కర్నూల్

కొత్త ఎస్పీ గోపీనాథ్‌జట్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 20 : జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మంగళగిరి ఏపిఎస్‌పి కమాండెంట్‌గా పనిచేస్తున్న గోపీనాథ్‌జట్టీ నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న రవికృష్ణ ఏసిబి డైరెక్టర్‌గా బదిలీ అయినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఐపిఎస్‌లను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీగా గోపీనాథ్‌జట్టీ నియమితులయ్యారు. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఆకే రవికృష్ణ జిల్లా ఎస్పీగా 2014 జూలై 23వ తేదీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఆకే రవికృష్ణ ప్రస్తుత బదిలీల్లో భాగంగా ఏసిబి డైరెక్టర్‌గా నియమితులైనట్లు తెలుస్తోంది.
నకిలీ వైద్యుల గుట్టురట్టు..
* ఆదోని, కర్నూలులో ఆసుపత్రుల సీజ్
* ఇద్దరు మాయగాళ్లపై కేసు నమోదు
కర్నూలు, జూన్ 20 : నకిలీ ఎంబిబిఎస్ సర్ట్ఫికెట్లతో వైద్యులుగా చెలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇద్దరు మాయగాళ్ల గుట్టును కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రట్టు చేశారు. ఈ సంఘటన మంగళవారం జిల్లాలో సంచలనం రేపింది. వివరాలు.. నగరంలోని కొత్తబస్టాండ్ సమీపంలో ఉన్న జెపి చిల్డ్రన్స్ అండ్ సూపర్ స్పెషాలిటీ, ఆదోని పట్టణంలో విజయగౌరీ హాస్పిటల్ పేరుతో 2015వ సంవత్సరం నుంచి నడుపుతున్నట్లు అధికారులు దాడుల్లో వెలుగుచూసింది. కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాంతీయ అధికారి శివకోటిబాబురావు ఆధ్వర్యంలో మంగళవారం సిఐ రామకృష్ణాచారి, సిబ్బంది శేఖర్‌బాబు ఆయా ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు. అందులో డిగ్రీలో బికాం పూర్తిచేసిన నరేంద్రప్రసాద్ ఎంబిబిఎస్ చదివినట్లు నకిలీ సర్ట్ఫికెట్లు తెచ్చుకుని 2015వ సంవత్సరం నుంచి కర్నూలు నగరంలో జెపి చిల్డ్రన్ ఆసపత్రి నిర్వహిస్తున్నట్లు తేల్చారు. అలాగే ఆదోని పట్టణంలో నరేంద్రప్రసాద్ బావమరిది బి.టెక్ పూర్తిచేసిన రాఘవేంద్ర విజయగౌరీ ఆసుపత్రి పేరుతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ఆసుపత్రులకు రోగులు వస్తే స్కానింగ్, ఎక్స్‌రే, ఆపరేషన్ల కోసం ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను పిలిపించి వైద్య చికిత్సలు అందించేవారని అధికారులు తెలిపారు. వైద్యులు రానిపక్షంలో నరేంద్రప్రసాద్, రాఘవేంద్ర స్కానింగ్ చేయడం, ఎక్స్‌రే తీయడం వంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు విచారణలో తేలింది. దీంతో అధికారులు కర్నూలు, ఆదోనిలో ఆ ఇద్దరు నిర్వహిస్తున్న ఆసుపత్రులను సీజ్ చేసి, వారి నుంచి నకిలీ ఎంబిబిఎస్ పత్రాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని, అలాంటి వారి సమాచారం తెలిస్తే విజిలెన్స్ శాఖకు తెలిజేయాలని ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు సూచించారు.
హామీలు 93.. అమలు 42
* గుండ్రేవుల, హగరి ఎత్తిపోతల మాటేంటి..
* ప్రారంభానికి నోచుకోని ఓర్వకల్లు పరిశ్రమలు..
* ముచ్చుమర్రి, ఎగువ కెసి కాలువకు అందని నీరు..
* నేడు, రేపు జిల్లాలో సిఎం పర్యటన

కర్నూలు, జూన్ 20 : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గత మూడేళ్ల కాలంలో చంద్రబాబునాయుడు 16వ సారి జిల్లా పర్యటనకు వస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలును రాజధానిగా చేయాలన్న డిమాండ్‌పై ప్రజలను సంతృప్తిపరిచేందుకు 2014 ఆగస్టు 15వ తేదీ పంద్రాగస్టు వేడుకలను కర్నూలులోనే నిర్వహించారు. ఆ రోజు నుంచి గత జనవరి 2వ తేదీన కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ఇచ్చిన హామీల సంఖ్య 93 కాగా వాటిలో 42 అమలు చేశామని అధికారులు మంగళవారం ప్రకటించారు. అధికారులు ఇచ్చిన జాబితా ప్రకారం సాధారణ, చిన్న చిన్న హామీలే అమలైనట్లు తెలుస్తోంది. ప్రధానమైన హామీలు ఇంత వరకూ అలాగే ఉన్నాయి. సాగునీటి రంగంలో సిఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఆర్‌బిసి, తెలుగుగంగ, ముచ్చుమర్రి, సిద్దాపురం ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం, కొత్తగా గుండ్రేవుల జలాశయం, వేదావతి నదిపై ఎత్తిపోతల పథకం చేపడుతామని సిఎం స్పష్టం చేశారు. ఇందులో ఎస్‌ఆర్‌బిసి పథకంలో అవుకు జలాశయంలో 4 టిఎంసిల నీటి నిల్వకు రంగం సిద్ధం చేసి గత ఏడాది 2.75 టిఎంసిలు నిల్వ చేశామని ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిల్వ చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. తెలుగుగంగ పథకంలో భాగంగా పలు ప్రధాన, ఉప కాలువల పనులు పూర్తి చేయగలిగారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి జాతికి అంకితమిచ్చినా ఎగువ ప్రాంతంలోని సుంకేసుల నుంచి నందికొట్కూరు మండలం వరకూ సాగునీరు అందించలేకపోయారు. దిగువ ప్రాంతంలోని కడప వరకూ కృష్ణా నీటిని మార్చి 15వ తేదీ వరకూ అందించారు. సిద్దాపురం ఎత్తిపోతల పథకం పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. గుండ్రేవుల జలాశయ నిర్మాణం, వేదావతి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక(డిపిఆర్) సిద్ధమైందని నెలల తరబడి చెబుతున్నా వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఈ రెండు సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి సమస్య 90శాతం మేర తొలగినట్లేనని వారంటున్నారు. ఆర్డీఎస్ కుడి కాలువ ద్వారా 4 టిఎంసిల నీరు తుంగభద్ర నుంచి వినియోగించుకడానికి ట్రిబ్యునల్ ఆమోదించగా ప్రస్తుతం సర్వే పనులు మాత్రమే పూర్తయ్యాయి. దిగువ కాలువకు సంబంధించి ఎగువన కర్నాటక రాష్ట్ర అభ్యంతరాలు, జల దోపిడీకి సంబంధించిన సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు కొనసాగుతోంది. హంద్రీ-నీవా ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశ పనులు పూర్తి చేయగా తాజాగా ఈ కాలువ నుంచి పడమర ప్రాంతంలో 106 చెరువులను నిర్మించాలని, ఉన్న చెరువులను ఆధునీకరించి అదనంగా నీటి నిల్వకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఓర్వకల్లు సమీపంలో పారిశ్రామికవాడ కేవలం ప్రచారానికి పరిమితమైంది. ఇక్కడ 30 వేల ఎకరాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం పలు సంస్థలకు సుమారు ఇందులో 16,078 ఎకరాలను ఏపిఐఐసికి అందజేయగా ఈ భూమిలో జయరాజ్ ఇస్పాత్ నిగం లిమిటెట్, ఎంపిఎల్ మినరల్ ప్రాసెసింగ్, వెల్‌స్పన్ రెనెవబుల్ సంస్థలకు భూములను కేటాయించారు. అయితే ఇంతవరకూ ఒక్క కంపెనీ కూడా నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇక ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో ప్రపంచ స్థాయి సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు దాదాపు పూర్తి కాగా త్వరలో ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన రైల్వే బోగీ మరమ్మతుల కేంద్రానికి భూమి సేకరణ పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగించారు. ఓర్వకల్లు వద్ద విమానాశ్రయానికి బుధవారం సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనుండగా మరో ఏడాది కాలంలో విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఉర్దూ విశ్వవిద్యాలయం తాత్కాలికంగా కర్నూలు నగరంలో ప్రారంభించగా, ట్రిపుల్ ఐటి తరగతులు కంచిలో ప్రారంభించారు. ఉర్దూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, ట్రిపుల్ ఐటి భవనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధమై జూన్ నుంచి అక్కడే తరగతులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. పలు సిమెంటు కర్మాగారాల ఏర్పాటుకు భూముల కేటాయింపు పూర్తి చేసినట్లు వెల్లడిస్తున్నారు. సిఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటిలో గుండ్రేవుల జలాశయం, ఆర్‌డిఎస్ కుడి కాలువ, వేదావతి ఎత్తిపోతల పథకం ప్రధానం కాగా అవే గత మూడేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని ప్రజలు పెదవివిరుస్తున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయగలిగినా సాగు నీటి సమస్య 50శాతం మేర మాత్రమే పరిష్కారమైందని వెల్లడిస్తున్నారు. జిల్లాకు మరోమారు వస్తున్న సిఎం చంద్రబాబు సాగునీటి సమస్య పరిష్కారానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
కర్నూలుటౌన్, జూన్ 20:సిఎం చంద్రబాబు ఈ నెల 21వ తేదీ కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సిఎం చంద్రబాబు ఉదయం 11.30గంటలకు జూపాడుబంగ్లా మండలం తంగెడంచె గ్రామం చేరుకుని జెయిన్ ఇరిగేషన్ యంత్రాంగం ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1 గంటకు తంగెడంచె నుంచి ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ భూమిపూజ చేయనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి బాల భారతి స్కూల్‌కు చేరుకుని 2.15 గంటల వరకూ విశ్రాంతి తీసుకుంటారు. 3.45 గంటలకు బాల భారతి స్కూల్ ప్రారంభోత్సవం, మహిళా సంఘ సభ్యులతో మాట్లాడి అన్న అమృతం, బాలామృతం కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెలిక్యాఫ్టర్ ద్వారా బయల్దేరి మెగా సోలార్ పార్కును సందర్శిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు నంద్యాల ప్రభుత్వ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అనంతరం నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత 5.30 నుంచి 7.30 గంటల వరకూ ఇఫార్ విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ సమయంలో ముస్లిం మైనార్టీ మతపెద్దలతో సమావేశం కానున్నారు. అనంతరం నంద్యాల ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుని రాత్రి బస చేస్తారు.
సిఎంతో పాటు ఏడుగురు మంత్రులు
సిఎం చంద్రబాబు కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లలో పర్యటించనున్నారు. ఆ పర్యటనలో సిఎంతో పాటు డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు, పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, వ్యవసాయ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు పాల్గొంటారు.
జిల్లా అభివృద్ధికి సిఎం చేయూత
* ఇన్‌చార్జి మంత్రి కాలవ
నంద్యాల, జూన్ 20: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని, ఆ మేరకు నిధులు విడుదల చేస్తూ అనేక పరిశ్రమల స్థాపనకు కృషి చేయడంలో భాగంగా బుధవారం జిల్లాకు వస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్‌యార్డులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొనే ఇఫ్తార్ విందు ఏర్పాట్లను స్థానిక మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్, మాజీ ఆర్‌ఐసి చైర్మన్ ఎవి సుబ్బారెడ్డి, నంద్యాల ఉప ఎన్నిక టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, ఎంపి అల్లుడు సజ్జల శ్రీ్ధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందులో భాగంగానే జిల్లాలోని తంగెడంచలో మెగా ఫుడ్‌పార్కును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, అలాగే ఓర్వకల్లులో విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రారంభించడంతోపాటు గని, శకునాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన భారీ సోలార్ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం నంద్యాలకు చేరుకుంటారన్నారు. నంద్యాల పట్టణంలో దివంగత నాయకుడు భూమానాగిరెడ్డి ఇచ్చిన హామీలలో ముఖ్యమంత్రి నూటికి నూరు శాతం నెరవేర్చేందుకు పలు అభివృద్ధి పనులను భూమి పూజలు నిర్వహించి పైలాన్ ఆవిష్కరించడంతో పనులు ప్రారంభిస్తారన్నారు. పై పరిశ్రమల ఏర్పాటు కారణంగా జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నంద్యాల సీడ్‌హబ్‌ను కూడా త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. నంద్యాల అభివృద్ధి కోసం రూ.167 కోట్లతో నిర్మించే తాగునీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారని, అలాగే 13 వేల గృహాల నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరిస్తారని, పట్టణంలో రోడ్ల విస్తరణ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద జరిగే అభివృద్ధి పనులతో పాటు మరికొన్ని పనులను ప్రారంభించేందుకు సిఎం నంద్యాల వస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి అఖిల మాట్లాడుతూ తన తండ్రి కన్న కళలను సిఎం చంద్రబాబునాయుడు నెరవేర్చేందుకు నంద్యాలకు వస్తున్నారని, ముఖ్యంగా నంద్యాల ముస్లింలతో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొంటారని తెలిపారు.
చుక్కల భూములపై అవగాహన కల్పిస్తాం
* సాగునీటి ప్రాజెక్టులపై సిఎం ప్రత్యేక దృష్టి
* డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
నందికొట్కూరు, జూన్ 20:చుక్కల భూముల సమస్య పరిష్కారంపై రైతులకు అవగాహన కల్పించి, వారు అనుభవిస్తున్న భూములకు పట్టాలు అందజేయనున్నట్లు డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులపైనే సిఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. జూపాడుబంగ్లా మండలంలో సిఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంగళవారం కెఇ పరిశీలించారు. అనంతరం నందికొట్కూరు మార్కెట్‌యార్డులో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో భూ యాజమాన్య హక్కులు ఎవరివో స్పష్టత లేకపోవడంతో, ఈ భూములన్నింటినీ 22-ఏ(1) ప్రకారం నిషిద్ధ ఆస్తుల జాబితాలో చేర్చారని, తద్వారా ఆయా భూములు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో రైతులు ఈ పొలాలు తమవే అయినప్పటికీ విక్రయించుకునే వీలులేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఆర్‌ఎస్‌ఆర్ తయారు చేసినప్పటి నుంచి రైతులను ఈ సమస్య వెంటాడుతుందన్నారు. రాయలసీమలోనే సుమారు 4లక్షల మంది రైతులు ఈ సమస్యతో దిగాలు చెందారన్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్య పరిష్కరించేందుకే ఈ చట్టం తెచ్చామన్నారు. ఈ చట్టం వచ్చే తేదీ నాటికి చుక్కలున్న భూములను 12 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతాంగానికి పట్టాలు ఇచ్చి ఉచితంగానే క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ విషయంపై రైతాంగానికి అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే జిల్లాలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. సిద్దాపురం, పులికనుమ, హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు చేపడుతామన్నారు. ఈ కాలువ వెడల్పు పూర్తయితే రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు సీమ ప్రాంతానికి వెళ్తుందన్నారు. ప్రతిపక్షాలు పట్టిసీమను విమర్శించడం తగదన్నారు. రాష్ట్రంలో 47లక్షల మందికి పింఛను అందజేస్తున్నామని, ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తున్నామన్నారు. మిగిలిన రెండేళ్ల కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు మరింత చేరువవుతామన్నారు. సిఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, ఎంపిపి వీరం ప్రసాదరెడ్డి, పిఏసిఎస్ అధ్యక్షుడు కాతా రమేష్‌రెడ్డి, కౌన్సిలర్ ముర్తుజావలి, నాయకులు పాల్గొన్నారు.
సిఎం పర్యటన జయప్రదం చేయండి
* డిప్యూటీ సిఎం కెఇ
ఓర్వకల్లు, జూన్ 20:మండలంలో సిఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి అధికారులు, పార్టీ నాయకులను ఆదేశించారు. కెఇ మంగళవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులుతో కలిసి మండలంలో సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే బాలభారతి పాఠశాల, జడ్పీ పాఠశాల ఆవరణలో సభా స్థలి, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూమిపూజ చేయనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం సభ నిర్వహణపై ఎంఎంఎస్ గౌరవ సలహాదారు విజయభారతితో చర్చించారు. వారి వెంట జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, కలెక్టర్ సత్యనారాయణ, కెడిసిసి బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, మాజీ మంత్రులు ఫరూక్, ఏరాసు ప్రతాపరెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, పలు శాఖల అధికారులు ఉన్నారు.
ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికలకు టిడిపి దూరం
* 22న జిల్లా స్థాయి వైకాపా ప్లీనరీ:ఎంపి రేణుక
కర్నూలు సిటీ, జూన్ 20:రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి ఖాయమన్న భయంతోనే టిడిపి ఆ ఎన్నికలకు దూరంగా ఉంద ని ఎంపి బుట్టా రేణుక విమర్శించారు. నగరంలోని వైకాపా కార్యాలయంలో మంగళవారం ఆమె పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రోజు రోజుకూ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఓటమి ఖాయమని టిడిపి భయపడుతుందని వెల్లడించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల్లో తమకు అవసరమైన వాటిలో అరకొరగా చేసి అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని చెప్పి సక్రమంగా చేయలేదని, దీంతో రైతులు, పొదుపు మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మె ల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ వైకాపా జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నామని, ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎంపి వరప్రసాద్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి హాజరవుతారన్నారు. జిల్లాస్థాయి ప్లీనరీలో నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల్లో చేసిన తీర్మానాలతో పాటు మరికొనిన అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే నెల 8వ తేదీ దివంగత సిఎం వైఎస్ జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి బివై.రామయ్య మాట్లాడుతూ సిఎం చంద్రబాబు జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వంద రోజుల్లో పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని, కాల్వగట్లపై నిద్రించి ప్రాజెక్టు పనులను పూర్తి చేయిస్తామని చెప్పి ఇంతవరకూ వాటి ఊసే ఎత్తలేదన్నారు. అనవసరంగా కృష్ణా పుష్కరాలకు వందలాది కోట్లు ఖర్చు పెట్టారని, గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేయటానికి మాత్రం నిధులు కేటాయింటం లేదని ఆరోపించారు. గత పర్యటనల్లో జిల్లా కు ఎన్నో హామీలు ఇచ్చినా అందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. నం ద్యాల ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తున్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు టిడిపిని నమ్మే స్థితిలో లేర న్నారు. సమావేశంలో కర్నూలు ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్, నరసింహులుయాదవ్, రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మద్దయ్య, గోపీనాథ్ పాల్గొన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే డిమోషన్
* సిడిఎంఎ కన్నబాబు హెచ్చరిక
కర్నూలు సిటీ, జూన్ 20:నగర పాలక సంస్థలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వాళ్లకు డిమోషన్ ఇస్తామని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిడిఎంఎ)కె.కన్నబాబు హెచ్చరించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థలో అనవసరంగా నిధులు ఖర్చు చేస్తూ ఇష్టానుసారం పని చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. అమృత పథకం కింద నగరానికి 15వేల కుళాయి కనెక్షన్లు మంజూరు కాగా ఇప్పటి వరకూ ఎన్ని కనెక్షన్లు ఇచ్చారని ప్రశ్నించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, పందుల పట్ల శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రెవెన్యూ వసూళ్లను వంద శాతం పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. నగరంలో గోడలపై అతికించిన పోస్టర్లను రెండు నెలల్లోగా తొలగించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి, మున్సిపల్ ఇంజినీర్ రాజశేఖర్, ఎంహెచ్‌ఓ, ఆర్‌ఓలు, డిఇలు, ఏఇలు, తదితరులు పాల్గొన్నారు.
సిఎం రోడ్డు మార్గాన వెళ్లొచ్చు..
* ఏర్పాట్లు చేయండి:కలెక్టర్
కర్నూలుటౌన్, జూన్ 20:సిఎం చంద్రబాబు బుధవారం జిల్లాలో పర్యటిస్తారని వాతావరణం అనుకూలించని పక్షంలో రోడ్డు మార్గాన కూడా పర్యటన చేయవచ్చని, కావున ఓర్వకల్లు నుంచి కర్నూలు వరకూ రహదారి వెంట పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం సిఎం పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిఎం రోడ్డు మార్గాన కూడా వెళ్లేందుకు అవకాశం ఉందని, అందుకుతగ్గ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీనివాసురెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఇ సుబ్బరాయుడు, డిపిఓ పార్వతి పాల్గొన్నారు.
ఆదోనిలో ఆసుపత్రుల పడకల స్థాయి 300కు పెంచాలి
ఆదోని, జూన్ 20: ఆదోనిలో ఉన్న ఆసుపత్రుల స్థాయిని 300లకు పెంచాలని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు ప్రకాష్‌జైన్ విలేఖర్ల సమావేశంలో స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆదోని మెయిన్ ఆసుపత్రిలో 100 పడకలు, స్ర్తిల పిల్లల ఆసుపత్రిలో 50 పడకల మాత్రం ఉన్నాయని అన్నారు. రెండు ఆసుపత్రులను విలీనం చేసి అదనంగా 150 పడకలను ఏర్పాటు చేసి ఆసుపత్రుల స్థాయిని కూడా పెంచాలని ఆయన కోరారు. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో 15 లక్షల వరకు జనాభా ఉందని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన ఆదోనిలో ఉన్న ఆసుపత్రులు ప్రజలకు వైద్యం చేయడానికి ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. రెండు ఆసుపత్రులను విలీనం చేసి 300 పడకల వరకు ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తే అదనంగా వైద్యాధికారులు వస్తారని, నిపుణులైన వైద్యులు కూడా వస్తున్నారన్నారు. 300 పడకలు ఏర్పాటు చేయడం వల్ల వైద్య విద్యార్థులు ప్రత్యేక కోర్సులకు ఆదోనికి వచ్చి రోగులకు సేవలు చేస్తారన్నారు. స్ర్తిల పిల్లల ఆసుపత్రిలో కేవలం 50 పడకలు మాత్రమే ఉన్నాయని, కాని అక్కడ కాన్పుల కోసం వందల సంఖ్యలో గర్భిణిలు రావడం వల్ల పడకలు చాలక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే మెయిన్ ఆసుపత్రి, స్ర్తిల పిల్లల ఆసుపత్రిలో ఎండిడిజిఓ వైద్యులను ఏర్పాటు చేయాలని కోరారు. సిటి స్కానింగ్‌తోపాటు అన్ని రకాల వైద్య పరికరాలను ఆసుపత్రులలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదోనికి డయాలసిస్ కేంద్రం మంజూరు చేశారని, వెంటనే ఆ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత వుందని, పదవీ విరమణ, బదిలీ అయిన వైద్యుల స్థానంలో వెంటనే వైద్యులను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా దృష్టికి ఆసుపత్రుల సమస్యలను తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
సిఎం పర్యటనకు నంద్యాల ముస్తాబు
* తొలిసారి నంద్యాలలో బాబు రాత్రిబస
* 10 వేల మంది ముస్లింలకు భారీ ఇఫ్తార్ విందు
* 1000 మందికి పైగా దుల్హన్ పథకం చెక్కుల పంపిణీ
నంద్యాల, జూన్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల పట్టణంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వస్తున్న సందర్భంగా నంద్యాల పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి రోడ్లకు మరమ్మతులు పూర్తి చేసి, డివైడర్లపై మొక్కలు, గడ్డిని ఏర్పాటు చేసి అనేక చోట్ల రంగులతో గోడలను నింపారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం వద్ద, వౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థూపం వద్ద, వై జంక్షన్‌లోని దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం చుట్టూ పుసుపుపచ్చ తోరణాలతో అలంకరించి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం చెప్పేందుకు స్థానిక నాయకులైన ఎంపి ఎస్పీవైరెడ్డి, మంత్రి భూమా అఖిల ప్రియ, మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్, మాజీ ఆర్‌ఐసి చైర్మన్ ఎవి సుబ్బారెడ్డి, టిడిపి కౌన్సిలర్ల ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో నిండిపోయింది. సిఎం చంద్రబాబు నంద్యాల పట్టణానికి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగుతారు. అక్కడి నుండి చామకాల్వ వై జంక్షన్, మున్సిపల్ కార్యాలయం, పద్మావతినగర్ మీదుగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన టెక్కె మార్కెట్‌యార్డుకు చేరుకుంటారు. అక్కడ నంద్యాల పట్టణానికి చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు సంబంధించి 11 శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా వెలుగోడు రిజర్వాయర్ నుండి నంద్యాల పట్టణానికి అమృత్ పథకం ద్వారా చేపట్టబోయే పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ, 13 వేల గృహాల నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరణ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద చేపట్టబోయే అభివృద్ధి పనులకు పైలాన్ ఆవీష్కరణ, రోడ్ల విస్తరణ పనులకు పైలాన్ ఆవిష్కరణలతోపాటు మరో 7 అభివృద్ధి పనులకు సిఎం పైలాన్ ఆవిష్కరించి పనులు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. దీంతోపాటు జిల్లాలోని 53 మండలాలకు సంబంధించి దుల్హన్ పథకం కింద ఎంపికైన 1069 మందికి ఒక్కొక్కరికి రూ.50 వేల ప్రకారం చెక్కులు పంపిణీ, డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమ బోధన కార్యక్రమాన్ని ప్రారంభించడం తదితర పనులన్నీ పూర్తి చేసుకొని 6.47 నిమిషాలకు 10 వేల ముస్లిం మైనార్టీలతో కలసి ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముస్లింలతో కలసి సామూహిక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం, ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఇఫ్తార్ విందు ముగిసిన అనంతరం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో రాత్రిబస చేస్తారు. రాత్రి నంద్యాల అభివృద్ధిపై స్థానిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఉదయం నుండి 9.30 గంటల వరకు స్థానిక ప్రజల నుండి వినతులు స్వీకరించడంతోపాటు రాజకీయ నాయకులతో చర్చించిన అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకొని కడప జిల్లాకు ప్రయాణమవుతారని అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
నేతలకు గుర్తుకొచ్చిన రహదారుల బాగోగులు...
నంద్యాలటౌన్, జూన్ 20:నంద్యాలలో రహదారులు ఏవిధంగా ఉన్నా యో నేతలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా గుంతలు, బురదమయం, అస్తవ్యస్తంగా ట్రాఫిక్ ఉంటుంది. అయితే ఒక్కసారిగా సిఎం నంద్యాల పట్టణానికి విచ్చేస్తున్నాడని నేతలు, అధికారులు రహదారులకు ప్యాచింగ్‌లు వేస్తూ, సిఎం వెళ్లే రహదారి వెంట స్పీడ్ బ్రేకర్లు తీసివేస్తు, సున్నం కొడుతూ అందంగా తీర్చిదిద్దుతున్నా రు. సిఎం వస్తున్నాడని నేతలకు రహదారులు, స్పీడ్ బ్రేకర్లు, అందాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా అని ప్రజ లు ముక్కున వేలేసుకుంటున్నారు. చామకాలువ నుంచి సంజీవనగర్, శ్రీనివాససెంటర్, ఆత్మకూరు బస్టాండ్ వరకు అధికారులు ఇష్టానుసారంగా తారురోడ్డు వేశారు. రహదారి హెచ్చుతగ్గులు ఉండడంతో ఇదేమి రోడ్డురో బాబు...అంటూ అధికారులపై విసుగు చెందుతున్నారు. అలాగే శ్రీనివాససెంటర్ నుంచి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వరకు రహదారి చుట్టూ ఉన్న బంకులను తొలగించి మట్టి, కంకర వేసి చదును చేస్తున్నారు. అలాగే పట్టణమంతా పచ్చ జెండాలతో నిండిపోయింది. ఏది ఏమైనా సిఎం పుణ్యమా అని నంద్యాలలో కొంత మేరా అయినా రహదారుల్లో ఉన్న గుంతలు పూడ్చి చదును చేశారు.
పట్టాలేని బోగస్ ఆసుపత్రి!
* రోగుల ప్రాణాలతో నకిలీ డాక్టర్ చెలగాటం..
* విజిలెన్స్ అధికారుల దాడితో గుట్టురట్టు...
ఆదోని, జూన్ 20: ఆదోనిలో బోగస్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి పట్టా లేకుండానే డాక్టర్‌పేరుతో వైద్యం అందించి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడిన నకిలీ వైద్యుని లీలలు విజిలెన్స్ అధికారుల దాడిలో మంగళవారం గుట్టురట్టయింది. ఆదోనిలో మార్చి నెలలో మేదరగేరి మెయిన్ రోడ్డులో విజయగౌరి ఆసుపత్రి పేరుతో చిన్నపిల్లల, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని నరేంద్ర ఆలియాస్ నాగేంద్రప్ప ఘనంగా ఏర్పాటు చేసి వైద్యం సేవలు ప్రారంభించారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు ఎంతో మందికి ఆసుపత్రిలో డాక్టర్ పేరుతో వైద్యం అందించాడు. ఈ ఆసుపత్రిలో దాదాపు 15 పడకలు అలాగే శ్వాసకోశవ్యాధులకు సంబంధించిన యంత్ర పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్, ఇసిజి మిషన్, చిన్న పిల్లలకు ఉపయోగ పడే వెంటిలేటర్ మిషన్‌తోపాటు మెడికల్‌షాపు కూడా ఏర్పాటు చేశారు. ఆసుపత్రిని మూడు భవనాల ఉన్న భవనంలో కొనసాగించారు. నకిలీ డాక్టర్లు, బోగస్ ఆసుపత్రిని ప్రజలంతా నిజమైన డాక్టర్లు, నిజమైన ఆసుపత్రి అని నమ్మారు. అయితే మంగళవారం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు ఒక్కసారిగా విజయగౌరి ఆసుపత్రి పేరుతో నిర్వహించే బోగస్ ఆసుపత్రిపై దాడి చేశారు. అధికారుల దాడితో బోగస్ ఆసుపత్రి, నకిలీ డాక్టర్ల లీలలు ఒక్కసారిగా వెలుగు చూశాయి. ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో బోగస్ ఆసుపత్రి, బోగస్ డాక్టర్ వైద్యం అందించారని తెలుసుకున్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు జగన్మోహన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నరేంద్ర ఆలియాస్ నాగేంద్రప్ప ఎమ్మిగనూరు సమీపంలోని ఎర్రకోట వద్ద ఉన్న సెయింట్‌జాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ వరకు చదివాడన్నారు. కర్నూలులో జెపి ఆసుపత్రి పేరుతో, ఆదోనిలో విజయగౌరి పేరుతో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా బోగస్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారన్నారు. బిటెక్ చదివిన నరేంద్ర ఎంబిబిఎస్, ఎండి చదివినట్లు బోర్డులు వేసుకొని ఆసుపత్రులు ఏర్పాటు చేసుకొని ప్రజలను నమ్మించి నిలువున దోపిడీ చేస్తున్నారన్నారు. డాక్టర్ పట్టా లేకున్న వైద్యం అందించారన్నారు. ఆసుపత్రిలో వైద్య పరికరాలు, పడకలు, మెడికల్‌షాపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవిధంగా పట్టాలేకుండా డాక్టర్ పేరుతో వైద్యం అందించి నేరం చేశారని, ఎలాంటి అనుమతి లేకుండా ఆసుపత్రి, మెడికల్‌షాపులు ఏర్పాటు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. తమ విచారణలో నరేంద్ర డాక్టర్ కాదని బోగస్ ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నారని తేలినట్లు తెలిపారు. ఆతని ఆసుపత్రిలో ఆయన భార్య జ్యోతి సహకారం అందించిందన్నారు. ఇంజినీరింగ్ చదివి డాక్టర్‌గా అవతారం ఎత్తి ఆసుపత్రులు ఏర్పాటు చేసి వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన నకిలీ డాక్టర్ గుట్టు తమ విచారణలో బట్టబయలైందని విజిల్స్ అధికారులు తెలిపారు. విచారణ నివేదికను పై స్థాయి అధికారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. నకిలీ డాక్టర్ నరేంద్రపైన క్రిమినల్ కేసును నమోదు చేసి స్థానిక పోలీసులకు అప్పగిస్తామన్నారు. కాగా డివిజన్ వైద్యాధికారి శ్రీదేవి, తహశీల్దార్ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు హరికృష్ణ, బాబురావు, తదితరులు ఆసుపత్రికి వచ్చి నకిలీ డాక్టర్‌ను, ఆయన భార్యను విచారించారు. ఆలాగే మెడికల్ షాపులో ఉన్న మందులను కూడా పరిశీలించారు. ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
* శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
మహానంది, జూన్ 20: పేద ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, పండుగ రోజు పేద ప్రజలు కూడా సంబరాలు చేసుకొనేలా తోఫాలు అందిస్తూ ప్రభు త్వం పనిచేస్తుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గాజులపల్లె గ్రామంలో ఎంపిపి చింతం నాగమణి అధ్యక్షతన జరిగిన రంజాన్ తోఫా పంపిణీ, ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు రంజాన్ తోఫాను అందించి మాట్లాడుతూ పెళ్ళి చేసుకొనే యువతులకు రూ.50వేలు అందించే పథకానికి మండలంలో 27 మంది దరఖాస్తు చేసుకోగా 9మందిని ఎంపిక చేశారన్నారు. గాజులపల్లె గ్రామంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నందున సిఎం దృష్టికి తీసుకెళ్లి షాదీఖానా వచ్చేలా చూస్తామన్నారు. పేద ప్రజలు పండుగ చేసుకొనేందుకు క్రిస్‌మస్, రంజాన్ తోఫాను ప్రవేశపెట్టడం చంద్రబాబు ఘనత ఉందన్నారు. ఈకార్యక్రమంలో మహానంది చైర్మన్ పాణ్యం ప్రసాద్, ఎంపిపి సాలమ్మ, టిడిపి నాయకులు రామలింగారెడ్డి, క్రాంతికుమార్, మధుసూధన్‌రెడ్డి, రఘునాథరావు, కన్వీనర్ రఘురామిరెడ్డి, అధికారులు ప్రజలు పాల్గొన్నారు.