కరీంనగర్

హరితహారంలో ప్రతి శాఖకు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 29: హరితహారం రెండవ విడత కార్యక్రమంలో ప్రతీ శాఖకు లక్ష్యం నిర్ణయిస్తామని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో హరితహారం కార్యక్రమంపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ, పశుసంవర్థక శాఖల ఆధీనంలో ఉన్న భూమిలో హరితహారంలో మొక్కలు నాటాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను సమన్వయపర్చి ఆవరణల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారికి సూచించారు. మొదటి విడత కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా లక్ష్యాలను సాధించలేకపోయామని చెప్పారు. మొదటి విడతలో నాటిన మొక్కలలో బ్రతికిన మొక్కల వివరాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. 2016-17 సంవత్సరంలో నాలుగు కోట్ల మొక్కలు నాటుటకు లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామపంచాయతీ 40 వేల మొక్కలకు తక్కువ కాకుండా కార్యాచరణ ఉండాలని సూచించారు. గ్రామ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అప్‌లోడ్ చేయాలని, ఖాళీ స్థలాలు, నర్సరీలు, ప్లాంటేషన్ డైరెక్టరీని రూపొందించి సమర్పించాలని తెలిపారు. మిషన్ కాకతీయ కింద చెరువు గట్లపై ఈత, తాటి చెట్ల పెంపకానికి కావాల్సిన మొక్కల వివరాలు సమర్పించాలని అన్నారు. ఏ ఏ రకాల మొక్కలు ఎంత మేరకు అవసరమో నిర్ధారించి వాటి పెంపకానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. మండలంలో కావాల్సిన మొక్కల పెంపకం కోసం ఆ మండలంలోనే నర్సరీలు ఏర్పాటు చేయాలని, ఒక మండలం నుండి మరొక మండలానికి మొక్కల రవాణాకు అవసరం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని, జిల్లాను అగ్రస్థానంలో నిలుపాలని, దీనికి అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అదనపు జెసి నాగేంద్ర, డ్వామా పిడి గణేష్, జడ్పీ సిఇఓ సూరజ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గ్రామ రక్షక దళాల్లో
ప్రజలు భాగస్వాములు కావాలి
* ఎస్పీ జోయల్ డేవిస్
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 29: గ్రామ రక్షక దళాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ కోరారు. దోపిడి, దొంగతనాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములను చేస్తూ జిల్లా వ్యాప్తంగా గ్రామ రక్షక దళాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో జిల్లా నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గ్రామ రక్షక దళాలపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రజా, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అనాధ, బాలకార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా నియంత్రణ కోసం ఆపరేషన్ స్మైల్ కొనసాగించడం జరుగుతోందని తెలిపారు. మద్యం, మత్తు పానియాలు సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి వాహనదారుడు ప్రాణాల రక్షణ కోసం హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ సుబ్బారాయుడు, గోదావరిఖని ఎఎస్పీ విష్ణు వారియర్, ట్రైనీ ఐపిఎస్ అధికారిణి సింధూశర్మ, డిఎస్పీలు మల్లారెడ్డి, రవీందర్‌రెడ్డిలతోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

విధులు బహిష్కరించిన న్యాయవాదులు
* సిఐ, ఎస్‌ఐల సస్పెన్షన్‌కు డిమాండ్
* నేడు జిల్లా వ్యాప్తంగా బార్ అసోసియేషన్‌ల సమావేశం
లీగల్ (కరీంనగర్), జనవరి 29: కోరుట్లకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాదులు దామోదర్‌రావు, యాదగిరిలను కోరుట్ల పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆద్వర్యంలోఅత్యవసర సమావేశం ఏర్పాటుచేసి కోర్టు విధులను బహిష్కరిస్తూ కోర్టు కాంప్లెక్స్ ఎదుట నిరసన నినాదాలు చేశారు. న్యాయవాదులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి భేషరతుగా సిఐ, ఎస్‌ఐ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపట్ల కరీంనగర్ బార్ అసోసియేషన్‌తో పాటు జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, హుజురాబాద్, గోదావరిఖని, హుస్నాబాద్ బార్ అసోసియేషన్‌ల కార్యవర్గ సభ్యులతో శనివారం కరీంనగర్ బార్ అసోసియేషన్ హాల్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి బి.రఘునందన్‌రావులు తెలిపారు. కార్యక్రమంలోన్యాయవాదులు పెంచాల ప్రభాకర్‌రావు, ఎస్.వి.రాంచందర్‌రావుతో పాటు ఐలా అధ్యక్షుడు కట్టెకొల లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి రమేష్‌లు పాల్గొన్నారు.

ఉన్నత విద్య ప్రక్షాళనకు చర్యలు

* వచ్చే విద్యా సంవత్సరం సిబిసిఇ పద్ధతికి సిఎం శ్రీకారం
* రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి

జగిత్యాల, జనవరి 29: ఉన్నత విద్య ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు గైకోనుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి. పాపిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్‌ఎస్‌వి డిగ్రీ కళాశాల 10వారికోత్సవం జగిత్యాల మినీ స్టేడియంలో జరిగింది. ఈసమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సిబిసిఇ పద్ధతి ద్వారా రానున్న విద్యా సంవత్సరం నుండి సెమిస్టార్ విధానాన్ని అమలు పర్చేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టేందుకు పట్టుదలతోఉన్నారని, తెలంగాణ ప్రాంత విద్యార్థులకు విలువైన విద్య అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులకు మంచిపేరు తీసుకురావడంతో పాటు అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని, విద్యార్థులు చెడుమార్గం వైపు వెళ్లకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. సమాజంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడంలో ఆచార్యుల పాత్ర ప్రధానమైందని, క్రమశిక్షణ తో విద్య అభ్యసించినప్పుడే దేశం గర్వపడేలా ఉన్నత స్థితికి చేరుకోగలరన్న విషయాన్ని ప్రతీ విద్యార్థి ఆకళింపు చేసుకోవాలని సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ మంచి పేరు తీసుకువస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించి విద్యతో పాటు సాంస్కృతి, క్రీడలు తదితర అంశాల్లో తర్ఫీద్ ఇస్తాయని వెల్లడించారు. విద్యార్థుల ప్రదర్శంచిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాడెంట్ నవీన్‌రెడ్డి, పట్టణ ప్రముఖులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులున్నారు.

-ళనఆ
అటెన్షన్ టు థి ఇన్‌చార్జి /మఫిసిల్ డెస్క్

ఇటుక బట్టీ కార్మికులకు ఊరట
* కనీస వేతనాలివ్వాల్సిందే
* యజమానులకు కార్మిక శాఖ నోటీసులు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 29: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై జిల్లా కార్మిక శాఖ దృష్టి సారించింది. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాల్సిందేనంటూ ఇటుక బట్టీల యజమానులకు కార్మికశాఖ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 125 మంది ఇటుక బట్టీల యజమానులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఈ నెల 25న జారీ చేసిన మద్యంతర ఉత్తర్వుల ప్రకారం ఇటుక బట్టీల యజమానులు కార్మికులకు అన్ని వసతులు కల్పించాలని, కార్మికులకు బ్యాంక్ ఖాతాలను తెరిచి నేరుగా వారి ఖాతాలోనే వేతనాలను జమచేయాలని కార్మిక శాఖ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చట్టప్రకారం ఇటుక బట్టీల యజమానులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందని నోటీసులో తెలిపారు. గత నెల రోజులుగా ఇటుక బట్టీ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై పలు సంఘాలు వినతిపత్రాలు అందించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో జిల్లా కార్మికశాఖ స్పందించి ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో ఇటుక బట్టీ కార్మికులకు కొంత ఊరట కలిగినట్లయింది.
ప్రతి విద్యార్థీ కనీస మార్కులు
సాధించే విధంగా తీర్చిదిద్దండి
* డిఇఓ శ్రీనివాస చారి
రామడుగు, జనవరి 29: విద్యార్థులను మన పిల్లలుగా భావించి ఆప్యాయంగా పలకరించి పాఠాలు బోధించి ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస చారి ఉద్బోధించారు. కనీసం రాయడం, చదవడం, గణిత శాస్త్ర ప్రావీణ్యంపై ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు గురువారం మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణలో అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఇఓ మాట్లాడుతూ పిల్లలను భయపెట్టి కాకుండా ప్రేమతో ప్రతి సబ్జెక్టుపై అవగాహన కల్పిస్తే వారు మనకు దగ్గరవుతారన్నారు. ఏడు సంవత్సరాలు మన వద్ద చదువుకోసం వచ్చిన విద్యార్థిని ఎందుకు పనికిరానివారిని కాకుండా ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థి ప్రతి సబ్జెక్టులో కనీస మార్కులు సాధించే విధంగా తయారు చేయాలన్నారు. ఫిబ్రవరి 1 నుండి జూలై 31 వరకు విద్యార్థుల ప్రగతిని పెంచాలని, ఆగస్టు 1న ఆయా పాఠశాలలో సమావేశం నిర్వహించి ఆ గ్రామ ప్రజాప్రతినిధులను ఆహ్వానించి సాధించిన ప్రగతి గూర్చి గర్వంగా చెప్పుకోవాలన్నారు. మునుపటిలాగా కాకుండా మార్చి 21 నుండి విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందనే విషయం ఉపాధ్యాయులు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వేణుకుమార్, స్థానిక ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి పాల్గొనగా ఉపాధ్యాయుడు సదయ్య ఆలపించిన పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి.
అమ్మా, నాన్నా నన్ను క్షమించండి..!
* సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు
శంకరపట్నం, జనవరి 29: అమ్మా, నాన్నా నన్ను క్షమించాలని, నాకు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డానని బతకాలంటే చదువు, డబ్బు అన్నీ ఉండాలని, తన వద్ద ఏదీ లేకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డానని మండలంలోని మొలంగూరు గ్రామానికి చెందిన కొత్తకొండ అనీల్ (24) శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనీల్ కరీంనగర్‌లో వాచ్ కం సెల్ రిపేరు చేస్తూ ఉండేవాడని, గురువారం తన స్వగ్రామమైన మొలంగూరుకు వచ్చి ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందినట్లు వారు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

పటిష్టంగా సంక్షేమ చట్టాలు అమలు

కలెక్టర్ నీతూప్రసాద్
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 29: ప్రభుత్వం దళిత, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం రూపొందించిన చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అమలుపై జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 30న జరిగే సివిల్ రైట్స్ డే రోజున సంబంధిత గ్రామానికి విచారణకు ఎంపిడిఓలు, తహాశీల్దార్లు, ఎస్‌ఐలు ఖచ్చితంగా హాజరు కావాలని సూచించారు. దళిత, గిరిజనులకు సంబంధించిన భూ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దళితులకు గతంలో ఇచ్చిన భూములను ఉపాది హామీ, ఇతర పథకాల ద్వారా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కమిటీ సభ్యులు అడిగిన అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ జిల్లాలో 158 దళిత, గిరిజన అట్రాసిటి కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులోని 30కేసుల్లో హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. మిగితా కేసులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని అన్నారు. దళిత, గిరిజన కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు, పోలీసు అధికారుల జాప్యంతో నిందితులు లబ్దిపొందే అవకాశం లేకుండా, అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక్, గోదావరిఖని ఎఎస్పీ విష్ణు వారియర్, అదనపు జెసి నాగేంద్ర, డిఆర్వో వీరబ్రహ్మయ్య, జడ్పీ సిఇఓ సూరజ్‌కుమార్, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, మంథని ఆర్డీఓలు చంద్రశేఖర్, భిక్షానాయక్, నారాయణరెడ్డి, శ్రీనివాస్, పలువురు డిఎస్పీలు, కమిటీ సభ్యులు చంద్రయ్య, శంకర్, విజయ్‌కుమార్, దుర్గాప్రసాద్, సమ్మయ్య, శంకర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గడియారాల
కొనుగోలులో
సింగరేణి అధికారుల గోల్‌మాల్
* 6న జిఎం కార్యాలయాల ముందు ధర్నాలు * ఎఐటియుసి నేత గట్టయ్య

గోదావరిఖని, జనవరి 29: సింగరేణి ఉద్యోగులకు ఇటీవల బహుమతిగా అందజేసిన గడియారాల కొనుగోలులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని దీనిపై విచారణ జరిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అధ్యక్షులు వై. గట్టయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తులు అదికంగా సాధించిన సందర్భంగా సింగరేణి సంస్థ పరిదిలోని 59వేల మంది ఉద్యోగులకు గోడ గడియారాలను బహుమతిగా అందజేశారని అన్నారు. గోడ గడియారాల కొనుగోలులో అధికారులు టెండర్లు ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అధిక రేట్లకు కొనుగోలు చేసి కమీషన్లు పొంది అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఒక్కో గోడ గడియారం 60రూపాయల నుండి 150వరకు విలువ కలిగి ఉండే వాటికి 260రూపాయల చొప్పున కొనుగోలు చేసి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. దీనిపై సింగరేణి సి అండ్ ఎండి విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పలు బొగ్గుగనుల్లో పనిచేస్తున్న మైనింగ్ స్ట్ఫా, ఆపరేటర్లు, ఓవర్‌మెన్‌లతో పాటు వివిధ కేటగిరీలకు చెందిన కార్మికులు అనారోగ్యాలతో ఉన్నవారికి సర్ఫేస్ డ్యూటి కల్పించాలని అన్నారు. వీటితో పాటు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న డిమాండ్ల పరిష్కారంకోసం ఫిబ్రవరి 6న సింగరేణి పరిదిలోని అన్ని జియం కార్యాలయాల ముందు ఎ ఐటియుసి ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చామని అన్నారు. కార్మికులు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదే విధంగా వీటితో పాటు కోల్ ఇండియా పరిదిలోని బొగ్గుగని కార్మికుల డిమాండ్ల పరిష్కారంకోసం 5జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ల వినతిపత్రాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. మార్చి 7నుండి 10వరకు వర్క్ టూ రూల్, మార్చి 29న కోల్ ఇండియా పరిదిలోని బొగ్గుగని కార్మికులు టోకెన్ సమ్మెలో పాల్గొనాలని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఎల్లయ్య, రఘు, రామస్వామి, మల్లేష్, జక్కుల శ్రీనివాస్, తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులున్నారు.