల్లో మాత్రం 20మీటర్ల కంటే లోతుకు పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 10మండలాలుంటే ఏడు మండలాలు, హుజురాబాద్ డివిజన్‌లో 8మండలాలుంటే 5మండలాలు, జగిత్యాల డివిజన్‌లో 14 మండలాలుంటే 10మండలాలు, సిరిసిల్లలో 9మండలాలుంటే 8మండలాలు, పెద్దపల్లిలో 9మండలాలుంటే 4మండలాల్లో, మంథని డివిజన్‌లో 7మండలాలుంటే 6మండలాల్లో నీటి మట్టాలు పడిపోయాయి. అటు తీవ్ర వర్షాభావంతో ప్రధాన నీటి వనరులైన నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ, జిల్లాలోని ఎల్‌ఎండి రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరాయి. అలాగే ఎగువ మానేరు, శనిగరం, కల్వల ప్రాజెక్టు, బొక్కల వాగు ప్రాజెక్టు తదితర మధ్యతరహా ప్రాజెక్టుల్లో సైతం నీళ్లు లేవు. గోదావరి నది సైతం ఎడారిలా మారింది. ఈ క్రమంలో జిల్లా అంతటా నీటి ఇబ్బందులు అధికమవుతుండగా, దప్పిక తీర్చండంటూ ప్రజలు, మహిళలు ఖాళీ బిందెలతో నిత్యం ఎదోఒక ప్రాంతంలో రోడ్డెక్కుతూనే ఉన్నారు. జిల్లాలో 1207 గ్రామ పంచాయితీలుండగా, 2,247 (హబిటేషన్) ఆవాస ప్రాంతాలున్నాయి. 2,247 ఆవాస ప్రాంతాలలో 400 ఆవాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం ఈ ప్రాంతాల్లో 750 బావులను అద్దెకు తీసుకుని రోజుకు 425 ట్రిప్పుల చొప్పున ట్యాంటర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో తాగునీరు అందక జనం నానాతిప్పలు పడుతోంది. నీటి సేకరణ కోసం ప్రజలు అరిగోస పడుతున్నారు. ఏప్రిల్ మాసాన్ని ఏలాగోలా అధిగమించిన జిల్లా యంత్రాంగానికి మే మాసంలో ప్రజల దప్పిక తీర్చడం ఒక సవాలే అని చెప్పొచ్చు. అక్కడక్కడ ఉన్న బావులే ఆధారం కాగా, మరింతగా ఎండలు ముదిరితే మాత్రం ఉన్న కాస్త నీరు వట్టిపోయే ప్రమాదం ఉండటంతో అందరిని కలవరపెడుతోంది. నిధులు ఎన్ని ఉన్నా, నీరు లేకపోతే ప్రజల దప్పిక తీర్చడం కష్టమే. ఈ క్రమంలో మే మాసం ఏలా గట్టెక్కుతుందోనని ఇటు అధికారులు, అటు ప్రజలు ఆందోళన చెందుతుండగా, ఇక ఆ వాన దేవుడి కరుణ, కటాక్షాలపైనే ఆధారపడి ఉంది. మరీ వాన దేవుడు కరుణిస్తాడో లేదో వేచిచూడాల్సిందే.