క్రీడాభూమి

కుంబ్లే కాంట్రాక్టుకు తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: జాతీయ క్రికెట్ జట్టు కోచ్‌గా అనిల్ కుంబ్లే కాంట్రాక్టు కొనసాగుతుందనీ, ఆ పదవిలో అతనే ఉంటాడనీ చాలాకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. కోచ్ పదవికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) విడుదల చేసిన ప్రకటన కుంబ్లే కాంట్రాక్టుకు తెరపడిందనే విషయాన్ని స్పష్టం చేసింది. బిసిసిఐతో అతని ఒప్పందం ఇంగ్లాండ్‌లో జూన్ ఒకటి నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీతో
ముగుస్తుంది. ఈలోగా కొత్త కోచ్‌ని ఎంపిక చేసేందుకు బిసిసిఐ కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని, వాటిని సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సిఎసి) పరిశీలించి, అర్హుడిని ఎంపిక చేస్తుందని గురువారం నాటి ప్రకటనలో బిసిసిఐ తెలిపింది. ఈ మొత్తం వ్యవహారం పారదర్శకంగా ఉండేందుకు సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) ప్రతినిధి కూడా ఎంపిక ప్రక్రియలో భాగస్వామిగా ఉంటాడని పేర్కొంది. కాగా, కోచ్ పదవికి కుంబ్లే కూడా రేసులో ఉండే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత కోచ్ హోదాలో అతను దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇంటర్వ్యూకు అర్హత సంపాదిస్తారు. మిగతా వారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన తర్వాత సిఎసి కొంత మంది పేర్లను ఖరారు చేస్తుంది. ఈ విధంగా ఎంపికైన వారికే ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. ఆతర్వాత సిఎసి కోచ్ పేరును ప్రతిపాదిస్తే, బిసిసిఐ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈసారి ఎవరెవరు దరఖాస్తు చేసుకుంటారు? ఎవరు ఇంటర్వ్యూ వరకూ వెళతారు? చివరికి ఎవరు కోచ్‌గా కాంట్రాక్టును పొందుతాడన్నది ఆసక్తి రేపుతున్నది.
స్వయంకృతం
న్యూఢిల్లీ: అనిల్ కుంబ్లే కాంట్రాక్టును పొడిగించకుండా, కోచ్ పదవికి బిసిసిఐ దరఖాస్తులు ఆహ్వానించడం వెనుక బలమైన కారణమే ఉందని బిసిసిఐ వర్గాలు అంటున్నాయి. ఈ వర్గాల ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆటగాళ్లకు కాంట్రాక్టు మొత్తాలను పెంచాలని కుంబ్లే పట్టుబట్టాడు. చివరికి అనుకున్నది సాధించగలిగాడు. ‘ఎ’, ‘బి’, ‘సి’ కాంట్రాక్టులు పొందిన ప్రతి ఒక్కరి పారితోషికం దాదాపు రెట్టింపయింది. అయితే, ఈ డిమాండ్ నెరవేడంతో కుంబ్లే సంతృప్తి చెందలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి అదనంగా మరో 25 శాతం ఫీజును ఇవ్వాలని పట్టుబట్టాడు. కెప్టెన్‌కు అదనపు భారం ఉంటుంది కాబట్టి, ఆ మాత్రం మొత్తం ఇవ్వడంలో తప్పులేదని వాదించాడు. తన ఫీజును కూడా రెట్టింపు చేయాలని కోరాడు. జాతీయ సెలక్షన్ కమిటీలో కోచ్‌కి కూడా సభ్యత్వం ఉండాల్సిందేనని అంటున్నాడు. అయితే, లోధా కమిటీ చేసిన సూచనలకు ఈ డిమాండ్ పూర్తిగా వ్యతిరేకం. ఈ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండాలి. కుంబ్లేను సభ్యుడిగా తీసుకోవాలంటే, ఆ సంఖ్యను నాలుగుకు పెంచాలి. లోధా సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడమేగాక, ఆ ప్రక్రియ సజావుగా సాగేందుకు సిఒఎను కూడా నియమించింది. ఈ పరిస్థితుల్లో కుంబ్లే డిమాండ్ అర్ధరహితమని బిసిసిఐ అభిప్రాయపడుతున్నది. మొదటి నుంచి జట్టు కోచ్, కెప్టెన్ కూడా సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతారు. వారి అభిప్రాయలను వెల్లడిస్తారు.
అయితే, వారికి ఓటు హక్కు మాత్రం ఉండదు. కుంబ్లే ఓటు హక్కు కోసం పట్టుబట్టడంతో బిసిసిఐ అసహనానికి గురవుతున్నది. ఇప్పటికే ఆటగాళ్ల కాంట్రాక్టు సొమ్మును రెట్టింపు చేసి, అదనపు భారాన్ని నెత్తినపెట్టుకుంది. తన జీతభత్యాలను కూడా పెంచాలని కుంబ్లే డిమాండ్ చేయడం బోర్డు అధికారులకు నచ్చడం లేదు. సెలక్షన్ కమిటీలో సభ్యత్వం ఇవ్వాలన్న అతని మరో డిమాండ్‌ను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణాలతోనే కుంబ్లేను తప్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. మొత్తానికి కుంబ్లే ప్రస్తుత పరిస్థితిని తేతులారా కొని తెచ్చుకున్నాడు. ఆటగాళ్ల కాంట్రాక్టు సొమ్ము రెట్టింపు చేయాలన్న డిమాండ్‌ను బిసిసిఐ అంగీకరించిన తర్వాత ఇతరత్రా డిమాండ్లపై పట్టుబట్టకపోతే బాగుండేది. కానీ, కోహ్లీకి అదనపు చెల్లింపులు, తన ఫీజు పెంపు, కోచ్‌కి సెలక్షన్ కమిటీలో సభ్యత్వం వంటి డిమాండ్లు బోర్డు ముందు ఉంచి, చివరికి తన పదవికే ఎసరు తెచ్చుకున్నాడు.