కరీంనగర్

కరీంను అభినందించిన కేంద్ర మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర, జనవరి 1: దేశంలోని నైపుణ్యం గల క్రీడాకారుల్ని గుర్తించటంతో పాటు, అంతర్జాతీయ క్రీడావేదికపై త్రివర్ణపతాకం రెపరెపలాడించేలా సూచించిన క్రీడా విశే్లషకుడు మహ్మద్ కరీంను కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు. కొత్త ఏడాదిని పురష్కరించుకుని దేశంలోని ప్రముఖ క్రీడా సంబంధీకులతోమంగళవారం చిట్ చాట్ నిర్వహించగా, ఈసందర్భంగా మాట్లాడుతూ, ఖేలో ఇండియా, ప్రపంచ హాకీ పోటీలు, క్విజ్‌లో ఆలిండియా స్థాయిలో విజేతగా నిలిచిన పలువురిని తొలుత మంత్రి అభినందించినట్లు కరీం తెలిపారు. ఈసందర్భంగా మంత్రి రాథోడ్ మాట్లాడుతూ, తాను ఆలస్యంగా క్రీడల్లో ప్రవేశించి, ఒలింపిక్ పథకం సాధించినట్లు తెలిపాడని, బాల్యం నుంచి క్రీడల్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారని, అనంతరం క్రీడల అభివృద్ధిపై సూచనలు ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఖేలో ఇండియా ఓ విప్లవాత్మక క్రీడా పథకమని, పాఠశాల దశే క్రీడారంగానికి ఆయువుపట్టని తాను పేర్కొన్నట్లు కరీం వెల్లడించారు. ఒలింపిక్స్‌లో పథకాల సాధనే లక్ష్యంగా శిక్షణాశిబిరాలు నెలకొల్పుతూ, ఆటగాళ్ళను ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల సంక్షేమానికి చేపడుతున్న ప్రోత్సాహాలు మరింత పెంచాల్సిన అవసరముందని, దేశవ్యాప్తంగా పలు క్రీడల్లో అకాడమీలు నెలకొల్పాలని సూచించగా, తెలంగాణలో రెజ్లింగ్ అకాడమీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఆదిశగా సత్వర చర్యలు చేపడుతామని హామీ ఇచ్చినట్లు కరీం తెలిపారు. ఈసందర్బంగా ప్రశంసలు పొందిన కరీంను జిల్లాక్రీడాభివృద్ధి అధికారి అశోక్, క్రీడాసంఘాల బాధ్యులు రమేశ్‌రెడ్డి, ఎస్.శ్రీకాంత్, సిద్ధారెడ్డి, జాడి శ్రవన్, జనార్థన్‌రెడ్డి, విజయభాస్కర్, కె.శ్రీనివాస్‌రావు, వి.రమేశ్, సరోత్తంరెడ్డి, షఫీమొయినొద్దిన్, మహేందర్,తదితరులు అభినందించారు.
ప్రజలు మాకు శత్రువులు కాదు.. మిత్రులే..!

కరీంనగర్, జనవరి 1: పోలీసులు ప్రజారక్షణ కోసమే పనిచేస్తున్నారని, ప్రజలుమాకేం శత్రువులు కారు మిత్రులేనని ప్రమాదాల నివారణకే డ్రంక్‌అండ్ డ్రైవ్ కొనసాగిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ వీ.బీ .కమలాసన్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారి కూడా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి 266 మంది మందు బాబులను పట్టుకొని వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కమిషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు సంభవించి అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని, దీంతో వారిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రజారక్షణ, ప్రమాదాల నివారణ కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని పోలీస్ యంత్రాంగం నిరంతరం కొనసాగిస్తుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణతో కొంత మేరకు రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల మన శరీరం మన ఆధీనంలో లేకుండా ఏదేదో జరిగిపోయి ప్రమాదాలకు దారితీస్తుందని, ప్రజల రక్షణ కోసమే ప్రమాదాల నివారణకై డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి జైలుశిక్ష, జరిమానాలు విధించబడుతున్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లతో తమ కుటుంబాలు ఆనందంగా ఉన్నాయని, తొందరగా ఇంటికి వస్తుండడంతో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. మద్యం సేవించి పట్టుబడ్డ వారిని లైసెన్స్ రద్దుకోసం రవాణా శాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి విధి విధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తరహాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కొనసాగించి ప్రమాదాల నివారణకు పకడ్బంధీగా పనిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న పోలీస్ యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరమేనన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపడాన్ని పూర్తిగా నియంత్రించేవరకు ప్రజల ప్రాణాలను పరిరక్షించేందుకు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కొనసాగిస్తామని చెప్పారు. అన్ని వర్గాలు తమవంతు సహకారాన్ని అందించాలని నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి కోరారు.
ఇదిలా ఉండగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడిన 13 మంది మందుబాబులపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఈ-పెట్టి కేసులను నమోదు చేశామని పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు.
అభివృద్ధే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం
కరీంనగర్ టౌన్, జనవరి 1: కొత్త ఏడాదిలో సరికొత్త లక్ష్యాలు నిర్ధేశించుకుని, ఆచరణే ధ్యేయంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగేందుకు జిల్లాయంత్రాంగం సన్నద్ధమవుతోంది. గత ఆర్ధిక సంవత్సర ప్రణాళికలు పూర్తి చేస్తూ, శాఖల పరంగా తిరిగి కొత్త ప్రణాళికలు రూపొందించుకుని, వాటి లక్ష్య సాధనకు కలిసికట్టుగా కృషి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు. తమ తమ శాఖల్లోని కిందిస్థాయి సిబ్బంది సహాయ, సహాకారాలతో, ప్రభుత్వ పథకాలు చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్ళేందుకు సమాయత్తమవుతున్నారు. నూతన సంవత్సరంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, చేయూతనందిస్తామన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా చొరవ చూపుతామంటూ భరోసా ఇచ్చారు. కొత్త వత్సరం ఆవిష్కృతమైన నేపథ్యంలోతమ విధుల పట్ల జిల్లా ఉన్నతాధికారుల లక్ష్య నిర్ధేశాలు ప్రకటిస్తూ, జిల్లాప్రజలకు మరింత చిత్తశుద్ధితో సేవలందించేందుకు కార్యచరణ రూపొందించుకుంటున్నట్లు వెల్లడించారు. కొత్త ఏడాదిలో అన్ని వర్గాలు అభివృద్ధిపథంలో పయనించేలా కృషి చేస్తూ, అన్ని రంగాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపి, ఇతర జిల్లాలకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కంకణ బద్ధులమవుతున్నట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు.పారదర్శక సేవలందిస్తూ, సామాన్య పౌరులు సైతం గుర్తించేలా విధులు నిర్వహించేలా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగేందుకుజిల్లాపోలీసు యం త్రాంగం సమాయత్తమవుతున్నట్లు పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.ప్రభుత్వ సంక్షే మపథకాలుక్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా సరైన పర్యవేక్షణ చేస్తూ, కొత్తగా అర్హులైన వారికి కూడా సముచిత న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. వైద్యరంగంలో గతేడాదికన్నా మరింత మెరుగైన సేవలందించేందుకు అలుపెరుగకుండా యత్నిస్తామని, ప్రభుత్వ వైద్యంపై అన్ని వర్గాల్లో మరింత భరోసా పెంచుతూ, అత్యాధునిక వైద్యసదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యారంగంలో గత ఫలితాలు పునరావృతం చేసేందుకు జిల్లా విద్యాశాఖ నిబద్ధతతో విధులు నిర్వహిస్తోందని, ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

వేడుకల వేళ విషాదం
* లారీ - కారు ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
హుజూరాబాద్, జనవరి 1: ఒకవైపు నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాలతో జరుగుతుండగా మరో వైపు రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. హుజూరాబాద్ మండలం మాందాడిపల్లి వద్ద వరంగల్ - కరీంనగర్ రహదారిపై సోమవారం రాత్రి 2 గంటలకు లారీ - కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామం నుండి కోడూరు వెంకటేశ్, కె ఎస్ చప్రారెడ్డి, సందెల రంజిత్‌లు కారులో హుజూరాబాద్‌కు వెళ్తుండగా హుజూరాబాద్ మండలం మాందాడిపల్లి వద్ద కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన కోడూరు వెంకటేశ్ (25) తో పాటు కే ఎస్ చప్రారెడ్డి (31) అక్కడికక్కడే మరణించారు. వీరి మృతదేహాలు కారులో ఇరుక్కుపోగా పోలీసులు, గ్రామస్తులు శ్రమించి బయటకు తీసారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు రంజిత్, లారీ డ్రైవర్ మోనూ రాథోడ్ తీవ్రంగా గాయపడగా వీరిని చికిత్స నిమిత్తం వరంగల్‌కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న కె ఎస్ చప్రారెడ్డి పయోనీర్ సీడ్స్ కంపెనీలో పీపీఎల్ గా పనిచేస్తుండగా, మృతుడు వెంకటేశ్‌తో పాటు గాయపడిన రంజిత్‌లు అదే కంపెనీలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఒకవైపు నూతన సంవత్సర వేడుకల్లో అందరు నిమగ్నమవగా మరో వైపు జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. మరో మృతుడు చప్రారెడ్డి స్వస్థలం కర్ణాటక లోని వెనగలూరు. లారీ డ్రైవర్ అతివేగంగా వెళ్తూ అదపుతప్పడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలకు హుజూరాబాద్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే యువకుడి మృతి
* బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్
చందుర్తి, జనవరి 1: చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో గత పది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో లింగంపేట గ్రామానికి చెందిన గుంటి సునీల్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, ప్రథమ చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు ఆసుపత్రి గేటుకు తాళం వేసి క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడంతో సరియైన సమయంలో వైద్యం అందక సునీల్ మృతి చెందాడని ఆయన అన్నారు.
ప్రభుత్వం, ప్రభుత్వ వైద్య సిబ్బంది యువకుడి మృతికి బాధ్యత వహించాలన్నారు. సునీల్ మృతిపై అధికార పార్టీ నాయకులు మాట్లాడకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ సందర్భంగా స్థానిక భజరంగ్‌దళ్, విశ్వహిందూపరిషత్ కార్యకర్తలు సేకరించిన రూ.25 వేలను మృతుని కుటుంబానికి బండి సంజయ్ అందజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రుద్రంగి మండల శాఖ అధ్యక్షులు నందాడపు వెంకటేష్, నాయకులు గోపాల్ రెడ్డి, రంజిత్, తిరుపతి, రమేష్, వెంకటేష్, కె.శేఖర్, కొత్తపల్లి శేఖర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు సామాజిక సేవలో ముందుండాలి
* ఎమ్మెల్యే రవిశంకర్
రామడుగు, జనవరి 1: కేవలం తరగతి గదుల్లో చదువు, రాయడమే కాకుండా విద్యార్థులు సామాజిక సేవలో సైతం ముందుండాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంగళవారం సూచించారు. మండలంలోని వెలిచాల సరస్వతి పాఠశాల విద్యార్థులు సమకూర్చిన రూ.12 వేల విలువ గల టవల్స్‌తో పాటు గ్రామానికి చెందిన గాదె నర్సయ్య 50 కిలోల బియ్యం, పూదరి తిరుపతి ఇచ్చిన రూ.5 వేలను ఎమ్మెల్యే చేతుల మీదుగా మండలంలోని ప్రశాంత్ భవన్‌లోని విద్యార్థులకు అందించారు. ప్రతీ సంవత్సరం జనవరి 1న కేక్ కట్ చేసి సరస్వతి విద్యార్థులు ఇక్కడి అనాధ పిల్లలకు తోచిన విధంగా సహాయం చేయడం ఆనవాయితీగా రావడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైననే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వీర్ల కవిత, ఎంపిపి మార్కొండ కిష్టారెడ్డి, గంగాధర, బోయినిపల్లి జడ్పీటీసీలు ఆకుల శ్రీలత, మదుసూధన్, సరస్వతి పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్, వెలిచాల ఎంపిటిసి దండెపల్లి యాదగిరి, రామడుగు మాజీ సర్పంచ్ పంజాల జగన్ మోహన్ గౌడ్ తదితరులు ఉన్నారు.
ఆర్జీ-2లో 101శాతం బొగ్గు ఉత్పత్తి
- ప్రైవేట్‌కు దీటుగా ఓబీ వెలికితీత
- ఆర్జీ-2 జీఎం విజయబాబు వెల్లడి
యైటింక్లయిన్‌కాలనీ, జనవరి 1: సింగరేణి ఆర్జీ-2 పరిధిలో డిసెంబర్ మాసానికి 101శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన్నట్లు జి ఎం విజయబాబు తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. గనుల వారిగా వికెపి గని ద్వారా 17,310 టన్నులతో 67శాతం, 7 ఎల్ ఇపి 17,293 టన్నులతో 86శాతం, ఓసిపి-3 3,58,833 టన్నులతో 82శాతం, ఫేజ్-2 2,61,664 టన్నులతో 131 శాతం బొగ్గు ఉత్పత్తి చేసిన్నట్లు వివరించారు. ఆఫ్ లోడింగ్‌లో ప్రైవేట్‌కు ధీటుగా సింగరేణి 119 శాతం ఓబి మట్టిని వెలికి తీయడం జరిగిందని అన్నారు.
అదేవిధంగా ఎస్ ఎల్‌పి పదోన్నత్తులు 150 మందికి ఉత్తర్వులు ఇచ్చామని, 2017-18లో ఓసిపి-3 ఉత్తమ ఓసిపిగా నిలవడం గర్వకారణమని, 2019లో కూడా ఆర్జీ-2 రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నామని అన్నారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పలు గనుల్లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో డిజి ఎం ఎన్‌వి.రావు, అధికారులు రామక్రిష్ణ, పద్మా రావు, మురళీ క్రిష్ణ, రాజేంద్ర ప్రసాద్, జానకి రాం తదితరులున్నారు.