కర్నూల్

ఆదోనికి మిర్చీ మార్కెట్ వచ్చేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఫిబ్రవరి 5 : గతంలో ఉన్న ముఖ్యమంత్రులకు, వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రులకు ఆదోనిలో మిరపకాయల మార్కెట్ చేయాలని ఎన్నిసార్లు వ్యాపారులు, రైతులు మోరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని మార్కెటింగ్‌శాఖ కమిషనర్ దృష్టికి కూడా మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆదోనిలో మిర్చీ మార్కెట్ ఏర్పాటు చేయకపోవడంతో కోట్ల రూపాయాల ఆధాయం మార్కెట్ కోల్పోతోంది. రైతులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కావున ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు హయాంలోనైనా ఆదోనిలో మిరప కాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని మిర్చీ రైతులు కోరుతున్నారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ రాయలసీమ జిల్లాలోని అతి పెద్ద మార్కెట్ దాదాపు100 ఎకరాల్లో మార్కెట్ ఉంది. మిర్చీ మార్కెట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. ఆదోని డివిజన్‌లో కూడా మిర్చీ పంటను పెద్దఎత్తున పండిస్తారు. కాని కర్నూలు జిల్లాలో ఉన్న ఏ మార్కెట్‌యార్డులలో కూడ మిరపకాయల అమ్మకాలు సాగడం లేదు. మిరపకాయల అమ్మకాలు లేకపోవడంతో మిరపపంటను పండించిన రైతులు దూరప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. ఇలా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళడం వలన కోట్లాది రూపాయల వ్యయం రైతుల నెత్తిన పడి రైతులు నష్టపోతున్నారు. ఆదోని మార్కెట్ యార్డులో మిరపకాయల అమ్మకాలు సాగించి రైతులకు మేలు చేయమని గత రాష్ట్ర ముఖ్యమంత్రికి, మార్కెటింగ్‌శాఖ మంత్రికి రైతులు, వ్యాపారులు చేసిన విజ్ఞప్తులన్ని బుట్టదాఖలయ్యాయని పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు పెద్ద ఎత్తున మిరప పంటను ప్రతి సంవత్సరం పండిస్తున్నారు. కానీ అమ్మకానికి మార్కెట్ సౌకర్యం లేదు. ఆదోని డివిజన్‌లో ఉన్న నియోజకవర్గాలేకాక నంద్యాల, గద్వాల, కర్నూలు ప్రాంతాల్లో 25వేల ఎకరాల్లో, నంద్యాల్లో 20వేల ఎకరాలు, కర్నాటకలోని సింధనూరు, శిరుగుప్ప, రాయచూరు, బళ్ళారి ప్రాంతాల్లో 30వేల ఎకరాల్లో మొత్తం లక్షా 10వేల ఎకరాల్లో మిరప పంటను రైతులు పండిస్తున్నట్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి సమర్పించిన వినతిపత్రంలో వ్యాపారులు, రైతులు స్పష్టం చేశారు. ఎకరానికి 12క్వింటాళ్ల మిరపను రైతులు పంటను పండిస్తున్నారు. ఈలెక్కన 13లక్షల 20వేల క్వింటాళ్ల మిరప పంటను రైతులు పండిస్తున్నారు. ఆదోనిలో మార్కెట్ సౌకర్యం మాత్రం లేదు. 600కోట్ల రూపాయల విలువ గల మిరప పంటలో, బ్యాడిగి రకం మిరపకాయలు రూ.340కోట్ల వరకు ఉన్నాయి. బ్యాడిగి రకం మిరప క్వింటాల్ 6వేల రూపాయల వరకు ధర పలుకుతుంది. దాదాపు 800కోట్ల రూపాయల విలువగల మిరప పంట రైతులు కర్నాటకలోని బ్యాడిగి మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారు. మిరపపంట అమ్మకాల వలన రూ.165కోట్ల మేరకు ఆదాయం రైతులకు వస్తుంది. ఈప్రాంతంలో ఎక్కడ మార్కెట్ సౌకర్యం లేకపోవడం వలన రైతులు 400కి.మీ.,దూరంలో ఉన్న కర్నాటకలోని బ్యాడిగి మార్కెట్‌కు బ్యాడిగి రకం మిరప పంటను లారీలలో తీసుకెళ్ళి అనేక వ్యయ ప్రయాసాలకు లోనవుతూ అమ్ముకుంటున్నారు. మిగిలిన రకం మామూలు మిరప పంట 500కి.మీ.,దూరంలో ఉన్న గుంటూరు మార్కెట్‌కు తీసుకెళ్ళి రైతులు అమ్ముకుంటున్నారు. ఇలా సుదూర ప్రాంతాలకు రైతులు మిరప పంటను తీసుకెళ్ళి అమ్ముకోవడం వలన రైతులకు ప్రతి సంవత్సరం రూ.50కోట్ల మేర అదనంగా రవాణా వ్యయం ఈ సంవత్సరం మళ్లీ పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో మిరప కాయలు తీసుకెళ్ళి అమ్ముకునే సందర్భంలో లారీలకు ప్రమాదాలు జరిగి రైతులు చనిపోవడం కూడ జరిగింది. స్థానికంగా మిరప పంట విక్రయ మార్కెట్ ఏర్పాటు చేస్తే ఆదోని మార్కెట్‌కు రూ.6కోట్ల ఆదాయం వస్తుంది. మార్కెట్ లేక రూ.6కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుందని వ్యాపారులు పేర్కొన్నారు. ఆదోనిలో మిరప పంట విక్రయ మార్కెట్ లేకపోవడం వలన వ్యాపారమంతా కర్నాటకకు తరలిపోతోందని వ్యాపారులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కూడ రవాణా వ్యయంతో విలవిలలాడుతున్నారు. మిరప కాయల ధర తగ్గిపోతే పండించిన పంట రవాణా ఖర్చులకే సరిపోతున్నాయని పలుగ్రామాల రైతులు వాపోతున్నారు. ఆదోనిలో మిరప కాయల మార్కెట్ అమ్మకాలు సాగించడానికి చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు సాయిప్రసాద్‌రెడ్డి, మాజీ శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు రాచోటి రామయ్య, ఆదోని వేరుశెనగ, పత్తి, దూది వ్యాపారుల సంఘం అధ్యక్షులు ఎరువుల వ్యాపారుల సంఘం నాయకులు అశోక్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నసీరుద్దీన్‌పటేల్, తదితరులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. అయినా ఆదోనిలో మిరపకాయల విక్రయ మార్కెట్ ఏర్పాటు కాలేదు. రైతులకు కోట్ల రూపాయల రవాణా వ్యయం తప్పలేదు. మిరప పంటను రైతులు ఏయేటికాయేడు అధికంగా పండిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం నేత నారా చంద్రబాబునాయుడు రైతులు పండించే మిరప పంట అమ్మకాలకు మిర్చి మార్కెట్‌ను ఆదోనిలోఏర్పాటు చేసి రైతులకుప్రయోజనం చేకూర్చాల్సిన అవసరం ఎంతోఉంది.చంద్రబాబు పాలనలోనైన మిర్చి మార్కెట్ ఆదోనిలో ఏర్పాటు చేస్తే రైతుల కష్టాలు తొలగిపోతాయి.

పూర్తయ్యేదెన్నడో!
* 8 ఏళ్లుగా కొనసాగుతున్న పనులు
ఆదోని, ఫిబ్రవరి 5:దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులికమ ప్రాజెక్టు నిర్మాణానికి 2008 సంవత్సరంలో శంఖుస్థాపన చేశారు. ఇప్పటికే 8 సంవత్సరాలు అయింది. పులికనుమ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. అసంపూర్తిగానే ఉంది. రూ. 100కోట్ల ఖర్చు చేసి ఒక విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం జరిగితే వేల ఎకరాలకు నీరు అందుతుందని రైతులు పేర్కొంటున్నారు. అందువల్ల ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టక నిర్లక్ష్యం చూపుతున్నారని అందువల్ల నిరసనగా రాయలసీమ హక్కుల పోరాట సమితి నాయకులు బొజ్జ దశరథరామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో గత సంవత్సరం కోసిగి నుంచి పులికనుమ ప్రాజెక్టు వరకు రైతులు పెద్దఎత్తున పాదయాత్ర చేశారు. ఆదోని డివిజన్‌లోని పులికనుమ గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి 2008, సెప్టెంబర్ 21న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాజెక్టు శంఖుస్థాపన చేశారు. పులికనుమ గ్రామం పైభాగంలో బసులదొడ్డి సమీపంలో రెండు కొండల మధ్య పులికనుమ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 759 ఎకరాలలో 1.232 టీఎంసీల నీటిని నిలువ చేసి మంత్రాలయం, ఎమ్మిగనూరు, కర్నూలు ప్రాంతాలలో 20వేల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించడానికి ఈప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అయితే రూ.263కోట్లుతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా ఇప్పుడు అంచనాలు పెరిగి రూ.400కోట్లకు చేరింది. అయితే ఇంత వరకు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే పెద్దకడబూరు, కోసిగి, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో తాగు, సాగునీటికి కూడా నీరు అందుతుంది. తుంగభద్ర దిగువ కాలువలో నీటి సరఫరా తగ్గినప్పుడు పులికనుమ నుంచి రోజుకు 300క్యూసెక్కల నీటిని వినియోగించుకోవడానికి ఈప్రాజెక్టు ఎంతో ఉపయోగ పడుతుంది. 900 మీటర్లు మొదటి కట్ట, 650 మీటర్లు రెండవ కట్ట, 375 మీటర్ల మూడవ కట్టలను రెండు కొండల మధ్య అడ్డంగా కట్టి తుంగభద్ర నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారాప్రాజెక్టులో నీటిని నిలువ చేసి ఆయకట్టు భూములకు నీరు అందించేలా పులికనుమ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 14కి.మీ పైపులైన్ అలాగే ప్రాజెక్టు నుండి తుంగభద్ర దిగువ కాలువకు 8కి.మీ మేర కాలువ పనులు చేయడం జరిగింది. 2009లో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. కాని ఇంత వరకు ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. మట్టికట్ట నిర్మాణం జరిగింది. పైపుల నిర్మాణం కొద్దిగా మిగిలింది. కేవలం రూ.100కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తే పులికనుమ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది. కాని ఇంత వరకు 8 సంవత్సరాలు దాటిన ప్రభుత్వం పులికనుమ ప్రాజెక్టు గురించి మరిచిపోయింది. సీఎం చంద్రబాబునాయుడు అనేక సభలలో పులికనుమ ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ కూడా ఇచ్చాడు. టిడిపి పాలన రెండున్నర సంవత్సరాలు దాటిన సీఎం చంద్రబాబునాయుడు పులికనుమకు నిధులు కూడా విడుదల చేయలేదు. చివరకు విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కూడా సాగలేదు. అందువల్ల ప్రాజెక్టు నుండి చుక్కనీరు రైతులకు అందలేదు. ఎన్నోసార్లు రైతులు ప్రాజెక్టు పూర్తి చేయమని ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం పెడచేవిన పెట్టింది. అందువల్ల రైతులు ఆందోళన చేసిన ఎలాంటి ఫలితం లేకుండా ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. రైతులు పులికనుమ రిజర్వాయర్ నుంచి జంపాపురం, సజ్జలగుడ్డం, సాతనూరు గ్రామాల వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు ఎలుగెత్తి చాటారు. తుంగభద్ర దిగువ కాలువ రైతుల హక్కుల సమితి నాయకుడు ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర సాగించారు. పాదయాత్రకు కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈవిధంగా పులికనుమ ప్రాజెక్టు నిర్మాణం కోసం సీమ రైతులు ఆందోళన బాట పట్టారు. పట్టిసీమ కోసం ముఖ్యమంత్రి కోట్ల రూపాయాలు ఖర్చు చేశారని కాని వంద కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అయ్యే పులికనుమను విస్మరించారని రైతులు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. అందువల్లనే పాదయాత్రతోనైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి నిధులను విడుదల చేసి పూర్తి చేస్తారని ఆశించారు. కాని రైతుల ఆశలు అడి యాసలు అయ్యాయి. పులికనుమ ప్రాజెక్టుకు నిధులు లేక 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఆసంపూర్తిగా ఉన్నప్రాజెక్టు కట్ట దిష్టిబొమ్మల నిలబడి ఉంది.
మరో 20 ఏళ్లు టిడిపిదే అధికారం
* ‘హోదా’ వల్ల ఒరిగేదేమీ లేదు..
* జగన్ యువతను రెచ్చగొడుతున్నారు..
* డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 5:రాష్ట్రంలో మరో 20 ఏళ్ల పాటు టిడిపిదే అధికారం అని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి జోస్యం చెప్పారు. నగరంలోని వౌర్యిఇన్‌లో ఆదివారం గ్రామ, మున్సిపల్ వార్డు కమిటీల ఎన్నికల అధికారుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కెఇ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకుపోయిందన్నారు. సిఎం చంద్రబాబు చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, దీంతో మరో 20 ఏళ్ల పాటు ప్రజలు ఏపార్టీ వైపు కనె్నత్తి కూడా చూసే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, హోదా ఉన్న రాష్ట్రాల్లో రాయితీలు రాక ఆయా రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి వీలవుతుందన్నారు. అయితే ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదని ప్రచారం చేస్తూ యవతను రెచ్చగొడుతున్నారనిమండిపడ్డారు. ఇక తన తండ్రి వైఎస్ హయాంలోనే నీటిపారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని, టిడిపి ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని జగన్ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. జిల్లాలో ఎన్‌టిఆర్ హయాంలోనే తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి, వెలుగోడు రిజర్వార్ వంటి సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారని వెల్లడించారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ సిఎం చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా ప్రజల దరికి చేర్చినప్పుడే పార్టీ పట్ల విశ్వాసం పెరుగుతుందన్నారు. ప్రజాదరణ కలిగిన వ్యక్తిని టిడిపి గ్రామ, మండల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలన్నారు. ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి టిడిపిని పటిష్ట పరిచేందుకే ప్రతి రెండేళ్లకు ఒకసారి జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికతో పాటు గ్రామ, మండల, వార్డు కమిటీల అధ్యక్షులను ఎన్నుకోవటం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి గ్రామ, మండల స్థాయి నుంచే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు సైనికుడిలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ధనారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, కెఇ ప్రతాప్, వీరభద్రగౌడ్, తిక్కారెడ్డి, తిరుపాల్‌బాబు, ఆకెపోగు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
హిందువులు ఐకమత్యంగా ఉండాలి
* ప్రతి దేవాలయంలో ఒక రోజు సత్సంగం
* విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి
నంద్యాలటౌన్, ఫిబ్రవరి 5:్భరతదేశంలోని హిందువులంతా ఐక్యతగా ఉండాలని, ప్రతి దేవాలయంలో కార్యకర్తలు వారంలో ఒక రోజు సత్సంగం ఏర్పాటు చేసి భారతదేశ చరిత్రను తెలియజేయడమే కాకుండా హనుమాన్‌చాలీసా, శ్రీరామ జపంతో పాటు ఏదో ఒక దేవుడి చాలీసా పారాయణం చేయించాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని త్రినేత్ర గెస్ట్‌లైన్ లాడ్జి సమావేశ భవన్‌లో కార్యకర్తల సమావేశానికి పట్టణ అధ్యక్షులు వైయన్‌రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ అధ్యక్షులు రాఘవరెడ్డి, అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి రాఘవులు హాజరయ్యారు. ఈసందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రాఘవరెడ్డి మాట్లాడుతూ హిందూ సమాజం కోసం ఎందరో దేశ స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసారన్నారు. ఏ వృత్తిలో ఉన్నా హిందూ సమాజం కోసం పాటుపడాలన్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. గతంలో భాగ్యనగరంలో కేవలం 50 గణేశ్ విగ్రహాలు ఉండేవని, ఈరోజు 90వేల గణేశ్ మండపాలలో గణేశ్ విగ్రహాలు కొలువుదీరుతున్నాయని, దీన్నిబట్టి చూస్తే హిందువులంతా ఐక్యమత్యంగా ఉండడమేన్నారు. హిందూ సమాజానికి ఇబ్బంది కలిగిస్తే కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాఘవులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మతమార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని హిందువులంతా ఆపాలన్నారు. అలాగే గోహత్యలు జరుగుతున్నాయని, వాటిని ఆపడానికి ప్రతి కార్యకర్త ముందుకు వెళ్లాలన్నారు. దేవాలయాలకు చెందిన మాన్యం భూములను కబ్జాకు గురైతే వాటి కోరల్లో నుంచి భూములు ఆలయాలకే చెందేలా కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు సుమతి, నందిరెడ్డి సాయిరెడ్డి, శ్రీదేవి, ఏర్వు రామచంద్రారెడ్డి, మోహన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా
పటిష్ట చర్యలు
* డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
కర్నూలు, ఫిబ్రవరి 5:రానున్న వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని పక్కాగా అమలు చేయాలని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్లను ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం తాగనీటి సరఫరాపై ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కెఇ మాట్లాడుతూ కర్నూలు పార్లమెంటు పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్యపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. కావున ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేందుకు కృషి చేయాలన్నారు. ఇక జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసి సిఎం చంద్రబాబు చేత ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. అవుకు రిజర్వాయర్ నుంచి 23 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు కలెక్టర్ ప్రతిపాదనలు సమర్పించి మంజూరు తీసుకోవాలన్నారు. అలాగే పత్తికొండ ఓఆర్‌హెచ్‌ఎస్ ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. జడ్పీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ 54 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ. 16 కోట్లు విడుదల చేశామని ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా వున్నాయని, వున్న నీటిని సక్రమంగా జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసే బాధ్యత ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుదే అన్నారు. ఇక 2 నెలల వ్యవధి మాత్రమే వుందని అధికారులు గ్రామాల్లో కలియ తిరిగి నీటి సరఫరాకు పనులు గుర్తించాలన్నారు. తాగునీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాల్లో నీటి రవాణా లాంటి అనాగరిక చర్యకు స్వస్తి పలికి నీటి వనరులు ఉన్న ప్రాంతం నుంచి పైపులైన్ ద్వారా నీరు సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధ చేసి తీసుకురావాలన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు పనులను మార్చి లోపు పూర్తి చేయాలని డిప్యూటీ సిఎం కెఇ సూచనలు జారీ చేశారని, ఆ మేరకు పనులు చేసేందుకు ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆదోని, ఆలూరు, డోన్, మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జిలు మీనాక్షినాయుడు, వీరభద్రగౌడ్, కెఇ ప్రతాప్, తిక్కారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
106 గ్రామాలను ఓడిఎఫ్‌గా మార్చండి
* మార్చిలోగా 100 శాతం పూర్తిచేయాలి:కలెక్టర్
కర్నూలుటౌన్, ఫిబ్రవరి 5:జిల్లాలోని 16 మండలాల్లోని 106 గ్రామాలను బహిరంగ మల విసర్జన గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. ఏపిఆర్‌ఐజిపి ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ఆదివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో డ్వామా, డిఆర్‌డిఎ, ఆర్‌డబ్ల్యుఎస్, ఎంపిడిఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమీకృత గ్రామ పంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేసి 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇందులో గ్రామైక్య సంఘాలు, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమైందన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బిల్లుల చెల్లింపులు జరగాలన్నారు. ఓడిఎఫ్ గ్రామాల్లో ప్రతిభ చూపిన వారిని సన్మానిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా 2015-16కు సంబంధించి మంజూరైన యూనిట్లను గ్రౌండ్ చేయాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద వచ్చే 4 నెలల గడువులో లేబర్ బడ్జెట్‌ను పెంచి నీటి కుంటలు, పూడికతీత పనులు చేపట్టాలన్నారు. వర్క్‌షాపులో డిఆర్‌డిఎ, డ్వామా పిడిలు రామకృష్ణ, పుల్లారెడ్డి, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఇడిలు, ఆర్‌డబ్ల్యుఎస్, ఎన్‌ఆర్‌ఇజిఎస్, ఎంపిడిఓలు, వెలుగు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి
ఏర్పాట్లపై సమీక్ష
శ్రీశైలం, ఫిబ్రవరి 5:శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి దేవస్థానం ఏర్పాటు చేసే ఆయా కార్యక్రమాల గురించి ఇఓ నారాయణ భరత్‌గుప్త, ఆలయ అధికారులు, అర్చకు వేద పండితులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఆలయ పరిపాలన భవనంలోని సమావేశ హాల్‌లో నిర్వహించారు. గత సంవత్సరంలో రూ.60లక్షలు ఖర్చు చేశామని, ఈ ఏడాది భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ. 3 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు అంచనాగా తెలిపారు. భక్తులకు క్యూ లైన్లలో, ఆలయం లోపల ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల చర్యలతో పాటు కాలినడక నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దేవస్థానం తరపున సోమవారం నుంచి సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచిత భోజన ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఇఓ తెలిపారు. అదే విధంగా మహాశివరాత్రిలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, షామియానాలు, టెంట్లు, పాతాళగంగ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మహాశివరాత్రి ఆహ్వానపత్రికలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆల య ఏఇఓలు, అర్చక వేద పండితులు, మరికొందరు అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు:ఎమ్మెల్సీ శిల్పా
* ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు:ఎమ్మెల్యే బుడ్డా
ఆత్మకూరు, ఫిబ్రవరి 5:దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. ఎన్‌టిఆర్ భరోసా కింద కొత్తగా మంజూరైన దివ్యాంగుల, వితంతు, వృద్ధాప్య పింఛన్లను ఆదివారం స్థానిక మార్కెట్ యార్డులో ఎమ్మెల్సీ శిల్పా, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శిల్పా మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గానికి 2 వేల పింఛన్లు మంజూరు కాగా అందులో ఆత్మకూ రు మండలానికి 723 పింఛన్లు మం జూరయ్యాయన్నారు. ఇంకా కొందరు అర్హులకు పింఛను మంజూరు కాలేదని, వచ్చే జాబితాలో అర్హులందరికీ మంజూరు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ కొత్తగా పింఛను తీసుకున్న లబ్ధిదారులు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తనకు కానీ ఎమ్మెల్సీ శిల్పాకు కానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తాను కేవలం ప్రజల అబిభివృద్ధి కోసం టిడిపిలో చేరానన్నారు. సిఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రహ్లాద, ఎంపిపి సౌజన్య, సహకార సంఘం చైర్మన్ జెడ్.శ్రీనివాసులు, ఆత్మ చైర్మన్ గొవిందరెడ్డి, పుల్లారెడ్డి, శిల్పా భవనేశ్వరరెడ్డి, రామలింగారెడ్డి, రాంమూర్తి, జయన్న వరాల మాలిక్, యుగంధర్‌రెడ్డి గౌస్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులకే ప్రభుత్వ పథకాల ఫలాలు
* ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి
బనగానపల్లె, ఫిబ్రవరి 5:ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికే దక్కుతాయని, ఇందులో అవినీతికి తావుండదని ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బిసి ఆదివారం పట్టణంలోని తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శల పట్ల స్పందించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే వారి ఆధార్ అనుసంధానం చేయడం, వారి సమాచారం కంప్యూటరీకరణ చేయడం జరుగుతుందని ఎట్టి పరిస్థితుల్లో బోగస్‌కు అవకాశం ఉండదన్నారు. అధికారులు ప్రభుత్వ జీఓ ప్రకారం వారి పనులు వారు చేసుకుపోతారని అభివృద్ధికి పార్టీ పరంగా అందరూ సహకరించాలన్నారు. లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌లో వుంటాయని, అందులో బోగస్ పేర్లు, అర్హులు కానిపేర్లు వుంటే బయటపడుతుందని ఇందులో గోప్యం వుండదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుపేదల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, ఈ ప్రయోజనాలు పేదలకు మాత్రమే దక్కేలా తాము కృషి చేస్తామని తెలిపారు. అయితే ప్రతిపక్ష పార్టీల నాయకులు కేవలం వారి ఉనికి చాటుకునేందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా కాటసాని తమపై అర్థరహిత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ కోడి నాగరాజుయాదవ్, రాష్ట్ర కనీస వేతన సంఘం డైరెక్టర్ పిఎల్‌ఎన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
11 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
* రూ. 1.24 లక్షల నగదు స్వాధీనం:డీఎస్పీ
కర్నూలు, ఫిబ్రవరి 5:నగరంలోని ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకుని పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 1,24,970 స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఇందుకు సంబంధించి ఆదివారం డీఎస్పీ 3వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి అందిన సమాచారం మేరకు హోటల్‌పై దాడి చేసి పేకాటరాయుళ్లను అరెస్టు చేశామన్నారు. వారిలో నగరంలోని జోహరపురానికి చెందిన వేముల రవి, బొల్లే శేఖర్, నేతాజీ నగర్‌కు నల్లబోతుల రవి, బంగారుపేటకు చెందిన షికారి సురేష్, రంగరాజు వీధికి చెందిన అలిబాషా, కృష్ణానగర్‌కు చెందిన మెమిన్‌సలీం, నంద్యాలలోని నూనేపల్లెకి చెందిన తలారి రాముడు, మహబూబ్‌నగర్ జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన గౌని నాగేష్, భూత్పూరు గ్రామానికి చెందిన సిరిగిరి శ్రీను, కర్నూలులోని పాతబస్టాండ్‌కు చెందిన షేక్ అక్బర్ బాషా, ఏపిఎస్పీ బెటాలియన్‌కు చెందిన బండి ఓబయ్య ఉన్నారన్నారు. కర్నూలుకు చెందిన రుక్మాందరెడ్డి, సంపత్ హోట్‌ల్‌లో గది అద్దెకు తీసుకుని ఒకొక్కరి నుంచి రూ. 1000 వసూలు చేసి పేకాట ఆడిస్తున్నారని, వారిద్దరు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో 3వ పట్టణ సిఐ మధుసూదన్‌రావు, ఎస్‌ఐ మల్లికార్జున ఉన్నారు.
వివాహిత ఆత్మహత్య
ఆత్మకూరు, ఫిబ్రవరి 5:మండల పరిధిలోని సిద్దాపురం గ్రామానికి చెందిన యశోద(30) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ లోకేష్‌కూమార్ తెలిపారు. పోలీసులు తెలపిన వివరాలు.. బండి ఆత్మకూరుకు చెందిన వెంకటసుబ్బయ్య కుమార్తె యశోద అలియాస్ కళ్యాణికి సిద్దాపురం గ్రామానికి చెందిన వడ్డే సుబ్బయ్య కూమారుడు సందయ్యకు 9 సంవత్సరాల క్రితం వివహమైంది. అయితే భర్త తాగుడుకు బానిసై డబ్బు కోసం నిత్యం యశోదను వేధించేవాడన్నారు. దీంతో 6 నెలల గర్భణి అయిన యశోద ఆ బాధలు భరించలేక శనివారం ఏఓ మందులు మింగిందన్నారు. గమనించిన భర్త ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ఆదివారం ఉదయం మృతి చెందిందని ఎస్‌ఐ తెలిపారు. యశోద తండ్రి వెంకటసుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దీనికి తోడు భర్త తల్లిదండ్రులు వడ్డే సుబ్బయ్య, లక్ష్మిదేవి, నాగమణి కూడా యశోదను వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. దీంతో భర్తను అదుపులోకి తీసుకున్నామని మిగిలిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు, ఫిబ్రవరి 5:మండల పరిధిలోని కరివేన గ్రామానికి చెందిన సునీతమ్మ ఆదివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్‌ఐ లోకేష్‌కూమార్ తెలిపారు. వివరాలు.. సునీతమ్మ భర్త సుంకన్న తాగుడుకు బానిస అని దీంతో కష్టపడి పండించిన కంది పంట అమ్మగా వచ్చిన డబ్బులను సారా తాగేందుకు తీసుకెళ్లాడు. దీంతో మనోవేదనకు గురైన సునీతమ్మ జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన ఇరుగు పొరుగు వారు వెంటనే సమాచారం ఇవ్వగా 108 వాహనం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కడుపు నొప్పి తాళలేక
మహిళ ఆత్మహత్య
ఆత్మకూరు, ఫిబ్రవరి 5:కొత్లపల్లె మండల పరిధిలోని దుద్యాల గ్రామానికి చెందిన చిట్టెమ్మ(30) ఆదివారం విషగుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడిందని కొత్తపల్లె ఎస్‌ఐ శివకూమర్‌నాయక్ తెలిపారు. ఆమె తండ్రి తెలిపిన వివరాలు.. చిట్టెమ్మ చాలా సంవత్సరాల నుంచి కడుపు నొప్పితో బాధపడుతోందని చాలా మంది డాక్టర్లకు చూపించినా తగ్గలేదని తెలిపారు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం విష గుళికలు మింగిందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందిందన్నారు. చిట్టెమ్మ తల్లి సారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.