కరీంనగర్

గోదా కల్యాణానికి సిద్ధమైన ధర్మపురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జనవరి 11: ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై గోదా రంగనాథ స్వాముల కళ్యాణం ఈనెల 13న ఆదివారం ఉదయం 11గంటల సుముహూర్తంలో నిర్వహించనున్నందున దేవస్థానం పక్షాన విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. వటపత్రశాయి అయిన శ్రీమహా విష్ణువును గూర్చి రోజుకొక్క పాశురం గానం చేసి, శ్రీనివాసునికై కాత్యాయనీ వ్రతమాచరించి, శ్రీరంగ నాథుడిని పరిణయ మాడిన ఆండాళ్ కోదై, గోదాదేవి, ఆముక్త మాల్యద, చోడిక్కొడుత్త నాచ్చియార్ అనే పేర్లతో ప్రసిద్ధ నొందినది. మధురకు యాభై మైళ్ళ దూరాన శ్రీవిల్లిపుత్తరు అనే చిన్ని నగరంలో నిత్యం, రంగానాథుడిని సేవించే విష్ణుచిత్తుడనే పరమ భక్తుడుండేవాడు. గోదాదేవి విష్ణుచిత్తునకు తులసి వనంలో లభించింది. ఆమెకు ‘‘కోదై’’ (పూలమాల) అనే పేరు పెట్టాడు. తన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ప్రభావ కారణాన శ్రీరంగ నాథుడినే ఆమె భర్తగా పొందాలనుకుంది. స్వామికి సమర్పించే మాలలలన్నీ ముందుగా తాను ధరించి, దేవదేవునికి సమర్పింప చేస్తూ, ‘‘ఆముక్త మాల్యద’’ అయింది. విషయాన్ని గమనించిన విష్ణుచిత్తుడు వేరే మాలలు సమర్పిస్తే, ఆ స్వామి గోదాదేవి ధరించి విడిచిన మాలలే కావాలన్నాడు. రంగనాథుని భర్తగా పొందేందుకు ఆమె ధనుర్మాస వ్రతం ఆచరించింది. ‘‘ఆండాళ్’’ అని ఆమెను విష్ణుచిత్తుడు సంబోధించాడు. అంటే రక్షకురాలు అని అర్థం. సర్వం త్యజించి స్వామిపైనే మనసు లగ్నం చేయడానికి గోదాదేవి కాత్యాయనీ వ్రతం చేసింది. స్వామిని పాశురాలతో నెల రోజులు పూజించింది. వేకువ జామునే గోపికలను నిద్ర లేపుతూ, స్వామి కైంకర్యానికి సమాయత్తం చేసింది. స్వామి అనుగ్రహించి ఆమెను తనలో ఐక్యం చేసుకుంటాడు. అలా ఆమె ‘‘రంగనాయకి’’ అయింది. ధర్మపురి క్షేత్రానికి చెందిన అపర వేదవ్యాసులు, అష్టాదశ పురాణాలను ఔపోసనం పట్టి లబ్దప్రతిష్ఠులైన శ్రీగుండి రాజర్షి, శ్రీరంగం క్షేత్ర దర్శనం చేసుకుని వచ్చి, ధర్మపురి క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనం, గోదా రంగనాథుల కళ్యాణాది కార్యక్రమాలను దేవస్థానంలో ప్రారంభింప చేశారు. నాటి నుండి ఈ పరంపర సాంప్రదాయ రీతిలో కొనసాగుతున్నది. ఈనేపథ్యంలో దేవస్థానం ఎడి, ఇఓ అమరేందర్, చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ధర్మకర్తలు, సిబ్బంది ఆదివారం ఉదయం 11గంటలకు నిర్వహించనున్న గోదా కళ్యాణ ఘట్టానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులతో పోటెత్తిన ధర్మపురి క్షేత్రం
పుణ్య తీర్థమైన ధర్మపురి క్షేత్రం శుక్రవారం భక్తజనంతో పోటెత్తింది. పుష్య మాస శుక్ల పంచమీ యుత శుక్రవారం పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రారంభమైన క్రమంలో రాష్ట్రంలోని నలుమూలల నుండి ఆర్టీసీ, ప్రత్యేక వాహనాలలో ఏతెంచిన అశేష భక్తజనుల దైవ నామ స్మరణలు, జయజయధ్వనాలు, భక్తిసంగీతాలు, వేద మంత్రాలతో సనాతన క్షేత్రంలో భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. ఉదయాత్పూర్వంనుండే ప్రత్యేక ప్రయివేటు వాహనాల ద్వారా వివిధ జిల్లాలనుండి క్షేత్రానికి చేరుకున్న భక్తులు, గోదావరి నదిలో స్నానాలను ఆచరించి, దైవ దర్శనాలకోసం దేవస్థానానికి చేరుకుని, బారులు తీరి వేచి ఉన్నారు. రద్దీ అధికం కాగా దైవ దర్శనార్థం వచ్చిన వందలాది భక్తులు దేవస్థానంలో సేదతీరారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, ముత్యాల శర్మ, సంతోష్ శర్మ, సంపత్ కుమార శర్మ, వివిధ ఆలయాల అర్చకులు పర్వదిన అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. పంచోపనిషత్ యుక్త అభిషేకాలు, అష్టోత్తరశతి నామార్చనలు, సప్త హారతులు, మంత్రపుష్పాది కార్యక్రమాలను నిర్వహించారు. వందలాదిమంది భక్తులు కార్యక్రమాలలో భాగస్వాములైనారు. భక్తులు దేవస్థానంలో ప్రసాదాలను కొని, పరమాన్నాలుగా ఆరగించారు. పర్వదిన ప్రత్యేక పూజలను, నిత్య కళ్యాణాదులను గావించారు.
గోదావరిలో అశేష భక్తజన స్నానాలు
సనాతన సాంప్రదాయాల వారసత్వ నేపథ్యం కలిగిన ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి క్షేత్రానికి శుక్రవారం సందర్భంగా అత్యధిక సంఖ్యాకులైన భక్తులు, యాత్రికులు గోదావరి స్నానాలకై తండోప తండాలుగా తరలి వచ్చారు. ఇటీవలి కాలంలో భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో, పుష్యమాస శుక్రవారం పర్వదినంనాడు ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో, గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, మహా సంకల్పాది పూజలొనరించి, గోదావరి మాతను అర్చించారు. మహిళలు పెద్దసంఖ్యలో ముత్తయిదువులకు వాయినాలను సమర్పించుకున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాది సత్కర్మలను ఆచరించారు. ఆధిక సంఖ్యలో భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, కోడి, మేకలలాంటి జంతుబలులతో, మొక్కులు తీర్చుకున్నారు. నదివద్దే వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు. గోదావరి పౌరోహితుల ఆధ్వర్యంలో తమ గోత్రనామాదులతో ప్రత్యేక పూజలు, మహా సంకల్పాదులను వేదోక్త సాంప్రదాయాచరణ ప్రకారం ఆచరించారు. అనంతరం దైవ దర్శనాల కొరకు ప్రధానాలయాలకు వెళ్ళి దైవ దర్శనాలు చేసుకుని ప్రత్యేక గోత్రనామయుక్త పూజలను గావించుకున్నారు. శుక్రవారం సంబరాలలో అంబర చుంబిత భక్తి భావంతో భాగస్వాములై, గోదావరి స్నానాదులతో పునీతులు కావడానికి క్షేత్రానికి రాష్ట్రేతర ప్రాంతాలనుండి సైతం శ్రమకోర్చి అరుదెంచిన భక్తులు వివిధ ఆలయాలముందు బారులుతీరి దర్శనాలను చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా దేవస్థానంలోని ప్రధానాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు గావించారు. వివిధ ఆలయాల అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక సాంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను క్రమబద్దీకరించారు.
వైభవంగా వేంకటేశ్వర మహా క్షీరాభిషేకం
సనాతన సాంప్రదాయాల వారసత్వ నేపథ్యం కలిగిన ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురిలో పుష్యమాస మాస యుక్త శుక్రవారం నేపథ్యంలో, గోదావరి స్నానాలకై తరలి వచ్చిన భక్తజనం దైవ దర్శనాల కొరకు ప్రధానాలయాలకు అరుదెంచి క్యూలైన్ల ద్వారా దైవ దర్శనాలు చేసుకుని ప్రత్యేక గోత్రనామయుక్త పూజలను గావించుకున్నారు. ఈసందర్భంగా దేవస్థానంలోని ప్రధానాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు గావించగా, శ్రీవేంకటేశ్వర ఆలయంలో నేరేళ్ళ శ్రీనివాసా చార్య, శ్రీ్ధరాచార్య, కిరణ్, మోహనాచార్య, గ్రహ, గృహ, సమస్త బాధల నివారణకై లక్ష్మీ హోమాలను, లక్ష్మీసూక్త హవనాలను గావించారు. దేవస్థానం పక్షాన మహా క్షీరాభిషేకం కన్నుల పండువగా నిర్వహించారు. దేవస్థానం డిసి,ఇఓ అమరేందర్, చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మకర్తలు, అర్చక పౌరోహితులు, అర్చకులు ప్రత్యేక సాంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించారు.

స్వచ్ఛ్ పెద్దపల్లి సాధనే లక్ష్యం

-కలెక్టర్ శ్రీదేవసేన
గోదావరిఖని, జనవరి 11: జిల్లాలో స్వచ్ఛతను పెంపొందించి స్వచ్ఛ్ పెద్దపల్లి సాధనే లక్ష్యంగా అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్వచ్ఛ్ జిల్లాగా తీర్చిదిద్ధుదామని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. జిల్లాలో స్వచ్ఛ్ భారత్ కింద నిర్వహించిన కార్యక్రమాలపై ప్రపం బ్యాంక్ ప్రతినిధులకు కలెక్టర్ శుక్రవారం ఎన్టీపీసీ జ్యోతి భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... స్వచ్చ్ భారత్ కార్యక్రమం కింద అధికారుల కృషితో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వంద శాతం మరుగుదొడ్లను నిర్మించి జిల్లాను ఓడి ఎఫ్‌గా ప్రకటించుకున్మాని, అనంతరం ఓడి ఎఫ్‌ను సుస్థిరపరిచే దిశగా మరుగుదొడ్లను వినియోగించుకోవాలని స్వచ్ఛ్‌త అంశాలపై ప్రజలకు అవగాహన కలిపంచేందుకు ఓడి ఎఫ్ ఫ్లస్ కార్యక్రమాన్ని నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో స్వచ్ఛ్ సర్వేక్షన్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తామని, ప్రతి శుక్రవారం డ్రై డేగా పరిగణించి ప్రతి అధికారి ఒక గ్రామంలో స్వచ్ఛ్‌త కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలను చైతన్య పరుస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని కొంత మేర వాయిదా వేసామని ప్రతినిధులకు ఆమె తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో డ్రైయిన్ల అవసరం లేకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ప్రతి ఇంటికో సోప్ కిట్ నిర్మాణం చేపట్టామని, 98శాతం మేర పూర్తి చేసామని, మరో 10 రోజుల్లో మిగిలిన పనులు పూర్తవుతాయని కలెక్టర్ తెలిపారు. కాగా ప్రపంచ బ్యాంకు బృందాలు శనివారం ఎలిగేడు మండలంలోని సుల్తాన్‌పూర్, జూలపల్లి మండలంలోని జూలపల్లి, కాటాపూర్, ధర్మారం మండలంలోని బొట్లవనపర్తి, బొమ్మిరెడ్డిపల్లి, రామగుండం మండలంలోని ఇసాలతక్కల్లపల్లిలో పర్యటించనున్నారు.
కన్నుల పండువగా కుడారై ఉత్సవాలు
సుల్తానాబాద్, జనవరి 11: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో శుక్రవారం తిరుప్పావై కార్యక్రమాలు కన్నుల పండువగా, వైభవంగా జరిగాయి. ప్రతీ రోజు తిరుప్పావైకి సంబంధించిన 30 పాశురాలను అందరు కలిసి పాడారు. 26,27వ పాశురాలు పరమమంగళకరమైన విశేషమైనవి. అనృ ఇవ్వగలమంటూ స్వామికి మంగళహారతులతో శుభవ్యపార్థత్యాన్ని సమర్పించారు. కుడారై వెళ్లుం షీరు గోవిందా..అనే పాశురం అనుసంధానం చేశారు. 108 గంగాళతో పాయసాన్ని నింపి స్వామివారికి నివేదించారు. అనంతరం ఆ భక్తి పాయసాన్ని భక్తులందరు స్వీకరించారు. ఈ కుడారై కార్యక్రమం దేవాలయంలో ఒక గొప్ప దృశ్యంగా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తెల్లవారుజామున యదాతథంగా పాశురాలను అనుసరించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో కుడారై వ్రతం నోచుకున్నారు. మహిళలు, దంపతులు ఇందులో పాల్గొని ప్రతీ ఒక్కరు 108 గంగాళాలలో పాయసాన్ని నింపి పూజలు, నోములు నిర్వహించారు. అర్చకులు సౌమిత్రి వేణుమాధవాచార్యులు, వీణ, శ్రావణ్ కుమారాచార్యులు, హరిణి, వెంకటాచార్యులు, వసుధ దంపతులు, పూజాధికారులు పూజలు నిర్వహించగా, వికాసతరంగిణి బాధ్యులు వెంకటేష్, శరణాగతి దీక్షాస్వాములు సాదుల భాస్కర్, సాదుల సుగుణాకర్, పల్లా సదాలక్ష్మి, రవి, గట్టయ్య, నారాయణ, శ్రీను, స్వరూప, శ్రీలత, దీప, మమత, గుణ, పెద్దఎత్తున మహిళలు కుడారై ఉత్సవాల్లో పాల్గొన్నారు.

టెన్ తలో ప్రథమ స్థానం రావాలి

సిరిసిల్ల, జనవరి 11: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. శుక్రవారం స్థానిక స్వశక్తి పొదుపు భవన్‌లో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉంటూ చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సబ్జెక్టుల వారిగా వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గొప్ప నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రతి పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దిశగా వారిలో ప్రేరణ, ఆత్మ విశ్వాసం కలిగించి మానసికంగా సంసిద్దులను చేయాలన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారం పాఠశాలలో సన్నాహక పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల పురోగతిని పరీక్షించాలన్నారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు గత పొరపాట్లను సమీక్షించుకుంటూ..రానున్న రోజుల్లో అలాంటి మంచి ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వం పక్షాన అన్ని సదుపాయాలు కల్పిస్తామని, ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలు, ఉపాధ్యాయులకు బహుమతులు అందచేస్తామన్నారు. హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. హాస్టల్‌లో ఉండని వార్డెన్‌లను సస్పెండ్ చేస్తామని జేసీ హెచ్చరించారు.
బాల్య వివాహాలకు అనుత్తీర్ణత ఒక కారణం
పదవ తరగతిలోఅనుత్తీర్ణత బాల్య వివాహాలకు ఒక కారణమని జేసీ పేర్కొన్నారు. పదవ తరగతిలో పబ్లిక్ పరీక్షలలో ఫెయిల్యూర్ కావడం వల్ల అమ్మాయిలకు పెళ్ళి చేస్తున్నారని, దీని వలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిని దూరం చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాధ్యతలు గుర్తెరిగి పని చేయాలన్నారు.
సివిల్ వర్క్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి
ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహరీల వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని జేసీ తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. అలాగే ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. నల్లా కనెక్షన్లు ఇవ్వని పాఠశాలలు ఉంటే వాటి వివరాలు తమకు అందిస్తే, సంబంధిత అధికారులను ఆదేశిస్తామన్నారు.
గోరు ముద్దను అందించాలి
పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అంచే గోరుముద్ద కార్యక్రమంను ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రారంభించాలని జేసీ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాధికారి డి.రాధాకిషన్, సాధారణ పరీక్షల సహాయ కమిషనర్ బి.శ్రీనివాస్, సెక్టోరియల్ అధికారి వీఎం.శ్రీనివాస్, అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.