కర్నూల్

తాగునీటి సమస్యను అధిగమిస్తాం.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మార్చి 26:జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవటానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ విజయమోహన్ భరోసా ఇచ్చారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులు ఉన్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాల్లో ఆశించినంత వృద్ధి లేకపోవడం, జలాశయాల్లో నీరు అడుగంటడం కారణంగా చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. భూగర్భ జలా లు, జలాశయాల్లో నీరు ఉన్న ప్రాంతా ల నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తాగునీటిని తరలించచడానికి అవసరమైన నిధులు ఉన్నందున ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఎండ లు తీవ్ర ప్రభావం చూపుతుందున్న ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎండ వేడిమి కారణంగా ప్రజ లు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని, కావున అధికారులు, ప్రభుత్వ సిబ్బంది వడదెబ్బపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది అన్ని గ్రామాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.
అందరి సహకారంతో అభివృద్ధి-జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్
అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో నీటి సమస్య ఉంది. నీటి సమస్య పరిష్కారానికి తగినన్ని నిధులు ఉన్నాయి ఎవరూ ఆందోళన చెందవద్దు. అలాగే జిల్లాలో అనేక పాఠశాలల్లో అదనపు గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, అటువంటి పాఠశాలలను గుర్తించి వౌలిక వసతులు కల్పిస్తాం. ముఖ్యంగా జడ్పీటిసి, ఎంపిటిసి సభ్యులకు కలెక్టర్ ఒకొక్కరికి రూ. 4లక్షల చొప్పున ఇవ్వటానికి ఒప్పుకున్నారు.
పిహెచ్‌సిల్లో వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి
బనగానపల్లె నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ వసతులు కల్పించలేదు. కొన్ని పిహెచ్‌సిల్లో సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొన్ని పిహెచ్‌సిలు శిథిలావస్థకు చేరుకున్నాయని, మరికొని కేంద్రాల నిర్మాణమే చేపట్టలేదన్నారు. డాక్టర్లు లేని పిహెచ్‌సిలు ఎందుకు అని వెంటనే వైద్యులు, సిబ్బందిని నియమించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరిపోయే విధంగా అదనపు గదుల నిర్మాణం చేపట్టి వౌలిక వసతులు కల్పించాలన్నారు. ముఖ్యంగా కొన్ని పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉందని, ఆయా సమస్యలను పరిష్కరించాలన్నారు. అలాగే గత సర్వసభ్య సమావేశాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, లేకపోతే సమావేశాలకు వచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు రాంభీమ్‌నాయుడు, మీనాక్షినాయుడు, రంగారెడ్డి, సమీర్‌రెడ్డి, చంద్రశేఖర్, నాగజ్యోతి, ఎంపిటిసి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
శివపార్వతులకు భృంగి వాహనసేవ
* మహాలక్ష్మీ అలంకారంలో భ్రమరాంబదేవి
శ్రీశైలం, మార్చి 26 : ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలం మహాక్షేత్రంలో మొదటి రోజైన ఆదివారం శ్రీమల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లు భృంగివాహన సేవలో, శ్రీభ్రమరాంబదేవి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలంలో ఆదివారం ఆలయ ఇఓ నారాయణ భరత్‌గుప్త శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉగాది మహోత్సవాల ప్రారంభ పూజలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ అర్చక వేద పండితులు, అధికారులు పూజా ద్రవ్యాలతో యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం ఉత్సవాలను నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక వేద పండితులు సంకల్పం పఠించారు. ఈసంకల్పంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి కరవు కాటకాలు నివారించబడాలని వేద పండితులు సంకల్పం పఠించారు. మండపారాధనలో భాగంగా నవగ్రహ దేవతలను, దిక్పాలకులకు శాస్త్రోక్తంగా ఆహ్వానించి ఆరాధించి రుద్రకలశ స్థాపన సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం ఉత్సవాలలో భాగంగా అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన నిర్వహించారు.
ముందుగా అక్కమహాదేవి అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు సాయంకాల పూజల అనంతరం అక్కమహాదేవి అలంకరణ మండపంలో అలంకరణ పూజలను ఆలయ అర్చక వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు మేళతాళాల నడుమ మహామంగళహారతులు ఇచ్చి స్వామి అమ్మవార్లను గ్రామోత్సవానికి తోడ్కొని వచ్చారు. ఈ గ్రామోత్సవంలో ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన నాదస్వరం, కోలాటం, గుర్రపు నృత్యం, కన్నడ జానపద విన్యాసాలు, తోలుబొమ్మలాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదే విధంగా సోమవారం స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ, శ్రీభ్రమరాంబ దేవికి మహాదుర్గ అలంకారం, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఈవిశేష కార్యక్రమంలో ఆలయ ఇఓ నారాయణ భరత్‌గుప్త దంపతులు, ఎఇఓలు, అర్చక వేద పండితులు అధిక సంఖ్యలో కన్నడ భక్తులు పాల్గొన్నారు.
తప్పులతడకగా ఈక్రాప్ నమోదు!
* అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం..
కర్నూలుటౌన్, మార్చి 26:ఈక్రాప్ నమోదుపై సరైన అవగాహన లేకపోవడంతో ఈ ఏడాది వ్యవసాయ అధికారులు నమోదు చేసిన వివరాల్లో పెద్దఎత్తున తప్పులు దొర్లాయి. సాంకేతికంగా తీసుకున్న మార్పులపై సిబ్బందికి అవగాహన లేకపోవడం, శిక్షణ ఇవ్వకపోవడం, జిపిఎస్ పద్ధతి లేకపోవడంతో ఒకే పంటను చూపిస్తుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఏదైమైనా ఈక్రాప్ నమోదులో అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందని చెప్పవచ్చు. జిల్లాలో 80శాతం ఈక్రాప్ నమోదు చేయగా 10శాతం కూడా సక్రమంగా లేవని వ్యవసాయ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. జిల్లాలో రబీలో 6 లక్షల హెక్టార్లలో 1.2 లక్షల మంది రైతులు, ఖరీఫ్‌లో 2.9 లక్షల హెక్టార్లలో 59వేల మంది రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. రబీలో జొన్న, కంది, మినుము, శెనగ పంటలు సాగు చేయగా శెగనపంట ఎక్కువగా సాగు చేశారు. అయితే వాటిని ఆన్‌లైన్‌లో తప్పులతడకగా నమోదు చేశారు.
ఈక్రాప్ బుకింగే నమోదే కీలకం..
ఈ క్రాప్ బుకింగ్ అనేది అన్నదాతల భవిష్యత్తుతో ముడిపడిన అంశం. ఆన్‌లైన్‌లో తప్పులతడకగా నమోదు చేస్తే ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు పరిహారం అందకుండాపోతాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులోకి రావడంతో ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంటల వివరాల నమోదు మేరకు బ్యాంకుల్లో బీమా చెల్లిస్తారు. ఆన్‌లైన్ ఆధారితంగా ఆ రైతుకు పంట దిగుబడి పరిహారం అందుతుంది. అయితే అధికారులు సాగు చేసిన పంట కాకుండా ఇతర పంటలు నమోదు చేస్తే రైతు పెట్టుబడితో సహా పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది.
గతంలో రెవెన్యూ అధికారులు ఈక్రాప్ నమోదు చేస్తుండగా 2015 నుంచి ఈక్రాప్ బుకింగ్ అంశం కేంద్ర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి వచ్చింది. ఈ బాధ్యతను ప్రారంభంలో రెవెన్యూ విభాగానికి అప్పగించారు. ఇందుకు సంబంధించిన ట్యాబ్‌లను గ్రామ రెవెన్యూ అధికారులకు అందించారు. వాటి ఆధారంగా గ్రామాల్లోని ప్రతి రైతు సాగు చేసుకుంటున్న పంటలను సందర్శించి జిపిఎస్ పద్ధతిన సాగు చేసిన పంటలను చిత్రాలు తీసి ఆ రైతు పేరు, విస్తీర్ణంతో సహా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఈక్రాప్ బుకింగ్ 40 శాతం పూర్తి చేయడంతో జిపిఎస్ పద్ధతిన నమోదు చేసేందుకు ఇబ్బందులు ఉన్నాయని రెవెన్యూ సిబ్బందికి పనిభారం అధికంగా ఉందని 2016లో ఈక్రాప్ బుకింగ్‌ను వ్యవసాయ శాఖకు మార్చారు. వారు పొలాల్లో పర్యటిస్తుంటారని రెవెన్యూ అధికారులు ఇచ్చిన ట్యాబ్‌లను తీసుకుని ఏఇఓలు, ఎంపిఇఓలకు ఇచ్చారు. వీరు కూడా ఈక్రాప్ నమోదులో 80శాతం చేసినా అందులో తప్పులు తడకగా నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి.
జెడిఏ కార్యాలయానికి ఫిర్యాదుల వెల్లువ
ఆదోని డివిజన్ పరిధిలోని ఆలూరు మండలం పత్తిబెళగల్ గ్రామానికి చెందిన రైతు తిక్కయ్య 521-ఎ సర్వే నంబర్ గల పొలంలో శెనగ పంట సాగుచేశారు. అయితే ఈ క్రాప్ నమోదులో ఆ చిత్రానికి బదులు కంది పంట చిత్రాన్ని అప్‌లోడ్ చేశారు. ఇలా ఒక రైతువే కాకుండా వందలాది మంది రైతులు సాగు చేసిన పంటలు కాకుండా ఇతర పంటలు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. దీంతో జెడిఎ కార్యాయానికి వేలాదిగా ఫిర్యాదులు వచ్చాయి.
మంత్రాలయంలో
పాండిచ్చేరి వాసుల ఆత్మహత్య
* మృతదేహాల వద్ద సూసైడ్ నోట్ లభ్యం..
* సిఐ ఆధ్వర్యంలో అంత్యక్రియలు..
మంత్రాలయం, మార్చి 26 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ముగ్గురు పాండిచ్చేరి వాసులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. మంత్రాలయం సిఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన శరవణన్(42), ఆయన సోదరి శాంతి(38), ఆమె కుమార్తె పవిత్ర(12) ముగ్గురూ కలిసి శుక్రవారం రాత్రి మంత్రాలయంలోని వివిజి వసతి గృహంలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. వీరు రెండు రోజుల క్రితమే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని, దీంతో దుర్వాసన వెదజల్లడంతో వసతి గృహం నిర్వాహకులు గుర్తించి సమాచారం ఇచ్చారన్నారు. వారి వద్ద సూసైట్ నోట్ లభ్యమైందని, అందులో తమకు ఎవరూ లేరని జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాశారన్నారు. అలాగే తమ మృతదేహాలకు మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని అందులో రాసినట్లు సిఐ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలకు ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి శవపరీక్షలు చేయించామన్నారు. అనంతరం మంత్రాలయంలోనే సిఐ ఆధ్వర్యంలో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీస్‌స్టేషన్ రైటర్ చంద్ర తెలిపారు.
బదిలీపై వెళ్లినా కప్పట్రాళ్ల
అభివృద్ధిని విస్మరించను
* ఎస్పీ ఆకే రవికృష్ణ
దేవనకొండ, మార్చి 26:రాష్ట్రంలో తాను ఎక్కడ ఉన్న కప్పట్రాళ్ళ అభివృద్ధిని మాత్రం వీడనని ఎస్పీ రవికృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం తన దత్తత గ్రామమైన కప్పట్రాళ్ళలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ తాను ఉద్యోగ రీత్య ఎక్కడైన బదిలీపై వెళ్ళిన్పటికి కప్పట్రాళ్ళ గ్రామాన్ని వీడే ప్రసక్తి లేదన్నారు. గతంలో కప్పట్రాళ్ళ గ్రామంలోని ఇతరులు రావాలంటే బయపడేవాడరని ప్రస్థుతం ఆమెరికాలో ఉండే తానా వారు కూడా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. అలాగే కప్పట్రాళ్ళ పొదుపు మహిళలను కమ్యూనిటి రీసోర్స్‌పర్సన్‌గా గుర్తించి ఇతర రాష్ట్రాలలో పొదుపు సంఘాలు తయారు చేయడానికి సిద్దం చేస్తున్నామన్నారు. త్వరలో కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన ఒక పొదుపు మహిళ మణిపూర్‌కు వెళ్ళనున్నట్లు పేర్కొన్నారు. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించి కొత్త రుణాలను పొందాలని అన్నారు. అన్ని శాఖల అధికారుల సహాయ సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
అలాగే తానావారి సహకారంతో రూ.10లక్షలతో నిర్మించనున్న శ్రీశక్తి భవనానికి ఆయన భూమి పూజ చేశారు. కోరమండల్, సత్యసాయి ట్రస్టు వారి సహకారంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎస్పీ ప్రారంభించారు. 15 మంది రైతులకు రాయితీ ఎద్దుల బండ్లను పంపిణీ చేశారు. రైతుల లాబాసాటి వ్యవసాయం కోసం రూ.90శాతం సబ్సిడీతో 18 మంది రైతులకు రూ. 25లక్షలు డ్రిప్ పరికరాలను ఆయన అందజేశారు. అలాగే కప్పట్రాళ్ళ గ్రామాల్లో మిర్చి ప్లాంట్ ఏర్పాటు కృషి చేస్తామన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ముస్లింల ఇస్తామ విందు కార్యక్రమంలో ఎస్పీ రవికృష్ణ పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో తానా ప్రోగ్రాం కన్వీనర్ రాజాశేఖర్, కోరమండల్ ఫర్టిలైజర్స్ మేనేజర్ చక్రవర్థి, డిఎస్పీ రమణమూర్తి, బాబా ఫకృద్దీన్లు, ఎంపిపి రామచంద్రనాయుడు, ఆస్పరి జడ్పీటిసి బొజ్జమ్మ, స్థానిక ఎంపిటిసి హైమావతి, సిఐలు విక్రమసింహ, నాగరాజుయాదవ్, డేగల ప్రభాకర్, శ్రీనివాసులు, ప్రసాద్, శ్రీనివాసరెడ్డిలు, ఎస్‌ఐలు గంగయ్యయాదవ్, శంకర్, మహేష్, కృష్ణమూర్తిలు, ఏఓలు అల్త్ఫా ఆలీఖాన్, అక్బర్‌బాషా, ఆర్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ రసూల్, సంజీవరావు, ప్రొఫెసర్ సంజీవరావు, సోషల్ ఆర్గనైజర్ నారాయణతోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
బిసిలపై కెఇ కుటుంబం కపటప్రేమ..
* దాడులు చేయడమేనా మీ అభివృద్ధి..
* పిఎసి చైర్మన్ బుగ్గన రాజారెడ్డి
డోన్, మార్చి 26:బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయమని, బడుగుల కోసం అహర్నిశలు పాటుపడుతున్నామని చెప్పుకునే డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి బిసిల పైనే దాడులు చేయిస్తున్నారని పిఎసి చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని తన నివాసంలో ఆదివారం బుగ్గన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కెఇ కుటుంబంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెఇ కుంటుంబం బిసిలంటే ప్రేమ ఒలకబోస్తూనే తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ టెండర్లలో టిడిపి వర్గీయుల దౌర్జన్యం దుర్మార్గపు చర్య అన్నారు. వైకాపా కార్యకర్తలైన పోస్టుప్రసాద్, ఓబుళాపురం సుధాకర్, మదన్, లాల్‌బాషాలపై దాడులు చేసి గాయపర్చడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. వీరంతా బిసిలు కాదా అని, వీరు రాజకీయంగా ఎదిగితే ఓర్చుకోలేరా అని ప్రశ్నించారు. కెఇ కృష్ణమూర్తి అండ చూసుకునే టిడిపి నేతలు దౌర్జన్యాలు, కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డోన్ ప్రాంతంలోని వంకలు, వాగులతో పాటు చెరువులను సైతం వదలకుండా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. డోన్‌లో జరిగిన కబ్జాల గురించి అసెంబ్లీలో లేవనెత్తుతానని స్పష్టం చేశారు. అందరికీ సమన్యాయం చేయాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని విమర్శించారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చూడాలని, వైకాపా నాయకులు, కార్యకర్తలపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ డీఎస్పీ బాబాఫకృద్దీన్‌కు వినతిపత్రం సమర్పించారు. బుగ్గనతో పాటు నాయకులు శ్రీరాములు, తదితరులు ఉన్నారు.
ఉద్యోగులను విస్మరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవు
* ఏపి ఎన్‌జిఓ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంగళరెడ్డి
నందికొట్కూరు, మార్చి 26:ఉద్యోగులను విస్మరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవు అని ఏపి ఎన్‌జిఓ జిల్లా అధ్యక్షుడు వెంగళరెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులకు పెన్షన్ విషయంలో ప్రభుత్వ తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్‌జిఓ కార్యాలయంలో ఆదివారం పట్టణ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి అధ్యక్షతన ఏపి ఎన్‌జిఓ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరెడ్డి మాట్లాడుతూ 2004 కంటే ముందు పని చేసే వారికి పెన్షన్ మంజూరు చేస్తూ అనంతరం ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్ అమలు చేయకపోవడం భావ్యం కాదన్నారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులకు ఒరిగేదేమీ లేదన్నారు. ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు మరికొందరికి జీవితకాలం పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం జీవితకాలం విధులు నిర్వహించే ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ యువత ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి గుణపాఠమన్నారు. పిఆర్‌సి అరియర్స్ ఇవ్వడం లేదని, డిఎ ఇవ్వడంలో కూడా అలసత్వం వహిస్తున్నారని, కరవు భత్యం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజాప్రతినిధులు దాడులు చేస్తే సహించేది లేదన్నారు. విజయవాడలో అధికార పార్టీ నాయకులు ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పట్ల వ్యవహరించిన తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయన్నారు. బనగానపల్లె, కోడుమూరులో ఎన్‌జిఓ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాలని కోరామన్నారు. ఎన్‌జిఓల సమస్యల పరిష్కారంపై జూన్ మొదటి వారంలో కడపలో నిర్వహించే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డిని ఎన్‌జిఓ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ సహాధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి రాముడు, ట్రెజరర్ పి.రాముడు, జిల్లా కార్యదర్శి జవహార్, 13 జిల్లాల ఎన్‌జిఓ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.