కరీంనగర్

హమ్మయ్య.. ఒక యజ్ఞం పూర్తయంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 7: ప్రతిష్టాత్మకంగా భావించిన అసెంబ్లీ ఎన్నికల ప్రస్థానంలోప్రధాన అంకం ముగియటంతో, ఉమ్మడి జిల్లా ప్రజానీకంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర పాలనకు అత్యంత కీలకమైన ఈ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా భావించిన యంత్రాంగం గత రెండు మాసాలుగా నిద్రాహారాలు మాని విధులు నిర్వహించగా, ఎట్టకేలకు ప్రధాన ఘట్టం శుక్రవారం పూర్తికావటంతో, హమ్మయ్య.. ఒక యజ్ఞం ముగిసిందంటూ అధికారులు,సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్‌కు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాల్లేకున్నా, రాజకీయ పార్టీల మద్య నెలకొన్న హోరా హోరీ పోరుతో పోలింగ్ బూతుల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలున్నాయనే అంచనాలు వేసినా, ప్రశాంతంగానే ముగిసింది. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు ఏకదాటిగా కొనసాగింది. మందకోడిగా ప్రారంభమై రానురాను ఊపందుకుంది. పలుచోట్ల ఈవి ఎంలు మొరాయించి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో గంట, మరికొన్ని చోట్ల రెండు గంటల ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. గోదావరిఖనిలోని ఇందిరానగర్‌లోగల పోలింగ్ బూత్‌లో, పెద్దపల్లిజిల్లాలోని శాంతినగర్, కొత్తపల్లి, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్‌లో, సిరిసిల్లలోని సుందరయ్యనగర్‌లో, కరీంనగర్‌లోని పలు పోలింగ్ బూతుల్లో ఈవి ఎంలు మొరాయించాయి. ఎన్నికల అధికారులు వాటి స్థానంలో రిజర్వ్ ఈవి ఎంలు ఏర్పాటు చేసి, పోలింగ్ నిర్వహించారు. క్యూలైన్లలో ఓపికగా నిల్చుని ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నా, మొత్తానికి ప్రశాంతంగానే పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల ఎన్నికల అధికారులు అధికార పార్టీ అభ్యర్థుల కొమ్ముకాశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓవైపు పోలింగ్ బూతుల సమీపంలోనే ఓపార్టీకి చెందిన వ్యక్తులు బాహాటంగానే డబ్బులు పంచుతూ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుండగా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు అడ్డుకున్నారు. కోతిరాంపూర్‌లోని అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇంటిలో పోలింగ్ చిట్టీల మాటున డబ్బులు పంచుతుండగా, బీజేపి కార్యకర్తలు పట్టుకున్నారు. వీరిలో మహిళా సంఘాల సభ్యులు కూడా ఉండగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరువర్గాల మద్య కొద్దిసేపువాగ్వివాదం జరిగింది. 25వ డివిజన్‌లోకూడా గ్రామైక్య సంఘాల సభ్యులతో ఇంటింటికి తిరుగుతూ, డబ్బులు పంపిణీ చేస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకున్నారు. వీరిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్కంఠ, ఉద్రిక్తతల మద్య పోలింగ్ ముగియగా, అభ్యర్థుల భవితవ్యం ఈవిఎంలలో భద్రంగా నిక్షిప్తమైంది. ఇన్నాళ్ళు పోటీ పోటీగా సాగిన పోరులో విజేత ఎవరో ఈనెల 11న తేలనుంది.

నగరంలో తెరాస ముందస్తు సంబురాలు
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 7: ముందస్తు ఎన్నికల్లో గెలుపు తమదేననే ధీమాతో తెరాస శ్రేణులు శుక్రవారం సాయంత్రం నగరంలోని టవర్ సర్కిల్‌లోమిఠాయిలు పంచి, సంబురాలు నిర్వహించాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ, నగరంలో మరోసారి ఎమ్మెల్యేగా గంగుల విజయయాత్ర చేపట్టనున్నాడని, హాట్రిక్ ఎమ్మెల్యేగా చరిత్రలో నిలవనున్నాడనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో మరోసారి పాలనాపగ్గాలు చేపట్టబోతుందని, ఈనెల 12న ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరో ఐదేళ్ళ పాటు సీ ఎం పరిపాలన సాగించబోతున్నాడని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఈ సంబురాల్లో నాయకులు ఎడ్ల అశోక్, మైకేల్ శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, దండవేణి రాములు, శ్రీనివాస్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

చొప్పదండిలో పలువురి ఓట్లు గల్లంతు
చొప్పదండి, డిసెంబర్ 7: చొప్పదండి నియోజకవర్గంలో ఎన్నికల ఓటింగ్ జరిగిన నేపథ్యంలో పలు మండలాల్లోని గ్రామాల్లో ఓక్కో గ్రామం నుంచి దాదాపు 50 ఓట్లకు పైగానే గల్లంతు కావడంతో గల్లంతైన ఓటర్లు ఆందోళనకు దిగి అధికారులను నిలదీశారు. అధికారులు తిరిగి ఓటు నమోదు చేసుకోవాలంటూ చెప్పటంతో పలువురు ఓటర్లు తీవ్రంగా దుయ్యబట్టారు. అలాగే నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో కొన్ని ప్రాంతాలలో రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. వికలాంగులకు అధికారులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడంతో అందులోనే తరలివచ్చి ఓటును వినియోగించుకున్నారు. ఉదయం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు మధ్యాహ్నం సమయంలో ఓటు నమోదు తగ్గి సాయంత్రం వేళలో తిరిగి ఓటర్లు బారులు తీరారు. దీంతో పోలింగ్ సరళికి సమయం పెరిగింది. కొత్త ఓటర్లు ఉత్సాహవంతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చొప్పదండిలో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం, టిఆర్‌ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్, కాట్నపల్లిలో బిజెపి అభ్యర్థి బొడిగె శోభలు ఎన్నికల సరళిని పరిశీలించారు. నియోజకవర్గంలో ఎన్నికల ఓటింగ్ సరళి ప్రశాంతంగా పూర్తి కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.