కర్నూల్

ఎన్టీఆర్ గృహ నిర్మాణం లక్ష్యం చేరుకోవాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జనవరి 23:ఎన్‌టిఆర్ గ్రామీణ గృహ నిర్మాణం కింద నిర్మించే ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి సా కులు చెప్పకుండా నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాల్సిందేనని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, పారిశుద్ధ్య శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఆదేశించారు. నగరంలోని ప్రభు త్వ అతిథి గృహంలో గృహ నిర్మాణ శాఖ, డిఆర్‌డిఎ, డ్వామా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మృణాళిని మా ట్లాడుతూ ఎన్‌టిఆర్ గృహ నిర్మాణం పథకం కింద జిల్లాలో 14,850 ఇళ్ల నిర్మాణం చేపట్టడం లక్ష్యం కాగా అం దులో కేవలం 7,500 ఇళ్లను మాత్రమే ఆన్‌లైన్ చేశారన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని పారదర్శకంగా తీసుకుని మార్చి లోపు 75శాతం పూర్తి చేసి మిగిలిన 25 శా తం ఏప్రిల్ లోపు పూర్తి చేయాలన్నా రు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఇక మున్సిపాలిటీల్లో విఎల్‌సి, హౌసింగ్ ఫర్ ఆల్ పథకాల కింద చేపట్టే ఇళ్లకు మున్సిపల్ అధికారులతో అప్రూవల్ తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. అయితే వీటిలో ఎవరైనా లబ్ధిదారులు ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టుకుంటామని తెలిపితే నిబంధనల ప్రకారమే చేపట్టాలని సూచించారు. అలాగే గ్రా మీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్ల సముదాయాల్లో ఖచ్చితంగా క్రీడా ప్రాంగణం ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. సిఎం చంద్రబాబు ప్రతి గ్రా మానికి ఒక క్రీడా ప్రాంగణంతో పాటు ఉద్యావనం ఏర్పాటు చేయాలని ఆదేశించారని, సిఎం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా డిఆర్‌డిఎ కింద చేపట్టే ఇటుకల తయారీ కేంద్రాల యాజమానులు గృహ నిర్మా ణ శాఖకు సహకరించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి మం చి పేరు తీసుకురావాలన్నారు. డ్వామా కింద చేపట్టే పథకాలను సక్రమంగా లబ్ధిదారులకు అందేలా చేసి గ్రామీణాభృవృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేయాలన్నారు. గతంలో జగన్నాథగట్టుపై వేలాది ఇళ్ల నిర్మించారని, అయితే ఇళ్లలో లబ్ధిదారులు ఎవరూ ఉండటం లేదని దీంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం నిరుపయోగమైందన్నారు. ప్రస్తుతం సొంతంగా స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేసుకుంటానని దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ప్రోత్సహించాలన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ 2007లో జోహరాపురం గ్రామ సమీపంలో దాదాపు 4వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడితే లబ్ధిదారులు ఎవరూ సక్రమంగా ఇళ్లలో చేరకపోవటంతో నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. 4 వేల ఇళ్లకు అన్ని ఇళ్లను గ్రౌండింగ్ పూర్తి చేశారని, అయితే కొందరు లబ్ధిదారులు వివిధ కారణాల చేత ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయలేదని, కొందరు పూర్తి చేసినా వాటిలో చేరలేదన్నారు. ఏ లబ్ధిదారుడికైతే కేటాయించామో ఆ వ్యక్తి ఇంటిలో లేకపోతే వెంటనే ఆ ఇంటిని స్వాధీనం చేసుకుని మరొకరికి కేటాయించాలన్నారు. జెసి హరికిరణ్ మాట్లాడుతూ నిర్ధేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసి లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. అందరూ సమన్వయంతో ఉండి నిర్ణీత గడువులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ, డ్వామా, డిఆర్‌డిఎ పిడిలు హుస్సేన్‌సాహెబ్, పుల్లారెడ్డి, రామకృష్ణ, ఇఇలు, డిఇలు, తదితరులు పాల్గొన్నారు.
ఆదోని మార్కెట్‌యార్డు
చైర్మన్ పదవి ఉమాపతికే!
ఆదోని, జనవరి 23: రాయలసీమలోని అతి పెద్ద మార్కెట్‌యార్డుగా ఉన్న ఆదోని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని ఎవరికి ఇవ్వాలో పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు మాజీ జడ్పీటీసీ దేవేంద్రప్పకు ఖరారు అయినట్లు పెద్ద ఎత్తునప్రచారం జరుగుతుంది. అయితే టిడిపిలో చాలా మంది నేతలకు, కార్యకర్తల మనోభావం మాత్రం మరోలా ఉంది. టిడిపికి ఎంతో కాలం నుంచి సేవలు చేస్తూ పార్టీ అభివృద్ధికి పాటు పడుతున్న సీనియర్ నేత ఉమాపతినాయుడుకు చైర్మన్ పదవి ఇవ్వాలని చాలా మంది కార్యకర్తలు, నాయకులు స్పష్టం చేస్తున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి ఉమాపతినాయుడు తన అన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు వెంట ఉండి ఆయన విజయం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. ఆ తరువాత మీనాక్షినాయుడు ఓటమి పాలైనప్పటికి ఆయన తన సోదరుడు మీనాక్షినాయుడుకు పార్టీలో అండదండగా ఉంటూ పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఏ పదవి లేకుండా ఉమాపతి నాయుడు కార్యకర్తలను, నాయకులను నడిపించడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. టిడిపికి వెన్నుదన్నుగా ఉండాలన్న ఉద్దేశంతో ముస్లిం మైనార్టీలను పార్టీలోకి తీసుకురావడానికి కృషి చేశారు. అంతేకాకుండా ఆదోని నియోజకవర్గంలో టిడిపిని బలోపేతం చేయడంలో తెరవెనుక రాజకీయాలు చేయడంలో ఉమాపతి నాయుడు ఎంతో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా అధికారం లేనప్పుడు పార్టీ కార్యకర్తలు, నాయకులను కాపాడడంలో కూడా ఉమాపతి నాయుడు ముందుభాగాన ఉండడంతో కార్యకర్తల్లో, నాయకుల్లో ఉమాపతి నాయుడు చెరగని ముద్రవేశారు. అందువల్ల పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు టిడిపి ఆవిర్భావం నుండి ఆదోని నియోజకవర్గంలో ఆ పార్టీ అభివృద్ధి కావడానికి కృషి చేస్తున్న ఉమాపతికి ఈసారి మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు తమ మనస్సులో మాటను బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మాత్రం తన కుటుంబంలో మరొకరు రాజకీయంలో రారని గతంలో ప్రకటించారు. అయితే కార్యకర్తలు, నాయకులు మాత్రం ఇంతకాలం ఎలాంటి పదవి లేకుండా ఉమాపతి నాయుడు పని చేయడం అని బహిరంగంగానే అంటున్నారు. ఎంతో కాలం నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉమాపతినాయుడుకు ఆదోని మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వాలని నాయకులు, కార్యకర్తలు తన మనోభావాలను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అవసరమైతే ఉమాపతినాయుడు చైర్మన్ పదవి ఇప్పించడానికి నేతలపైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా సిద్ధమైన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఈ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఉన్న చైర్మన్ పదవి ముగియడంతో చైర్మన్ పదవి కోసం ఆశలు పెరిగిపోయాయి. కార్యకర్తలు, నాయకుల్లో మాత్రం ఉమాపతి నాయుడువైపే చూపులు ఉన్నాయి.
పాలిటెక్నిక్ హాస్టల్‌లో చొరబడిన
నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు
* నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి
నంద్యాల, జనవరి 23: నంద్యాల పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల బాలికల హాస్టల్‌లో హల్‌చల్ చేసి దొంగతనానికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని, వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నట్లు డిఎస్పీ హరినాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం కళాశాల ఆవరణలోని బాలికల హాస్టల్ భవనాన్ని, గదులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పనులు చిల్లర గ్యాంగ్ చేసిందని అభిప్రాయపడ్డారు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మత్తు పదార్థాలకు బానిసలైన గ్యాంగ్ పనులేనని ఆయన అన్నారు. ఏది ఏమైనా బాలికల హాస్టల్‌లో హల్‌చల్ చేసిన గ్యాంగ్‌ను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈయన వెంట టూ టౌన్ సిఐ గుణశేఖర్‌బాబు ఉన్నారు. అనంతరం డిఎస్పీని పలు విద్యార్థి సంఘాల నాయకులు కలిసి వినతిపత్రాలు అందించారు. రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజునాయుడు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థి సంఘం నాయకులు రామచంద్రుడు, ఎపిఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగనవీన్, జివియస్ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాయక్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు ధనుంజయలు మా ట్లాడుతూ నంద్యాలలో రోజు రోజుకు క్రైం రేటు పెరిగిపోతుందని, మద్యం మత్తులో అనేక అరాచకాలు జరుగుతున్నాయన్నారు. పోలీసులు పట్టణంలో రాత్రివేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని కోరారు. హాస్టల్‌లో దొంగతనం చేసి హల్‌చల్ చేసిన వారిపై నిర్భయచట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, పట్టణంలో రాత్రి పూట అన్ని ప్రధాన కూడళ్లలో డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహించి తాగుబోతులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. వందలాది మంది బాలికలు ఉంటున్న హాస్టల్‌లో వాచ్‌మెన్‌ను పెట్టకపోవడం దారుణమని వారు విమర్శించారు.
జీఓ నెం 884 రద్దు చేయాలి
* ఏఐటియుసి డిమాండ్
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 23: జీఓ నెం 884ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు శివ అధ్యక్షతన 200 ఆటోలు, 400 మంది ఆటో కార్మికులతో ఆర్‌టిఎ కార్యాలయాన్ని దిగ్బంధించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్, నగర అధ్యక్షుడు వెంకటేష్, రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారని, వీరంతా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక తమ కుటుంబాల పోషణ కోసం ఆటోలు నడుపుతున్నారన్నారు. అలాంటి నిరుద్యోగులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై అనేక రకాల పన్నులు విధిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ఆటో కార్మికులకు ప్ర భుత్వం రాయితీలు అందించి వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. పెంచిన ఆర్‌టిఎ ఫీజులను వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో కార్మికుల చేత భారీ ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు, ఆటో యూనియన్ నాయకులు జయరామిరెడ్డి, గణేష్, ఇజ్రాయేల్, రవి, యేసు, స్వాములు, గంగారం, జగన్, ఇబ్రహీం, మధు, రాము, తదితరులు పాల్గొన్నారు.
పల్స్‌పోలియో విజయవంతం చేయండి
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు, జనవరి 23:ఈ నెల 29వ తేదీ 0-5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలి యో చుక్కలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో పల్స్‌పోలియోపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మండలాల్లోని తహశీల్దార్లు సంబంధిత మెడికల్ ఆఫీసర్లు స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ కార్యదర్శి స్థాయి నుంచి మండల స్థాయి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పటిష్టంగా ఏర్పాటు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఐదేళ్ల లోపు వున్న ఏ ఒక్కరినీ మరచిపోకుండా అందరికీ పోలియో చక్కులు వేసే లా కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని డిఆర్‌ఓను ఆదేశించారు. పల్స్‌పోలియో మార్గదర్శక సూత్రాలపై అందరికీ లేఖలు రాసి వందశాతం భాగస్వామ్యానికి సహకరించాని డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. పల్స్‌పోలియోపై గ్రామస్థాయిలో టాం.. టాం.. దండోరాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ నెల 28వ తేదీ అన్ని పాఠశాలల విద్యార్థుల చేత పల్స్‌పోలియోపై ర్యాలీ నిర్వహించాలని డిఇఓను ఆదేశించారు. ఈ నెల 30 నుంచిడి 3 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాని డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. అలాగే ఆర్‌టిసి బస్సు ల్లో పోలియో చుక్కలు వేయడంతో పాటు బస్టాండ్‌లో పల్స్‌పోలియో కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. పల్స్‌పోలియో చుక్కలపై ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు టెలిఫోన్‌లో డయల్ టోన్ మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని బిఎస్‌ఎస్‌ఎల్ అధికారులకు సూచించారు. సమావేశంలో డిఆర్‌డిఎ పిడి రామకృష్ణ, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డా. వీరాస్వామి, మైనార్టీ సంక్షేమాధికారి మస్తాన్‌వలి, తదితరులు పాల్గొన్నారు.
సెక్యూరిటీ గార్డు మృతికి
ప్రభుత్వానిదే బాధ్యత
* మృతదేహంతో ఎమ్మెల్యే ఐజయ్య ధర్నా
నందికొట్కూరు, జనవరి 23:మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు హంద్రీనీవా రెండవ ఎత్తిపోతల పథకం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నాగేంద్ర ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెందాడని, ఆయన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే ఐజయ్య డిమాండ్ చేశారు. హంద్రీనీవా కాలువలో గల్లంతైన యువకుడి శవాన్ని సోమవారం వెలికితీశారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగేంద్ర ప్రాజెక్టు వద్ద గత రెండేళ్లుగా సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడన్నారు. ప్రాజెక్టుకు అమర్చిన సిమెంట్ దిమ్మెలు నాణ్యతగా లేకపోవడంతోనే దిమ్మె కూలి అక్కడి నుంచి కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడన్నారు. కావున ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులవి ప్రాణాలు కావా..
* కలెక్టరేట్ ఎదుట బాధిత కుటుంబాల ఆందోళన
కర్నూలు, జనవరి 23:మావోయిస్టులవేనా.. పోలీసులవి ప్రాణాలు కాదా అని సోమవారం పోలీసు మృతుల కుటుంబాలు చిన్నారులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగ బాధితులు లక్ష్మిరాణి, స్వర్ణకుమారి, వాణి, ప్రసాద్‌రావు మాట్లాడుతూ రాష్ట్రం, దేశంలో మావోయిస్టుల తరఫున ప్రజాసంఘాల పేరుతో కొందరు హింసా కార్యక్రమాలు కొనసాగిస్తూ వాటికి వంత పాడుతున్నారని ఆరోపించారు. ఎక్కడో ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్‌లో ఏదైనా సంఘటన జరిగినా ఇక్కడ ఉద్యమాలు, నిరసనలతో ప్రభుత్వాలను విమర్శించడం చేస్తున్నారన్నారు. మావోయిస్టుల వల్ల ఎన్నో కుటుంబాలు కుటుంబ పెద్ద దిక్కులను కోల్పోయి అనాథలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం, అధికారులు బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలిచి ఆర్థిక సహాయం, ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు. ఇక నక్సల్స్ చేస్తున్న హింస, దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 23:అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం వెంటనే రూ. 1000 కోట్లు మంజూరు చేసి ఆదుకోవాలని ఏపి అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మల్లికార్జున కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక శ్రీ కృష్ణదేవరాయ సర్కిల్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు సిపిఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, సిపిఎం రాష్ట్ర నేత టి.షడ్రక్, ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, మహిళా సంఘం నాయకురాలు పి.నిర్మల సంఘీభావం తెలిపారు.

నాయకత్వ లోపం వల్లే టిడిపికి బీటలు
* బైరెడ్డి సిద్దార్థరెడ్డి
ఓర్వకల్లు, జనవరి 23:నాయకత్వ లోపం వల్ల జిల్లాలోని పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో టిడిపి బీటలు వారుతోందని బైరెడ్డి సిద్దార్థరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని గుట్టపాడు గ్రామంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఒకప్పుడు నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాలు టిడిపికి కంచుకోటగా వుండేవన్నారు. అయితే ప్రజలకు అధికార పార్టీ నేతలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో టిడిపి అవసాన దశకు చేరిందన్నారు. నిజమైన పార్టీ కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. దీంతో తాను ప్రజలకు అందుబాటులో వుంటూ ప్రజా సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నానన్నారు. సమావేశంలో జిల్లా టిడిపి కార్యదర్శి మోహన్‌రెడ్డి, నాయకులు సయ్యద్‌అహ్మద్, నజీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
ఆదోని మున్సిపాలిటీలో
7 గ్రామాల విలీనానికి చర్యలు
* 28లోగా ప్రభుత్వానికి నివేదిక
ఆదోనిటౌన్, జనవరి 23: ఆదోని మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మున్సిపల్ అధికారులు ఆదేశాలు రావడంతో పట్టణానికి సమీపంలో ఉన్న 7 గ్రామాలను ఆదోనిలో విలీనం చేసేందుకు మున్సిపల్ అధికారులు గత వారం రోజులుగా ముమ్మరంగా చర్యలు తీసుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం టౌన్ ప్లానింగ్ అదికారి మహబూబ్‌బాషా గ్రామాల విలీనంకై రికార్డులను పరిశీలించారు. ఆదోని పట్టణానికి సమీపంలో ఉన్న మదిరే, ఇస్వీ, మండిగిరి, బసాపురం, డాణాపురం, నాగనాథనహళ్ళి, వి.కొండాపురం గ్రామాలను ఆదోని విలీనం చేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందని ఈమేరకు మున్సిపల్ కమిషనర్ గోవిందప్ప ఆధ్వర్యంలో విలీన ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ఆదోని జనాభా 2011 లెక్కల ప్రకారం లక్ష 80వేలు కా గ్రామీణ ప్రాంతాలకు చెందిన జనాభా 24వేలు కలుపుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం 2016 జనాభా లెక్కల ప్రకారం ఆదోని, 7 గ్రామల జనాభా 2 లక్షలకు పైగా ఉందన్నారు.
అలాగే ఆదోని పట్టణ విస్తీర్ణం 31.76 చదరపు కిలో మీటర్లు ఉందని, గ్రామాల విస్తీర్ణం 7.38 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం ఉందని, ఈరెండు కలిపితే సుమారు 40 చదరపు కిలో మీటర్ల విస్తర్ణం అవుతుందని, అలాగే మున్సిపాలిటీ ఆదాయం, ప్రస్తుతం రూ. 9.37 కోట్లు కాగా గ్రామాల ఆదాయం రూ. 75లక్షలు ఉందన్నారు. ముఖ్యంగా ఆదోనిలో గ్రామాలను విలీనం చేయడం వల్ల ఆయాగ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు.

విద్యార్థులు విభిన్నంగా ఆలోచించాలి
* రచయిత యండమూరి వీరేంద్రనాథ్
నంద్యాలటౌన్, జనవరి 23:విద్యార్థులు నిరంతరం కొత్త కోణాల్లో విభిన్నంగా ఆలోచిస్తూ ముందుకు సాగాలని, అందరూ ఆలోచించే దానికన్నా విభిన్నంగా ఆలోచన చేయాలని ప్రముఖ నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంధ్రనాథ్ విద్యార్థినీ, విద్యార్థులకు తెలిపారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ టౌన్‌హాల్‌లో ఆపద్భాందవ సేవా సొసైటీ ఆధ్వర్యంలో బడ్డింగ్ సొసైటీ సహకారంతో విద్యార్థినీ, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమాన్ని బడ్డింగ్ సొసైటీ అధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, సేవా సంస్థ నిర్వాహకులు రమేశ్‌తో పాటు పలువురు సభ్యులు నిర్వహించిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా యండమూరి వీరేంద్రనాథ్, మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం ఆయన విద్యార్థినీ, విద్యార్థులకు చదువులో, జీవితంలో ఎలా రాణించాలనే అంశాలను యండమూరి వివరించారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు శోభారాణి, మాలేపాటి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సనాతన ధర్మ పరిరక్షణకు అందరి కృషి
కొలిమిగుండ్ల, జనవరి 23: సనాతన ధర్మ పరిరక్షణకు అందరు కృషి చేయాలని సమరసత జిల్లా ప్రచారక్ బాల సుబ్రమణ్యం అన్నారు. మండలంలోని కనకాద్రిపల్లె గ్రామ అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆలయాల పునరుద్దరణకు ప్రతి ఒక్కరు కృషి చేయాల, ఆలయాలకు వెళ్లి భజనలు చేయాలని, ప్రతి ఇంటిలో రామాయణం, మహాకావ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇంటి పెద్ద నైతిక విలువలను తెలియజెప్పేలా భారత, భాగవత, రామాయణం, వేదాలు, ఉపనిశత్తుల సారాంశాన్ని రానున్న తరాల వారికి అందించే విధంగా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు లాంటి భక్త్భివంతో కూడిన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ధార్మిక శిక్షణలో భాగంగా విజయవాడలో, కొలిమిగుండ్ల మండలంలోని ప్రతి గ్రామం నుండి ముగ్గురిని ఎంపిక చేస్తున్నట్లు, అలాగే అర్చకత్వ శిక్షణలో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఇద్దరిని ఎంపిక చేసి ధార్మికత్వంలో శిక్షణ కోసం విజయవాడలోను, అర్చకత్వ శిక్షణ కోసం తిరుపతిలోను ఉచిత సౌకర్యం కల్పించి టిటిడి వారు ఉచిత శిక్షణ అందజేస్తారన్నారు. ఆసక్తిగల వారు మండల సమరసత సేవా ఫౌండేషన్ వారిని కలవాలని వారు సూచించారు. అనంతరం తోలమడుగు గ్రామానికి వెళ్లి గ్రామంలో ఆలయాలు పరిశీలించి గ్రామస్తులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఈకార్యక్రమంలో మండల సేవా పౌండేషన్ ప్రచారక్ శ్రీనివాసులు, కన్వీనర్లు శేఖర్, సుబ్బయ్య, సభ్యులు సాంబయ్య, తిరుమలయ్య, జయరాముడు, మనోహర్‌రెడ్డి, లక్ష్మయ్య, మండలంలోని 24 గ్రామాలకు చెందిన సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

అట్రాసిటీయాక్ట్ ఏర్పాటు చేయాలి

మంత్రాలయం, జనవరి 23: బ్రాహ్మణులను ఎవరైనా కించపరచి మాట్లాడితే వారిపై బ్రాహ్మణ అట్రాసిటి యాక్ట్ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ సేవాసంఘం సమైక్య రాష్ట్ర కార్యదర్శి హెచ్‌కె మనోహర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మంత్రాలయంలోని టిటిడి కల్యాణ మండపంలో రాష్టప్రతి అవార్డు గ్రహీత, పండిత రేసరి, రాజా ఎస్ గిరియాచార్యుల అధ్యక్షతన బ్రాహ్మణుల సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు సముద్రాల హనుమంత రావు, రాష్ట్ర కార్యదర్శి మెంబర్ హెచ్‌కె రాజశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్‌కె మనోహర్ రావు మాట్లాడుతూ 75 శాతం పేద బ్రాహ్మణులుగా ఉన్న వారిని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. బ్రాహ్మణులు ఎవరైనా రానున్న ఎన్నికల్లో టికెట్ సంపాదించుకుంటే వారి గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణుడు రూ.12లు ప్రిమియం చెల్లిస్తే వారికి సంఘం ద్వారా రూ.2లక్షల భీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. బ్రాహ్మణ సంఘం ద్వారా నిర్వహించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతక ముం దు శ్రీరాఘవేంద్ర బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో బ్రా హ్మణ విద్యార్థులకు పురందర్ దాసుల ఆరాధన సందర్భం గా నిర్వహించిన క్విజ్, వివిధ ధార్మిక, సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంశా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పన్నగ వెంకటేష్, వ్యాసరాజాచార్, సంస్కృత పాఠశాల ప్రిన్సిపాల్ వాదిరాజాచార్ తదితరలు పాల్గొన్నారు.
మా స్థలం చూపండి...
ఉయ్యాలవాడ, జనవరి 23: ఇందిరమ్మ పథకం కింద మాకు మంజూరు చేసిన స్థలాలను చూపాలంటూ లబ్ధిదారులు తహశీల్దార్ మోసేజ్‌ప్రసన్‌ను సోమవారం అభ్యర్థించారు. మండలంలోని ఇంజే డు గ్రామానికి చెందిన సామే లు, రాజన్న, ఓబులేస్‌తో పాటు మరి కొందరు లబ్ధిదారులు మాట్లాడుతూ గ్రామంలోని 488-1 సర్వే నెంబర్‌లో 2.50 ఎకరాలు 1976వ సంవత్సరంలో దళితుల కోసం ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసిందన్నారు. అప్పట్లో 5 సెంట్ల ప్రకారం పట్టాలు ఇచ్చారని, ఇంత వరకు స్థలాలు చూపలేదన్నారు. ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమిలో కొందరు ఆక్రమించుకుని పంట నూర్పిడి కళ్లాలు, చెత్త దిబ్బలుగా వాడుకుంటున్నారన్నారు. తహశీల్దార్ స్పందిస్తూ మీ గ్రామానికి ఆర్‌ఐ, సర్వేయర్‌ను పంపించి సర్వే చేసి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
గుర్తు తెలియని శవం లభ్యం
చాగలమర్రి, జనవరి 23: మండలంలోని ముత్యాలపాడు తాండ సమీపంలో తెలుగుగంగ వంతెన వద్ద సోమవారం గుర్తు తెలియని మహిళా శవాన్ని పోలీసులు గుర్తించారు. ఎం.తాండ నుండి రామాపురం పోయే రస్తాలో ఈ మహిళా శవం లభించినట్లు ఎస్ ఐ మోహన్‌రెడ్డి తెలిపారు. పంజాబి డ్రస్ ధరించి 20 సంవత్సరాల వయస్సు ఉంటుందని, అస్తిపంజరం బయటపడిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బేతంచర్ల, జనవరి 23: పట్టణంలోని జెండాపేటలో 18వ తేదీ గ్యాస్ లీకేజీతో ఏర్పడిన ప్రమాదంలో గాయపడిన మారం వెంకటేశ్వర్లు(53) హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు. వెంకటేశ్వర్లు టీ చేసుకునేందుకు లైట్ వెలిగించగా గ్యాస్ లీకేజీతో చెలరేగిన మంటల్లో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా అతడికి భార్య, కుమారుడు ఉన్నారు.
ల్యాబ్ టెక్నీషియన్‌కు మూడేళ్ల జైలు
ఆత్మకూరు, జనవరి 23:పట్టణంలో ల్యాబ్‌ను నిర్వహిస్తున్న బి.నాగశేషులుకు మూడేళ్లల జైలు శిక్ష, రూ. 1.2 లక్షలు జరిమానా విధించినట్లు సోమవారం నంద్యాల డ్రగ్ ఇన్‌స్పెక్టర్ హరహరతేజ తెలిపారు. వివరాలు.. 2010లో అప్పటి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ విజయశేఖర్ వెలుగోడు పట్టణంలో ఉన్న నాగశేషులు నిర్వహిస్తున్న మహంత ల్యాబ్‌ను తనిఖీ చేశారన్నారు. ఆ సయమంలో ల్యాబ్‌లో మందులు పెట్టుకుని వైద్యం చేస్తున్నట్లు ఆయన కేసు నమోదు చేశారన్నారు. ఆ కేసుకు సంబంధించి సోమవారం విచారణ నిర్వహించి జూనియర్ జడ్జి రామకృష్ణ నిందితుడికి శిక్ష, జరిమానా విధించారని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
మట్కాబీటర్ల అరెస్టు
తుగ్గలి, జనవరి 23: మండలంలో జొన్నగిరికి చెందిన నాగరాజు, ఉప్పర్లపల్లికి చెందిన సత్యనారాయణ అనే మట్కా బీటర్లను జొన్నగిరి ఎస్‌ఐ మారుతి శంకర్, పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2200లు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నారు. మట్కాబీటర్ల ఇద్దరిని పత్తికొండ కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మహిళ నుంచి రూ. 14 వేలు చోరీ
డోన్, జనవరి 23:మహిళ నుంచి రూ. 14 వేల నగదు దొంగలించిన సంఘటన సోమవారం పట్టణంలోని ఎస్‌బిఐ శాఖలో చోటుచేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పొదుపు సంఘం సభ్యురాలు కేశమ్మ సోమవారం పట్టణంలోని ఎస్‌బిఐ శాఖకు వచ్చింది. ఈమె మదర్‌థెరిస్సా గ్రూపునకు చెందిన రూ. 24 వేలు డ్రా చేసి బ్యాగులో ఉంచుకుంది. అదే సమయంలో వెనుకనే వున్న మరో మహిళ త్వరగా వెళ్లామని చెప్పింది. కేశమ్మ బ్యాంక్‌లో నుంచి బయటకు వచ్చి చూసుకోగా ఆమె వద్ద ఉన్న బ్యాగ్‌ను కత్తితో కోసి ఉండడం, బ్యాగ్‌లో కేవలం రూ. 10 వేలు మాత్రమే ఉండడంతో రూ. 14 వేలు చోరీకి గురైనట్లు గుర్తించింది. వెంటనే లబోదిబోమంటూ ఈ విషయాన్ని బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ నెల 10వ తేదీ ఇదే బ్యాంక్‌లోనే పట్టణంలోని కొండపేటకు చెందిన బీబీ నుంచి రూ. 24 వేలు కాజేసిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన జరిగి పక్షం రోజులు కూడా కాక ముందే మరో సంఘటన జరగడంతో బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.