కర్నూల్

భూవివరాలు ట్యాబ్‌లో నమోదు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, ఏప్రిల్ 4:సర్వే వివరాలు, పెండింగ్ భూముల వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సర్వేయర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆన్‌లైన్ విధానాన్ని చేపట్టిందని, అందులో భాగంగానే జిల్లాలోని సర్వేయర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నామన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారం జెసి ఏడి చెన్నయ్యతో కలిసి జిల్లాలోని సర్వేయర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రహదారి భూసేకరణను వేగవంతంగా పూర్తిచేయాలని సిఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ మార్గం పనులకు సంబంధించి భూసేకరణపై ఎప్పటికప్పుడు నివేదికలు అడుగుతున్నారని, భూసేకరణను వేగవంతంగా పూర్తిచేసిన సర్వేయర్లకు సిఎం నుంచి ప్రశంసలు ఉంటాయని తెలిపారు. ప్రతి మండల సర్వేయర్ తనకు కేటాయించిన సర్వేపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. కొలిమిగుండ్ల, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ, చాగలమర్రి, నంద్యాల, సంజామల సర్వేయర్లు పని విషయంలో కొంత వెనకపడ్డారని వారి పనిలో మార్పురావాలని సూచించారు. ఆదోని డివిజన్‌లో రైతుల భూ సరిహద్దు సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, ఆ డివిజన్ నుంచే ఎక్కువగా ఫిపిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కర్నూలు డివిజన్‌లో ప్యాపిలి, డోన్, వెల్దుర్తి, ఓర్వకల్లు, నందికొట్కూరు మండలాల్లో భూసమస్యలు అధికంగా ఉన్నాయని, ప్రజాదర్బార్‌లో ఆయా మండలాలకు సంబంధించి అధిక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మీసేవలో చలానా కట్టినా కూడా సకాలంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ఇకపై చలాన కట్టిన ప్రతి రైతుకు ఒక తేదీని ప్రకటించి ఆ దినాన సమస్యను పరిష్కరించాలన్నారు. నంద్యాల డివిజన్‌లో సర్వేయర్లు రైతుల నుంచి అధిక మొత్తం వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
బాధ్యతగా పనిచేయండి..
* ఎంఇఓల శిక్షణలో డిఇఓ తాహెరాసుల్తానా
కర్నూలుటౌన్, ఏప్రిల్ 4:జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు(ఎంఇఓలు) బాధ్యతగా పని చేయాలని డిఇఓ తాహెరాసుల్తానా సూచించారు. కలెక్టరేట్‌లోని విద్యాశాఖ సమావేశ మందిరంలో మంగళవారం నూతన ఎంఇఓలకు విధులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ మండలంలోని ప్రతి పాఠశాల, వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. అలాగే మండలంలో నిరక్షరాస్యత వున్న గ్రామాలను సందర్శించి, ఆ గ్రామాల్లో పాఠశాల పనితీరుపై దృష్టి పెట్టాలన్నారు. సి.క్యాటగిరి పాఠశాలలను తనిఖీ చేసి వౌలిక వసతులపై నివేదికలు అందించాలని, అసౌకర్యంగా ఉన్న పాఠశాలలపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి నాణ్యతపై సమీక్షించాలన్నారు. పాఠ్యపుస్తకాలు, దుస్తులకు సంబంధించి సరైన సమయంలో సమాచారం అందించాలన్నారు. బడిమాని పనులకు వెళ్లే బాల కార్మికులపై దృష్టి పెట్టి వారు పాఠశాలలో వుండేలా కృషి చేయాలన్నారు. మండలంలోని పాఠశాలల్లో సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో సమాచారం పంపాలన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల వివరాలను డిఇఓ కార్యాలయానికి పంపాలన్నారు. పాఠశాలలో రిజిస్టర్ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఇఓలు, సర్వశిక్షా అభియాన్ ఏఎంఓ మాలిక్‌బాషా, విద్యాశాఖ సిబ్బంది, ఎంఇఓలు పాల్గొన్నారు.
15లోగా సర్వే వివరాలు పంపండి
* సమాచారం అందించడంలో నిర్లక్ష్యం వద్దు
* సిసిఎల్‌ఎ కమిషనర్ అనీల్ చంద్రపునీత్
కర్నూలుటౌన్, ఏప్రిల్ 4:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే, ఈ కెవైసి వివరాలను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని భూ పరిపాలన ముఖ్యకార్యదర్శి అనీల్‌చంద్రపునీత్ ఆదేశించారు. ఆయన మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలో ఈకెవైసి సర్వేలో అర్బన్ ప్రాంతం వెనుకబడి వుందని, ఇప్పటికే ఎమ్మిగనూరు కమిషనర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు. నగర, పురపాలక, నగర పంచాయతీల్లో 3 రోజుల్లోగా సర్వే పూర్తవుతుందన్నారు. జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో రెవెన్యూ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల ధ్రువీకరణ పత్రాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలో దాదా పు 180 కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఇప్పటి వరకూ దాదాపు 500ల దాకా దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి ధ్రువపత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రెవెన్యూ శాఖపై ప్రత్యేక నమ్మకం కల్గిందని, భవిష్యత్తులోనూ ఇదేవిధంగా కొనసాగిస్తామన్నారు. జన్మభూమిలో అందిన అర్జీలను వేగవంతంగా పరిష్కరిస్తామన్నారు. 3 డివిజన్లలో కర్నూలు కొంత వెనుకబడిందన్నారు. రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో వుండేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని, రెవెన్యూ అంశాలన్నింటిలో మే నెలకు ప్రథమ స్థానంలో వుంటామని తెలిపారు. అనంతరం కమిషనర్ పలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ, సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
శ్రీశైలంలో శ్రీరామనవమికి
ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీశైలం, ఏప్రిల్ 4: శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం దేవస్థాన పరివార దేవాలయమైన పాతాళగంగ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో సీతారామ చంద్రుల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామికి, శ్రీసీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 9.05 గంటలకు సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను దేవస్థాన అధికారులు ప్రత్యేకంగా చేశారు.
పాల డెయిరీ కార్మికులను
రెగ్యులర్ చేయాలి
కర్నూలు సిటీ, ఏప్రిల్ 4:విజయ పాల డెయిరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎన్.మనోహర్ మాణిక్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం విజయ పాల డెయిరీ మేనేజర్ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక విజయ పాల డెయిరీలో కాంట్రాక్టు కార్మికులు 1999 నుంచి చాలీచాలని వేతనంతో పని చేస్తున్నారని, ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు వారి కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవటం లేదన్నారు. ముఖ్యంగా 1993 నుంచి ఏ ఒక్కరినీ రెగ్యులర్ చేయకుండా కాంట్రాక్టు పద్ధతిన కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా డెయిరీ యాజమాన్యం, పాలక మండలి స్పందించి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. క్యాక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప, నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ప్రభాకర్, శ్రీనివాసరావు, పాల డెయిరీ సంఘం నాయకులు నాగరాజ్, చాంద్‌బాషా, రాజేష్, రాఘవేంద్ర పాల్గొన్నారు.
సీమలో ఉద్యాన పంటల అభివృద్ధికి
ప్రత్యేక ప్రాజెక్టు
నంద్యాల, ఏప్రిల్ 4: ఉద్యాన పంటల రైతులకు మేలు కలిగే విధంగా భూమి ఆరోగ్య యాజమాన్య పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం రూ.1.215 కోట్ల ఖర్చుతో రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో సరికొత్త ప్రాజెక్టును చేపట్టినట్లు నంద్యాల, తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా ఆచార్య ఎన్‌జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డా.గిరిధర్ కృష్ణ తెలిపారు. మంగళవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అత్యల్ప వర్షపాత మండల పరిశోధనా సలహా మండలి సదస్సు రెండవ రోజున ఆయన మాట్లాడుతూ ఉద్యానవన పంటల రైతులకు భూసార విలువలపై తగిన విధంగా సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా ఆరు జిల్లాల్లోని మామిడి, నిమ్మ, చీని, దానిమ్మ, సపోట, రేగు, పంటలు పండించే రైతులకు భూసార స్థితిగతులు, పోషకాల యాజమాన్యం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సిఫార్సులు చేయడం జరుగుతుందన్నారు. ఆరు జిల్లాల్లో ఉద్యానవన పంటలు సాగుచేస్తున్న ప్రాంతాలలో 400 గుంతలను తీసి అందులో నుండి మట్టి నమూనాలను సేకరించి ఉద్యానవన కమిషనరేట్‌కు నివేదిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉద్యానవన పంటల విస్తీర్ణం గురించి స్థానిక ఉద్యానవన శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేస్తామన్నారు. చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు సంబంధించిన ఉద్యానవన పంటల కోసం సుమారు 7500 మట్టి నమూనాలు సేకరించి వాటిని విశే్లషించి ఉద్యానవన అధికారులకు, రైతులకు అందజేస్తామన్నారు. ఉద్యానవన పంటలు సాగుచేస్తున్న మండలాల్లో మండల స్థాయి సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో 80 వేల ఎకరాల్లో మామిడి పంట సాగుచేస్తున్నారని, నెల్లూరు జిల్లాలో చీని, నిమ్మ తోటలు 6500 ఎకరాలు, కర్నూలు జిల్లాలో మామిడి 27 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో దానిమ్మ, చీని, నిమ్మ, రేగు, సపోట పంటలు 8500 ఎకరాలు, కడప జిల్లాలో మామిడి 30 వేల ఎకరాలు, చీని, నిమ్మ తోటలు 7000 ఎకరాలు, బొప్పాయి 5 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారన్నారు. పై ఆరు జిల్లాల్లో ఉద్యానవన పంటలు సాగుచేస్తున్న రైతులకు పోషకాల యాజమాన్యం (న్యూట్రిషన్ మ్యాప్స్) చిత్రపటాలు సిద్ధం చేసి ఆయా మండలాల ఉద్యానవనాల అధికారులకు అందిస్తామని, ఆయా జిల్లాల్లో ఉన్న ఉద్యానవన తోటల్లో సమస్యలు గుర్తించి యాజమాన్య పద్ధతులలో ఉద్యానవన శాఖ అధికారులు, శాస్తవ్రేత్తలు పరిష్కారం చేస్తారన్నారు.
ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానంపై పరిశోధన..
తిరుపతి కేంద్రంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానంపై 99.12 లక్షల ఖర్చుతో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద పరిశోధన చేపట్టినట్లు స్పెషల్ ఆఫీసర్ డా.గిరిధర్ కృష్ణ తెలిపారు. 13 జిల్లాల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల వారిగా ఆయా పంటలపై ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానంపై పరిశోధనలు నిర్వహించి ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుందా? లేక నష్టపోతారా? అన్న విషయం స్పష్టం చేస్తామన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానలో శనగ, కొర్ర పంటలపై తిరుపతి ఆర్‌ఎఆర్‌ఎస్‌లో వేరుశనగ పంటపై, గుంటూరు ఆర్‌ఎఆర్‌ఎస్‌లో పత్తి పంటపై, అనకాపల్లి ఆర్‌ఎఆర్‌ఎస్‌లో చెరుకు పంటపై, మార్తేరు ఆర్‌ఎఆర్‌ఎస్‌లో వరి పంటపై, చింతపల్లి ఆర్‌ఎఆర్ ఎస్‌లో మొక్కజొన్న, రాజ్‌మా పంటలపై ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానంపై పరిశోధించి ఆచార్య ఎన్‌జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామన్నారు. ఇటీవల కాలంలో ప్రకృతి వ్యవసాయం (సేంద్రీయ వ్యవసాయంపై) అక్కడక్కడ రైతులు సాగుచేస్తున్నారని, అయితే ఆ రైతులు పండించే పంటలు వారికి గిట్టుబాటు ధర లభిస్తుందా? లేదా? అన్న విషయంపై మూడు సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు ద్వారా పరిశోధనలు నిర్వహిస్తామన్నారు. రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు మోతాదుకు మించి వాడడం వల్ల భూమి తన సహజ సిద్ధ స్వభావాన్ని కోల్పోయి భవిష్య తరాల వారికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, దీన్ని నివారించేందుకే ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానంపై మూడు సంవత్సరాల పాటు పరిశోధనలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. పంటల తెగుళ్ల నివారణకు, క్రిమి సంహారక మందుల కంటే సేంద్రీయ పద్ధతిలో మందులు ఉపయోగించడం వల్ల తెగుళ్లను అదుపు చేయగలమా? రసాయనిక ఎరువులు వాడకుండ అధిక దిగుబడులు సాధించే అవకాశాలపై సమగ్రంగా పరిశోధన నిర్వహిస్తామన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు
మంత్రి పదవులు అనైతికం
ఆదోని, ఏప్రిల్ 4: వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి పదవులు ఇవ్వటం అనైతికమని మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలు మార్చిన వారి శాసన సభ సభ్యులుగా ఉండటానికి వీలు లేకుండా శాసనం చేసినప్పటికీ ఆ చట్టాలకు చంద్రబాబునాయుడు, తెలంగాణలో చంద్రశేఖర్‌రావు తూట్లు పొడిచారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను శాసన సభ నుంచి, వారి శాసన సభ్యత్వం నుండి తిరస్కరించే హక్కు చట్టం స్పీకర్లకు ఇచ్చినప్పటికి స్పీకర్లు శాసన సభ నేతలుగా వ్యవహరించలేదని, రాజకీయ పార్టీ నాయకులుగానే వ్యవహరించడం వల్ల పార్టీలను చాలా సులువుగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్నారు. నేటి రాజకీయాలలో నీతి నిజాయితీ, నిబద్ధత ఎక్కడ కనిపించలేదన్నారు. ఒకప్ముప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, అధికార పీఠం ఎక్కుతున్నారని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసేవారన్నారు. అయితే నేడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలో పార్టీలు మార్చడానికి ముఖ్యమంత్రులే పూనుకుంటున్నారని, మంత్రి పదవులు ఎరవేస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా మెజార్టీ సాధించినా బిజెపి ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఎరవేసి అధికారం చేపట్టడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. అదే పని కాంగ్రెస్ చేసి ఉంటే అన్ని పార్టీలు దుమ్మెత్తి పోసేవన్నారు. రాజకీయాలలో పార్టీ నియమం ప్రకారం నడుచుకోవాలన్నారు. గవర్నర్లు పార్టీ మారిన వారితో ప్రమాణస్వీకారం చేయించడం చట్టరీత్యా తప్పన్నారు. ఇప్పటికైనా నాయకులు విలువలను పాటించాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్లు చట్టం ప్రకారం చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని కోరారు.
పదవుల కోసం సిఎంను
విమర్శించడమా!
ఆదోనిటౌన్, ఏప్రిల్ 4: మంత్రి పదవుల కోసం పార్టీలోని కొంత మంది నాయకులు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శలు చేయడం ఆయనపై ఒత్తిడి తేవడం తగదని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు. మంగళవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు అధికారంలో లేని తెలుగుదేశం పార్టీ అధికారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కష్టపడి 208 పాదయాత్ర చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని, ఆయన కష్టార్జీతమే టిడిపి అధికారమన్నారు. అంతేకాకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడుతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, రాష్ట్ర ప్రజలు ఆయనపై నమ్మకంతో ఎన్ని పార్టీలు ఉన్నా తెలుగుదేశంకే ఓటు వేశారన్నారు. అయితే మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యే బోండా ఉమా, అనితలు తమకు మంత్రి పదవులు రాలేదని ముఖ్యమంత్రిని విమర్శించండం పత్రికలకు ఎక్కడం ఎంత వరకు సమంజసం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో అనేక విధాలుగా అభివృద్ధికి పనులు చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడానికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. కేవలం కమ్మవర్గం వారే ఎక్కువ పదవులు కావాలంటే ఎలా అని పేర్కొన్నారు. పార్టీపై విమర్శలు చేయడం వల్ల చడ్డపేరు వస్తుందని, ప్రజలపై నమ్మకం పోతుందన్నారు. పార్టీలో సీనియర్ నాయకులు అనేక మంది ఉన్నారని, వారు పార్టీ కోసమే పని చేస్తున్నారని, కొత్తగా వచ్చిన వారు అప్పుడే మంత్రి పదవులు కావాలంటున్నారు. తాను పార్టీలో పుట్టినప్పటి నుంచి ఉన్నానని చంద్రబాబును నమ్ముకుని పని చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా పార్టీ నాయకులు అధినేత నిర్ణయాన్న శిరశావహించాలని, 2019లో తిరిగి టిడిపి అధికారంలోకి వచ్చేలాగా కలిసి కట్టుగా కృషి చేయాలని అందరిని ప్రార్థిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
లాభదాయక వ్యవసాయానికి
యాంత్రీకరణ తప్పదు
నంద్యాల, ఏప్రిల్ 4: వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతోపాటు యాంత్రికరణ చేపట్టడం వల్లనే లాభదాయకత ఉంటుందని వ్యవసాయ శాస్తవ్రేత్తలు వెల్లడించారు. మంగళవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహించిన అత్యల్ప వర్షపాత మండల పరిశోధనా, సలహా మండలి సమావేశంలో ఆచార్య ఎన్‌జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు చాపర గణపతి రావు, వ్యవసాయ శాస్తవ్రేత్తలు డా.గిరిదర్ కృష్ణ, డా.పద్మలత, నంద్యాల ఆర్‌ఎఆర్‌ఎస్ ఎడిఆర్ డా.గోపాల్‌రెడ్డి, అనంతపురం జెడిఎ శ్రీరామమూర్తి, కర్నూలు జెడిఎ ఉమా మహేశ్వరమ్మలు రైతులకు లాభదాయక వ్యవసాయంపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వరి, కొర్ర, కంది, పొద్దుతిరుగుడు, శనగ పంటల్లో అన్ని రకాలుగా యాంత్రీకరణ చేయడం వల్ల కూలీల ఖర్చులు తగ్గి నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చన్నారు. ముఖ్యంగా వరి పంట నారు నాటేందుకు, పంట నూర్పిడి చేసేందుకు యాంత్రీకరణ వల్ల ఖర్చులు తగ్గి లాభాలు వస్తాయన్నారు. అలాగే శనగ పంట విత్తేందుకు, నూర్పిడికి కూడా యంత్రాలు వాడడం ఉపయోగకరమన్నారు. కొర్ర పంట నూర్పిడి, పొద్దు తిరుగుడు పంట నూర్పిడి, పంటలలో కలుపు నివారణ తదితర పనులకు యంత్రాలను ఉపయోగించడం వల్ల ఖర్చులు తగ్గడంతోపాటు దిగుబడులు సాధించవచ్చన్నారు. 2వ రోజు సమావేశంలో కర్నూలు, కడప జిల్లాల్లో గత ఖరీఫ్, రబీ సీజన్‌లో సాగుచేసిన పంటల పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాల వ్యవసాయాధికారులు శ్రీరామమూర్తి, ఉమా మహేశ్వరమ్మలు శాస్తవ్రేత్తలకు, రైతులకు వివరించారు. రెండు జిల్లాల నుండి హాజరైన రైతులు పంటల సాగులో తాము ఎదుర్కొన్న సమస్యలను శాస్తవ్రేత్తల దృష్టికి తీసుకువచ్చారు. శాస్తవ్రేత్తలు రైతుల సమస్యలను పరిష్కరించి పలు సలహాలు, సూచనలు అందజేశారు. స్పెషల్ ఆఫీసర్లు డా.పద్మలత, డా.గిరిధర్ కృష్ణలు మాట్లాడుతూ గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రెండు జిల్లాల్లో వేరుశనగ పంట తీవ్రంగా నష్టపోయిందని, రబీ సీజన్‌లో పలు పంటలు వర్షాలు లేక ఎండిపోయాయన్నారు. అనంతరం చాపర గణపతి రావు మాట్లాడుతూ శాస్తవ్రేత్తలు రైతులు పంటలు వేసే సమయానికి వారికి అవగాహన కల్పిస్తూ వ్యవసాయంలో ఒడిదుడుకులు ఎదుర్కొనేందుకు సూచనలు చేయాలన్నారు. రాయలసీమ జిల్లాల్లో కొర్ర పంట సాగుచేసి తద్వారా వాల్యు యాడెడ్ ప్రాడక్ట్‌లను తయారు చేసి లాభాలు ఆర్జించవచ్చన్నారు. కర్నూలు జిల్లాలో కంది పంట మంచి దిగుబడులను ఇచ్చిందని, అయితే మార్కెట్‌లో ధర లేక రైతులకు కొంత మేరా నష్టం వాటిల్లిందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లలో రెండు జిల్లాల్లో పంటల సాగు ప్రణాళిక రూపొందించి విస్తరణ అధికారులకు అందజేస్తారన్నారు. తద్వారా రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకొని శాస్తవ్రేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ ఏ ప్రాంతానికి తగిన విధంగా పంటల సాగు చేసుకోవాలని సూచించారు.

ఘనంగా సీతారాముల ఎదుర్కోళ్లు
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 4: శ్రీరామనవమి సర్వదినాన్ని పురష్కరించుకొని నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సీతారాములకు ఎదుర్కోల్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోధూళికా సమయంలో ఉత్సవమూర్తులు శ్రీ సీతా, రామ, లక్ష్మణులకు పంచామృతాభిషేకం అర్చకులు వేద మంత్రాల నడుమ జరిగింది. ఉత్సవమూర్తులను పట్టుపీతాంబరాలతో, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు చేశారు. రాత్రి సీతారాములకు ఎదుర్కోలు కార్యక్రమాన్ని చూడముచ్చటగా నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో పడకండ్ల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో ఉత్సవమూర్తులకు పూజలనంతరం ఎదుర్కోల్ల వేడుక కార్యక్రమం జరిపించారు.

నంద్యాలలో రాములోరి కల్యాణం
నంద్యాలటౌన్, ఏప్రిల్ 4: నంద్యాల పట్టణంలోని శ్రీరామాలయాలు శ్రీరామనవమి పురస్కరించుకుని అన్ని హంగులతో ముస్తాబయ్యాయి. పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వెలసిన శ్రీ కోదండ రామాలయం, ఎస్‌బిఐ కాలనీలో వెలసిన కోదండ రామాలయం, ఎన్‌జిఓ కాలనీలో వెలసిన రామాలయం, మూలసాగరంలోని రామాలయం, నందమూరినగర్‌లో నూతనంగా నిర్మించిన రామాలయాల్లో శ్రీ రాములోరి కల్యాణ వేడుకలను నిర్వహించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.