కర్నూల్

ఫైబర్ నెట్‌కు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 7:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫైబర్‌నెట్ సేవలు అందించడానికి జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లందరూ సిద్ధంగా ఉన్నారని కర్నూలు ఎంఎస్‌ఒ కెఇ సత్య, జిఎం ఎస్‌కె మహేష్ స్పష్టం చేశారు. వారు శనివారం ఆంధ్రభూమితో ఆ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి సిగ్నల్ కర్నూలు నగరంతో పాటు ప్రధాన పట్టణాలకు వచ్చిందన్నారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు అందుతుందని వెల్లడించారు. ప్రయోగాత్మకంగా వీడియోకాల్, పలు టీవి ఛానళ్లను పరీక్షించి చూశామని, ఇంటర్‌నెట్ వేగం, టీవి ప్రసారాల నాణ్యత సంతృప్తినిచ్చిందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సెట్ టాప్ బాక్సుల నాణ్యత ప్రైవేట్ సంస్థలు అందిస్తున్న వాటికంటే బాగా ఉన్నాయన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోనితో పాటు ఇతర పురపాలక సంఘాల్లో సంక్రాంతి నుంచి ప్రజలకు కనెక్షన్ ఇస్తామన్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఫైబర్ నెట్ సేవలు అందజేస్తామని తెలిపారు. అతి తక్కువ ధరకే ఇంటర్‌నెట్, కేబుల్ టీవి, టెలిఫోన్ సదుపాయం దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదని వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైబర్‌నెట్ కార్యక్రమం చేపట్టిన తరువాత తొలిసారి ఢిల్లీ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుందని వివరించారు. ఫైబర్ నెట్ కేబుల్ అందించడానికి ఏపిఎస్‌ఎఫ్‌ఎల్ అధికారులు జిల్లాలో 2,134 కి.మీ మేర కేబుల్ లాగారని, 49 కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారన్నారు. దీంతో జిల్లాలో మారుమూల గ్రామాలకు సైతం అత్యధిక వేగంతో ఇంటర్‌నెట్, హెడ్‌డి నాణ్యతతో టీవి ప్రసారాలు అందనున్నాయన్నారు. ఇక ఈ రంగంలో ప్రజలకు ఇస్తున్న టెలిఫోన్ నుంచి ఇదే నెట్‌వర్క్‌లోని ఏ ఫోన్‌కు చేసుకున్నా ఉచితం అని తెలపారు. జిల్లాలోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్‌నెట్ సదుపాయం కల్పిస్తుండటంతో ఆయా శాఖల అధికారులతో ఉచితంగా మాట్లాడుకోవచ్చని తెలిపారు. కర్నూలు నగరంలో తొలి కనెక్షన్ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి స్వగృహానికి ఇస్తామన్నారు. అదే రోజు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీడియో కాల్‌లో మాట్లాడతారని తెలిపారు.
మళ్లీ సెట్ టాప్ బాక్సులా..
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అనలాగ్ ప్రసారాలు నిలిచిపోయి డిజిటల్ ప్రసారాలు తప్పనిసరికావడంతో జిల్లాలోని అన్ని పురపాలక పట్టణాల్లో 6 నెలల క్రితమే రూ. 1500 నుంచి రూ. 2వేల దాకా ఖర్చు చేసి సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకున్న ప్రజలు తాజాగా ఫైబర్ నెట్ సేవల కోసం మళ్లీ రూ. 4వేలు ఖర్చు చేసి కొత్తగా సెట్ టాప్ బాక్సు తీసుకోవాలంటే భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్కువ ధరకే అందిస్తున్నా సెట్ టాప్ బాక్స్ భారంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం రాయితీ కల్పించి సెట్ టాప్ బాక్సు భారాన్ని కొంతైనా తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. పలు ప్రైవేట్ సంస్థలు ఇంటర్‌నెట్ సేవలందించేందుకు ప్రజలకు అనేక రాయితీలు ఇస్తున్నాయని ప్రభుత్వం కూడా అలాగే ఇవ్వాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అనధికార కేబుళ్ల తొలగింపు సబబే..
కేబుల్ నెట్ విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాలపై అనేక కంపెనీలకు చెందిన నెట్‌వర్క్ కోసం తీగలను లాగటం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. ప్రభుత్వమే ఫైబర్ నెట్ వర్క్ తీగలను లాగి సురక్షితమైన నెట్ వర్క్‌ను అందించటానికి పూనుకొని ప్రస్తుతం విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ నెట్ వర్క్‌ను తొలగిస్తుంది. దీంతో ప్రజలకు కూడా అతి తక్కువ ధరకే నెట్ వర్క్ వస్తుందని మహాలక్ష్మి కమ్యూనికేషన్ జిఎం ఎస్‌కె మహేష్ స్పష్టం చేశారు.