కర్నూల్

బియ్యం, తెల్లజొన్నల ధరలకు రెక్కలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఫిబ్రవరి 10: సోనామసూరి బియ్యంతోపాటు తెల్ల జొన్నల ధరలు కూడా పెరిగి వాటికి ఉండడంతో సగటు జీవులు, పేదలు పెరిగిన ధరలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు కూడా బియ్యంతో పోటీపడి జొన్నల ధరలు పెరగలేదు. కానీ ఈ సంవత్సరం బియ్యం ధరలు, తెల్ల జొన్నల ధరలు సమానంగా ఉన్నాయి. సీజన్ ప్రారంభంలోనే మసూరి కొత్త బియ్యం క్వింటాల్ రూ. 3500కు చేరింది. అలాగే తెల్ల జొన్నల ధరలు కూడా రూ. 3500కు పై మాటే ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది బియ్యం ధర సీజన్ ప్రారంభంలో క్వింటాల్ రూ. 3వేలు ధర పలకింది. జొన్నల ధర రూ. 2200కు క్వింటాల్ కొనుగోలు కావడం జరిగింది. కాని ఈ సంవత్సరం బియ్యం, జొన్నల ధర ఒకేసారి పెరిగాయి. తుంగభద్ర డ్యాంలో తగినంత వరద నీరు రాక డ్యాం నిండలేదు. రబీ సీజన్‌లో వేయాల్సిన లక్ష ఎకరాల్లో వరి పంటను రైతులు పడించలేదు. లక్ష ఎకరాలు బీడు పడిపోయింది. ఆదోని డివిజన్‌లోని కోగిలతోట, హొళగుంద, వందవాగిలి, ఎండిహళ్లి, ఇంగళదహాల్, చిన్నహరివాణం, పెద్దహరివాణం, సంతేకూడ్లూరు, హానవాల్, కౌతాళం, హాల్వి, పొదిలకుంట, బదినేహాల్, కోసిగి, కుంబళనూరు, నదిచాగి, మంత్రాలయం, మాచాపురం, నాగలదినె్న, నదీకైరవాడి, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, పెద్దతుంబళం, నందవరం, మిట్టసోమాపురం, మొదలగు గ్రామాల్లో తుంగభద్ర దిగువ కాలువ కింద వరి పంట పడించేవారు. నీరు సరఫరా లేకపోవడం వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో వేసిన వరి పంట దిగుబడి తగ్గింది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బియ్యం సరఫరా కూడా నిలిచిపోవడం జరిగింది. అందువల్ల బియ్యం ధరలు సీజన్ ప్రారంభంలోనే కొత్త బియ్యం క్వింటాల్ రూ. 3500, పాత బియ్యం రూ. 4500 ధర పలుకుతుంది. ఆదోని డివిజన్‌లో చిప్పగిరి, హాలహర్వి, హొళగుంద, ఆస్పరి, మద్దికెర, దేవనకొండ ప్రాంతాల్లో ఉన్న నల్లరేగడి భూముల్లో తెల్ల జొన్న పంట రైతులు పండించే వారు. అయితే ఈ సంవత్సరం చాలా మంది రైతులు పత్తి పంట వైపు మొగ్గు చూపగా దాదాపు 40 వేల ఎకరాల్లో తెల్లజొన్న పంట వేయడం జరిగింది. అయితే వర్షాలు సకాలంలో రాకపోవడంతో తెల్ల జొన్న పంట కూడా దెబ్బతింది. అందువల్ల చాలాప్రాంతాల్లో జొన్న పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు. అందువల్ల ఎన్నడూ లేని విధంగా తెల్లజొన్నలు సీజన్ ప్రారంభంలోనే క్వింటాల్ రూ. 3500కు చేరింది. ఇంక వ్యాపారులైతే రూ. 3800 నుంచి రూ. 4 వేలకు కూడా తెల్ల జొన్నలు అమ్మతున్నారు. ఈ విధంగా దిగుబడి తగ్గి బియ్యం, తెల్లజొన్నలు ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బియ్యం అవసరం ఉన్నా తక్కువ మోతాదులో కొనుగోలు చేస్తున్నారు. జొన్నల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. ఆదోని డివిజన్‌లో తెల్లజొన్నలను ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవడం జరుగుతుంది. అందువల్ల బియ్యంతో పోటిపడి తెల్ల జొన్నలు కూడా పెరగడంతో అన్నం, రొట్టేలు కూడా తినలేని పరిస్థితి ఏర్పడిందని పేదలు వాపోతున్నారు.
శ్రీశైలంలో భక్తులకు
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
* మహాశివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
శ్రీశైలం, ఫిబ్రవరి 10: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ విజయమోహన్ జిల్లా అధికారులు, ఆలయ అధికారులకు సూచించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తులకు ఎటువంటి సౌకర్యం ఏర్పాటు చేయాలనే అంశం పై జిల్లా అధికారులతో, దేవాలయ అధికారులతో కలెక్టర్ శుక్రవారం ప్రత్యేక సమీక్ష సమావేశం శ్రీశైలం పరిపాలన భవనంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ ఆకె రవికృష్ణ, దేవస్థానం ఇఓ నారాయణ భరత్‌గుప్త, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు సౌకర్యాల కల్పనే ధ్యేయంగా అధికారులు విధులు నిర్వర్తించాలని సూచించారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు వసతి, మరుగుదొడ్ల ఏర్పాటు, క్యూ లైన్లు, పారిశుద్ధ్యం, రోడ్ల ఏర్పాట్లు, బస్సు సౌకర్యాలు, వైద్య సహాయం, తాగునీటి సౌకర్యాల వంటి విషయాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సంబంధించిన అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరా రు. రోడ్లు, భవనాల శాఖ వారు నిర్ధేశించిన నిబంధనల ప్రకారం పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, వీరితో పాటు వైద్య, ఆరోగ్య సంబంధిత అధికారులు మెడికల్ క్యాంపులను అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కొనేలా 30 పడకలతో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేయాలని సూచించారు. కాలినడకన వచ్చే భక్తులకు అత్యవసర సమయాల్లో ఏర్పాట్లు చేస్తూ వారికి కావాల్సిన తాగునీరు నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రా నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల తాకిడికి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల ఆర్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. భక్తులను తీసుకుని వచ్చే బస్సులకు పార్కింగ్ ప్రదేశాలు, పబ్లిక్ అనౌన్స్‌లు, వాహనాల రాకపోకలకు వీలుగా అన్ని ఏర్పాట్లను, నీటి సరఫరాను, పార్కింగ్ ప్రదేశాన్ని భక్తులు గుర్తు పట్టేవిధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. ప్రజలు అసహనానికి గురికాకుండా చర్యలు చేపడుతున్నట్లు, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు దేవాలయాన్ని కూడా విద్యుత్ దీపాలతో పగలు వలె భక్తులు వేచివుంటే క్యూ లైన్లను ఆలయ చుట్టుపక్కల పురవీధులను విద్యుత్ దీపాలతో అలంకరించాలని కోరారు. మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను, నడకదారి వచ్చే సౌకర్యార్థం ప్రత్యేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మహాశివరాత్రిని విజయవంతం చేయాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను నిర్వహించిన అనుభవంతో జిల్లాను మొదటిస్థానంలో ఉంచిన స్ఫూర్తితో అధికారుల సమన్వయంతో సిబ్బంది పనులు నిర్వహించాలని కోరారు. 2000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు, అధికంగా వచ్చే వాహనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలతో పాటు ప్రమాదాలు, తప్పిపోయిన చిన్నపిల్లలు, ఇతర సంఘటనలు జరిగిన వెంటనే పోలీస్ సిబ్బందికి తెలిస్తే తగు చర్యలు వెంటనే చేపడతామన్నారు. సిసి కెమెరాలు, సిసి టివిలు, డ్రోన్ల సహాయంతో పక్కా ప్రణాళికగా విధులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇఓ మాట్లాడుతూ 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మో త్సవాలను నిర్వహించనున్నామని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన జరిగే లాగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భక్తులు క్యూ లైన్లకు బదులుగా కంపార్ట్‌మెంట్లలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని, ప్రసాద టోకెన్లను కూడా క్యూ లైన్లలోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా లాకర్లు ఏర్పాటుతో పాటు భక్తుల సౌకర్యాలలో ఎటువంటి రాజీపడేది లేదని తెలిపారు. అధికంగా వచ్చే శివస్వాములకు ప్రత్యేకంగా క్యూ లైన్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సిబ్బంది అందరూ అధికారులకు సహకరిస్తూ సమన్వయంతో పనిచేసి మహాశివరాత్రిని విజయవంతం చేయాలని కోరారు.
కెసి కాలువకు నీరు బంద్
* ఆందోళనలో రైతులు
నందికొట్కూరు, ఫిబ్రవరి 10 : పగిడ్యాల మండల పరిధిలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కెసి కాలువకు విడుదల చేస్తున్న కృష్ణా జలాలను శుక్రవారం అధికారులు బం ద్ చేశారు. కెసి కాలువ కింద సాగు లో ఉన్న పంటలు ఎండిపోకుండా 5 రోజుల క్రితం కలెక్టర్ విజయమోహన్ నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వక్తం చేశారు. కెసి కాలువ కింద 0 నుంచి 120 కి.మీ వరకూ 40 వేల హెక్టార్లలో మొక్కజొన్న, శెనగ, మినుము, తదితర పంటలు సాగు చేశారు. అయితే చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంతో ఈ నెల 25వ తేదీ వరకూ నీటి విడుదలను కొనసాగిస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. అయితే వా రం రోజులు కూడా కొనసాగక ముం దే నీటి విడుదలను బంద్ చేయడంతో ఆయకట్టు కింద సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రాజెక్టు ఇఇ రెడ్డి శేఖర్‌రెడ్డిని వివరణ కోరగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కెసి కాలువకు నీటి విడుదలను బంద్ చేశామన్నారు.
యాగాల వల్ల బహుళ ప్రయోజనాలు
* యోగాచార్య అచల పరిపూర్ణ యోగానందస్వామి
నంద్యాలటౌన్, ఫిబ్రవరి 10 : యాగాలు చేయడం వల్ల దేశం సుభిక్షంగా ఉండడమే కాకుండా మనిషి జీవితం ఎంతో సుఖసంతోషాలతో ఉంటుందని, అలాగే సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో తులతూగుతారని అమరయోగాశ్రమ నిర్వాహకులు, యోగాచార్య అచల పరిపూర్ణ యోగానంద (పాములేటి) స్వామి పేర్కొన్నారు. శుక్రవారం మాఘ మాస పౌర్ణమి పురస్కరించుకుని మహారుద్రయాగం నిర్వహించారు. మహారుద్ర యాగాన్ని స్వా మి శిష్యులు సుబ్రమణ్యంచే నమకం చమకంతో వేద మంత్రాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆశ్రమంలో 14వేల యజ్ఞ హోమాలు చేసినందు వల్ల మహారుద్రయాగం చేసినట్లు చెప్పారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ యాగం చేయడం వల్ల దేశం సుభిక్షంతో పాటు ప్రజలు సుఖశాంతులతో ఉంటారన్నారు. ఎవరైతే యజ్ఞ వేదిక ముందు కూర్చుని హోమాలు చేస్తారో వారికి ఉన్న రోగాలు దూరమవుతాయన్నారు. హోమంలో రావి, జమ్మి, తిప్పతీగ, తదితర వనమూలికలు వేయడమే కాకుండా ఉత్తరేణి, హవ్యద్రవ్యం, ఆవునెయ్యి కూడా వేయడం వల్ల వచ్చే ధూమం గాలిలో కలిసి చుట్టుపక్కల ఉన్న వాతావరణం శుద్ధి అవడమే కాకుండా ఆ ధూమం ఆకాశంలో కలిసిపోయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోనే మహారుద్రయాగం ఎవరూ చేయలేదన్నారు. ఆశ్రమంలో నిర్వహించే హోమాల్లో ఎవరైనా పాల్గొనవచ్చని, ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదన్నారు. ప్రతినెల పౌర్ణమి రోజున ఆశ్రమంలో హోమాలు జరుగుతాయన్నారు. తమవెంట కేవలం కొబ్బరికాయ, కర్పూ రం, ఊదిబత్తీలు మాత్రమే తెచ్చుకోవచ్చన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
పెద్దాసుపత్రిలో దారుణం..
* రోగి బంధువును చితకబాదిన సెక్యూరిటీ గార్డు
* ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు
కర్నూలు, ఫిబ్రవరి 10:నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి బంధువును అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు చితకబాదడంతో పాటు చెవి కత్తిరించిన సంఘటన శుక్రవారం సంచలనం రేపింది. వివరాలు.. కర్నూలు మండలం జి.శింగవరం గ్రామానికి చెందిన ఓ మహిళ క్రిమిసంహారక మందు తాగింది. దీంతో ఆమెకు వరసకు మరిది అయిన మోహన్‌గౌడ్ నగరంలోని పెద్దాసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మోహన్‌గౌడ్ వైద్యులకు ఈ విషయాన్ని తెలిపేందుకు వెళ్లగా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు బాలాజీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. మోహన్‌గౌడ్ కాలర్ పట్టుకుని కొట్టుకుంటూ ఆసుపత్రిలో ఉన్న పోలీసు ఔట్‌పోస్టుకు తీసుకెళ్లారు. దీనికి తోడు ఆపరేషన్ చేసే కత్తెరతో మోహన్‌గౌడ్ చెవిని కత్తిరించాడు. ఈ తతంగం అంతా పోలీసుల ఎదుటే జరుగుతున్నా వారు ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరం. ఈ సంఘటనపై మోహన్‌గౌడ్‌తో పాటు బంధువులు పట్టణ 3వ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా రోగి బంధువులు ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు వైఖరిపై ఆసుపత్రి ఎదుట ఆందోళనకు చేపట్టారు. మోహన్‌గౌడ్‌ను చితకబాదిన సెక్యూరిటీ గార్డును తక్షణమే విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
* హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు భరత్
కర్నూలు, ఫిబ్రవరి 10:ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టిజి భరత్ పేర్కొన్నారు. నగరంలోని పూలబజార్‌లో ఉన్న చిన్న అమ్మవారిశాలలో శుక్రవారం ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సంస్థలను ఒక వేదిక పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఆర్థిక స్తోమత లేని నిరుపేద ఆర్యవైశ్యులకు గృహ నిర్మాణాలను ఏర్పాటు చేయటమే కాకుండా నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనం అందజేస్తామన్నారు. అనంతరం ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా టిజి.్భరత్, ప్రధాన కార్యదర్శిగా ఇల్లూరు లక్ష్మయ్య, కోశాధికారిగా తిరుపాల్‌బాబు, జిల్లా అధ్యక్షుడిగా ఇల్లూరు సుధాకర్, కర్నూలు పట్టణ అధ్యక్షుడిగా సోమిశెట్టి నవీన్, ప్రధాన కార్యదర్శిగా లగిశెట్టి కిరణ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టిజి.శివరాజ్, శ్రీశైలం ట్రస్టు మాజీ చైర్మన్ ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు, కాశీఅన్నపూర్ణ సత్రం అధ్యక్షుడు బాలకృష్ణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు, కోశాధికారి పురుమాళ్ల కాశీరావు, ఆవోపా నాయకులు రత్నప్రసాద్, శేషగిరి శెట్టి, వేముల శేషయ్య, తదితరులు పాల్గొన్నారు.
రూ. 8.65 కోట్ల వ్యయంతో
మంగంపేటతండాకు రోడ్డు
* ఎమ్మెల్యే బిసి
బనగానపల్లె, ఫిబ్రవరి 10 : అవుకు మండలం మంగంపేట తండాకు రూ. 8.65 కోట్ల వ్యయంతో తారురోడ్డు వేయనున్నట్లు ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే శుక్రవారం పట్టణంలోని తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. బనగానపల్లె మండలం క్రిష్ణగిరి నుంచి మంగంపేట, మంగంపేటతండా, కాశిరెడ్డి నాయన ఆశ్రమం వరకూ మట్టి రస్తా వుందన్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాక కాశిరెడ్డి నాయక ఆశ్రమానికి వచ్చే భక్తులు కూడా అవస్థలు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము సిఎం చంద్రబాబు, మంత్రి రావెల కిశోర్‌బాబు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించామన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ జీఓ కూడా విడుదలైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం టెండర్లు పిలిచి రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యేతో పాటు నాయకులు కప్పెట నాగేశ్వరరెడ్డి, బురానుద్దీన్, తదితరులు ఉన్నారు.
శ్రీచౌడేశ్వరీదేవికి పట్టువస్త్రాల సమర్పణ
కోడుమూరు, ఫిబ్రవరి 10:శ్రీచౌడేశ్వరీదేవి తిరుణాల సందర్భంగా ఏటా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా శుక్రవారం స్థానిక పంచాయతీ పాలక వర్గం సభ్యులు అమ్మవారికి చీర సారె సమర్పించారు. ముందుగా స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి పంచాయతీ పాలకవర్గం సభ్యులు పట్టు వస్త్రాలు తీసుకుని పట్టణ పురవీధుల గుండా భారీ ప్రదర్శనగా వెళ్లి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం సర్పంచ్ సిబి లత, ఉపసర్పంచ్ ప్రవీణ్‌కుమార్, కాంగ్రెస్‌పార్టీ నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఆలయ పూజారులకు పట్టువస్త్రాలు సమర్పించగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ పాలక వర్గం సభ్యులు బసన్న, మాదులు, పరమేష్, వెంకటస్వామి, పాండు, సవారి రాముడు, సోమన్న, రాంప్రసాద్, ఎంపిటిసిలు రఘునాథ్‌రెడ్డి, సాజిత్, కెఇ హేమలత, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా నరసింహస్వామి
పార్వేట ఉత్సవాలు
ఉయ్యాలవాడ, ఫిబ్రవరి 10: మండలంలోని సర్వాయిపల్లెలో శుక్రవారం సాయంత్రం పారువేట ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆనవాయితీ ప్రకారం ప్రహ్లాద వరదస్వామి, జ్వాలా నరసింహస్వామి ఉత్సవ మూర్తులను అర్చకులు సతీష్, సంతానయ్యల ఆధ్వర్యంలో గ్రామం వెలుపల వున్న కోనేటి నీటితో పుణ్య స్నానాలు చేయించిన అనంతరం పాలాభిషేకం, నెయ్యాభిషేకం, గంధాభిషేకం, వివిద రకాల పండ్లతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆయా తలుపుల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి, తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. తిరుణాల సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
వైభవంగా జంబులాపరమేశ్వరీ దేవి బోణాల పండుగ
నంద్యాలటౌన్, ఫిబ్రవరి 10: మాఘశుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీజంబులాపరమేశ్వరీ దేవికి బోణాలను మహిళా భక్తులు పురవీధుల గుండా మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో తరలివచ్చి సమర్పించుకున్నారు. శుక్రవారం శ్రీజంబులా పరమేశ్వరీ దేవి మహోత్సవాలలో భాగంగా బ్రహ్మశ్రీ మాడుగుల నాగేంద్రశర్మ ఆచార్యత్వంలో అమ్మవారికి వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. అమ్మవారికి పూలంగిసేవ, వెండి మకరతోరణం, వెండిచీరతో ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారికి కాయకర్పూరం సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలు బోణాల పండుగతో ముగిశాయని నిర్వాహకులు గాండ్ల రాజేశ్వరీ, గాండ్ల వెంకటేశ్వర్లు, మూటాల నాగరాజులు తెలిపారు. అనంతరం అన్నదాన ప్రసాదాలను భక్తులకు ఏర్పాటు చేశారు.