కరీంనగర్

ప్రభుత్వాసుపత్రుల్లో ఉత్తమ వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 10: ప్రభుత్వాసుపత్రులలో పేద ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఏర్పాటు చేసిన అసంక్రమిత వ్యాధుల చికిత్స విభాగాన్ని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మంత్రులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, షుగర్ వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, క్యాన్సర్ తదితర అసంక్రిమిత వ్యాధుల భారిన పడిన ప్రజలకు ఈ విభాగం ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. అసంక్రమిత వ్యాధుల చికిత్స విభాగంపై ప్రజలు అవగాహన పెంచుకొని ప్రభుత్వాసుపత్రిలో ఉచిత ఉత్తమ వైద్య సేవలు వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని అన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఇప్పటికే ఐసియు యూనిట్‌ను ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 969 మంది రోగులకు ఐసియులో చికిత్సలు అందించినట్లు వివరించారు. గతంలో పేదలు ప్రైవేటు ఆసుపత్రులు, హైదరాబాద్‌కు అత్యవసర వైద్యానికి వెళ్లేవారని, ప్రస్తుతం పేద రోగులకు ప్రభుత్వాసుపత్రిలో ఐసియు యూనిట్‌ను అందుబాటులో ఉంచామని, పేద ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై నాలుగైదుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అన్ని వౌలిక వసతులతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో గల 30 పడకల ఆసుపత్రులను వంద పడకలుగా అప్‌గ్రేడ్ చేశామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో అవసరమైన సిబ్బందిని, డాక్టర్లను నియమించామని తెలిపారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో ఐసియు యూనిట్‌లో పేద రోగులు బయటకు వెళ్లకుండా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో నాలుగు కోట్ల మొక్కలు నాటి హరితహారంలో కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో నంబర్‌వన్‌గా నిలుపుతామని అన్నారు. జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని తెలిపారు. ప్రతీ రోజు 40 నుంచి 50 లక్షల మొక్కలు నాటుతున్నారని, పక్షం రోజుల్లో నాలుగు కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నీతూ ప్రసాద్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేశం, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుహాసిని, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ అశోక్ కుమార్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.