కర్నూల్

ముస్లింలను ఆదుకుంటాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, జూన్ 19: ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పర్యాటకశాఖ, తెలుగు సాంస్కృతికశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముస్లీంలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లింల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టారన్నారు. పేద ముస్లింలకు దుల్హన్ పధకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దుల్హన్ స్కీంకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి చంద్రబానాయుడు నంద్యాలలో రూ. 50 వేల విలువ గల చెక్కులను పంపిణీ చేస్తారన్నారు. నియోజకవర్గంలోని ముస్లింలతో పాటు నంద్యాలలో వున్న ముస్లింలందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. పేద ముస్లంలకు ఎక్కువ శాతం ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, అందుకు స్పందించిన ఆయన ఇళ్లు లేని ముస్లింలకు ఇళ్లు మంజూరు చేయించి ఆదుకుందామన్నారన్నారు. ముఖ్యమంత్రి నంద్యాలకు వచ్చిన సమయంలో నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువగా వున్న ప్రాంతాల మత పెద్దలతో మాట్లాడి వారికి కావలసిన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చారన్నారు. దూదేకుల వారు కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో వున్నారని తమ దృష్టికి వచ్చిందని వారికి బలోపేతం చేసేందుకు దూదేకుల కార్పొరేషన్ ఫాం చేసి ఫాం ద్వారా వచ్చే నిధులతో వారికి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయవచ్చన్నారు. మసీదులకు ప్రహరీలు అవసరమని తమ దృష్టికి పెద్దలు తెచ్చారని, ప్రహరీల విషయంలో కలెక్టర్‌ను కలువడం జరిగిందన్నారు. మసీదుల మెయింటెనెన్స్ సక్రమంగా లేదని తమ దృష్టికి వచ్చిందని, అలాగే కొన్ని మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా వుండడం లేదని తెలియడంతో అట్టి వాటిని కొన్ని నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని మసీదుల్లో ఎక్కడైనా సమస్యలు వుంటే తమకు తెలియజేస్తే ఉన్నతాధికారులతో చర్చించి మశీదులకు కావలసిన సౌకర్యాలను సమకూర్చేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో 6500 మంది ముస్లింలకు రంజాన్ తోఫా ఇస్తున్నట్లు తెలిపారు. అల్లా దువా వుంది కాబట్టి ముఖ్యమంత్రిపై, మాపై మీ అందరి ఆశీస్సులు వుంచాలని కోరుతున్నామన్నారు. పెన్షన్ రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అట్టి వారి కోసం 2000 పెన్షన్లు కొత్తవి మంజూరు చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ బివి రామిరెడ్డి, డిఎస్పీ ఈశ్వరరెడ్డి, నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఎద్దుల ఉషారాణి, ఎంపిడిఓ మధుసూదన్‌రెడ్డి, నాయకులు సింగం వెంకటేశ్వరరెడ్డి, బాచ్చాపురం శేఖర్‌రెడ్డి, మిట్టపల్లె శ్రీనివాసరెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది, ముస్లింలు పాల్గొన్నారు.
దొంగనోట్ల ముద్రణ ముఠా అరెస్టు..
* రూ. 8 లక్షల దొంగనోట్లు స్వాధీనం
నంద్యాల రూరల్, జూన్ 19: గుట్టు చప్పుడు కాకుండ దొంగనోట్లను ముద్రిస్తున్నారన్న సమాచారంతో గోస్పాడు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దొంగనోట్ల ముద్రణ ముఠాను అరెస్టు చేశారు. సోమవారం గోస్పాడులోని పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డిలు మాట్లాడుతూ మండలంలోని ఎం కృష్ణాపురం గ్రామానికి చెందిన డి.హుసేన్, చెరువు పల్లె గ్రామానికి చెందిన లీలావతి, నందికొట్కూరుకు చెందిన రామానాయుడులు కలసి పాణ్యం పమీపంలో ఒక తోటలో దొంగనోట్ల మిషన్ వెంట బెట్టుకొని నోట్లను ముద్రించే నోటు కట్టతో దొంగనోట్లను ముద్రిస్తున్నారని కొందరు సమాచారం ఇచ్చారన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎం కృష్ణాపురంకు చెందిన హుసేనిని గోస్పాడులోనే అదుపులోకి తీసుకున్నామని, అతన్ని విచారించగా పాణ్యం తోటలో ఉన్నారని తెలుపడంతో అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న లీలావతి, రామానాయుడును అదుపులోకి తీసుకొని వారి వద్ద నున్న రూ.8 లక్షల దొంగనోట్లను, ముద్రణా మిషన్, నోటు కట్ చేసే మిషన్‌ను, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించామన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి ఆళ్లగడ్డ కోర్టుకు పంపినట్లు వారు తెలిపారు.
కార్యకర్తలకు అండగా ఉంటా..
* జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కృషి
* టిడిపి నూతన అధ్యక్షుడు సోమిశెట్టి
కర్నూలు సిటీ, జూన్ 19:పార్టీ ఆవిర్భావం నుంచి ఏళ్ల తరబడి నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటానని జిల్లా టిడిపి నూతన అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు. సోమిశెట్టి సోమవారం నగరంలోని తన స్వగృహం నుంచి పార్టీ కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా చేరుకుని అక్కడ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తాను 9వ సారి జిల్లా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టానన్నారు. సిఎం చంద్రబాబు 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు నియోజరవర్గ ఇన్‌చార్జిల అభిప్రాయాలు తీసుకుని అన్నీ ఆలోచించి అన్ని జిల్లాలకు నూతన అధ్యక్ష, కార్యదర్శులను నియమించారని తెలిపారు. ఏ పార్టీలో అయినా చిన్న చిన్న అపోహలు ఉండటం సహజమేనని, వాటన్నింటినీ తొలగించి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి 2019 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నామని వెల్లడించారు. పార్టీ స్థాపించి దాదాపు 36 ఏళ్లు అయిందని అప్పటి నుంచి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టిఆర్ మీద ఉన్న అభిమానంతో ఎన్ని అడ్డంకులు వచ్చినా పార్టీని వీడకుండా ఉన్న వారిని గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే జిల్లాలో కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్‌తో పాటు ఇంకా కొన్ని కమిటీల చైర్మన్ల పోస్టులు, దేవదాయ శాఖ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏ నియోజకవర్గంలో ఉన్న దేవస్థానానికి ఆలయ కమిటీ ఖాళీగా ఉందన్న వివరాలను ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిల ద్వారా వివరాలు సేకరించి వాటిని సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి, పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇక ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వం, పార్టీ అధినేతపై విమర్శలు చేస్తే ఆయా నియోజకవర్గాల్లోనే వాటిని ఖండించాలన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేయటం మాని అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు తిరుపాల్‌బాబు, పర్వేజ్, అల్లా బకాష్, మల్లెల పుల్లారెడ్డి, పోతురాజు రవికుమార్, నంద్యాల నాగేంద్ర, సత్రం రామకృష్ణుడు, హనుమంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పాడి, పంటను రైతులకు దూరం
చేయటానికి ప్రభుత్వాల కుట్ర
* దళారుల నుంచి రైతులను రక్షించాలి
* ఏపి వ్య.కా.స మహాసభలో కేరళ సిఎం విజయన్
కర్నూలు సిటీ, జూన్ 19:కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ రైతాంగానికి పాడి, పంటను దూరం చేయటానికి కుట్ర పన్నుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. నగరంలోని ఎస్టీబిసి కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన ఏపి వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. భూసేకరణ పేరు తో వేలాది ఎకరాలను బలవంతంగా లాక్కొంటూ రైతులకు తీరని అన్యా యం చేస్తున్నారన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు చిన్న, సన్న కారు రైతులకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు వలస పోతున్నారని ఫలితంగా దేశంలో ఆహార కొరత ఏర్పడనుందని ఆవేదన వ్యక్తం చేశా రు. రైతు కష్టపడి పంటలు పండిస్తేనే దేశ ప్రధానితో పాటు సామాన్య ప్రజలకు తిండి ఉంటుందని, అటువంటిది వ్యవసాయ రంగా న్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తే తిండి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం రైతులు పండించిన పంటలకు మంచి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, దీంతో మధ్య దళారులు రంగ ప్రవేశం చేసి రైతులను అందిన కాడికి దోచుకుంటున్నారన్నారు. దీంతో పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందక సాగు కోసం చేసిన అప్పులను ఏ విధంగా తీర్చాలో దిక్కుతోచక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. ముఖ్యంగా రైతుకు రక్షణ కల్పించకపోతే దేశాభివృద్ధి కుంటుపడుతుందని, తక్షణమే రైతులకు రక్షణ కల్పించి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 60 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు పింఛను సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించకుండా వ్యవసాయ కూలీలకు 200 రోజుల పాటు పని కల్పించి వేతనాలను పెండింగ్ పెట్టకుండా తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దేశాభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యాన్ని వీడకపోతే ప్రభుత్వాల మనుగడ కష్టమని వెల్లడించారు. సమావేశంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి విజయరాఘవన్, ఏపి వ్య.కా.స రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దడాల సుబ్బారావు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షే
* వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తే పుట్టగతులుండవు..
* అఖిల భారత వ్య.కా.స కార్యదర్శి విజయరాఘవన్
కర్నూలు సిటీ, జూన్ 19: పాలకుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు కనీస అవసరాలైన విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి విజయరాఘవన్ విమర్శించారు. నగరంలోని ఎస్టీబిసి కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన ఏపి వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్య, వైద్యం నేడు అత్యంత ఖరీదైనవిగా మారాయని, దీంతో వాటిని సామాన్యులు అందుకోలేక పోతున్నారన్నారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్య అన్నారు. మోదీ ఎన్నికలకు ముందు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను ఇచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ప్రగల్బాలు పలికి అధికారం చేపట్టాక ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇక దేశంలో 60శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, అలాంటి వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండాపోతాయని హెచ్చరించారు. సిఐటి యు రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ రాయలసీమలో చాలా ఏళ్లుగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో ఈ ప్రాంతంలో కరవు విలయ తాండవం చేస్తుందన్నారు. గ్రామాల్లోని వ్యవసాయ కూలీలకు, చిన్న, సన్న కారు రైతులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉపాధి పనులను సక్రమంగా నిర్వహించక పోవడంతో లక్షలాది మంది ప్రజలు ఉన్న ఊర్లను వదిలి కేరళ, చెన్నై, బెంగళూరు, లాంటి నగరాలకు వలస వెళ్లి అక్కడ దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి శాశ్వత కరవు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏపి వ్య.కా.స రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు మాట్లాడు తూ ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను అమలు చేస్తే సీమలో కరవు ఉండదన్నారు. సీమలో శాశ్వత కరవు నివారణ చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపి వ్య.కా.స రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.షడ్రక్, వ్య.కా.స జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరావు, నారాయణ పాల్గొన్నారు.
ప్రగతి నివేదికలివ్వండి
* అధికారులను ఆదేశించిన కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలుటౌన్, జూన్ 19:సిఎం చంద్రబాబు ఈ నెల 21వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారని, కావున శాఖల వారీగా సాధించిన ప్రగతిపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం లోగా ఇప్పటి వరకూ సాధించిన ప్రగతిపై నివేదికలను సిపిఓకు అందజేయాలని ఆదేశించారు. ఓర్వకల్లు మండలంలో సిఎం పర్యటకు సంబంధించిన ఏర్పాట్లపై ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీనివాసురెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఇ సుబ్బరాయుడు, డిపిఓ పార్వతి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఐసిడిఎస్ పిడితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏర్పాట్లను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. వ్యవసాయ శాఖతో పాటు డ్వామా, జలవనరులు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ విభాగాలకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జలవనరులు, డ్వామా శాఖలు కలిసికట్టుగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. రైతులు అధికసంఖ్యలో హాజరయ్యేలా చూడాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. జెసి ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ ఈ ఆఫీస్‌లో జిల్లా 10వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరిందని, ఈ నెలలో అన్ని శాఖలు ఈ ఆఫీస్‌ను సక్రమంగా అమలు చేస్తే రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటామన్నారు. నిర్లక్ష్యం చేసే శాఖలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు జెసి-2 రామస్వామి డయల్ యువర్ కార్యక్రమం నిర్వహించగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 25 మంది అర్జీలు అందజేశారు. అందులో భూసమస్యలపై అధికంగా ఫిర్యాదులు ఉన్నాయి. అనంతరం కలెక్టర్, జెసి గత వారంలో పరిష్కరించిన సమస్యలపై సమీక్షించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, సిపిఓ ఆనంద్‌నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో 20 లక్షల మొక్కలు పెంచాలి
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలుటౌన్, జూన్ 19:జిల్లాలోని అటవీ శాఖ వన విభాగం 20 లక్షల మొక్కలను సిద్ధం చేసిందని, వాటిని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాటి సంరక్షించాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సోమవారం కలెక్టర్ పాఠశాలల్లో మొక్కల పెంపకంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల, కెజిబివి, మోడల్ స్కూల్ ప్రాంతాల్లో మొక్కలు పెంచాలని డిఇఓ, ఎస్‌ఎస్‌ఎ పిఓలను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,565 పాఠశాలల ప్రాంగణాల్లో దాదాపు 20 లక్షల మొక్కలు నాటాలని సూచించారు. అటవీశాఖ వనవిభాగం అధికారిణి యశోధబాయి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 40 చోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, 35 ప్రాంతాల్లో అటవీశాఖ ద్వారా మొక్కలు పెంచుతున్నామని మిగిలిన మొక్కలను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో ఎస్‌ఎస్‌ఎ పిఓ రామచంద్రారెడ్డి, డిఇఓ తాహెరాసుల్తానా, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కేరళ సిఎంను కలిసిన ఎస్పీ
కర్నూలు, జూన్ 19:జిల్లాకు వచ్చిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను సోమవారం సాయంత్రం ఎస్పీ ఆకే రవికృష్ణ నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, 2వ పట్టణ సిఐ డేగల ప్రభాకర్ ఉన్నారు.
సిఎం పర్యటకు భారీ బందోబస్తు
* పోలీసులు అప్రమత్తంగా ఉండాలి:ఎస్పీ
కర్నూలు, జూన్ 19:సిఎం చంద్రబాబు ఈ నెల 21,22 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఆకే రవికృష్ణ సోమవారం ఒక ప్రటనలో తెలిపారు. సిఎం చంద్రబాబు తంగెడంచె, ఓర్వకల్లు, నంద్యాల తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారని పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. సిఎం పర్యటన బందోబస్తు పర్యవేక్షణ బాధ్యతలను ఏఎస్పీ షేక్షావలి, ఏఆర్ ఏఎస్పీ వెంకటేష్‌లకు అప్పజెప్పారు. బందోబస్తుకు 16 మంది డీఎస్పీలు, 36 మంది సిఐలు, 124 మంది ఎస్‌ఐలు, 371 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1082 మంది కానిస్టేబుళ్లు, 12 ప్లాటూన్ల ఏఆర్ బలగాలు, 3 ప్లాటూన్ల ఏపిఎస్పీ బలగాలు, 107 మంది మహిళా పోలీసులు, 600 మంది హోంగార్డులు, 16 స్పెషల్ పార్టీ బృందాలను కేటాయించారు. అలాగే పోలీసు జాగిలాలు, బాంబుస్క్వాడ్ బృందాలతో సిఎం పర్యటన ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలోని పలు చోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక మఫ్టీ పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సిఎం పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
సిఎం పర్యటనను అడ్డుకుంటాం
* బేడ బుడగ జంగం రిజర్వేషన్ పోరాట సమితి
నందికొట్కూరు, జూన్ 19:ఏపిలో బేడ బుడగ జంగాల కులస్థులు లేరని రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు విడుదల చేసిన జీఓ నెం.144ను రద్దు చేయకుండా బుడగ జంగాల విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 21వ తేదీ జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించనున్న సిఎం సభను అడ్డుకుంటామని బేడ బుడగ జంగం రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సిరువాటి లక్ష్మయ్య, అలేఖ్యం, సుంకన్న హెచ్చరించారు. పట్టణంలో సోమవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభు త్వం రాష్ట్రంలో బుడగ జంగాల విద్యార్థులకు ఎలాంటి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయకుండా వారి భవిష్యత్‌ను నాశనం చేస్తుందని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి జీఓ నెం 144ను రద్దు చేసి బుడగజంగాలను ఎస్సీలుగా గుర్తించాలని, లేనిపక్షంలో ఈ నెల 21వ తేదీ జిల్లాలో పలు చోట్ల జరిగే సిఎం కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
10 వేల గృహాల నిర్మాణానికి శంకుస్థాపన
కర్నూలు, జూన్ 19:జగన్నాథగుట్ట సమీపంలో ‘ప్రధానమంత్రి అవాస్ యోజన’, ‘ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం’ కింద నిర్మించనున్న 10వేల గృహ నిర్మాణాలకు సోమవారం కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదల కోసం రూ. 660 కోట్ల వ్యవయంతో గృహాలు నిర్మిస్తున్నామన్నారు. 3 కేటగిరీల్లో ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని, పేదలకు అనువైన రీతిలో షేర్‌వాల్ టెక్నాలజీతో పనులు చేపడుతున్నట్లు వివరించారు. 300, 365, 430 చదరపు అడుగుల్లో గృహ నిర్మాణాలతో పాటు ప్రజలకు అవసరమైన వౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఎస్వీ మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అధికంగా నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న జగన్నాథగుట్ట ప్రాంతంలో సిమెంటు రోడ్లు, మురికి కాలువలు, పాఠశాలలు, తాగునీటి వసతి, తదితర పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో నగరపాలకసంస్థ కమిషనర్ హరినాథ్‌రెడ్డి, మెప్మా పిడి రామాంజనేయులు, ఆర్డీఓ హుసేన్‌సాహెబ్, కర్నూలు, కల్లూరు తహశీల్దార్లు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతా..
* ఎమ్మెల్సీ కత్తి
కోడుమూరు, జూన్ 19:ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాడుతానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో సోమవారం మండల స్థాయి ఉపాధ్యాయం సంఘం నాయకులు ఎమ్మెల్సీ కత్తిన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. బదిలీల పేరుతో టిడిపి ప్రభుత్వం భారీగా సొమ్ము చేసుకునేందుకు పూనుకుందని ఆరోపించారు. ఉపాధ్యాయ బదిలీలను ప్రతి ఏటా వేసవి కాలంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఈ విషయాన్ని తాను సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అంతేగాక పాఠశాలలు, కళాశాలల్లో పని చేసే ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సిబిఎస్‌ఇ సిలబస్‌ను తక్షణమే రద్దు చేయాలని, తప్పనిసరిగా తెలుగు మాధ్యమం చదువులు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు షణ్ముఖ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోసఫ్, సుధాకర్‌బాబు, ఎంఇఓ అనంతయ్య, ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
వెల్దుర్తి, జూన్ 19:మండల పరిధిలోని చెర్లోకొత్తూరు గ్రామానికి చెందిన చంద్రవౌలి (28) సోమవారం విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. చంద్రవౌలి ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో విద్యుత్ మోటారును ఆన్ చేయడానికి ప్రయత్నించగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వైభవంగా రాజరాజేశ్వరి రథోత్సవం
ఆదోని, జూన్ 19: ఆదోనిలోని హనుమాన్‌నగర్‌లో కొలువై ఉన్న రాజరాజేశ్వరిదేవాలయం 33వ రథోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం నుంచి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా రాజరాజేశ్వరి మాతకు అభిషేకాలు, కుంకుమార్చనలు, బిల్వార్చన, తదితర పూజలు చేశారు. అనంతరం భక్తుల సందడిలో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని రథోత్సవంలో అధిరోహించి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. రతాన్ని రంగు రంగుల పూలతో ఆలంకరణ చేశారు. మేళతాళాల మధ్య భక్తుల జనసందోహం మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు. ఆదోని వాసులే కాకుండా కర్నాటకలోని గంగావతి, క్యాంపుల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని తమ మొక్కులను తీర్చుకున్నారు.

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా
ఆదోని, జూన్ 19: ఆనందం, ఆరోగ్యం, రుగ్మతలు లేని జీవనం కోసం నేడు ప్రపంచ మానవాళి కోరుకుటోంది. అందుకే అందరి దృష్టి యోగాభ్యాసం వైపు మరలింది. ఆ పరిణామమే ఐక్యరాజ సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినంగా ప్రస్తావించింది. ప్రపంచ దేశాలన్నీ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ఎంతో సంతోషంగా అంగీకరించాయి. యోగాశాస్త్రం యొక్క ప్రాధాన్యాత ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం భారతదేశం గుర్తించింది. ఎందరో మహానుబావులు యోగా శాస్త్రానికి ప్రాణం పోశారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ యోగాశాస్త్రం యొక్క ప్రాధాన్యతను గుర్తించాయి. జూన్ 21న యోగా దినంగా ప్రకటించడంలో ఎంతో శాస్త్ర బద్ధత ఉంది. అన్ని రోజుల కల్లా జూన్ 21న పగటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే యోగా దినానికి ఆరోజు ప్రకటించారు. యోగా యుజ అనే పదం నుండి పుట్టింది. యుజ అంటే జోడిచండం అని అర్థం. యోగా కేవలం శరీర ప్రక్రియ కాకుండా శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మలను ఒకటిగా చేసే సమగ్ర ప్రక్రియ యోగా. ఎన్నో సంవత్సరాల క్రితం మహర్షి పతంజలి అష్టంగా యోగాన్ని బోధించారు. ఆయన బోధన ప్రకారం యమ, నియమ, ఆసన, ప్రాణాయామం,ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిస్థితిని అష్టాంగా యోగమని అంటారు. ఈ యోగా సాధన చేయడం వల్ల మనిషికి శాంతి, ఆరోగ్యం, ప్రకృతితో స్నేహం పొంది మంచి జీవనాన్ని గడిపే అవకాశం ఉంటుంది. యోగా దినోత్సవం వల్ల ఈనాడు పీడిత ప్రపంచ మానవాళి మళ్లీ భారతదేశం వైపు దృష్టి పెట్టింది. ముఖ్యంగా యోగాసానాల్లో సూర్యనమస్కారాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఆరోగ్య భాస్కరాదిచ్చేత్ అంటే సూర్యుడు ఆరోగ్య ప్రధాత, ఆయన సూర్యరశ్మివల్లనే సకల జీవరాసులు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాయి. అందుకే సూర్యనమస్కారాలు ఆరోగ్యాన్ని చేకూరుతాయి. సూర్యనమస్కారాలు, యోగాసాలు, ప్రాణాయామం ఆహారా నియమాలు, ధాన్యం ప్రతి రోజు చేస్తే ఎన్నో ధీర్ఘకాలిక రోగాల నుంచి మనుషులు బయట పడతారు. అంతేకాకుండా చక్కెర వ్యాధిని అదుపులో పెట్టడానికి యోగా ఎంతో ఉపయోగ పడుతుంది. యోగా ఒక క్రమ బద్ధీకరణగా చేయాలి. ముందు సూర్యనమస్కారాలు, ఆతరువాత ఆసనాలు, ఆసనాలు తరువాత ప్రాణాయామం చేసి అప్పుడు ధాన్యం చేయాలి. అంతేకాకుండా మనిషి ఆహార నియమాలను కూడా పాటించాలి. అప్పుడే శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ అనుసంధానం అవుతాయి. ఆత్మ పరమాత్మను చేరుకుటుంది. అదే ధాన్యం. ప్రతి రోజు యోగా చేస్తే ప్రతిఫలం అందుతుంది. అప్పుడే నిజమైన యోగ సాధన చేసినట్లు అవుతుంది. రోగాల నుంచి బయట పడి మనిషి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందగలడు. ఒకప్పుడు భారతదేశంలో పంతజంలి మహర్షి ద్వారా బోధించిన యోగా ఈనాడు దేశ నలుమూలల వ్యాప్తి చెందింది. ముఖ్యంగా దేశ దేశాల్లో యోగా వ్యాప్తి చెందడానికి బౌద్దమతం ఎంతో ఉపయోగ పడింది. ప్రపంచంలో యోగాకు ఒక ప్రముఖ స్థానం నేడు లభించింది. ప్రతి దేశంలో కూడా యోగాను ప్రజలు అనుసరిస్తూ ఆచరిస్తున్నారు. యోగా గురుస్థానం మాత్రం భారతదేశానిదే. దేశంలో నేడు అనేక ప్రాంతాల్లో యోగా శిక్షణ కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. యోగా విద్యను అనుసరించడానికి ఎంతోమంది యువకులు ముందుకు వస్తున్నారు. ఆదోనిలో వివేకానంద యోగా కేంద్రంలో ప్రతి రోజు యోగా సాధన కొనసాగుతుంది. మందులకు కూడా నయంకాని వ్యాధులు రోజు వారిగా యోగాను అభ్యసిస్తే రోగాలు దూరం అవుతున్నాయి. ఈ యోగా ఆవశ్యకత నేటి సమాజానికి ఎంతో అవసరం. నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగాను గుర్తించారు. యోగాలో చివరి ప్రక్రియ మాత్రమే ధ్యానం. ద్యానం ద్వారా ఆత్మశుద్ధి, ఆత్మను పరమాత్మతో విలీనం చేయడం చివరి దశ. ఆరోగ్యం, ఆత్మపరిశుద్ధి యోగాలో లభిస్తుండడం వల్లే ఐక్యరాజ్య సమితి యోగా డేను ప్రకటించింది. ఈ సందర్భంగా ఆదోనిలో ఈనెల 21వతేదీ స్వామివివేకానంద యోగా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో సూర్యనమస్కారాలు, యోగాసాలు చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యోగ కేంద్రం నిర్వాహకులు తెలిపారు. అలాగేప్రతి పాఠశాల, కళాశాలల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అందరు కూడా సన్నద్ధం అవుతున్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి అఖిల
ఆళ్లగడ్డ, జూన్ 19: పట్టణంలోని బిబిఆర్ పాఠశాలలో కరస్పాండెంట్ షరీఫ్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేసి మాట్లాడారు. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలకు దుల్హన్ పథకం కింద రూ. 27 కోట్లు మంజూరైందన్నారు. మంజూరైన నిధులను ఈ నలె 21న సిఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పంపిణీ చేస్తారన్నారు. మసీదు నిర్వహణ, ప్రహరీగోడకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరయ్యేలా చూస్తామన్నారు. పేద ముస్లింకు ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. టిడిపి ప్రభుత్వం అధికరంలోకి వచ్చిన నాటి నుండి రంజాన్ తోఫాలను అందిస్తున్నారన్నారు. అనంతరం ముస్లింలకు భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ బివి రామిరెడ్డి, ముస్లింలు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా అందరికీ గృహ నిర్మాణం
ఆదోనిటౌన్, జూన్ 19: రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా గృహ నిర్మాణం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయమని, అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల గృహ నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు. సోమవారం పట్టణ శివారులోని శిరుగుప్ప టర్నింగ్ వద్ద చాచానెహ్రూ కాలనీ వద్ద పిఎంఎవై, ఎన్టీఆర్ నగర్ గృహ నిర్మాణాల సముదాయం నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని 37 మున్సిపాలిటీల్లో 2లక్షల ఇండ్లు నిర్మిస్తుండగా ఒక ఆదోనిలో 4704 ఇండ్లు నిర్మించడానికి చర్యలు తీసుకున్నారన్నారు. ముఖ్యంగా ఈ గృహ నిర్మాణం సముదాయంపై ప్రజల్లో అనేక అపోహాలు ఉన్నాయని, అయితే పట్టణంలోని అమరావతి నగర్‌లో నిర్మించిన గృహ నిర్మాణాల సముదాయం లాగా ఉండదన్నారు.
అందరికీ గృహ నిర్మా ణం పథకంలో ప్రతి అపార్టుమెంట్‌లో 24 ఇండ్లు ఉంటాయని, అలాగే అన్ని రకాల వౌళిక సదుపాయాలు కల్పిస్తారని తాగునీరు, రోడ్లు, మరుగునీటి కాలువలు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆదోనిలో 9వేల మంది దరఖాస్తు చేసుకోగా 5వేల 189 మంది అర్హులుగా గుర్తించారని, అయి తే ఇప్పటి వరకు కేవలం 2వేల మంది మాత్రమే ముందుకు వచ్చారని, ఇంక 2700 మంది ముందుకు రావాలని వారందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్, తహశీల్దార్ శ్రీనివాసరావు, టాటాగ్రూపు కంపెనీ ఎస్పీ ఏజెన్సీ ప్రతినిధులు, ఆపిట్‌కో ఇంజినీర్ సురేంద్ర, మున్సిపల్ ఎంఇఓ విశ్వనాథ్, నాయకులు విట్టారమేష్, ఉమాపతి నాయుడు,గుంటెప్ప, మల్లప్ప, కౌన్సిలర్లు వై.జి.బాలాజీ, తిమ్మప్ప, నాయకులు లక్ష్మీనారాయణ, నల్లన్నతోపాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.
రైతులకు సాగునీరు,
నాణ్యమైన విత్తనాలు అందించాలి
నంద్యాల, జూన్ 19: రైతులకు ఎరువులు ఉచితం, వ్యవసాయానికి కరెంటు ఉచితం, విత్తనాలపై సబ్సిడీ, రుణమాఫీ అంటూ రైతులకు అన్ని ఫ్రీగా ఇస్తున్నాం, ఇంకేమి కావాలి అని ప్రజల ఆలోచన మళ్లించే ప్రయత్నాలు చేయవద్దని, 70 శాతం వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులకు అన్ని ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని, పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన విత్తనం, నిరంతరంగా కరెంటు ఇస్తే చాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సోమవారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏ విధంగా పెంచారో అదేవిధంగా అదే శాతంతో సమానంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ధరలేని సమయాల్లో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాత్రకనక, పగలనక, ఎప్పుడు పడితే అప్పుడు పొలానికి వెళ్లే రైతు తిరిగి వస్తాడో, లేదో తెలియక ఇంటి వద్ద ఎదురుచూసే భార్యపిల్లలు, పంటలు రోగం, మనిషికి రోగం వస్తే ఎక్కడ చూపించాలో తెలియక అప్పు చేసి దిగుబడి తగ్గి కృంగిపోయిన రైతులకు ఫ్రీ అంటే ఎలా సరిపోతుందని, ఉద్యోగులకు ఇంక్రిమెం టు ఇచ్చే విధంగా రైతులు పండించిన పంటకు ధరలపై ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో వైఎన్‌రెడ్డి పాల్గొన్నారు.
వైభవంగా పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ఠ
కొలిమిగుండ్ల, జూన్ 19: మండలంలోని పెట్నికోట గ్రామంలో సోమవారం పెద్దమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. దళితవాడలో టిటిడి నిధులతో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. పూజా కార్యక్రమంలో హిందూ ధర్మపరిషత్ ట్రస్టు రాష్ట్ర కార్యదర్శి విజయరాఘవాచార్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ డిప్యూటి డైరెక్టర్ చంద్రశేఖర్, రాయలసీమ ఇన్‌చార్జి ఈశ్వర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు బాలసుబ్రమణ్యం, జిల్లా కన్వీనర్, బనగానపల్లె వైకాపా నాయకులు యర్రబోతుల వెంకటరెడ్డి, మాజీ ఎంపిపి తులశమ్మ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పూజలు, హోమాలు, ప్రతిష్ఠ మంత్రోత్సవాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల కార్యదర్శి శ్రీనివాసులు, సభ్యులు సుబ్బయ్య, శేఖర్, గ్రామస్థులు పాల్గొన్నారు.