కర్నూల్

గోవిందనామస్మరణతో మార్మోగిన నల్లమల గిరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, మే 9: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతుత్సవాలు, స్వాతి నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. గత 10 రోజుల నుండి నృసింహ జయంతుత్సవాలు కొనసాగుతున్నాయి. చివరి రోజైన మంగళవారం ఆలయ ఇఓ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, అర్చక బృందం ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పాటు శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారిని ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి పూలజు చేశారు. ఉత్సవమూర్తుల ఎదుట స్వాతి హోమం నిర్వహించారు. పూర్ణాహుతి అవగానే హోమం నుండి వెలువడే కాటుకను భక్తులకు అందజేశారు. స్వామి చెంతన వుంచిన పసుపు దారాలను కూడా భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు మాట్లాడుతూ నృసింహ జయంతి సందర్భంగా హోమం నిర్వహించడం వల్ల వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలతో రైతులు, ప్రజలు కళకళ లాడుతూ వుండాలనే సంకల్పంతో చేస్తామన్నారు. స్వాతి సందర్భంగా నల్లమల అరణ్యంలో కొలువు దీరిన నవనారసింహులను కాలినడకన దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయన్నది భక్తుల ప్రగాడ విశ్వాసం. వేకువఝామునుండే నవనారసింహులను దర్శించుకునేందుకు కొండ మార్గం గుండా గోవింద నామాలు పెడుతూ వెళ్తుంటే అలుపు అన్న మాటే కనిపించదు. స్వామికి వచ్చే భక్తులకు పావన, మాలోల, వరాహ, కారంజ, యోగానంద నరసింహ ఆలయాల వద్ద అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేశారు. సాయంత్రం అష్టోత్తర శత కలశ తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం అవతారోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పాటు, రామానుజన్ స్వామిని, గోదాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. రాత్రి కంచి నుండి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలతో పల్లకిని ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవమూర్తులను కొలువుంచి అహోబిల మాఢ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నృసిం హ జయంత్యుత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అహోబిలేసుని సన్నిధిలో ప్రముఖులు
ప్రముఖ పుణ్య క్షేత్రమైన అహోబిలంలో రాయలసీయ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ నరసింహులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుకొని పూజలు చేశారు. వైస్ చాన్సలర్ రాకతో ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కొలువైన ప్రహ్లాదవరదస్వామిని, అమృతవల్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నృసింహ జయంతుత్సవాలలో పాల్గొన్నారు. అలాగే కర్నాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప నల్లమల అరణ్యంలో కొలువైన నవనారసింహులను దర్శించుకున్నారు.
ఆళ్లగడ్డలో అన్నదానం
నృసింహ జయంతుత్సవాల సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలో నరసింహస్వామి భక్తుడు లక్ష్మిబాల ఓబులేసు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివివచ్చారు.
‘నీరు-ప్రగతి’ రైతులకు వరం
* చెరువుల అభివృద్ధికి శ్రీకారం:కేంద్ర మంత్రి సుజనాచౌదరి
వెల్దుర్తి, మే 9:నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా రైతుల భూముల్లో పంట కుంటలు తవ్వడంతో పాటు చెరువులు, చెక్‌డ్యాంల మరమ్మతులు చేసి వీలైనంత ఎక్కువ నీరు నిల్వ చేయడం, భూగర్భజలాలను పెంచడమే లక్ష్యమని కేంద్ర సహాయ సాంకేతిక మంత్రి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి సుజనాచౌదరి తెలిపారు. మండల పరిధిలోని సూదెపల్లి చెరువులో మంగళవారం నీరు-చెట్టు కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి సుజనాచౌదరి, డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం కెఇ మాట్లాడుతూ 3 నియోజకవర్గాల్లో చెరువులను నీటితో నింపడమే ప్రధాన లక్ష్యమని, అందుకోసం రూ. 506కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రతి గ్రామంలో ప్రతిరైతు పొలంలో నీటి కుంట తవ్వుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కుంటల నిర్మాణానికి నిధులు పుష్కలంగా మంజూరు చేశాయన్నారు. అలాగే ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. ఎన్నికలకు మందు చంద్రబాబు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారన్నారు. అందులో భాగంగా రైతులు, పొదుపు మహిళలకు రుణాలు మాఫీ చేశారని, రాష్ట్రం విడిపోయిన అనంతరం రూ. 16వేల కోట్ల రెవెన్యూ లోటును అధిగమించి కర్షకుల కోసం కష్టపడుతున్నారన్నా రు. రాయలసీమలో కరవును పారదోలేందుకు పనులు చేపడుతున్నారన్నారు. అనంతరం నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా రైతులతో సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, జయనాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రి కెఇ ప్రభాకర్, టిడిపి ఇన్‌చార్జిలు తిక్కారెడ్డి, మీనాక్షినాయుడు, వీరభద్రగౌడ్, శివానందరెడ్డి, ఎంపిపి శైలజసుబ్బరాయుడు, సర్పంచ్ జయరాముడు, మాజీ ఎం పిపి జ్ఞానేశ్వరగౌడ్, ఎంపిటిసి రామాంజినేయులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నివేదిక తరువాత
విద్యుత్ రైళ్లు ప్రారంభిస్తాం
* గుంతకల్లు డిఆర్‌ఎం అమిత్ ఓజా
ఆదోని, మే 9: గుంతకల్లు-వాడీ రైల్వే లైన్ విద్యుతీకరణ పనులు ఇప్పటి వరకూ కర్నాటకలోని చిక్ సూగూరు వరకు పూర్తి చేశామని, సాంకేతిక అధికారులు నివేదిక ఇచ్చిన తరువాత పరిశీలించి విద్యుత్ రైళ్ళను నడపడానికి చర్యలు తీసుకుంటామని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ అమిత్ ఓజా విలేఖర్ల సమావేశంలో స్పష్టం చేశారు. మంగళవారం గుంతకల్లు నుంచి ఆదో ని రైల్వే స్టేషన్‌కు విచ్చేసిన అమిత్ ఓజా విలేఖర్లతో మాట్లాడుతూ తాను, ఇతర రైల్వే అధికారులు, సాంకేతిక అధికారులు మూడు రోజులపాటు విద్యుతీకరణ నిర్మాణం పూర్తి చేసిన విద్యుత్ లైన్లను పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక నిపుణులు, అధికారులు విద్యుతీకరణ చేసిన విద్యుత్ లైన్లను పూర్తిగా పరిశీలించి లోటు పాట్లు, లోపాలను పరిగణంలోకి తీసుకోని వాటిని పునః నిర్మించి అధికారులు 3 రోజుల్లో నివేదిక ఇస్తారని ఆయన చెప్పారు. ఆ నివేదికను పరిశీలించిన అనంతరం కొత్తగా నిర్మించిన విద్యుతీకరణ రైల్వే లైన్‌పై ముందుగా గూడ్స్ రైళ్ళను నడుపుతామని, ఆతరువాత ఎక్స్‌ప్రెస్ రైళ్ళను, ఇతర రైళ్ళను నడపడానికి తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విద్యుతీకరణ నిర్మాణంలో ఉన్న లోపాలపైన డిఆర్‌ఎం అధికారులపైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లోపాలను సరిదిద్ది విద్యుతీకరణ లైన్లను సక్రమంగా రైళ్ళు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైళ్ళ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదన్నారు. ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను గురించి గ్యాంగ్ మ్యాన్లకు ఆయన తగిన సూచనలు చేశారు.
రతనాలసీమగా మార్చేందుకు కృషి
* కేంద్ర సహాయ మంత్రి సుజనాచౌదరి
కర్నూలు సిటీ, మే 9:ఒకప్పుడు రాయలసీమకు రతనాల సీమగా పేరుండేదని, అయితే ప్రస్తుతం రాళ్లసీమగా మారిందని, ఈ పరిస్థితుల్లో సిఎం చంద్రబాబు రతనాలసీమగా మార్చేందుకు కృషి చేస్తున్నారని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి వెల్లడించారు. నగర శివారులో ఉన్న విజెఆర్ ఫంక్షన్ హాలులో మంగళవారం కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ అనాధిగా రాయలసీమ ప్రాంతం స్వార్థ రాజకీయాలు, ఫ్యాక్షన్ వల్ల వెనుకబడి పోయిందన్నారు. గత కొనే్నళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయని దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి తాగడానికి కూడా గుక్కెడు నీరు కరువై పోతుందన్నారు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచి నీటి కరవు లేకుండా చేయడానికి సిఎం చంద్రబాబు నీరు-ప్రగతి వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. గతంలో సీమలో ఫ్యాక్షన్ ప్రభావం ఎక్కువగా ఉండేదని దీంతో అభివృద్ధికుంటుపడిందని, ప్రస్తుతం ఫ్యాక్షన్ అంతమైపోయిందన్నారు. ఈ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా కలిసి ఉంటూ అభివృద్ధి దిశలో పయనిస్తున్నారని తెలిపారు. ప్రజలు ప్రాంతీయ విభేదాలు వీడి అభివృద్ధి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పార్టీని గ్రామ, మండల స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు అన్ని కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజల దరికి చేర్చి పార్టీపై నమ్మకం పెరిగేలా చేస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ని మండల కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో కొంత వివాదం ఉందని, ఆ సమస్యను కూడా ఇన్‌చార్జి మంత్రితో పాటు అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో కెడిసిసి బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, మాజీ మంత్రి కెఇ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జిల్లా కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్, తిక్కారెడ్డి, బిటి.నాయుడు, కర్నూలు పార్లమెంట్‌లోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
ఎన్‌డిఎలోకి ఆహ్వానిస్తూ
వామపక్షాలకు ఆహ్వానం
* బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు
మహానంది, మే 9: దేశంలో బిజెపి గూటికి వామపక్షాలను ఆహ్వానిస్తూ అన్ని పార్టీలను ఎన్‌డిఎ కూటమిలో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, అగ్రరాజ్యాన సరసన భారతదేశం చేరాలంటే మరో 15 సంవత్సరాల పాటు బిజెపి ప్రభుత్వం, నరేంద్రమోదీ పాలన సాగాలని రాష్ట్ర కార్యదర్శి కె కోటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన మహానంది పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించారు. అనంతరం రమణ కల్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ బిజెపిని రాష్ట్రంలో బలపరచేందు మండలాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 25న భారత బిజెపి అధ్యక్షులు అమిత్‌షా విజయవాడకు వస్తున్న సందర్భంగా భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు కార్యకర్తల సమీకరణ చేస్తూ ప్రతి మండలంలో పర్యటిస్తున్నామన్నారు. 1.50 లక్షల మందిని సమీకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ యేతర పార్టీలను ఎన్‌డిఎ కూటమిలో చేర్చుకొనేందుకు పార్టీ బలంగా ప్రయత్నాలు సాగిస్తుందన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఎపికి ప్రత్యేక హోదాకు మించి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. రైతులకు లాభసాటిగా ఉండేందుకు ఉచిత కరెంటు, నిరంతర విద్యుత్ అందిస్తుందన్నారు. రాబోయే 15 సంవత్సరాలు మోడీ పాలన సాగితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపిపై దృష్టిసారిస్తున్నారన్నారు. కేంద్ర మంత్రులు కూడా ఏ రాష్ట్రాన్ని పర్యటించనంత మంది ఎపిలో పర్యటిస్తూ అభివృద్ధిని కాంక్షిస్తున్నారన్నారు. 1.25 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి స్మార్ట్ సిటీగా ఎపిని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. వీటిని చూసిన అగ్రరాజ్యాలు వెంకయ్యనాయుడుకు ఐక్యరాజ్య సమితి చైర్మన్‌గా ఎన్నుకోవడం జరిగిందని ఆయనకు అభినందనలు తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి ఎపిలో 225 శాసన సభ సీట్లను తెలంగాణలో 154 సీట్లను ఏర్పాటు చేస్తూ వచ్చే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హరీష్‌బాబు, జిల్లా ఇన్‌చార్జి రామకృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యుడు పడకండ్ల నాగేశ్వరరావు, జిల్లా ప్రదాన కార్యదర్శులు గిరిరాజ వర్మ, రమేష్, మండల అధ్యక్షులు చిన్న లింగన్న, కార్యకర్తలు మధు, సాయి, వెంకటేష్, కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
చెరువులకు జలకళ
తెప్పిస్తాం:ఎమ్మెల్యే బిసి
బనగానపల్లె, మే 9:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నియోజకవర్గం పరిధిలో చెరువులకు జలకళ తెప్పిస్తామని ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే బిసి మండల పరిధిలోని ఎర్రగుడి, హుస్సేనాపురం, చెరువుపల్లె, విఠలాపురం తదితర గ్రామాల్లో పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎర్రగుడి వద్ద ఎర్రవాగులో రూ. 8.7 లక్షల వ్యయం తో కంపచెట్లు, రాళ్ల తొలగింపు, హుస్సేనాపురం నూరుషా చెరువులో రూ. 7.7 లక్షలతో, చెరువుపల్లె అక్కాజమ్మ చెరువులో రూ. 9.84 లక్షలతో పూడికతీత, విఠలాపురంలో రేగుమానువాగులో కంపచెట్లు, రాళ్ల తొలగింపు రూ. 9.16 లక్షలతో పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఎర్రగుడి వద్ద ఎర్రవాగు ఎర్రగుడి, హుస్సేనాపురం, యనకండ్ల, బత్తులూరుపాడు, పండ్లాపురం, కాపులపల్లె తదితర గ్రామాల మీదుగా జుర్రేరులో కలుస్తుందని ఈ వాగుకు పూర్వపు రూపుకల్పిస్తే ఈ గ్రామాల్లో భూగర్బజలాలు పెరుగుతాయని తెలిపారు. చెరువుపల్లె అక్కాజమ్మ చెరువు పూడికతీత పనులు ప్రాధాన్యత సంతరించుకున్నాయని ఈ చెరువుకు వచ్చే సీజన్‌లో ఎస్సార్బీసీ కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా చెరువును నింపుతామన్నారు. తద్వారా రామకృష్ణాపురం, దేవనగర్, పలుకూరు, బీరవోలు, చెరువుపల్లె, నందవరం, తిమ్మాపురం తదితర గ్రామాలకు భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీరు కూడా అందుతుందన్నారు. ప్రాధాన్యత కల్గిన చెరువులు, కుంటల్లో 3,4 విడతలైనా నీరు-చెట్టు కార్యక్రమం కింద పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా వున్నామని తెలిపారు. చెరువుపల్లె చెరువుమట్టి సారం కల్గి వుండడంతో చిన్న, సన్నకారు రైతులు కూడా మట్టిని పొలాలకు తోలుకుంటూ పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నామని, భూగర్భ జలాలు పెరిగి వచ్చే వేసవిని తట్టుకునే పరిస్థితులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అధికారులు అవసరమైన చోట్ల కంపచెట్లు, రాళ్ల తొలగింపు, పూడికతీత పనులు స్వీయ పర్యవేక్షణలో సాగించాలని జాప్యం లేకుండా చూడాలని ఎమ్మెల్యే బిసి ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు నాయకులు అంబాల రామకృష్ణారెడ్డి, టంగటూరు సహకార సంఘం అధ్యక్షుడు గాలి మద్దిలేటిరెడ్డి, నందవరం శ్రీ చౌడేశ్వరమాత ఆలయ కమిటీ చైర్మన్ పివి కుమార్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ కోడి నాగరాజు యాదవ్, కాట్రెడ్డి రాజశేఖరరెడ్డి, కప్పెట నాగేశ్వరరెడ్డి, పాణ్యం సిఐ పార్థసారధిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత
లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
నంద్యాలటౌన్, మే 9: వైశాఖ శుద్ధ చతుర్థశి పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయంలో వెలసిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల కల్యాణం మనోహరంగా...అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ్భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన స్వామి అమ్మవార్ల వివాహానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వీక్షించారు. ఈసందర్భంగా ఉదయం స్వామివార్ల పంచామృతాభిషేకాలు, విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, నవకుంభారాధన, రక్షా బంధనం, అగ్ని ప్రతిష్ఠ సామాన్య క్రియా హోమాన్ని పండితులు నిర్వహించారు. 9గంటలకు విశేష పూలంగిసేవ, సువర్ణరత్న ఆభరణ అలంకారం గావించారు. అనంతరం స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలు పఠిస్తుండగా కడు రమణీయంగా కల్యాణం కొనసాగింది. స్వామి అమ్మవార్ల కల్యాణం చేయడం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుందని, ఎవరైతే కల్యాణంలో పాల్గొంటారో వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు గావించారు.
2 నుంచి ‘అన్న అమృతహస్తం’
* ఐసిడిఎస్ ఆర్‌జెడి శారద
కర్నూలు టౌన్, మే 9:జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టులు 16 ఉండగా అందులో జూన్ 2వ తేదీ నుంచి 9 ప్రాజెక్టుల్లో అన్న అమృతహస్తం పథకం ప్రవేశ పెడుతున్నామని శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకురాలు శారద తెలిపారు. ఆమె మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ శిశుమరణాలు తగ్గించేందుకు తక్కువ బరువుతో ఉన్న పిల్లలకు పౌష్ఠిహారం అందించాలన్నదే అన్న అమృతహస్తం పథకం లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 102 ప్రాజెక్టుల్లో మంత్రి పరిటాల సునీత జూన్ 2వ తేదీ ప్రారంభిస్తారన్నారు. అందులో భాగంగా జిల్లాలో ఆదోని అర్బన్, డోన్, కోడుమూరు, కోవెలకుంట్ల, కర్నూలు రూరల్, అర్బన్, నందికొట్కూరు, నంద్యాల అర్బన్, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ఆర్‌జెడి తెలిపారు..
నేడు నూతన జెసి బాధ్యతల స్వీకరణ
కర్నూలుటౌన్, మే 9:జిల్లా 40వ జాయింట్ కలెక్టర్‌గా ప్రసన్నవెంకటేష్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. జెసి హరికిరణ్ తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ కావడంతో బాధ్యతలను కలెక్టర్‌కు అప్పగించారు. నూతన జెసి కలెక్టర్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
కేంద్ర మంత్రి సుజనాచౌదరికి
ఎమ్మెల్యే ఎస్వీ ఘనస్వాగతం
కర్నూలుటౌన్, మే 9:రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నీరు-ప్రగతి కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించడానికి మంగళవారం కేంద్ర మంత్రి సుజనాచౌదరి నగరానికి చేరుకోగా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. తొలుత బళ్లారి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకూ వేలాది మందితో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమ అఖిలప్రియ, ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వారు వెల్దుర్తి మండలంలోని సూదెపల్లె గ్రామానికి వెళ్లారు.
నాగసింధూర గణపతి గ్రామోత్సవం
ఆదోనిటౌన్, మే 9: మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో వెలసిన నాగసింధూర గణపతికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి వైభవంగాగ్రామోత్సవం నిర్వహించినట్లు వేద పండితులు గరుడాద్రిదత్తాత్రేయశర్మ తెలిపారు. ముందుగా దేవాలయంలో నవనాగశాంతి సహిత కుంబాభిషేకం, మహాయజ్ఞంలో భాగంగా గ్రామోత్సం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుండి దేవాలయంలో స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, మహామంగళహారతితో పూజలు నిర్వహించారు. అనంతరంగ్రామంలోని పురవీధుల గుండా వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామానికి చెందిన బజారప్ప అనే భక్తుడు స్వామివారికి రూ.35వేలతో బంగారు బొట్టు చేయించినట్లు గరుడాద్రిదత్తాత్రేయస్వామి పేర్కొన్నారు.
ఇళ్ల పథకానికి
రూ.216 కోట్లు మంజూరు
ఆదోనిటౌన్, మే 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అందరికీ గృహ పథకానికి ప్రభుత్వాలు తమ వాటాగా రూ.216 కోట్లు మంజూరు చేశాయని, బ్యాంకు మేనేజర్లు తమ సహకారం అందించాలని, లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ గోవిందప్ప కోరారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని 13 బ్యాంకుల మేనేజర్లు, ప్రతినిధులతో కమిషనర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆదోని పట్టణంలో 4,704 లబ్ధిదారులకు గృహ పథకం కింద మూడు విధాలుగా ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి రూ.216 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో మొదటి విధానంలో రూ.5లక్షల 72వేలు, రెండవ విధానంలో రూ.6లక్షల 74వేలు, మూడవ విధానంలో రూ.7లక్షల 71వేలతో గృహ సముదాయాల నిర్మాణం ఉంటుందని, ఇది కూడా ఎల్‌అండ్‌టి కంపెనీ వారు నిర్మిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బ్యాంకు మేనేజర్లు తమ బ్యాంకులకు కేటాయించిన లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించాలని, అందుకు ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో బరోసా ఇస్తున్నాయన్నారు. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల సబ్సిడీ ఉంటుందని, ఆయా కేటగిరిల వారిగా రూ.50వేలు, రూ.లక్ష లబ్ధిదారుల వాటాగా ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించినట్లు అవుతుందని, అన్ని రకాల సదుపాయం ఉంటుందని ఆయన తెలిపారు. పట్టణంలోని 18 బ్యాంకులకు ఒక్కొక్క బ్యాంకుకు 260 మంది లబ్ధిదారులు కేటాయిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బ్యాంకు మేనేజర్లు, మెప్మా అధికారులు శేఖన్న, రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు.
రూ. 4 కోట్లతో కోల్డ్ స్టోరేజి
నిర్మాణానికి ప్రతిపాదనలు
ఆళ్లగడ్డ, మే 9: నియోజకవర్గం రైతుల కోసం కోల్డ్ స్టోరేజి నిర్మించేందుకు రూ. 4 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మార్కెట్ యార్డు చైర్మన్ బివి రామిరెడ్డి తెలిపారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో మంగళవారం విలేఖర్లతో మాట్లాడుతూ రైతు సంక్షేమమే టిడిపి ధ్యేయమన్నారు. రాష్ట్ర పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ల సహకారంతో మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా పండ్ల వ్యాపారుల కోసం కాంప్లెక్సు నిర్మిస్తామన్నారు. రైతులు పండించుకున్న మర్చి, శనగలు తదితర ధాన్యాలను నిల్వ చేసుకునేందుకు కోల్డు స్టోరేజి నిర్మించుకునేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. 17 వేల క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశామన్నారు.
కన్నుల పండువగా
చెన్నకేశవస్వామి కల్యాణం
శిరివెళ్ల, మే 9: మండలంలోని కోటపాడులో శ్రీ బీరభద్ర చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో మంగళవారం శ్రీ చెన్నకేశవ స్వామి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈసందర్భంగా చెన్నకేశవ స్వామి మూలవిరాట్‌కు ఉదయం నూతన వస్త్రాలు ధరించి ఆకుపూజ, కుంకుమార్చన, పూలాభిషేకం, తీర్థ్భాషేకం తదితర పూజలు ఆలయ పూజారులు నిర్వహించారు. అనంతరం స్వామి వారి జన్మనక్షత్రం రోజు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవ మూర్తులకు పట్టువస్త్రాలు ధరించి కల్యాణం నిర్వహించారు. ఆలయ ఇఓ మల్లికార్జున ప్రసాద్ ప్రత్యేక చర్యలు తీసుకొని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణం నిర్వహించారు.
50 లక్షల మంది సీమ ప్రజలు వలస
ఆదోని, మే 9: కరవు కాటకాలతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రాయలసీమ ప్రాంతం నుంచి 50 లక్షల మంది ప్రజలు వలసలు పోయారని రాయలసీమ మేథావుల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్, కోకన్వీనర్ రత్నం, అరుణ్, ఏసేపు, నక్కలమిట్ట శ్రీనివాసులు, రాయలసీమ జెఎసి కన్వీనర్ ఆదినారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సీమ ప్రాంతంలో రైతులు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పశుగ్రాసం లేక కబేళాలకు పశువులు తరలిపోతున్నాయని, కనీస అవసరాలు ప్రజలకు లేవన్నారు. తాగునీరు కూడా అందజేయలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. సాగుకు అనుకూలమైన 30శాతం భూమికి నీరు ఇవ్వకపోతే ఆ ప్రాంతం నివాస యోగ్యం కాదని ప్రణాళిక సంఘం చెబుతుందన్నారు. రాయలసీమలో 13.5శాతం భూమికి మత్రమే నీటి కేటాయింపు ఉందని కాని సాగునీరు అందేది 7 శాతం మాత్రమే అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ, తుంగభద్ర, పెన్న, కుందూ, హంద్రీ, హగరి నందుల నుంచి ప్రతి సంవత్సరం కృష్ణ జలాలు 500 టీ ఎంసీలు సముద్రంలో కలిసి పోతున్నాయని అన్నారు. ఈనీరు వినియోగించుకుంటే 50లక్షలకు సాగునీరు అందించవచ్చునని అన్నారు.రాజకీయ పార్టీలు మారిన రాయలసీమ దుస్థితి మారలేదని అన్నారు. నంద్యాలలో ఈనెల 21న జరిగే సీమ జలచైతన్య సభను విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ సమావేశంలో వాసుదావరెడ్డి,నేతప్ప,గోవిందరాజు, శ్రీనివాసరెడ్డి, అబ్బాస్, బసవన్నగౌడ్, మహిళ నాయురాళ్ళు వెన్నల, విరుపాక్షప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఆదోనిని ఆదర్శ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతాం
ఆదోని, మే 9: ఆదోని రైల్వే స్టేషన్‌ను ఆదర్శ రైల్వే స్టేషన్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అందువల్ల ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యలను స్టేషన్‌లో కల్పిస్తామని గుంతకల్లు రైల్వే మేనేజర్ అమీత్ ఓజా అన్నారు. ఆదోని రైల్వే స్టేషన్‌కు మంగళవారం విచ్చేసిన అమిత్ ఓజా గ్యాంగ్‌మ్యాన్లతో ముందుగా మాట్లాడారు.ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించాలని వారిని ఆడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని వారిని కోరారు. ఆదోని రైల్వేస్టేషన్‌లో డబల్‌లైన్ రైల్వే పనులను ఆయన పరిశీలించారు. అలాగే విద్యుతీకరణ పనులను కూడా ఆయన పరిశీలించారు. దక్షణ భారత రైల్వే భద్రత కమిషనర్ రాంత్రిపాల్, రైల్వే భద్రత అధికారి రామ్‌మెహార్, రైల్వే అధికారి ఎకె గర్గ్, స్థానిక రైల్వే అధికారులు డిఆర్‌ఎం వెంట పాల్గొన్నారు.
మద్దులేటయ్య క్షేత్రంలో
ఘనంగా స్వాతి వేడుకలు
బేతంచెర్ల, మే 9: శ్రీమద్దులేటి నరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఇఓ ఎం.తిమ్మనాయుడు, చైర్మన్ యల్లనాగయ్య ఆధ్వర్యంలో వేదపండితులు కళ్యాణచక్రవర్తి, జ్వాలచక్రవర్తి, ప్రధానార్చకులు మద్దులేటిస్వామి శ్రీస్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, సహస్ర తులసినామార్చన, తిరుమంజరం, మహామంగళహారతి, ప్రసాదవితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాలం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమద్దులేటిస్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి ఆలయ ఆవరణలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు.
ఎల్లెల్సీ నీటి సంఘం అధ్యక్షుడి మృతి
కౌతాళం, మే 9: కౌతాళం ఎల్లెల్సీ నీటి సంఘం అధ్యక్షులు, టిడిపి సీనియర్ నాయకులు ప్రసాద్‌రాజు(60) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం గుండె పోటుతో గురైన ప్రసాద్‌రాజును చికిత్స నిమిత్తం ఆదోనికి తరలించేలోగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుమారుడు వెంకటపతి రాజు కౌతాళం సింగిల్ విండో అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, భార్య ఉంది. ప్రసాద్‌రాజు మృతి చెందిన విషయం తెలుసుకున్న టిడిపి మంత్రాలయం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి, మండల కన్వీనర్ ఉలిగయ్య, ఉరుకుంద దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ చెన్నబసప్పతోపాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
వడదెబ్బతో రైతు మృతి
ఆదోనిటౌన్, మే 9: పట్టణంలో బోయగేరికి చెందిన రైతు గుడ్డి ఈరప్ప(45) వడదెబ్బతో మంగళవారం మృతి చెందాడు. పొలం పనులకు వెళ్లి పని చేసి ఇంటికి తిరిగి వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయిన ఈరప్పను కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు మృతుడి బంధువు టిడిపి కౌన్సిల్ ప్లోర్ లీడర్ తిమ్మప్ప తెలిపారు. ఎండలోనే పొలంపని చేయడంతో తీవ్ర ఎండవేడిమికి అస్వస్థతకు గురై మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు పేద రైతు అని, భార్య పిల్లలు ఉన్నారని, ప్రభుత్వం కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. టిడిపిలో క్రీయశీలక కార్యకర్తగా కొనసాగారని, పార్టీలో గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారని, టిడిపి పార్టీ అధిష్టానం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఎస్‌ఐ ప్రవర్తనను నిరసిస్తూ స్టేషన్ ముందు మహిళల బైఠాయింపు
బేతంచెర్ల, మే 9: మహిళకు జరిగిన అన్యాయంపై ఎస్పీ సూచన మేరకు స్టేషన్‌కు వెళ్లిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, సభ్యురాళ్ల పట్ల ఎస్‌ఐ తిరుపాలు అసభ్యకరంగా మాట్లాడారని, దీంతో అతడిని తీరును నిరసిస్తూ మంగళవారం మహిళలు స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు ఎస్‌ఐ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ పట్టణంలోని దుర్గాపేటకు చెందిన ఎస్.మునీశ్వరీపై అదే కాలనీకి చెందిన ప్రభాకర్, యల్లమ్మ, సుజాతతో పాటు మరో ఇద్దరు దాడి చేశారు. అయితే ఆ సంఘటనపై కేసు నమోదు చేయలేదన్నారు. దీంతో ఎస్పీ రవికృష్ణకు ఫిర్యాదు చేయగా ఆయన సూచన మేరకు ఎస్‌ఐని కలవగా మహిళలను అసభ్యంగా మాట్లాడి అవమాన పరిచారని మండిపడ్డారు. కావున పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా సెల్ జిల్లా ఉపాధ్యక్షురాలు పాలెం సుజాతమ్మ, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళా సంఘం కర్నూలు అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, కల్లూరు కార్యదర్శి లక్ష్మిదేవి, మంగమ్మ, బాధితురాలు మునీశ్వరి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
* మరో ఇద్దరు పరిస్థితి విషమం
గోనెగండ్ల, మే 9: మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగందినె్న గ్రామం వద్ద మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్లూరుకు చెందిన మల్లికార్జున (45)తోపాటు మరొకరు మృతి చెందగా ప్రాథమిక సమాచారం మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తీవ్రగాయాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కల్లూరుకు చెందిన ఐదుకు కొత్తగా కొనుగోలు చేసిన కారులో మిత్రులు కలిసి ఈదూల దేవరబండ గ్రామానికి వచ్చి విందు చేసుకుని అనంతరం తిరిగి కారులో వెళ్తుతుండగా ప్రమాదవశాత్తు కారు బోల్తాపడి ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మల్లికార్జునతోపాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ సంఘటన స్థలానికి హుటాహుటిన వెళ్ళారు. ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
ఉయ్యాలవాడ, మే 9: మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన వివాహిత అజరా(ప్రణవి)(20) మంగళవారం ఆనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. గ్రామానికి చెందిన బెల్ల వెంకటన్న కుమారుడు పెద్ద ఓబులేస్‌తో నాలుగు సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. వీరి సంసారం అన్యోన్యంగా కొనసాగుతూ ఒక కుమార్తె కూడా జన్మించింది. సోమవారం కుటుంబంలో చోటు చేసుకున్న ఘర్షణలతో మనస్తాపానికి గురై అజరా విష గుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. చికిత్స నిమిత్తం బందువులు నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సలు పొందుతూ కోలుకోలేక మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఎఎస్‌ఐ నాగవీరయ్య అందించిన వివరాల మేరకు మృతురాలు ఇచ్చిన మరణ వాంగ్మూలం ప్రకారం గ్రామానికి చెందిన దాదా ఓబన్న అనే వ్యక్తి అజరాను నిత్యం వేధిస్తూ వుండేవాడు. ఇతని వేధింపుల కారణంగా మా కుటుంబంలో కలతలు చోటు చేసుకున్నాయి. నా భర్త, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలకు తావివ్వడంతో మనస్థాపానికి గురై విష గుళికలు మింగినట్లు తెలిపిందన్నారు. అజరా ఇచ్చిన మరణ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధం
నందికొట్కూరు, మే 9: మండల పరిధిలోని 10.బొల్లవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం విద్యుత్ తీగలు తగిలి లారీ పూర్తిగా దగ్ధమైంది. విజయవాడ నుంచి స్టీల్ బిందెల లోడ్‌తో కర్నూలు వైపు వెళ్తున్న లారీకి బొల్లవరం గ్రామంలో విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది.