కరీంనగర్

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 13: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఉంటుందని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక రెవెన్యూ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పిల్లలచే అక్షరాభ్యాసం చేయించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో గతంలో కంటే ఈ విద్యాసంవత్సరం పది శాతం ఎక్కువ ప్రవేశాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉంటారని, మంచి ప్రణాళికతో విద్యా బోధన ఉంటుందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా వసతులు ఉంటాయని పేర్కొన్నారు. దశలవారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమంలో బోధన ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై దృష్టి పెట్టి పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తుందన్నారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 31 మంది విద్యార్థులు 10జిపిఎ సాధించారని, మంచి ఫలితాలు వచ్చాయని, పిల్లలను పంపితే నాణ్యతతో కూడిన విద్య అందిస్తామన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్లు, వౌలిక సదుపాయాల కల్పనకు క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ నుండి రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంఖ్యతో పాఠశాలలు మూతపడే ప్రమాదం గమనించి ఉపాధ్యాయులు దృఢ సంకల్పంతో పాఠశాలల బాగుకు ప్రతినబూని తదనుగుణంగా కృషి చేస్తే ఫలితాలు ఉజ్వలంగా ఉంటాయని కలెక్టర్ అన్నారు. మేయర్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ నగరంలో 32 ప్రభుత్వ పాఠశాలలకు గాను రెండు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టారని, మిగతా పాఠశాలల్లో కూడా ఆంగ్ల బోధన ప్రవేశపెడితే తల్లిదండ్రుల్లో ఉత్సాహం పెరుగుతుందని అన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ మొదలు ఎందరో శాస్తవ్రేత్తలు, మేధావులు ప్రభుత్వ బడుల్లోనే చదివారని, ఇప్పుడు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కెజి టు పిజి ఉచిత విద్యతో పాటు సన్న బియ్యం, వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో ఉచిత నల్లా కనెక్షన్‌తో తాగునీరు అందిస్తామని రవీందర్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా పదవ తరగతిలో 10జిపిఎ సాధించిన విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు వీల్ చైర్‌లు, వినికిడి పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఇవో శ్రీనివాసాచారి, కేంద్ర పరిశీలకులు పద్మావతి, ఐసిడిఎస్ పిడి రాధమ్మ, బిసి సంక్షేమం డిడి మంజుల, వికలాంగుల సంక్షేమ ఎడి నళిని, కార్మిక సహాయ కమిషనర్ నీలిమ, మత పెద్దలు శేషువేణుగోపాల శర్మ, ముఫ్తి మహ్మద్ ముస్తాక్ అహ్మద్, ఫాస్టర్ అబ్రహం, సర్దార్ దళిత్ సింగ్, ఆర్‌విఎం సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.