కరీంనగర్

మేమూ అడవి బిడ్డలమే బాంచన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, జనవరి 20: మేమూ అడవి బిడ్డలమే సారు... జంతువులను వేటాడుతూ, దుంపలు, పండ్లు, కందమోలాలు తిని బతికేవాళ్లం... ఉన్నత చదువులు లేవు, ఉద్యోగాలు లేవు... పూర్వం మేమంతా కూడా గిరిజనులమే... బాషలేదని పక్కన పెట్టద్దు బాంచన్... దుర్భర జీవితాలను అనుభవిస్తున్న మా బతుకులకు ధైర్యమిచ్చి ఎస్టీ జాబితాలో చేర్చి... కాసింత జీవ గంజి పోయండని వాల్మీకి బోయ కుటుంబాలు బుధవారం రామగుండం వచ్చిన ఎస్టీ కమిషన్ ‘చల్లప్ప కమిటీ’ ముందు ఆవేదన వ్యక్తం చేసారు. తహశీల్దార్ కార్యాలయంలో సుమారు 2గంటల పాటు వాల్మీకి బోయ, కైతి లంబాడి కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై అభిప్రాయ సేకరణ కొనసాగింది. ఎస్టీ కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఎస్. చల్లప్ప, సభ్యులు ఐపి ఎస్ అధికారి కె. జగన్నాథ రావు, డాక్టర్ హెచ్‌కె నాగుల సమక్షంలో జరిగిన అభిప్రాయ సేకరణలో రామగుండం, గోదావరిఖని, మంథని, పెద్దపల్లి ప్రాంతాలకు చెందిన వందలాదిమంది వాల్మీకి బోయ, కైతి లంబాడి కులస్థులు హాజరై తమ గోడును, బతుకు చిత్రాలను ఎస్టీ కమిషన్ ముందు మొరపెట్టుకున్నారు. 1960కి పూర్వం మేమంతా ఎస్టీల్లోనే కొనసాగామని ఆ తర్వాత కాలంలో ఆ జాబితా నుండి తొలగించి బిసి ఎలో చేర్చారని, సామాజికంగా ఎంతో వెనకబడి ఉన్న తమ కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని, సమాజంలో చిన్నచూపుగా బ్రతుకుతున్న మా జాతి కుటుంబాలను కాపాడాలని ఆ సంఘం ప్రతినిధి, కార్పోరేటర్ బొంతల రాజేష్ ఎస్టీ కమిషన్‌ను ఈ సందర్భంగా వేడుకున్నాడు. మరో ప్రతినిధి కెంగర్ల మల్లయ్య, అడ్డాల రామస్వాములు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న మా జాతి అంతరించిపోకుండా కాపాడాలని ఎస్టీలలో చేర్చి మమ్మల్ని బ్రతికించాలని కమిషన్ ముందు సుదీర్ఘంగా వివరించారు. అదే విధంగా మంథని డివిజన్‌లోని ముత్తారం మండలం ఓడెడుకు చెందిన మహిళలు చెంచు ప్రమిళ, సరోజ కమిషన్ ముందు మాట్లాడుతూ అడవినే నమ్ముకొని బ్రతికామని మాకు ఏ కుల వృత్తి లేదు సారు అంటూ చేతులు జోడించి వేడుకున్నారు. అనేక గ్రామాల్లో ఇప్పటికి మా జాతీ వారిని మంత్రగాళ్లు అనే నెపంతో బాధలు పెట్టిన సంఘటనలు ఉన్నాయని, కూలిపైనే ఆధారపడుతున్న మా కుటుంబాల్లో ప్రభుత్వమే ‘దీపం’ వెలిగించాలని, ఎస్టీలో చేరిస్తే కనీసం మా పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేసే వీలైనా కల్పించండి బాంచన్ అంటూ రోదిస్తూ మొరపెట్టుకున్నారు. అనంతరం గిరిజన సంఘాలతో సమావేశమైన ఎస్టీ కమిషన్ చల్లప్ప కమిటీ ముందు లంబాడి హక్కుల పోరాట సమితి ప్రతినిధులు లౌడియ సురేష్ నాయక్, సారయ్య నాయక్‌లు మాట్లాడుతూ మా జాతిలోని కుటుంబాలకే ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలు దరిచేరక అభివృద్దికి దూరంగా ఉన్నామని, ఇప్పుడు కొత్తగా వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలనడం సరైంది కాదని వ్యతిరేకించారు. తిండికి లేక మా కుటుంబాల్లో అనేక మంది ఆడపిల్లలను అమ్ముకుంటున్న దైన్య స్థితిలో మేము జీవిస్తున్నామని, మాకే రిజర్వేషన్ సరిపోక తల్లడిల్లుతుంటే మరికొంత మందిని మాలో చేరుస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని కమిటీ ముందు వాపోయారు. ఈ సమావేశంలో రామగుండం తహశీల్దార్ శ్రీనివాస రావు, వాల్మీకి బోయ పోరాట సమితి రాష్ట్ర నాయకులు లక్ష్మీ నారాయణ, జిల్లా అధ్యక్షుడు గూడూర్ల మహేందర్, నాయకులు బలంతుల రవి, కార్పోరేటర్ బొంతల రాజేష్, కెంగర్ల మల్లయ్యలతో పాటు వందలాది మంది వాల్మీకి బోయ కుటుంబాలు పాల్గొన్నాయి.

వేగం కంటే ప్రాణం ముఖ్యం..!
* ప్రమాదాలపై చైతన్యం కలిగించాలి
* జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 20: వేగం కంటే ప్రాణం ముఖ్యమని, ప్రయాణాల్లో ఇది అందరు గుర్తుంచుకోవాల్సిన విషయమని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. 27వ జాతీయ రహదారి భద్రత వారోత్సవ వేడుకలను బుధవారం స్థానిక కృషి భవన్‌లో కలెక్టర్ ప్రారంభించి ప్రసంగించారు. ఏ విధంగా వాహనాలు నడుపాలి, ఏ విధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలనే విషయంలో అందరిలో చైతన్యం కలుగాలని అన్నారు. ప్రయాణాలలో హెల్మెట్, సీట్‌బెల్ట్‌ల వాడకంలో పోలీస్, రవాణాశాఖ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని, దీనిపై ప్రజల్లో అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. వీటి ఖచ్చిత అమలు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణాలు చేయరాదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు లేక ఆటోలు, జీబులు తదితర వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని తెలిపారు. వ్యాధుల బారిన, ప్రకృతి వైపరీత్యాల మూలంగా సంభవించే మరణాలకంటే రహదారి ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల వల్ల అంగవైకల్యం కలిగితే ఆ కుటుంబం బాధ వర్ణనాతీతమని చెప్పారు. ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలని అన్నారు. రహదారి భద్రతకు ప్రమాద సూచికలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలకు, ఇతరత్రా వాటికి ఎంతో ఖర్చుపెడుతున్నామని, రహదారి భద్రతకు కొంత ఖర్చు మాత్రమే పెడుతున్నట్లు, ఈ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రహదారి భద్రతపై రూపొందించిన ఆడియో, వీడియో సిడిలను, వాల్‌స్టిక్కర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. రహదారి భద్రతపై గ్రామ గ్రామాన తిరుగుతూ చిత్ర ప్రదర్శనలు, ప్రచారంతో ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని సైతం కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు రహదారి భద్రతపై రూపొందించిన లఘు చిత్రాలను తిలకించి, ట్రాఫిక్ నిబంధనలపై, రహదారి ప్రయాణాలపై అవగాహన, చైతన్యం పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్, రవాణాశాఖ డిప్యూటి కమీషనర్ వినోద్ కుమార్, ఆర్‌టిఎ మెంబర్ పెద్ది రమేష్, తెలంగాణ ఎంవిఐల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ట్రస్మా కార్యదర్శి శేఖర్ రావు, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సత్యనారాయణ, ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఐసోటీం ప్రతినిధి ఘన్‌శ్యాం ఓజా తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో విజయం మాదే..
* మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు

పెద్దపల్లి, జనవరి 20: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వంద సీట్లు కాంగ్రెస్‌పార్టీ విజయం సాదిస్తుందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు దీమవ్యక్తం చేశారు. బుధవారం పెద్దపల్లి పట్టణంలోని మేయిన్‌రోడ్డులో బట్టల దుకాణాన్ని నగర పంచాయతి చైర్మన్ ఎల్ రాజయ్యతో కలిసి ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టి ఆర్ ఎస్ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే రూ.450కోట్లు ప్రచారాల కోసం ఖర్చుపెట్టిందని వాటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌పార్టీ చేసిన అబివృద్ది పథకాలన్ని తామే చేసామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వర్షాభావ దృష్య కరువు నివారణ చర్యలను చేపట్టడంలో టి ఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిదన్నారు. ఈసమావేశంలో వేముల రాంమూర్తి, సత్యనారాయణరెడ్డి, చేతి ధర్మయ్య, డా.టి వేంకటేశ్వర్‌రావు, భూషనవేని సురేష్‌గౌడ్,బయ్యపు మనోహర్‌రెడ్డి, మంథని నర్సింగ్, మేబిన్, రఫిక్ తదితరులు పాల్గోన్నారు.

వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో
రాష్టస్థ్రాయికి ఎంపికైన మురహరి
సుల్తానాబాద్, జనవరి 20: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బిపిసి ప్రథమ సంవత్సర విద్యార్థి గుండేటి మురహరి వెయిట్ లిఫ్టింగ్‌లో రాష్టస్థ్రాయికి ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ కల్పన బుధవారం తెలిపారు. జిల్లా స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో విజయం సాధించి ఈనెల 22న సికిందరాబాద్‌లో జరుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మురహరి ఎంపిక పట్ల ప్రిన్సిపాల్ కల్పన, లెక్చరర్లు అభినందించారు.
గుండెపోటుతో కౌలు రైతు మృతి
కోనరావుపేట, జనవరి 20: మండలంలోని మామిడిపల్లికి చెందిన గెంటె శ్రీనివాస్ (40) అనే కౌలు రైతు బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ తనకున్న ఎకరం భూమితో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకుని పంట వేయగా దిగుబడి రాక అప్పుల పాలయ్యాడు. అంతే కాకుండా ఉపాధి కోసం కొడుకు వేణును అప్పులు చేసి బయటకు పంపగా అక్కడ పని దొరకలేదు. పంటల కోసం చేసిన అప్పులతో పాటు కొడుకు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై గుండెపోటుతో మృతి చెందినట్లు భార్య లక్ష్మి తెలిపింది. కాగా తమ ముగ్గురు సోదరులు మానసిక వికలాంగులు కావడంతో వారి పోషణ భారమైనట్లు విలపించింది. సుమారు 3 లక్షల మేరకు అప్పులు ఉన్నట్లు బంధువులు తెలిపారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ విజయ లక్ష్మారెడ్డి, ఎంపిటిసి లక్ష్మి కోరారు.
తుల ఉమకు సమ్మక్క-సారలమ్మ పురస్కారం
కరీంనగర్ టౌన్, జనవరి 20: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సమ్మక్క-సారలమ్మ పురస్కారం అందుకున్నారు. ఎంపి కవిత చేతుల మీదుగా ఉమ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.వి రమణచారి, జిల్లాలోని పలువురు జడ్పీటిసిలు, ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నాయకులు, టిఆర్‌ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు ‘ఉద్యోగ మేళా’
* 27 నుండి ఫిబ్రవరి-1 వరకు నిర్వహణ
* సింగరేణి సిఎండి శ్రీధర్
సెంటినరికాలనీ, జనవరి 20: సామాజిక బాధ్యత నిర్వహణలో భాగంగా సింగరేణి సంస్థ మరో సమాజహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 27 నుండి ఫిబ్రవరి 1 వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ‘సింగరేణి ఆణిముత్యాలు- ఉద్యోగ మేళా’ నిర్వహించడానికై సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు ఎన్.శ్రీధర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ రకాల ఉపాధి,ద్యోగ అవకాశాలపై 2015 జూలై నెలలో ‘సింగరేణి ఆణిముత్యాలు’ పేరుతో కంపెనీ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిచండం జరిగిన విషయం విధితమే. ఈ కార్యక్రమంలో దాదాపు 22,000 మంది నిరుద్యోగ యువత పాల్గోన్నారు. నిరుద్యోగ యువత అభ్యర్థన మేరకు ‘సింగరేణి ఆణిముత్యాలు-ఉద్యోగ మేళా’ నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగ మేళాలో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో గల వివిధ సంస్థలు, కంపెనీల వారు తమ వద్ద గల ఉద్యోగవకాశాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు అవసరాన్ని బట్టి ఉచిత నైపుణ్య శిక్షణను ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గోంటాయి. ఎంపికైన తర్వాత వారివారి అర్హతల మేరకు ఉద్యోగాల నిమిత్తం బయటి ప్రదేశాలకు వెళ్లవలసి ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి జీతభత్యాలు ఉంటాయి. ఏరియాల వారిగా జాబ్ మేళా నిర్వహించే షెడ్యూల్ ఇలా ఉన్నాయి. జనవరి 27, 28వ తేదీలలో శ్రీరాంపూర్, రామగుండం-3, కొత్తగూడెం, భూపాలపల్లి ఏరియాల్లో, జనవరి 29, 30 తేదీల్లో మందమర్రి, రామగుండం-2, ఎల్లెందు ఏరియాల్లో,జనవరి-31, ఫిబ్రవరి-01 వ తేదీలలో బెల్లంపల్లి, రామగుండం-1, మణుగూర్ ఏరియాల్లో నిర్వహిస్తారు. నిరుద్యోగ యువత ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని సిఎండి నడిమెట్ల శ్రీధర్ కోరారు.

విషజ్వరంతో యువకుడి మృతి
కోనరావుపేట, జనవరి 20: మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన పిల్లి నాగరాజు(30) విష జ్వరంతో బుధవారం మృతి చెందాడు. కొన్ని రోజులుగా జ్వరం రావడంతో స్థానిక ప్రైవేట్ వైద్యుల చేత చికిత్స పొందుతూ వ్యాధి తీవ్రం కావడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తెల్ల రక్త కణాలు భారీగా తగ్గడంతో డాక్టర్లు చికిత్స చేస్తుండగానే మృతి చెందినట్లు బందువులు తెలిపారు. మృతుడు నాబార్డ్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. భార్య పవిత్ర, తల్లిదండ్రులు లింబాద్రి, దేవయ్యలు ఉన్నారు. గ్రామాల్లో అందరికి సుపరిచితంగా మెదలడంతో నాగరాజు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
రామగుండం, జనవరి 20: కాజీపేట్-బల్లార్ష జంక్షన్ల మధ్య పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైల్లు గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. న్యూ ఢిల్లీ నుండి విజయవాడ, సికింద్రాబాద్, మద్రాస్ వైపు వెళ్లే రైల్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. 12626 కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు 3.30 గంటలు, 12521 రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదే విధంగా 16318 హిమాసాగర్ ఎక్స్‌ప్రెస్ గంటన్నర, 17012 ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్ గంట, పుష్పుల్ ప్యాసింజర్ రైలు గంట, సింగరేణి ప్యాసింజర్ రైలు రెండున్నర గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో బుధవారం రోజున రామగుండం నుండి వివిధ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరైన సమయానికే రైళ్ల రాకపోకలు ఉంటాయని రైల్వే స్టేషన్ చేరుకున్న ప్రయాణికులకు పలు ఎక్స్‌ప్రెస్ రైల్లు గంటల పాటు ఆలస్యంగా నడుస్తుండడంతో రైల్వే స్టేషన్‌లో పిల్లా పాపలతో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాగే దీనికి తోడు రామగుండం రైల్వే స్టేషన్‌లో లూప్‌లైన్ ట్రాక్‌లైన్ మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపద్యంలో 1వ నంబర్ ప్లాట్‌ఫారంపై రావాల్సిన పలు రైళ్లను 2, 3వ నంబర్ ప్లాట్‌ఫాం పైకి మార్చి నడుపుతుండడంతో ఈ మూడు ప్లాట్‌ఫాంల నుండి వెళ్లాల్సిన రైలు ప్రయాణికులంతా ఒకే ప్లాట్‌ఫాంపై ఉండడంతో ఆ ప్లాట్‌ఫాంలు వందలాది మందితో కిక్కిరిసిపోయింది.

ఆక్రమణలకు గురికాకుండా చర్యలు
కరీంనగర్ టౌన్, జనవరి 20: దేవాలయ భూములను ఎవరు ఆక్రమించుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ కరీంనగర్ తహశీల్దార్‌ను ఆదేశించారు. బుధవారం కరీంనగర్ మండలం నగునూరులో నిర్మాణంలో ఉన్న త్రికుట దేవాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణ పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పాత త్రికుట ఆలయాన్ని తొలగించిన స్థానంలో గల దాదాపు నాలుగు ఎకరాల దేవాలయ స్థలం ఆక్రమణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పాత దేవాలయ స్థలాన్ని సందర్శించి ఆక్రమణలకు గురైన భూమిని కలెక్టర్ పరిశీలించారు. దేవాలయ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటే సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని గ్రామ రెవెన్యూ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రికార్డులను పరిశీలించి దేవాలయ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఫిన్సింగ్ ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు ఏర్పాటు చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. కలెక్టర్ ముందుగా కొత్తపల్లిలోని శివాలయంను సందర్శించి పరిశీలించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ జయచందర్ రెడ్డి, శృతి ఫౌండేషన్, నారాయణ రావు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నిష్పక్షపాతంగా అధ్యయనం
వాల్మీకి బోయ స్థితిగతులపై క్షేత్రస్థాయి పరిశీలన * ఎస్టీ కమిషన్ చైర్మన్ చెల్లప్ప

రామగుండం, జనవరి 20: వాల్మీకి బోయ కులస్థుల జీవన స్థితి గతులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపేందుకు నిష్పక్షపాతంగా రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎస్. చెల్లప్ప తెలిపారు. బుధవారం ఎస్టీ కమిషన్ బృందం రామగుండంలో పర్యటించింది. ఈసందర్భంగా చెల్లప్ప మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం జరిగే అధ్యయనం కాదని, రిజర్వేషన్ల ప్రక్రియ అంతా ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. కేవలం వాల్మీకి బోయ, కైతి లంబాడి కుటుంబాల జీవణ స్థితిగతులను సంపూర్ణంగా తెలుసుకునేందుకే ఇప్పటివరకు తెలంగాణలోని 7జిల్లాల్లో పర్యటించి అభిప్రాయ సేకరణను చేపట్టినట్లు తెలిపారు. అభిప్రాయ సేకరణ సందర్భంగా వాల్మీకి బోయల స్థితిగతులు, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారన్న విషయాలను కూడా పరిశీలన చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న వాల్మీకి బోయ కుటుంబాలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై కొనసాగుతున్న అభిప్రాయ సేకరణపై స్పష్టత లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. సిఎం కెసిఆర్‌ను పైనా కొంత మంది తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని ఇది సరికాదన్నారు. తమ కమిటీ పర్యవేక్షణలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని, ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాల్మీకి బోయలను ఎస్టీలలో చేర్చొద్దంటున్న వారు ఎందుకో స్పష్టంగా చెప్పాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే నిష్పక్షపాతంగా ప్రభుత్వానికి అభిప్రాయ సేకరణ నివేదికను అందజేస్తామని చైర్మన్ చెల్లప్ప వివరించారు.