కర్నూల్

గ్రామాల్లో వైభవంగా సంక్రాంతి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 13 : తెల్లవారుజాము మంచు తెరల నడుమ ఎగిసిపడే భోగి మంటలు, నులివెచ్చని సూర్య కిరణాలను ఆస్వాదిస్తూ పడచులు వేసే రంగ వల్లులు, పండించిన పంటను తమ ఇష్టదైవానికి తొలి నైవేద్యంగా సమర్పించేందుకు సిద్ధపడే మహిళలు, ఇంటికి వచ్చిన చుట్టాలతో పల్లె ప్రాంతాలు శుక్రవారం కళకళలాడాయి. భోగి పండుగ రోజున పల్లెల్లో కనిపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు. గత ఖరీఫ్ సీజన్‌లో ఆరు నెలలు కష్టపడి తాము పండించిన పంటను తమ ఇష్టదైవానికి తొలి నైవేద్యంగా సమర్పిస్తూ పల్లె జనం కులం, మతం, వర్గం అనే తారతమ్యం లేకుండా ఉత్సాహంగా గడిపారు. భోగి పర్వదినాన ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అల్లుళ్లు, కూతుర్లు, కోడళ్లు, కుమారులు, మనవళ్లు, మనవరాండ్లతో పల్లెల్లోని ప్రతి ఇళ్లు నూతన శోభను సంతరించుకుంది. అలనాటి నుంచి సంప్రదాయంగా వస్తున్న భోగి మంటల చట్టూ పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఆడుతూ పాడుతూ చిన్నారులతో కలిసి కేరింతలు కొట్టారు. ఇక యువకులు సంప్రదాయ గ్రామీణ క్రీడలు, కోడిపందేలు, పొట్టేళ్ల యుద్ధం, వృషభరాజముల పరుగు పందెం వంటివి నిర్వహించి అందరితో ఆనందం పంచుకున్నారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోంది. పండుగ కోసం ఉద్యోగులు ఊళ్లకు వెళ్లేందుకు వీలుగా భోగి పండుగను జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో గురువారమే సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. ఇక అనేక సంస్థలు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు నిర్వహించిన రంగవళ్లుల పోటీలో విజేతలకు భోగి పండుగ సందర్భంగా బహుమతులు ఇచ్చి వారిలో ఆనందం నింపారు. సంక్రాంతి పండుగకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాధాన్యత పట్టణాల్లో లేకపోవడంతో అందరూ తమ స్వగ్రామాలకు వెళ్లి పండుగను నిర్వహించుకోవాలని భావిస్తారు. ఇందులో భాగంగా దూరపు ప్రాంత గ్రామాలకు వెళ్లే వారు ఇప్పటికే వెళ్లిపోగా దగ్గరి పల్లెలకు గురు, శుక్రవారాల్లో చేరుకున్నారు. ఇక సంక్రాంతి పండుగకు పల్లెలకు వెళ్లలేకపోయిన పట్టణ వాసులు సాధ్యమైనంత వరకూ పల్లె సంప్రదాయాలను పట్టణాల్లోనే కొనసాగించి పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. పట్టణాల్లోని వీధులను రంగురంగుల రంగవళ్లులతో నింపేశారు. చిన్నారులు గాలి పటాలను ఎగురవేసి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు.
సెంటు భూమి లేకున్నా నష్టపరిహారం!
* కంబలదినె్నలో వెలుగుచూసిన బోగస్ జాబితా..
* అధికారుల మాయాజాలం..
* బాధిత రైతుల ఆందోళన..
పెద్దకడుబూరు, జనవరి 13 : సెంటు భూమి లేకపోయినా వేలాది రూపాయల పంట నష్టపరిహారం బినామీ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. ఈ సంఘటన పెద్దకడుబూరు మండలం కంబలదినె్న గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలల్లోకి వెళ్తే... 2015 ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. అయితే కంబలదినె్న గ్రామంలో 650 రైతుల జాబితా తయారుచేసిన అధికారులు పంట నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో 50 మందికి గ్రామంలో సెంటు భూమి కూడా లేకపోవడం గమనార్హం. బాధిత రైతుల జాబితా తయారీలో అధికారులు తమకు అనుకూలమైన రైతులు కాని వారి పేర్లు నమోదుచేసినట్లు తెలుస్తోంది. దీంతో వారి ఖాతాల్లోకి వేలాది రూపాయలు జమ అయింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 20 నుంచి రూ. 30 వేల వరకు పంట నష్టపరిహారం జమ అయినట్లు సమాచారం. అయితే బ్యాంకు నుంచి తీసుకున్న పంట నష్టపరిహారం వాటాల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో అసలు విషయం బయటకు పొక్కింది. గ్రామంలో అర్హులైన 50 మంది రైతుల పేర్లు జాబితాలో నమోదుచేయకుండా, అనర్హుల పేర్లు పొందుపరిచినట్లు సమాచారం. వీరికి నష్టపరిహారం మంజూరైంది.
అనర్హులకు నష్టపరిహారం అందజేసిన అధికారులు తమకు మొండిచేయి చూపడంతో బాధిత రైతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో రైతులు పెద్దకడుబూరులోని వ్యవసాయశాఖ కార్యాలయానికి శుక్రవారం చేరుకున్నారు. అయితే అక్కడ సంబంధిత అధికారి లేకపోవడంతో వెనుదిరిగారు. పంట నష్టపరిహారం జాబితా తయారీలో అర్హులైన తమకు అధికారులు అన్యాయం చేశారని రైతులు దస్తగిరి, మద్దిలేటి, ఈరన్న, మహదేవ, పెద్ద బుడ్డప్ప, లింగన్న, నరసమ్మ తదితరులు వాపోయారు. కమ్మలదినె్నకు మంజూరైన పంటనష్టహారం జాబితాపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అనర్హుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకుంటే ఉన్నతాధికారులక ఫిర్యాదుచేస్తామని వారు తెలిపారు.