కర్నూల్

క్షణ క్షణం ఉత్కంఠ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 20 : అందరూ ఊహించినట్లుగా స్థానిక సంస్థల నియోజకవర్గంలో పోటీ నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగింది. ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించిన ఇరుపార్టీల అభ్యర్థుల్లో చెమటలు పట్టాయి. ఎవరు విజయం సాధిస్తారో నిర్ధారణకు రావడానికి 900 ఓట్ల లెక్కింపు వరకూ తీవ్ర ఉత్కంఠ మధ్య వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికీ అనుమాన మేఘాలు అభ్యర్థులను వీడలేదంటే అతిశయోక్తి కాదు. ఇది సోమవారం కర్నూలులో నిర్వహించిన స్థానిక సంస్థల నియోజకవర్గంలో శాసనమండలి సభ్యుని ఎన్నికకు సంబంధించిన ఓట్ల కేంద్రంలోని పరిస్థితి. ఇరుపార్టీల అభ్యర్థులను కొద్ది సేపు విజయం ఊరిస్తూ మరి కొద్ది సేపు అపజయం తప్పదేమోనన్న ఆందోళన రేకెత్తించింది. ఎట్టకేలకు టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి 62 ఓట్ల ఆధిక్యతతో విజయం దక్కించుకున్నారు. నగరంలోని టౌన్ మోడల్ హైస్కూలులో ఉదయం 8 గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలలో ఏర్పాటు చేసిన 3 పోలింగ్ బూతుల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను కలిపారు. ఆ తరువాత 25 ఓట్లు ఒక కట్టగా కట్టారు. ఆ వెంటనే డిప్యూటీ కలెక్టర్లు శశిదేవి, మల్లికార్జునుడు ఓట్ల కట్టల నుంచి బ్యాలెట్ పేపర్లను తెరిచి అభ్యర్థులకు చూపించిన తరువాత టిడిపి, వైకాపా, చెల్లని ఓట్లు, నోటా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రేలలో పెట్టడం ప్రారంభించారు. బ్యాలెట్ పేపరు తెరిచి చూపించే సమయంలో ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు కాగితాల్లో ఆయా ఓట్లు ఎవరికో రాసుకున్నారు. సుమారు 350 ఓట్లను లెక్కించే వరకూ వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి ఆధిక్యతలో కొనసాగారు. ఒక దశలో ఆయనకు సుమారు 70 ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. ఆ తరువాత టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి పుంజుకుని ఆధిక్యత దిశగా దూసుకుపోయారు. ప్రతి 50 ఓట్లకు 20చొప్పున ఆయన అధిక ఓట్లు సాధిస్తూ వచ్చారు. అయితే ఫలితం ఎవరికి అనుకూలమో నిర్ధారించడానికి సుమారు 900 ఓట్లను లెక్కించిన తరువాతే ఒక అభిప్రాయానికి రాగలిగారు. మరో 50 ఓట్ల లెక్కింపు తరువాత మ్యాజిక్ ఫిగర్ 539 ఓట్లు శిల్పాకు రావడంతో ఆయన విజయం ఖాయమైంది. దాంతో ఊపిరి పీల్చుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు. మొత్తం 1084 ఓట్లకు గానూ 1077 ఓట్లు పోల్ కాగా శిల్పా చక్రపాణిరెడ్డికి 564, వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి 502 ఓట్లు రాగా చెల్లని ఓట్లు 11గా తేలాయి. దీంతో టిడిపి అభ్యర్థి శిల్పా తన సమీప ప్రత్యర్థి గౌరు కంటే 62 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌కు అధికారులు నివేదిక పంపారు. సుమారు 30 నిమిషాల తరువాత కర్నూలు ఎన్నికల అధికారి నివేదికను ధ్రువీకరిస్తూ ఎన్నికల కమిషన్ విజేత పేరును ప్రకటించింది. వైకాపా అభ్యర్థి పోటీ వాతావరణాన్ని చల్లబరుస్తూ విజయం సాధించిన టిడిపి అభ్యర్థి శిల్పాను అభినందించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఆయన అక్కడే ఉన్నారు. రాజకీయాల్లో ఆయన క్రీడాస్ఫూర్తి ప్రదర్శించడంపై అధికారులు ఆయనను అభినందించారు. ఓడినా తన ప్రత్యర్థి గెలుపును ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాదని పేర్కొన్నారు. దీనికి గౌరు సమాధానమిస్తూ రాజకీయాల్లో గెలుపోటములు సాధరణమని, అందరం కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్తూ వెళ్లిపోయారు. ఆ వెంటనే టిడిపి నేతలు సంబరాలు చేసుకున్నారు.
విజయం బాధ్యతను పెంచింది
- శిల్పా చక్రపాణిరెడ్డి, టిడిపి అభ్యర్థి
శాసనమండలి ఎన్నికల విజయం తన బాధ్యతను మరింత పెంచిందని శిల్పా పేర్కొన్నారు. తనకు గతం కంటే ఆధిక్యత తగ్గడంపై పార్టీలో చర్చిస్తామని తెలిపారు. ప్రస్తుతం వచ్చిన ఓట్లను పరిశీలించిన తరువాత తాము మున్ముందు మరింత శ్రమించాల్సిన అవసరం ఉందని గుర్తించామని వెల్లడించారు. తన విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తనకు ఓటు వేసిన వారందరికీ శిల్పా కృతజ్ఞతలు తెలిపారు.
నైతిక విజయం నాదే..
- గౌరు వెంకటరెడ్డి, వైకాపా అభ్యర్థి
శాసనమండలి ఎన్నికల్లో సాంకేతికంగా ప్రత్యర్థి విజయం సాధించినా నైతిక విజయం తనదే అన్నారు. గత ఉప ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నా టిడిపి అభ్యర్థి 142 ఓట్లు ఆధిక్యత సాధించారని గుర్తుచేశారు. తాజా ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన అయిదుగురితో కలిపి టిడిపి తరఫున 8 మంది తీవ్రంగా ప్రయత్నించినా మెజారిటీ గణనీయంగా తగ్గిందని తెలిపారు. దీన్ని బట్టి ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందన్నారు. ప్రస్తుతం తమ పార్టీకి వచ్చిన ఓట్లతో రెట్టించిన ఉత్సాహంతో పని చేసి 2019 నాటికి 14 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాలను దక్కించుకుంటామని గౌరు ధీమా వ్యక్తం చేశారు.