కర్నూల్

పశ్చిమ ప్రాంతంపై నిర్లక్ష్యం నీడలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జనవరి 16:జిల్లాలో పశ్చిమ ప్రాంతాలైన ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాలపై నేతలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అందుకు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకాకపోవడమే నిదర్శనం. రెండేళ్ల నుంచి రబీ సీజన్‌లో తుంగభద్ర దిగువ కాలువకు నీరు లేక 1.05 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి సీమ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చుతానని ప్రకటనలు చేస్తుండగా మరోవైపు ఈ ప్రాంతం ప్రజాప్రతినిధులు, నాయకులు కర్నాటక అధికారులు, ముఖ్యమంత్రితో మాట్లాడి మన వాటా నీటిని కూడా తెప్పించుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో రైతులు నీరు లేక పంటలు ఎండిపోతుంటే చివరకు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విధంగా ప్రజలే న్యాయస్థానికి వెళ్లి నీరు కావాలని కోరినా ఈ ఏడాది కూడా నీరు లేక రబీ సీజన్ పూర్తిగా లేకుండాపోయింది. ఇక జిల్లాలో ప్రకటించిన కరవు మండలాల్లో ఆదోని డివిజన్ మండలాలే అధికంగా ఉన్నాయి. అయినా ఇంతవరకూ రైతులను ఆదుకునే చర్యలు తూతూ మంత్రంగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి చూస్తే రెయిన్‌గన్‌లతో పంటలను రక్షించానని గొప్పలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి అటు వెళ్లగానే రెయిన్‌గన్‌లు ఇటు వెళ్లిపోయాయి. అందువల్ల రైతులు కరవు బారినపడ్డారు. ఉపాధి హామీ పథకం రైతులకు ఉపాధి కల్పించడం లేదు. అందువల్ల రైతులు ఈ ప్రాంతం నుంచి బెంగళూరు, గుంటూరు, బళ్లారి, హైదరాబాద్, ముంబయి, తదితర ప్రాంతాలకు వలస పోతున్నారు. కోసిగి మండలం నుంచి అధికంగా ప్రతి రోజూ వలసలు పోతుండడంతో ప్రతిరోజూ కోసిగి నుంచి బెంగళూరుకు రెండు ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. వలస తీవ్రతకు ఈ రెండు బస్సులే అద్దం పడుతున్నాయి. మరోవైపు చూస్తే ముఖ్యమంత్రి హెచ్‌ఎల్‌సి కాలువకు హంద్రీనీవా నుంచి నీరు అందిస్తానన్నారు. అలాగే గత 8 సంవత్సరాల నుంచి నిర్మాణంలో ఉన్న నగరడోణ, రిజర్వాయర్ పథకానికి రూ. 30 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. వేదావతిపై రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 600కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన అనేక సభలలో ప్రకటించారు. ఇంత వరకూ ఆయన ప్రకటనలు అన్ని కూడా పత్రికలకే పరిమితం కావడం జరిగింది. ఈవిధంగా స్వయాన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే నీటి మూటలుగా మిగిలాయి. బనవాసి వద్ద టెక్స్‌టైల్స్ ఫార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎంపి బుట్టారేణుక, ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి, సిఎం చంద్రబాబు ఎన్నోసార్లు ప్రకటనలు చేశారు. అధికారులు వ్యాపార వేత్తలతో టెక్స్‌టైల్స్‌ఫార్కుపై సమావేశాలు కూడా నిర్వహించారు. కాని ఇంత వరకు టైక్స్‌టైల్స్‌ఫార్కు గురించి నిర్మాణం నేతల మాటలకే పరిమితమయ్యాయి. హంద్రీనీవా ఆదోని డివిజన్‌లోని పత్తికొండ, దేవనకొండ, మద్దికెర మండలాల మీదుగా కాలువలో నీళ్లుపోతున్నాయే తప్పా ఈప్రాంతానికి మాత్రం ఉపయోగం లేదు. నీటిని అంతా అనంతపురం జిల్లాకు మళ్లిస్తున్నారు. దీని వల్ల కరవు ప్రాంతం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు విద్యార్థులు ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, పిజి సెంటర్ ఏర్పాటు చేయాలని వచ్చిన ముఖ్యమంత్రులందరికీ కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు. ఎవరూ పట్టించుకోవం లేదు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పత్తికొండలో జరిగిన సభలో మాట్లాడుతూ పత్తికొండ పిజిసెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డివిజన్ కేంద్రమైన ఆదోనిలో ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తే ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థుల కోరిక కూడా నేరవేరుతుంది. ఇక వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పల్లేబాట కార్యక్రమంలోఆదోనికి వచ్చి బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. అయితే నిధులు విడుదలైన అనేక సాంకేతిక కారణాల వల్ల ఇప్పటికి బైపాస్ రోడ్డు నిర్మాణం ఆదోనిలో పూర్తి కాలేదు. అందరు సీనియర్ నాయకులు అధికార, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. కాని బైపాస్ రోడ్డు నిర్మాణం గురించి ముఖ్యమంత్రి వద్దకు ఆఖిల పక్షంగా ఏర్పడి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక ప్రజల కోసమే పోరాటాలు చేస్తామని చెప్పుకునే పార్టీలు కరవు యాత్రాల పేరుతో, రైతుల యాత్రాల పేరుతో ఊరు ఊరు తిరిగేరే తప్పా అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను ఒక వేదిక మీదకు తెచ్చి పశ్చిమ ప్రాంతం అభివృద్దిపైన దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం చేయకపోవడం రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి, పార్టీల ఆలక్ష్యానికి నిదర్శనంగా ఆదోని డివిజన్ మిగిలింది. ఆదోనిలోఏమి ఉందని అనే పరిస్థితి ఈరోజు దిగజారింది. కావున ఇకనైనా నాయకులు పశ్చిమ ప్రాంతం, ఆదోని పట్ల నిర్లక్ష్యం వీడి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారీగా పెరిగిన పత్తి ధర
* క్వింటాల్ రూ. 5,889
ఆదోనిటౌన్, జనవరి 16:ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం అమ్మకానికి వచ్చిన పత్తి క్వింటాల్ గరిష్టంగా రూ. 5,889 ధర పలికినట్లు యార్డు చైర్మన్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ. 5,351 పలుకగా 15 రోజుల్లోనే(సోమవారం నాటికి) రూ. 538 పెరిగి రికార్డు సృష్టించిందని ఆయన తెలిపారు. సోమవారం యార్డుకు 4,068 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ. 5,889 కాగా కనిష్ట ధర రూ. 4,068 ధర పలికిందని, మద్దతు ధర రూ. 5312 పలికినట్లు ఆయన వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో పత్తికి ఇంత భారీగా ధరలు లేవని ఆదోని మార్కెట్‌లో మాత్రం పత్తికి మంచి ధర లభిస్తుందన్నారు. అంతేకాకుండా పక్కనే ఉన్న కర్నాటకలోని బళ్లారి, రాయచూర్ మార్కెట్‌యార్డుల్లో కూడా పత్తికి ఇంత భారీగా ధర లేకపోవడంతో ఆయా ప్రాంతాల రైతులు, సరిహద్దు రైతులు ఆదోనియార్డుకు పత్తి తీసుకొస్తున్నారని ఆయన వివరించారు. రోజురోజుకూ పత్తి ధర పెరుగుతుండడం పట్ల రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.
నరకప్రాయం నంద్యాల-కడప
డెమో రైలు ప్రయాణం!
* ఎడ్లబండిని మరిపిస్తున్న వైనం..
* 4 గంటల ప్రయాణానికి ఆరున్నర గంటలు..
* రైలు ప్రయాణంపై ప్రజల అనాసక్తి..
నంద్యాల, జనవరి 16 : మూడు దశాబ్దాలుగా ఎదురుచూసిన నంద్యాల- యర్రగుంట్ల రైల్వే మార్గం గత ఏడాది ప్రారంభం కాగా నంద్యాల నుంచి కడప వరకూ డెమో రైలు నడుపుతున్నారు. అయితే నంద్యాల-కడప మధ్య తిరుగుతున్న డెమో రైలులో ప్రయాణం నరకప్రాయంగా ఉందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఎద్దుల బండి వేగంతో పోటీపడే విధంగా నడుస్తుందని కడప నుంచి నంద్యాలకు 4 గంటల్లో చేరుకోవాల్సి ఉండగా ఆరున్నర గంటల సమయం పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. నంద్యాల నుంచి కడపకు ప్రతి రోజూ ఈ డెమో రైలు రెండు ట్రిప్పులు తిరుగుతుంది. నంద్యాలలో ఉదయం 6 గంటలకు బయల్దేరి కడపకు ఉదయం 10 గంటలకు చేరుకోవాలి. అలాగే 10.30 గంటలకు కడపలో బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు నంద్యాల చేరుకోవాలి. నంద్యాలలో 2.15 గంటలకు బయల్దేరి సాయత్రం 6 గంటలకు కడపకు చేరుకుని వెంటనే నంద్యాలకు తిరుగు ప్రయాణమై రాత్రి 10 గంటలకు నంద్యాలకు చేరుకోవాల్సి ఉంది. నంద్యాల-కడప మధ్య తిరుగుతున్న డెమో రైలు యర్రగుంట్ల వరకూ గంటకు 20 కి.మీ వేగం కూడా మించడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 163 కి.మీ దూరాన్ని 4 గంటల సమయంలో చేరుకోవాల్సి ఉండగా ఆరున్నర గంటలు తీసుకోవడం దారుణమన్నారు. సాయంత్రం 6 గంటలకు కడప నుంచి బయలుదేరాల్సిన డెమో రైలు 7.30 నుంచి 8 గంటల మధ్య బయల్దేరి నంద్యాలకు రాత్రి 2 గంటలకు చేరుకుంటుందని, ఈ రైలులో రాత్రిపూట ప్రయాణించాలంటే భయం భయంగా ఉంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల-కడప మధ్య తిరిగే డెమో రైలుకు యర్రగుంట్ల స్టేషన్ వచ్చే వరకూ ఎక్కడా క్రాసింగ్‌లు కాని, గూడ్స్ రైళ్లు కానీ ఎదురుకావు. డెమో రైలు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ గమ్యస్థానం చేరుకునేందుకు గంటల తరబడి రైలులో రాత్రి పూట గడపడం నరక ప్రాయంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా కడప నుంచి యర్రగుంట్ల వరకూ కొంత మేర వేగంగా వస్తుందని ప్రయాణికులు కూడా యర్రగుంట్ల వరకూ ఎక్కువగా ఉంటారన్నారు. అయితే యర్రగుంట్ల నుంచి నంద్యాల చేరే వరకూ బోగిలో నలుగురైదుగురు తప్ప ఎక్కువ మంది ఉండడం లేదన్నారు. రైలులో ప్రయాణికులకు రక్షణగా పోలీసులు కూడా ఉండడం లేదని, దీంతో ప్రయాణికులు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయం భయంతో ప్రయాణం చేస్తున్నారు. ఇకనైనా రైల్వే అధికారులు ఈ మార్గంలో నడిచే డెమో రైలుకు వేగం పెంచి, త్వరగా గమ్యస్థానానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
నందినాటకోత్సవాలకు కర్నూలు వేదిక
* 22 నుంచి 2 వరకూ ప్రదర్శనలు
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు, జనవరి 16 : రాష్ట్ర ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 2016 నంది నాటకోత్సవాలకు కర్నూలు నగరం వేదిక కానున్నదని కలెక్టర్ విజయమోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాటకోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు కళాభిమానులు, ప్రజ లు ప్రతిఒక్కరు సహకరించాలని కో రారు. నగరంలోని సి.క్యాంపు సెంటర్ టిజివి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవి, నాటకరంగ అభివృద్ధి సంస్థ, విజయవాడ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకూ నాటక ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 2016 నంది నాటక శుభారంభ మహోత్సవం ఈ నెల 18వ తేది ఉదయం 9.30 గంటలకు టిజివి కాళా క్షేత్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. రాయలసీమ 4 జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రముఖ తెలుగు కళాకారులు ప్రదర్శించే కార్యక్రమాలకు నోడల్ అధికారిగా కర్నూలు ఆర్డీఓ రఘుబాబు వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. కావున కళాకారులు, కళాభిమానులు, ఔత్సాహిక కళాకారులు, ప్రముఖులు, ప్రజలు పెద్దఎత్తున హాజరై నందినాటకోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
శ్రీశైలంలో ఘనంగా
సంక్రాంతి పూర్ణాహుతి
శ్రీశైలం, జనవరి 16:మకర సంక్రాంతి పురస్కరించుకుని ఏడు రోజుల పాటు నిర్వహించబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన సోమవారం స్వామి, అమ్మవార్లకు అర్చక వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి యాగశాలలోని చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, లోక కల్యాణం కోసం జపాలు, నిత్య హోమాలు, బలిహరణలు, రుద్రహోమం, జయాది హోమాన్ని అర్చక వేదపండితులు శాస్త్రానుసారంగా నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా శాస్త్రోక్తంగా పూర్ణాహుతి ద్రవ్యాలు అయిన నారికేళాలు, సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పడగము, బంగారం, వెండి, నూతన వస్త్రాలను హోమ గుండానికి ఆహుతిగా సమర్పించడంతో రుద్రయాగ పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయింది. అనంతరం వసంతోత్సవంలో భాగంగా అర్చక వేదపండితులు వసంతాన్ని తడిపిన మంత్ర పూరిత జలాన్ని భక్తులపై సంప్రోక్షించారు. అవబృదంలో భాగంగా చండీశ్వర స్వామికి ఆలయ ప్రాంగణంలో ఉన్న మల్లికాగుండంలో వైదిక శాస్త్రాన్ని అనుసరించి స్నానాది కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు.
ధ్వజావరోహణ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల మొదటి రోజున బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజ స్తంభంపై ఆవిష్కరింపచేసిన ధ్వజ పతాకం అవరోహణ చేయబడింది. ఆయా కార్యక్రమాల్లో ఇఓ నారాయణభరత్‌గుప్తా దంపతులు, ఆలయ అర్చక వేదపండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పట్ల జాప్యం తగదు
* కాంట్రాక్టర్లు, అధికారులపై ఎమ్మెల్యే ఎస్వీ ఆగ్రహం
కర్నూలు సిటీ, జనవరి 16:నగరంలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను పూర్తి చేయటంలో ఎందుకు జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మున్సిపల్ కార్పొనేషన్ అధికారులను ప్రశ్నించారు. నగర పాలక సంస్థ సమావేశ భవన్‌లో సోమవారం పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎస్వీ మాట్లాడతూ సిఎం చంద్రబాబు నగరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించటమే కాకుండా వందలాది కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం నగర పాలక సంస్థలో దాదాపు రూ. 3.46కోట్ల పనులకు టెండర్లు పూర్తి చేసినప్పటికీ పనులపై కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని, పనులపై నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ల బిల్లులను వెంటనే నిలిపి వేయాలని ఆదేశించారు. అలాగే స్థానిక బుధవారపేట కాలనీలో రూ. 50లక్షల పనులు చేయటానికి టెండర్లు పూర్తి చేసి దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ కాంట్రాక్టర్ పని ప్రారంభించకపోయినా అధికారులు ఏమి చేస్తున్నారని ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు పనుల పనితీరుపై వారానికి ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించి వాటి స్థితిగతులను తెలుసకోవాలన్నారు. అంతేకాకుండా మున్సిపల్ పాఠశాలల్లో కేరీర్ ఫౌండేషన్ కోర్సు ప్రవేశపెట్టి విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. నగరంలో ఉన్న మన్సిపల్ పాఠశాలల్లో నెలకొన్న వౌలిక వసతులపై సర్వే చేసి నివేదిక పంపిస్తే పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం వహించకుంచా సకాలంలో పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, ఎస్‌ఇ శివరామిరెడ్డి, ఎంఇ రాజశేఖర్, డిఇఇలు శేషసాయి, రాధాకృష్ణ, మనోహర్‌రెడ్డి, నబిరసూల్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి శాస్ర్తిషబ్నం, బిల్డింగ్ సూపర్‌వైజర్స్, ఇన్‌స్పెక్టర్స్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
వంద శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు, జనవరి 16:దృఢమైన ప్రజాస్వామ్యానికి ఘనమైన ప్రాతినిధ్యాన్నిచ్చే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయమోహన్ నియోజకవర్గ ఇఆర్‌ఓలను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఓటు అత్యంత విలువైందని, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు హక్కు వినియోగ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేసేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా జూనియర్ కాలేజీలు, 9,10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఓటు హక్కు ప్రధాన్యతపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 4 కాలేజీలు, 4 హైస్కూల్స్, మండల స్థాయిలో ఒక పాఠశాల, ఒక హైస్కూల్ విద్యార్థులకు భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను వివరించాలన్నారు. తహశీల్దార్, ప్రిన్సిపాల్/ప్రధానోపాధ్యాయుల సమన్వయంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులు లేవనెత్తిన అంశాలపై ఎన్నికల సంఘం సూచించిన ప్రొఫార్మాలో పొందుపరచి ఈ నెల 23వ తేదీలోగా జిల్లా రెవెన్యూ అధికారికి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించా రు. అలాగే ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా బూత్ స్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకూ చేపట్టాల్సిన అంశాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇఆర్‌ఓలను ఆదేశించారు. ఓటు హక్కు వినియోగంపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు ఇది వరకే నిర్వహించామని వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాల్సి వుందని డిఆర్‌ఓ కలెక్టర్‌కు నివేదించా రు. సమావేశంలో జెసి-2 రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు.
తప్పులతడకగా
పంట నష్ట పరిహారం జాబితా!
* రోడ్డెక్కిన బాధిత రైతులు.. తహశీల్దార్, ఏఓ నిలదీత..
పెద్దకడబూరు, జనవరి 16:2015 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అధికారులు తయారు చేసిన జాబితా తప్పులతడకగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం కంబలదినె్న రైతులు తహశీల్దార్ ఛాంబర్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండల పరిధిలోని కంబలదినె్న, బసలదొడ్డి, నౌలేకల్, పెద్దకడబూరు గ్రామాల్లో అసలైన రైతులకు అన్యాయం చేస్తూ సెంటు భూమి లేని వారి బ్యాంకు ఖాతాల్లోకి వేలాది రూపాయాల పంట నష్ట పరిహారం డబ్బులు జమ చేయడం ఏంటని ప్రశ్నించారు. వారికి మద్దతుగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో స్పందించిన తహశీల్దార్ నాగరాజు కంబలదినె్న విఆర్‌ఓ దేవదాసును, ఏఓ హేమలతను పిలిపించి చర్చించగా ఆ జాబితా విఆర్‌ఓలు తయారు చేశారని, వ్యవసాయ సిబ్బందికి సంబంధం లేదని ఏఓ సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన కంబలదినె్న రైతులు పంట నష్ట పరిహారం జాబితాలో అవకతవకలకు పాల్పడిన కంబలదినె్న విఆర్‌ఓ దేవదాసును, ఏఓ హేమలతను సస్పెండ్ చేయాలని తహశీల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు తిక్కన్న, పరమేష్, రామన్న, రవిచంద్రరెడ్డి మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల పంట నష్ట పరిహారం జాబితా తప్పులతడకగా ఉందని, దీనికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరకు తహశీల్దార్, ఏఓ రైతుల వద్దకు వచ్చి జాబితాలో అవకతవకలపై విచారణ జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, జాబితాలో పేర్లు లేని రైతుల పేర్లను తిరిగి నమోదు చేసి జిల్లా అధికారులకు నివేదిక పంపుతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు నీలకంఠ, సుబాన్, నాగేంద్ర, తాయప్ప, కాశీం, అల్లయ్య, చాంద్‌బాషా, అంజినయ్య, బసప్ప పాల్గొన్నారు.
పకడ్బందీగా కానిస్టేబుళ్ల
నియామక పరీక్షలు:ఎస్పీ
కర్నూలు, జనవరి 16:ఈ నెల 22వ తేదీ జరిగే పోలీసు కానిస్టేబుళ్ల నియామక మెయిన్స్ పరీక్ష, ఈ నెల 29వ తేదీ జరిగే కమ్యునికేషన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్షల బందోబస్తుపై సోమవారం నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ జరిగే కానిస్టేబుల్ పరీక్షకు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి 16,800 మంది అభ్యర్థులు వస్తారని, వారు కర్నూలులోని 27 సెంటర్లలో పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వాచ్‌లు, ఇతర వస్తువులను అనుమతించబోమన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఒక రోజు ముందుగానే వెళ్లి సెంటర్, సెంటర్ కోడ్ సరైనదా లేదా అని చూసుకోవాలన్నారు. ఒకే పేరుతో కలిగిన కాలేజీలు ఎక్కువగా ఉండటం వల్ల చివరి క్షణం లో ఇబ్బందులకు గురికాకుండా చూ సుకోవాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. నిర్ణయించిన సమయం లోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నా రు. 10 గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రంలో బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ను మాత్రమే వాడాలన్నారు. పరీక్ష 10 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగుస్తుందన్నారు. పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్ష నిర్వహించే కేంద్రం చట్టూ దాదాపు 200 మీటర్ల వరకూ పరీక్ష జరిగే సమయం లో జిరాక్స్ షాపులు, హోటళ్లు, టైప్ ఇనిస్టిట్యూట్, నెట్ సెంటర్లు మూసివేయాలన్నారు. సమావేశంలో ఓఎస్‌డి రవిప్రకాష్, అడిషనల్ ఎస్పీ వెంకటేష్, కర్నూలు పుల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, ఏఓ అబ్దుల్‌సలాం, ఆర్‌ఐ రంగముని, తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
* ఎమ్మెల్సీ గేయానంద్
కర్నూలుసిటీ, జనవరి 16:ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ డా. గేయానంద్ పిలుపునిచ్చారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ వరకూ పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా సమావేశ భవన్‌లో ‘ప్రభుత్వ విద్య పరిరక్షణ-ఉపాధ్యాయుల పాత్ర’ అంశంపై ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు షణ్మూర్తి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని వర్గాలకు విద్యనందించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. 2009లో ఆర్భాటంగా అమలులోకి తెచ్చిన విద్యాహక్కు చట్టం వల్ల ఆశించినంత ప్రయోజనం లేదన్నారు. రాబోయే నూతన విద్యావిధానంలో ప్రభుత్వ విద్యారంగానికి, ఉపాధ్యాయ, అధ్యాపకులకు నష్టం కల్గించే అనేక ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. క్లస్టర్స్ స్కూల్స్, రేషనైలేజేషన్ పేరుతో వేల పాఠశాలల్లో పోస్టులను రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కావున ఉపాద్యాయులు ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించేందుకు కృషి చేయటమే కాకుండా సిపిఎస్‌ను రద్దు చేసేంత వరకూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, జానీ, అప్పారావు, చెన్నయ్య, నరసింహులు, శివశంకర్, రవీంద్రవిద్యాసంస్థల డైరెక్టర్ పుల్లయ్య, ఎస్టీయు జిల్లా కార్యదర్శి తిమ్మన్న, తదితరులు పాల్గొన్నారు.