ఉత్తర తెలంగాణ

జాతర (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ కోడికూతతో మేల్కొనే ఆ గ్రామప్రజలు ఆ రోజు అంతకంటే ముందుగానే లేచారు. కారణం-ఆ రోజు వాళ్ల ఊర్లో ‘జాతర’. చుట్టుపక్కన ఉన్న గ్రామ ప్రజలంతా వస్తారు. వస్తారేంటి? వచ్చేశారు కూడా! పొద్దున తొమ్మిది గంటలకల్లా రాములవారి రథాన్ని ఊరంతా తిప్పుతారు. ఆ సమయంలో ఎవరి గుమ్మాలముందు వాళ్లు హారతి పళ్లెం పట్టుకొని దేవుడి రథం కోసం ఎదురు చూస్తుంటారు. కొబ్బరికాయలు కొట్టేవాళ్లు రథాన్ని లాగేవాళ్లు రథం కిందినుండి దూరేవాళ్లు ఇలా..ఎవరి భక్తిని వారు నిరూపించుకుంటారు. ఈ కార్యక్రమం పండెండు గంటలవరకు సాగుతుంది. అందరిలాగే పొద్దునే్న లేచి గబగబా వాకిలి ఊడ్చి, కల్లాపి చల్లి ముగ్గుపెట్టింది శాంతమ్మ. పొయ్యి అంటించి నీళ్లకొప్పెర ఎక్కించి ‘ఇగో-నినే్న.. ఇయ్యాల్ల జాత్రకు రమ్మని కొడుకుల్ని కోడండ్లని పిలిస్తివి. మనుమలు, మనుమరాండ్లు వచ్చేటాల్లకు గిట్లనే ఉంటవా ఏంది. జల్ది తానం చేసి పట్ట్ధుతి కట్టుకోరాదూ! అన్నది శాంతమ్మ భర్తను తట్టి లేపుతూ!!
గట్లనే అంటూ లేచి కూర్చున్నాడు మల్లయ్య. పాలసర్వ తెచ్చి భర్త చేతికిస్తూ ‘సరేగాని - జల్ది పాలు తీసుకరా! ‘గడ్డపెరుగేదే నాయినమ్మా’ అంటాడు నీ పెద్దమనుమడు. ఇగో పోయినేడు లెక్క పీసినాసితనం జేయకు - పొల్లగాండ్లు ఏదడిగితే అది గొనియ్యి - యాడాదికొక్కదినం ‘అన్నది శాంతమ్మ’. ఏ..గాల్లడిగినయన్ని నేనేడకొంటగని - తలా వందరూపాయలిస్తు - వాళ్లేమన్న గొనుక్కొనియ్’ అంటూ లేచి చెప్పులేసుకున్నాడు మల్లయ్య.
‘ఒక్క సిత్తం - గట్లనే జెయ్యిగాని - పోయినేడు యాదికున్నదా!? నీ చిన్న మనుమరాలు ప్యాలాలముద్దలు కొనియ్యమని కిందపడి బొర్లింది. ఇగదాని తల్లేమో కొత్తగౌను పాడాయే అని పొట్టు పొట్టు కొట్టింది పిల్లను’ అంటూ పొయ్యిముందున్న పీటపై కూచుంది.
‘ఆ..ఆ..యాదికున్నది తియ్యి - దుమ్మువారిపై తినద్దంటది కోడలమ్మ. గా పిలగాండ్లకేమెరుక - అద్దన్నయే కావాల్నంటరాయే. అవునుగని పిల్లగాండ్లకు తినేటందుకు ఏం జేస్తున్నవ్’ ఆసక్తిగా అడిగాడు మల్లయ్య.
‘నిన్ననే సకినాలు, గారెలు చేసి పెట్టిన గదా! అంటూ కట్టెల్ని పోయిలోకి తోసింది.
ఎహె - ‘ఇయ్యాల్ల ఏం జేస్తవని అడుగుతున్న’ అన్నడు మల్లయ్య. పరువన్నం జేసుడైతె ఉంటది. పురిహోర, మక్కగారెలు, భక్షాలు కూడా జేస్త! సాలా? అన్నట్లు చెయ్యి చూపించింది శాంతమ్మ.
‘సరేగని - గట్లనే కందగడ్డ ఉడుకపెట్టి పల్లికాయకూడ వేంచుకమ్మగ బుక్కుతరు పిల్లగాండ్లు అనుకుంట పాలకోసం బయటకెళ్లాడు మల్లయ్య.
గబగబా పనులన్ని పూర్తి చేసి పట్టుచీర కట్టుకొని దేవుడి గదిలోకెళ్లి మంగళహారతి వెలిగించింది శాంతమ్మ. మొదట ఇంటి దేవతైన మల్లన్న దేవుడికి పరమాన్నం నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టింది. ఇంతలో పిల్లలు వచ్చిన అలికిడివిని ప్రాణం లేచి వచ్చినట్లయింది శాంతమ్మకు.
నాన్నమ్మా! అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తన రెండు కాళ్లనూ పట్టుకున్నారు పిల్లలు. వాళ్లను ఆప్యాయంగా ముద్దాడింది శాంతమ్మ. నాకోసం ఏం చేశావ్ నాన్నమ్మా’ అన్నది చిన్ని. ‘ముందుగాల కాళ్లు చేతులు కడుక్కొని జేజకు దండం బెట్టుర్రి బిడ్డా’ అన్నది శాంతమ్మ కోడండ్లు పద్మ, లక్ష్మి అత్త,మామ కాళ్లకు నమస్కరించారు.
‘ఈసారి జాతర బాగానే సాగేటట్టు ఉందికదా’ అన్నాడు కాళ్లు కడుక్కుంటూ చిన్నకొడుకు లక్ష్మన్న.
సత్యంగల్ల దేవుడని సుట్టుపక్క ఊరోల్లు ఎక్కడెక్కడినుంచో వస్తున్నార్రా అన్నాడు మల్లయ్య. ‘నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా! అంటూ పలకరించాడు పెద్దకొడుకు రామన్న. ‘మంచిగనే ఉన్న బిడ్డా’ అన్నది శాంతమ్మ. కోడండ్లు ముఖాలు, కాళ్లు కడుక్కుని పట్టుచీరలు కట్టుకున్నారు. దేవుడి గదిలోని వెళ్లి దండం బెట్టుకున్నారు. ఇంతలో రాములవారి రథం వీధిలోకి వస్తున్న సందడి వినిపించింది. ‘జైబోలో - శ్రీరామచంద్రమూర్తికీ’! అంటూ అంతా భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. మేళతాళాల చప్పుడు వింటూ బుజ్జిగాడు తీన్మార్ స్టెప్పులేస్తుంటే సంతోషంతో ఒకరి మొకాలొకరు చూసుకొని మురిసిపోయారు తాతయ్యా నాన్నమ్మలు. ఇంటిముందుకు రథం వచ్చి ఆగగానే బిందెడు నీళ్లు రథానికి అడ్డంగా కుమ్మరించింది శాంతమ్మ. చిన్నకోడలు లక్ష్మి కొబ్బరికాయ కొట్టగానే పెద్దకోడలు పద్మ హారతిచ్చింది. కొడుకులిద్దరూ రథాన్ని లాగడానికి సిద్ధమైయ్యారు. మల్లయ్య మాత్రం పిల్లలను రథం కిందినుండి ఆ పక్కనుండి ఈ పక్కకి అతి జాగ్రత్తగా పరిగెత్తించాడు. రథం మళ్లీ కదిలింది. ఇలా కొంత దూరం రథంతో పాటు అంతా కదిలి వెళ్లారు. వీధి చివరివరకూ వెళ్లి అందరూ మనసారా దేవునికి దండం పెట్టుకొని ఇంట్లోకి వచ్చేశారు.
‘తాతయ్యా! మమ్మల్ని ఎందుకు రథం క్రిందినుండి అటూ ఇటూ పరిగెత్తించావ్’ అంటూ అడిగాడు బుజ్జిగాడు.
గట్టజేస్తే మీరు నిండు నూరేండ్లూ సల్లగ బతుకుతరుబిడ్డా! అన్నది శాంతమ్మ.
‘మరి మీరు కూడా నూరేండ్లు బతకాలికదా! మమ్మల్ని మాత్రమే ఎందుకు పరిగెత్తించారు’. అన్నది చిన్నిది. మేంగూడ మీ అంత ఉన్నప్పుడు గట్లనే చేసినం రా అన్నాడు మల్లయ్య! అందరికీ భోజనాలు వడ్డించే పనులు మొదలు పెట్టింది శాంతమ్మ. అంతా తృప్తిగా భోంచేసి కాస్సేపు కబుర్లు చెప్పుకున్నారు. ‘జాత్రకెల్దాం నాన్నా’ అంటూ పిల్లలు మారాం చేసేసరికి ఇక తప్పదని జాతర చూడడానికి సిద్ధమయ్యారు అందరు. ‘మీరు పొయ్యిరండి బిడ్డా నేను కొంచెం నడుం వాలుస్తా’ అన్నది శాంతమ్మ. అంతా కలిసి జాతరకు వెళ్లారు. ఆటవస్తువుల వింత వింత శబ్ధాలు వినగానే పిల్లల మొఖాలు కళకళలాడాయి. బూరలు ఊదుతున్న పిల్లలను, చేతిలో పిస్తోల్ బొమ్మ ఉన్న పిల్లలను చూసి ఇలాంటివి తాను కూడా తప్పకుండా కొనుక్కోవాలని ఆశపడ్డాడు బుజ్జిగాడు.
‘పోయిన సంవత్సరం కంటే రెండింతలు ఉన్నారు జనం’ అన్నాడు చిన్న కొడుకు లక్ష్మన్న. ‘రోజు రోజుకూ దేశంలో జనాభా పెరుగుతున్నది, దాంతో పాటు దైవభక్తి కూడా పెరుగుతున్నది’ అని సమాధానమిచ్చాడు పెద్దకొడుకు రామన్న. జనాల నడకతో దుమ్ము ఆకాశాంన్నట్టుతోంది. ‘నాన్నా, నాకు పిస్తోల్ కావాలి’ అని ఏడుపు మొదలు పెట్టాడు బుజ్జిగాడు. చిన్నదాని మనసంతా గులాభీ, తెలుపు రంగుల్లో అందంగా పేర్చిన చక్కెర బత్తీసలపైన ఉంది. ఆశగా తల్లిని అడిగి చూసింది. కానీ లాభం లేకపోయింది అలాంటివి తినకూడదని గట్టిగా మందలించింది తల్లి.
పుల్లకు ఐస్‌ముద్దను నొక్కి తియ్యని రంగునీళ్లు చల్లి ఇచ్చే బండి కనబడగానే ఆ ఇద్దరి పిల్లల కాళ్లూ ఠక్కున ఆగిపోయాయి. కోడళ్లు వద్దని వారించే లోగా తాతయ్య ఆ పుల్ల ఐసుల్ని కొని పెట్టాడు. ఆ తరువాత వారిద్దరినీ రంగులరాట్నం ఎక్కించి ఆనందపడ్డాడు. పెద్దలు, పిల్లలు ఆనందంగా జాతరంతా కలియతిరగసాగారు. ఇంతలో నాన్నా, చెల్లి కనిపించడం లేదు’ అని బుజ్జిగాడు చెప్పేవరకు గమనించలేదెవరూ! అంతా కంగారుపడి వెతకడం మొదలు పెట్టారు. ఒరేయ్ - నువ్వు మాత్రం తాతయ్య చెయ్యి వదలకు. అని చెప్పి మళ్లీ చిన్నిని వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు రామన్న లక్ష్మన్నలు.
కోడలు లక్ష్మి నీళ్లు నిండిన కళ్లతో చుట్టూ కలియజూసింది. ఎటు చూసినా జనం తప్ప చిన్ని కనిపించడం లేదు. ఇంతలో..ఒక అనుమానం వచ్చి గబగబా మిఠాయి దుకాణం వైపు నడిచింది లక్ష్మి. తనవెనకాలే వెంబడించారు పెద్దకోడలు, తాతయ్య, బుజ్జిగాడు. దాదాపుగా పరుగెత్తారు అంతా అందరి కళ్లల్లో ఒక్కసారిగా ఆనందం నిండిపోయింది. దుకాణం ముందు నిలబడి మిఠాయిలను ఆశగా చూస్తున్న చిన్నిని చూసి ‘చిన్ని’..అని అరిచింది లక్ష్మి. చిన్నిని కోపంతో కొడుతుందేమోనని భయపడ్డాడు. మల్లయ్య - కానీ కూతుర్నెత్తుకుని ఏడుస్తూ ముద్దాడుతున్న తల్లి ప్రేమను చూసి ఆనందంతో తన కళ్లుకూడా చెమర్చాయి. వెంటనే కొన్ని చక్కెర బత్తీసల్ని కొని చిన్ని చేతికి అందించింది లక్ష్మి. పెద్దకోడలు కొడుకులకు ఫోనే్జసి చిన్ని దొరికింది. మేమంతా ఇంటికి వెళ్తున్నాము. మీరు కూడా వచ్చేయండి అని చెప్పేసింది. మొత్తానికి ఇల్లు చేరుకున్నారు అందరు. జరిగిన విషయాన్నంతా శాంతమ్మకు వివరించారు.
‘అమ్మో-అమ్మో’ అని గుండెలు బాదుకుంది శాంతమ్మ. ఆ దేవుడి దయవల్ల పిల్లకెంత ప్రమాదం తప్పిందని పిడికెడు ఉప్పు తెచ్చి, దిష్టిదీసి చిన్నిని ఎత్తుకుని ముద్దాడింది శాంతమ్మ. ఆ తరువాత అందరిముందు ఉడికించిన కందగడ్డ, కాల్చిన పల్లికాయ, గారెలు, సకినాలు తెచ్చిపెట్టింది శాంతమ్మ.
‘ఎన్ని రోజులైందో ఇలాంటివి తిని’ అని అంతా ఒక పట్టు పట్టారు. ఆ రోజంతా పిల్లలు ఆటబొమ్మలతో సంతోషంగా ఆడుకున్నారు!

- కాటబత్తిని చంద్రకళ
కరీంనగర్, సెల్.నం.9866170713

పుస్తక సమీక్ష

తొలి పూత!

పేజీలు: 69
వెల : 50/-
ప్రతులకు
వంగర నరసింహారెడ్డి
గ్రామం సముద్రాల
మండలం కోహెడ
జిల్లా కరీంనగర్
‘పూచిన ప్రతి పుష్పం / కలిగి యుండలేదు పరిమళం.. / నే రాసిన ప్రతి కవిత / పొందలేదు అందరి ఆమోదం’ అంటూ సవినయంగా ప్రకటించుకున్న వంగర నరసింహారెడ్డి ‘తొలి పూత’ కవితా సంపుటిని వెలువరించి తమ భావాలను పాఠకులకు పంచారు.
కలవారికి, కడుపేదవారికి ఒకేరకమైన వరములీయుమని వీరభద్రుని స్తుతిస్తూ...ప్రారంభమైన ఈ కవితా సంపుటి నిండా వంగర నరసింహారెడ్డి సరళమైన రీతిలో కవితల్ని పొందుపరిచారు. నవమాసాలు నవ్వుతూ మోసి..నలత పడకుండ నలుగే పూసిన అమ్మకు మించిన వారు లోకంలో ఎవరూ లేరని తేల్చిచెప్పారు. ‘బాధ్యతలు పంచక బరువునంతా మోసిన మనిషి నాన్న’ అని ఒక కవితలో నాన్నను ఉన్నతంగా చిత్రించారు. ఈ అనంతంలో..రూపాంతరమే తప్పా, ఆది, అంతం, ఎవరికీ, దేనికీ, ఏదీ లేదని విప్పి చూపిన గురువును గుర్తు చేసుకొని తనకు గురువుపట్ల గల గౌరవభావాన్ని కవి చాటుకున్నారు.
‘మనసు పరిపక్వత పొందనంతవరకు ‘శుభం’ లేదు ఈ కాలంలో అని ‘ఇంద్రజాలం’ కవితలో తెలియజేశారు.
మరణం..నీ శరీరానికి చెల్లించిన..సుఖాల భరణమే కానీ, ఆభరణం కాలేదు నీ జీవితానికి అంటూ తమ తాత్వికతను చాటుకున్నారు. ‘ఆడపిల్ల శాపం’ కవితలో ఆడపిల్లలపై కొనసాగుతున్న వివక్షను అక్షరబద్ధం చేశారు. నేడు మసకబారుతున్న మానవ సంబంధాలను ఏకరువు పెడుతూ..విత్తం, ఈ దర్పం సాంతం తన సొంతమనే భావంతో నేడు మనిషి కుంచించుకు పోయాడని వాపోయారు. దేశభక్తి పల్లవిగా..జాతి సమైక్యత చరణంగా శాంతిగీతం పాడుమని పిలుపునిచ్చారు. ‘మిరపబజ్జీల’ శీర్షికన రాసిన మినీ కవితల్లో కవులకు చురకలంటించారు కవి..మాటలకు కోట..చేతలకు టాటా అంటూ చమత్కరించారు. ఇలా ఇందులోని కవితలన్నీ సీదా సాదా కవిత్వంతో రూపుదిద్దుకున్నాయి. ‘పుష్పాలు పుష్పించక మానవు..నే కవితలు రాయక మానను’ అని సగర్వంగా ప్రకటించుకున్న కవి నరసింహారెడ్డి కవిత్వం రాయడంలో మెలకువలు తెలుసుకోవాలి. భాష పట్ల పట్టు సాధిస్తూ..ఒక్కో మెట్టు ఎక్కాలి. ఆయన ఆలోచనలు..్భవాలు బాగున్నాయి. కానీ వాటికి అనుగుణమైన కవిత్వపు సొబగులు అద్దడానికి ప్రతీకలు..వర్ణనలు లాంటి ఆభరణాలు అవసరమని గ్రహించాలి. ఈ దిశలో ఆయన అడుగులేస్తారని ఆశిద్ధాం..ఈ రోజు పాఠకులకందించిన ‘తొలిపూత’ మున్ముందు పండ్లు, ఫలాలనందించేలా ఆయన కవిత్వపు సేద్యం చేయాలని కోరుకుందాం!
- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

మనోగీతికలు

సాహిత్య కళాశాల

హృదయ కుసుమం వికసించే చోట
కదన కుతూహలాలు కనుమరుగౌతాయి!
స్నేహగంధాలు పరిమళించే చోట
ద్వేష దుర్గంధాలు దూరవౌతాయి!
జీవితం ఒక సాహిత్య కళాశాల
భావిస్తున్న కొలదీ సంబంధాలు
భావరాగతాళాలౌతాయి!
నవరసాలన్నీ కవితా రసాలే!
కువకువలాడుతున్న కోరికలు
అవిశ్రాంతంగా నింగిలో ఎగసే శారికలు!
అవి ఎక్కడ వాలుతాయో
ఏ అందమైన కొమ్మపై తేలుతాయో
సత్యధర్మ సమ్మేళనమే సాహిత్యం
నిత్య నూతన స్పందనమే సాంగత్యం!
మనసులు కలుస్తూనే ఉండాలి
మధురానుభవాలు పిలుస్తూనే ఉండాలి!
బ్రతుకు అంటే అమృతమే
దానిని విషతుల్యం చేయరాదు!
మనుగడను మించిన వరం లేదు
సకల గుణాల సాహిత్యం మనిషి
వికటంగా మారనంతవరకు వాడు రుషి!
నిరంతరం అద్దంలా కనబడాలి వాడి కృషి!
అప్పుడే వాడి బ్రతుకు ధన్యం!!

- డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ
కామారెడ్డి, సెల్.నం.9440468557

నేనొక..
అమ్మ ఒళ్లో ఎలాపెరిగానో
‘చిగురాకు’ వాసనలా
జ్ఞాపకముంది!
పెళ్లికాకముందు
పూలతోట లాంటి
‘జీవితం’ జ్ఞాపకముంది!
‘గూడు’కట్టుకున్న
స్వప్నం గుండెనిండా
దాగి ఉందని జ్ఞాపకముంది!
మధుమాసం లాంటి
‘పుట్టిల్లు’
వేధింపుల మెట్టిళ్లు
‘కునుకు’ పట్టని రాత్రిలా
జ్ఞాపకముంది!
అత్తారింటి ‘అంట్ల’ గినె్నగా మారి
శిశిర, వసంతాలకు
కనుమరుగైన కాలం
మానని గాయంలా జ్ఞాపకముంది!
సూత్రం మెడలో వేసి
శిలగా మార్చి
‘వర’కట్నపు తాలింపులా
జ్ఞాపకముంది!
తప్పుదొర్లని సంఘటనలైన
చెంప ఛెళ్లుమన్న క్షణం...
బొప్పి కట్టిన నెత్తుటిలా
జ్ఞాపకముంది!
స్ర్తి స్వాతంత్య్రం
ఆర్థిక స్వేచ్ఛలేనిదని
చెంప ఛెళ్లుమన్నంత
జ్ఞాపకముంది!
చెదిరిన బ్రతుకుల్ని
అందమైన ‘మజిలీ’గా
మార్చే
సరికొత్త ఆశయాన్ని
నేనని జ్ఞాపకముంది!!

- రామానుజం సుజాత, కరీంనగర్, సెల్.నం.9701149302

నా అక్షరం..!

సూర్యోదయం నుండి
సంగీతం అందుకుంటున్న వాన్ని
కిరణాలలో సరిగమలు
వెతుకుంటున్న వాన్ని
నాకు ఆనందం..
అందం తెలియదని
కొందరు రాళ్లు విసురుతుంటారు
నా అక్షరాలే
అందంగా వుంటాయి!
నా పదాలు
కోటి రాగాలు పలుకుతాయి!
నా వాక్యం
ఒక క్షణం తుమ్మెద రాగమై..
మరో క్షణం వెంటపడిన కందిరీగ మోతై..
మల్లెపూల సుగంధాన్ని ఎగరేస్తున్న
నా కవిత్వం...
బుసలు కొడుతున్న
పాములా మారిపోతుంది!
నవరసాలలో అన్ని రసాలు
నా కవిత్వానికున్నాయి!
అందం ఆనందం నా అక్షరం పరమావధి.
మామిడిపూత, మల్లెతోట, స్వచ్ఛమైన బాట
నా అక్షర లక్ష్యం!
అందమైన నా అక్షరానికో సుగుణముంది
ఎప్పుడూ తల వంచదు!
నా అక్షరం ప్రశ్నగా మారుతుంది!
పిడికిలిగా ఎగురుతుంది!
సుడిగాలిలా విజృంభిస్తుంది
నా అక్షరం..
నవ్వుతూనే ముళ్లకంపలు నరుకుతుంది!!

- సిహెచ్.మధు
నిజామాబాద్
సెల్.నం.9949486122

మిణుగురులు
చెలీ! నీ గుండె గూటిలో
కొలువైన నేను..
ఓ ఇల్లు లేని వాన్నయ్యాను!
కళ్లతో కడివెడు కన్నీరు కార్చినా
కడుపులో దుఃఖపు కడలిని దాచినా..
కదలి పోయిన కాలం తిరిగిరాదు!
బాల్యంలో వేసుకుందామంటే
ఒక్క నగ లేదు!
ఇప్పుడు స్పాండిలైటిస్ వ్యాధితో
నగలు మోసే శక్తి లేదు!
పూలను, ముళ్లను
సమంగా స్వీకరించిగలిగితేనే..
జీవితానికి అర్థం, పరమార్థం!!

- చెన్నమనేని ప్రేమ్‌సాగర్ రావు
కరీంనగర్, సెల్: 9912118554

శ్రమేవ జయతే
మనిషి మనసులో నిరంతర
సంఘర్షణ గెలుపుకోసమే
రైతు రేయింబవళ్లు శ్రమించేది
రెట్టింపు దిగుబడి సాధించాలనే!
విద్యార్థి శోధన సైతం విజ్ఞాన
స్పర్థలో ప్రథముడనవ్వాలనే!
క్రీడాకారుని కఠిన దీక్షంతా
పసిడి పతకాలు సాధించాలనే
నిరుద్యోగుల ప్రయత్నమంతా
చక్కని జీవనోపాధి పొందాలనే
అనుకున్నది సాధించాలంటే
అనుక్షణం శ్రమించాలి
శ్రమైక జీవనంలోనే దాగుంది
భారతీయ సంస్కృతి

- నూజెట్టి రవీంద్రనాథ్
జగిత్యాల, సెల్: 9948748982

ఓ రైతన్నా !

దుఃఖాన్ని దుక్కిలా దున్ని
కన్నీటి విత్తనాలు చల్లి...
ధాన్యరాశులు పండించే ఓ రైతన్నా
అందరి ఆకలి తీర్చే...
మహారాజువు!
కరువు కళాల నృత్యానికి
నీ ఆశలన్నీ చెదిరాయనీ...
కాలం పెట్టిన పరీక్షలో
ఓడిపోయానని దిగులు పడకు!
నేతలు మారినా
నీ తల రాతలు మారడం లేదనీ..
పాలకుల చిలుక పలుకులు
నీటిపై రాసిన గీతలవుతున్నాయనీ..
ఆత్మహత్యను ఆశ్రయించకు!
ఎప్పటికైనా..
మంచి రోజుస్తాయనీ...
కష్టాలన్నీ తొలిగిపోతాయనీ..
అడుగులు ముందుకు వేయ!!

- అపర్ణ జ్యోతి
కరీంనగర్, సెల్.నం.
9866600748

ఒక్కసారి..
ఆడదంటే..
అలుసెందుకు?
కొందరు మగాళ్లు
మృగాలై అబలలపై...
జరుపుతున్న అకృత్యాలకు అంతం లేదా?
చట్టాలన్నీ తమకు చుట్టాలయి..
రోజు రోజుకు..
వావి వరసలు మరిచి
పశువుల్లా మారి
పడతుల్ని హింసిస్తుంటే..
సభ్య సమాజం
సిగ్గుతో తలవంచుకుంటోంది!
ఇకనైనా..
ఈ విష సంస్కృతికి
చరమగీతం పాడాలి!
ఒక్కసారి ఆలోచించి..
ఆడవాళ్లపై
అఘాయిత్యాలను ఆపాలి!!

- మందుల పరమాత్మ
సెల్.నం.8374382524

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- కాటబత్తిని చంద్రకళ