కర్నూల్

అనధికార కేబుళ్ల తొలగింపునకు రంగం సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 15 : ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఫైబర్ నెట్ పథకం వల్ల ప్రజలకు నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకూ పంచాయతీలు మినహా అన్ని పట్టణాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవల కోసం ఏర్పాటు చేసుకున్న సెట్ టాప్ బాక్సుల కోసం వినియోగదారులు ఒకొక్కరు రూ. 1500 నుంచి రూ. 2500ల వరకూ ఖర్చు చేశారు. అయితే ఆ సేవలను పొంది 6 నెలల సమయం కూడా కాకపోవడంతో కొత్తగా వస్తున్న ఫైబర్ నెట్ వైపు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తక్కువ ఖర్చుతో సేవలు అందించడానికి ఏర్పాట్లు చేసింది. అయితే సెట్ టాప్ బాక్సుల ఖరీదు వినియోగదారుడే భరించాల్సి ఉన్నందున వాయిదాల పద్ధతి ప్రవేశపెట్టినా నగరాల్లో ప్రజలు ఆలోచనలో పడ్డట్లు మల్టీ సిస్టం ఆపరేటర్(ఎంఎస్‌ఓ) ప్రతినిధులు తెలిపారు. ఫైబర్‌నెట్ సెట్ టాప్ బాక్సులు 3 ఏర్పాటు చేయాల్సి ఉందని వీటి ఖరీదు రూ. 4వేలుగా ప్రభుత్వం నిర్ణయించిందని వారు తెలిపారు. అయితే ఇప్పటికే సెట్ టాప్ బాక్సు ఉన్న కారణంగా కొత్తగా మళ్లీ ఖర్చు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని వారంటున్నారు. దీనిపై ఫైబర్‌నెట్ అధికారులకు విషయాన్ని తెలియజేయగా వారు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుపోవడంతో ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. ఫైబర్‌నెట్‌కు సంబంధించిన కేబుల్ మినహా ఏ ఇతర కేబుల్ కూడా విద్యుత్ స్తంభాలపై ఉండరాదని ఇప్పటికే ఆదేశించిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ తీగలను తొలగించడం ద్వారా ఇంటర్‌నెట్, టీవీ ప్రసారాలు నిలిచిపోతే ఆయా సంస్థల నుంచి వినియోగదారులు సెట్ టాప్ బాక్సుల ఖరీదును వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనధికారికంగా తీగలు లాగిన సంస్థలు వినియోగదారులకు సేవలందించడం వీలుకాదని దాంతో సంస్థల తప్పిదంగా నిర్ణయించి వారి నుంచి సెట్ టాప్ బాక్సుల ఖరీదును తిరిగి ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే వినియోగదారుల కోర్టులో కేసులు దాఖలు చేసి అత్యవసర కేసుల కింద విచారించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. ఇక గతంలో అధికారిక అనుమతులు పొందిన కేబుల్, ఇంటర్‌నెట్ ఆపరేటర్ల తీగలను తొలగించలేని పక్షంలో వినియోగదారులకు సేవలు అందిస్తారన్నారు. అలాంటి వారి విషయంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోలేదని వారికి ప్రభుత్వ పరంగా తగిన సౌలభ్యం కల్పించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ముగిసిన నోటీసుల గడువు..
కాగా అనధికారికంగా కేబుల్ వైర్లను లాగేందుకు విద్యుత్ స్తంభాలను వినియోగించుకున్న ఇంటర్‌నెట్, కేబుల్ ఆపరేటర్లకు వాటిని తొలగించాల్సిందిగా ఇచ్చిన నోటీసుకు ఎవరూ స్పందించి తొలగించలేదని ఆ శాఖ అధికారులు తెలిపారు. వారికి ఇచ్చిన గడువు ఆదివారంతో ముగిసిందని తాము సోమవారం నుంచి రంగంలోకి దిగి ఎక్కడి తీగలను అక్కడే కట్ చేసి తొలగిస్తామని తెలిపారు. ఆపరేటర్ల కోరిక మేరకు కొంత సమయం ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తామని వారు పేర్కొంటున్నారు. ఫైబర్ నెట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానందున వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కొంత సమయం ఇవ్వడానికి ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చని వారు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం కేబుల్, ఇంటర్‌నెట్ ఆపరేటర్లు అధికారిక అనుమతులు పొందాలని ప్రభుత్వం నిబంధన గత దశాబ్దకాలం కిందటే ఉందని అయితే ఎవరూ అనుమతులు పొందిన దాఖలాలు లేవని వారు తెలిపారు. కేవలం ప్రధాన లైన్ కోసం కొంత దూరంలో ఉన్న విద్యుత్ స్తంభాలకు మాత్రమే పన్ను చెల్లిస్తున్న ఆపరేటర్లు అతి కొద్ది మంది ఉన్నారని వారు తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం తాము ఇంతకాలం ఈ అంశాన్ని పట్టించుకోలేదని వెల్లడించారు. తాజాగా ప్రభుత్వం ఫైబర్‌నెట్ సేవలను ప్రవేశపెడుతూ అనధికార కేబుల్ తీగలను తొలగించాలని ఆదేశించడంతో తాము సిద్ధపడుతున్నామని వారు స్పష్టం చేశారు.
భక్తిశ్రద్ధలతో మల్లన్న పుష్ప పల్లకి సేవ
* సంప్రదాయబద్దంగా సదస్యం, నాగవల్లి
శ్రీశైలం, జనవరి 15 : సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు పుష్ప పల్లకి సేవ నిర్వహించారు. పుష్ప పల్లకి సేవలో తెల్ల చామంతి, పసుపు, చామంతి, ఎర్రబంతి, కనకాంబరాలు, నందివర్థనం, కాగడాలు, జాబ్రా, ఆర్కిస్, గ్లాడియోస్, టైగర్ రూల్, పన్నీరు ఆకు తదితర 8 రకాల పుష్పాలతో పల్లకిని ప్రత్యేకంగా అలంకరించి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో వేంచింపచేయించి ఎంతో వైభవంగా శ్రీశైల పురవీధుల్లో ఆలయ అధికారులు పుష్ప పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరింపచేయించి, ఉత్సవ పూజలను శాస్త్రోక్తంగా జరిపిన అనంతరం మేళ తాళాల నడుమ, డప్పు వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రథశాల వద్దకు తోడ్కొని వచ్చి ఎంతో సుందరంగా అలంకరించిన పుష్ప పల్లకిపై స్వామి, అమ్మవార్లను వేంచిప చేయించి విద్యుత్ దీప కాంతుల నడుమ ఎంతో వైభవంగా వేద మంత్రోచ్చారణలతో శ్రీశైల పురవీధుల్లో పుష్ప పల్లకి సేవ నిర్వహించారు. ఈ పుష్ప పల్లకి సేవను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఈకార్యక్రమాల్లో ఇఓ నారాయణ భరత్‌గుప్తా దంపతులు, వేదపండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు సదస్యం, నాగవల్లి కార్యక్రమాన్ని అర్చక వేదపండితులు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేద స్వస్తి నిర్వహించడింది. నాగవల్లి కార్యక్రమంలో శనివారం కల్యాణోత్సవం జరుపబడిన అమ్మవారికి ఆగమశాస్త్ర సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలు సమర్పించబడ్డాయి. సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు ఉదయం ప్రాతఃకాల పూజలు నిర్వహించి, 9.15 గంటల నుండి స్వామి వారి యాగశాలలో రుద్రహోమం, పూర్ణాహుతి, కలశోద్వాసన కార్యక్రమాన్ని అర్చక వేదపండితులు నిర్వహించనున్నారు.
అహోబిలేసుని పార్వేట ఉత్సవాలు
వైభవంగా ప్రారంభం
ఆళ్లగడ్డ, జనవరి 15:పుణ్య క్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పార్వేట ఉత్సవాలు ఆదివారం ఆలయ ఈఓ మల్లికార్జునప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆళ్ళగడ్డ నియోకవర్గంలోని మూడు మండలాల్లో 43 రోజులు పాటు 33 గ్రామాలలో పూజలందుకోవడానికి సాక్షాత్తు ఎగువ అహోబిలంలో స్వయంభువుగా వెలసిన శ్రీ జ్వాలా నరసింహస్వామి, దిగువన వెలసిన శ్రీ ప్రహ్లాదవరదస్వామిలు ఇరువురు పార్వేటకు సిద్దమై పూజలందుకునేందుకు భక్తుల చెంతకు తరళివెళ్లారు. ఈ సందర్భంగా శనివారం ఎగువలో కొలువుదీరిన జ్వాలా నరసింహస్వామి కొండ దిగి దిగువకు చేరుకున్నారు. సాయంత్రం ఉత్సవమూర్తులను చూడ ముచ్చటగా అలంకరించి ప్రత్యేకంగా తయారు చేసిన ఉత్సవ పల్లకిలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ జ్వాలా నరసింహస్వామిని, శ్రీ ప్రహ్లాద వరదున్ని ఆశీనులను చేసి మండపం వద్ద వుంచి స్వామి వారి ఎదుట అన్నకూటోత్సవం చేసి సాంప్రదాయం ప్రకారం స్వామి వారికి సంధ్యాహారతి ఇచ్చారు. అందులో భాగంగా కుంభహారతి, నక్షత్ర హారతి, తిరువారాధన, షోడషాపచార పూజలను ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నం రాశిగా పోసి కుంభ హారతి ఇచ్చి ప్రసాదాన్ని భక్తులకు అందజేసి పారువేట ఉత్సవాలను ప్రారంభించారు. చెంచులక్ష్మి అమ్మవారిని తోబుట్టువుగా భావించే చెంచులు తరలి వచ్చి డప్పులు మోగిస్తూ చేసిన నాట్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం విల్లంబులు చేతబట్టి పార్వేట ఉత్సవ పల్లకికి నమస్కార బాణాలు ఎక్కుపెట్టి సంధించారు. అనంతరం పార్వేట ఉత్సవ పల్లకి బాచేపల్లే గ్రామం వైపు పరుగులు తీసింది. నారసింహుడి పారువేట ఉత్సవ పల్లకిపై చెంచులువేసే బాణాలపై అర్చకులు మాట్లాడుతూ పూర్వం హిరణ్యకశిపుని సంహారానంతరం ఉగ్రరూపంతో స్వామి నల్లమల అడవుల్లో సంచరిస్తుండగా చెంచులక్ష్మి అమ్మవారు తారసపడ్డారు. ఆమెను మోహించిన స్వామి వారు వివాహం చేసుకునేందుకు సంసిద్దుఅయ్యారు. ఆచారం ప్రకారం కన్యాశుల్కం చెల్లించి మా ఇంటి ఆడపడచును పెండ్లి ఆడాలని కోరారు. తన వద్ద ఏమీలేదని కల్యాణోత్సవానికి సమీప గ్రామాలలోని ప్రజలను పిలిచి వారు అందించిన సహాయ సహకారాలతో కన్యాశుల్కం చెల్లించి పరిణయము ఆడతానని పారువేటకు బయలుదేరారని తెలిపారు. తమ ఇంటి ఆడపడచును వెంట తీసుకోకుండా వెల్లడం ఏంటని విల్లంబులతో చెంచులు అడ్డుకున్నట్లుగా పురాణాలు చెబుతున్నాయని అర్చకులు తెలిపారు. అన్న ప్రకారం 44 రోజులపాటు 33 గ్రామాలు పర్యటించి వచ్చి కన్యాశుల్కం చెల్లించి బ్రహ్మోత్సవాలలో చెంచులక్ష్మి అమ్మవారిని వివాహమాడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నంది వాహనంపై
దర్శనమిచ్చిన దేవీదేవేరులు
* వైభవంగా కల్యాణం
శ్రీశైలం, జనవరి 15 : మకర సంక్రాంతి పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఏడు రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన శనివారం స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చక వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వృద్ధ మల్లికార్జునస్వామి వారి ఆలయ ముఖ మండపంలో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజల అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, మండపారాధనలు, పంచ వరణార్చనలు, ఆగమ శాస్త్రంగా నిర్వహించారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు, జపానుష్టానాలు నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లు నందివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశేష కార్యక్రమంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరింపచేయించి అలంకరణ పూజల అనంతరం నందివాహనంపై వేంచింపచేయించి మరోమారు మంగళ హారతులు ఇచ్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో ఆలయ ఈఓ నారాయణ భరత్‌గుప్తా దంపతులు, జెఇఓ హరినాథ్‌రెడ్డి దంపతులు, ఆల య అర్చక వేదపండితులు, సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీ పార్వతి మల్లికార్జునస్వామి వారికి బ్రహ్మోత్సవ కల్యా ణం శాస్త్రానుసారంగా అర్చక వేదపండితులు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రతి రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తుండగా సంక్రాంతి రోజున మాత్రం పార్వతి కల్యాణం జరిపించడం విశేషం. ఈ కల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని తిలకించి పుణీతులయ్యారు.
స్వామి అమ్మవార్లకు బంగారు గొలుసు వితరణ
శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు నిజామాబాద్ జిల్లాకు చెందిన శోభారాణి దంపతులు 58 గ్రాముల బరువు కలిగిన బంగారు గొలుసును ఆలయ అధికారులకు అందించారు. ఆలయ అధికారులు నగను తూకం వేయించి అందుకు సంబందించిన రసీదును, స్వామి అమ్మవార్ల లడ్డూ ప్రసాదాలను ఇచ్చి భక్తులను ప్రోత్సహించారు.
అభివృద్ధి పథంలో సుంకేసుల..
* గ్రామమంతా సిసి రోడ్లు, సౌరవిద్యుత్, మరుగుదొడ్లు..
* ప్రతి ఇంటికీ ఉచితంగా కుళాయి కనెక్షన్..
* ఎస్సీలకు పన్ను మినహాయింపు..
* విద్య, వ్యవసాయంలో ముందడుగు..
అవుకు, జనవరి 15 : స్వచ్ఛ్భారత్ పిలుపునందుకున్న మండల పరిధిలోని సుంకేసుల గ్రామం పరిశుభ్రతతో పాటు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. సుంకేసుల గ్రామంలో మొత్తం 500 ఇళ్లు ఉండగా జనాభా 2,300 మంది కాగా అందులో 1400 ఓట్లు ఉన్నాయి. అభివృద్ధిలో భాగంగా గ్రామంలోని అంతర్గత రహదారులన్నింటినీ సిమెంటు రోడ్లుగా మార్చారు. అలాగే ప్రతిరోడ్డులో సౌర విద్యుత్‌తో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇంకా పెండింగ్ ఉన్న వీధుల్లో సిమెంట్ రోడ్లు వేసుకునేందుకు గ్రామపంచాయతీ, మండల పరిషత్, శాసనసభ్యుల కోటాతో రూ. 20 లక్షల నిధులు సమీకరించుకుని పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుద్ధిజల కేంద్రం ఏర్పాటు చేసి చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్, ఇవ్వడంతో పాటు ఎస్సీ కాలనీలకు ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నారు. మిలిగిన ప్రజలకు పరిమితంగా పన్ను వసూలు చేస్తున్నారు.
విద్య, వ్యవసాయంలో ముందడుగు
గ్రామానికి 4 వేల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. అందులో జొన్న, శెనగ, మిరుప, కంది, తదితర పంటలతో పాటు చీనీ, అరటి వంటి వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. భూమిని సారవంతంగా మార్చే జీవమృతాన్ని రైతులు తమ ఇళ్ల వద్దనే తయారుచేసుకుని తోటలకు పైపుల ద్వారా కనెక్షన్ ఏర్పాటు చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు సహకారం అందిస్తూ ఉపాధ్యాయులులేని సబ్జ్‌క్ట్టులకు విద్యావలంటీర్లను ఏర్పాటుచేసుకుని వారికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే గౌరవవేతనం అందిస్తున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు చక్కని భవన సముదాయాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు కూడా గ్రామస్థులతో మమేకమై విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇక పరిశుభ్రతపై దృష్టి సారించిన ఉపసర్పంచ్ చిలకల రామచంద్రారెడ్డి గ్రామంలో 200 ఇళ్లకు మరుగుదొడ్లు లేని విషయాన్ని గుర్తించి ఆయా ఇళ్లకు ప్రభుత్వం ద్వారా మరుగుదొడ్లు మంజూరు చేయించడంతో పాటు తాత్కాలికంగా తన సొంత నిధులు వెచ్చించి లెట్రిన్, బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేయించారు. గ్రామంలోని వద్ధ్రులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం నుంచి పింఛన్లు మంజురయ్యే విధంగా ఒకవైపు అధికారులకు, మరోవైపు గ్రామస్థులకు జవాబుదారితనంగా వ్యవహరిస్తూ గ్రామాభివృద్ధి తనవంతు సహకారం అందిస్తున్నారు. ఇలా సుంకేసుల గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతూ పలుగ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇలా సుంకేసుల గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతూ పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
గ్రామాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
- ఉపసర్పంచ్ చిలకల రామచంద్రారెడ్డి
సుంకేసుల గ్రామాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు తన వంతు సహకారం ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటుంది. అభివృద్ధికి ప్రజల సహకారం మరువలేనిది. గ్రామస్థులు మొదటిసారిగా తనను 2001వ సంవత్సరంలో సర్పంచ్‌గా ఏన్నుకున్నారు. ఆ తర్వాత 2006లో మహిళ రిజర్వేషన్ కావడంతో నా సతీమణి చిలకల మహేశ్వరమ్మను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. 2013లో సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కావడంతో తాను మద్దతిచ్చిన ముద్దుటుంగరం నాగమ్మను సర్పంచ్‌గా, నన్ను ఉపసర్పంచ్‌గా ఏన్నుకున్నారు. వారి రుణం తీర్చుకునేందుకు మంచి అవకాశం లభించింది.