కర్నూల్

కుటుంబ సభ్యులతో చర్చించాకే పార్టీ మార్పుపై నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, సెప్టెంబర్ 16:కుటుంబ సభ్యులతో చర్చించాకే తెలుగుదేశంపార్టీలో చేరే విషయంపై నిర్ణయం తీసుకుంటానని వైకాపాకు చెందిన కర్నూలు ఎంపి బుట్టా రేణుక స్పష్టం చేశారు. ఆమె శనివారం కోడుమూరులో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరులు ఆమెను వైకాపాను వీడి టిడిపిలో చేరే విషయంపై ప్రశ్నించగా పార్టీ మారే విషయంపై తాను కుటుంబ సభ్యులతో చర్చించి ఆపై తన నిర్ణయాన్ని పత్రికా ముఖంగా తెలియజేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా ఆమె వైకాపాను వీడి టిడిపిలోకి చేరుతారా లేదా అన్న విషయంపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో వైకాపా శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది.
19న బాబు సమక్షంలో టిడిపిలోకి చేరేందుకు రంగం సిద్ధం
వైకాపాకి చెందిన కర్నూలు ఎంపి బుట్టా రేణుక ఒకవైపు పార్టీ మారే విషయంపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయకుండానే మరోవైపా ఎంపి అనుచరగణం అంతా టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన కర్నూలుకు వస్తున్న సిఎం చంద్రబాబు సమక్షంలో ఎంపి బుట్టా రేణుకతో పాటు సీనియర్ వైపాకా నేత కొత్తకోట ప్రకాష్‌రెడ్డి కూడా టిడిపి కండువా వేసుకుంటారని సమాచారం.
పాలేరువాగులో బస్సు బోల్తా..
* తప్పిన పెను ప్రమాదం.. * ఇద్దరికి గాయాలు..
సంజామల, సెప్టెంబర్ 16: మండల పరిధిలోని సంజామల గ్రామ సమీపంలోని పాలేరువాగులో ఆర్టీసీ బస్సు పడిపోయింది. దీంతో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉండగా ఇద్దరికి స్వల్పగాయాలు కాగా మిగిలి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం 12 గంటల్లో కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోకు చెందిన ఎపి 29 జడ్ 2505 నెంబర్ గల బస్సు కోవెలకుంట్ల నుంచి సంజామల, తిమ్మనాయనపేట మీదుగా తాడిప్రడికి వెళ్తుండగా డ్రైవర్ అజాగ్రత్తతో బస్సు వాగులోకి పడిపోయింది. ప్రయాణికులు దృశ్యాన్ని కళ్లారా చూసి భయాందోళనకు గురై గట్టి కేకలు వేస్తు బస్సులో నుంచి పరుగులు తీశారు. కాగా శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అవుకు రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉండే పాలేరువాగు నీరు ఉదృత్తంగా ప్రవహిస్తుండడంతో ఆర్టీసీ డ్రైవర్ దావీద్ అజాగ్రత్తతో పాలేరువాగు వద్ద రోడ్డు ఉన్నవైపు కాకుండా మరో వైపు వెళ్లడంతో బస్సు వాగులో పడింది. బస్సులో అధి క సంఖ్యలో 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అందులో ప్రయాణిస్తున్న పేరుసోమలగ్రామానికి చెందిన సుంకమ్మ, కానాలగ్రామానికి చెందిన వృద్ధురాలు ఎస్తేరమ్మకు స్వల్పగాయా లయ్యాయి. గాయపడిన ఇద్దరిని సం జామల గ్రామానికి చెందిన ఈతగాళ్ల సహాయంతో బస్సులో నుంచి ఒడ్డుకు చేర్చి 108 ద్వారా కోవెలకుంట్ల ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బకుజీవుడా అంటూ బస్సులో నుంచి కిందకు దిగి ఒడ్డుకు చేరుకుని ఊపిరి పీల్చుకున్నారు. విష యం తెలుసుకుని ఘటనా స్థలానికి తహశీల్దార్ వై.వెంకటేశ్వర్లు, సిబ్బంది చేరుకుని ప్రయాణికులకు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం బస్సు ను క్రేన్, ప్రొక్లయిన్ సహాయంతో పాలేరువాగు నుంచి బయటు కు తీశారు. వాగు వద్దకు కర్నూలు ఆర్‌ఎం శ్రీనివాసులు, కోవెలకుంట్ల డిపో మేనేజర్, వారి సిబ్బంది, సంజామల ఎస్‌ఐ విజయభాస్కర్, పోలీసులు చేరుకుని పరిశీలించి ప్రయాణికులు వాగు దాటకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే వాహనాలను వాగు లో పోనీకుండా ముదిగేడు, ముక్కమల్ల, పేరుసోమల, తిమ్మనాయుడుపేట, తాడిపత్రి మీదుగా దారి మల్లించారు.
కుందరవాగులో ఆటో బోల్తా..
ఉయ్యాలవాడ : ఆళ్లగడ్డ, మాయలూరు ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారిలో మండలంలోని ఇంజేడు గ్రామ సమీపంలో కుందరవాగులో ఆటో బోల్తా పడిన సంఘటన శనివారం రాత్రి 8.30 గంటలకు చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు చాగలమర్రి పట్టణానికి చెందిన ఇస్మాయిల్ జీవనం కొనసాగించేందుకు పాత సామానుల వ్యాపారం చేసేవాడు. వృత్తి రీత్యా ఉదయం కడప జిల్లా పెద్దముడియం మండలం కొండసుంకేసులకు బయలుదేరాడు. వ్యాపారం ముగించుకుని స్వగ్రామం చేరుకునేందుకు సాయం త్రం బయలుదేరి వచ్చాడు. మండలంలోని ఇంజేడు వద్ద కుందరవాగు ఉదృతంగా ప్రవహిస్తున్న దాటవచ్చునన్న నమ్మకంతో ఆటోను అలాగే నీటిలో దింపాడు. నీటి ప్రవాహానికి ఆటోతో సహా వాగులో కొట్టుకుపోయాడు. ఉదయం నుండి గస్తీ నిర్వహిస్తున్న ఎఎస్‌ఐ నాగవీరయ్య, కానిస్టేబుల్ భాస్కర్‌రెడ్డి, హోంగార్డు చలమయ్యలు భోజనం చేసేందుకు 8 గంటల సమయంలో గ్రామంలోకి వచ్చారు. భోజనం చేసిన అనంతరం వాగు వద్దకు వెళ్తున్న సమయంలో ఆటో బోల్తాపడిన విషయాన్ని గమనించారు. దీంతో వారు ఇంజేడు గ్రామస్థులకు సమాచారం అందజేశారు. గ్రామానికి చెందిన వెంకటక్రిష్ణ, అమర్‌నాథ్‌రెడ్డితో పాటు మరి కొందరు సంఘటనా స్థలానికి చేరుకుని ఇస్మాయిల్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి గ్రామంలోకి తీసుకువచ్చారు. రాత్రి సమయం కావడంతో వాగులో ఆటో ఆచూకి లభించలేదు. వాగులో వరద ఉదృతి తగ్గితే తప్పా ఆటో ఆచూకి లభ్యం కావడం కష్టమని గ్రామస్థులు పేర్కొన్నారు.
వాగులో కొట్టుకుపోయి వృద్ధురాలి మృతి
కొలిమిగుండ్ల : మండలంలోని అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు ఈడిగ రంగమ్మ (60) వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అబ్దుల్లాపురం సమీపంలో భారీ వర్షం కురిసింది. గ్రామ సమీపంలోని వంక, వాగు ఉదృతంగా ప్రవహించినట్లు గ్రామస్థులు తెలిపారు. అయితే ఈడిగ రంగమ్మ సాయంత్రం తమ మేకలను తోలుకొని మేత కోసం వెళ్లగా మళ్లీ వర్షం రావడంతో రంగమ్మ వాగు దాటలేక అందులోనే కొట్టుకుపోయింది. రంగమ్మ కోసం బంధువులు రాత్రంగా గాలించినా ఫలితం లేకపోగా, శనివారం ఉదయం వాగులో చెట్లకు తగులుకొని ఉన్న రంగమ్మ మృతదేహాన్ని కనుగొన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎఎస్‌ఐ గని అక్కడికి చేరుకొని రంగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
జలాధివాసంలోకి వేపదారు శివలింగం
* సంగమేశ్వరాలయాన్ని చుట్టుముట్టిన కృష్ణాజలాలు
పాములపాడు, సెప్టెంబర్ 16 : శ్రీశైలం జలాశయంలోకి శనివారం అనూహ్యంగా 2 లక్షల కూసెక్కుల వరద నీరు చేరడంతో సప్తనదీ సంగమేశ్వరాలయం చుట్టూ కృష్ణాజలాలు చేరాయి. దీంతో వేపదారు శివలింగం జలాధివాసంలోకి వెళ్లింది. 12 రోజుల క్రితం చుక్కనీరు లేని సప్తనదీ తీరంలోకి శనివారం సాయంత్రానికి పెద్దఎత్తున నీరు చేరి సంగమేశ్వరాలయంలోని గర్భగుడిలోకి నీరు చేరడం ఆరంభమైంది. సాయంత్రం సమయానికి కృష్ణా జలాలలు గర్భాలయంలోని వేపదారు శివలింగాన్ని ముంచెత్తాయి. వేపదారు శివలింగం పూర్తిగా నీట మునిగే సమయంలో ఆలయ వేద పండితులు తెలకపల్లి రఘురామశర్మ మహాహారతి ఇచ్చారు. అలాగే యాగశాలలో కృష్ణా జలాలపై నిర్వహిస్తున్న వరుణయాగానికి పూర్ణహారతితో పరిసమాప్తి పలికారు. అనంతరం శిఖర హారతి ఇస్తూ వినాయకుడి విగ్రహాన్ని ఆలయ గోపురంపైకి చేర్చి నిమజ్జనానికి సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం నాటికి శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 847 అడుగులకు చేరింది.
వ్యవసాయ రంగం అభివృద్ధికి యువత కృషి చేయాలి
* మంత్రి అఖిలప్రియ
ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 16: వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేలా యువత కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. మండలంలోని కోటకందుకూరు మెట్ట వద్ద వున్న భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో శనివారం శోభానాగిరెడ్డి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలను వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. పాలిటెక్నిక్‌తో పాటు అగ్రికల్చరల్ బిఎస్సీ, ఎమ్మెస్సీలను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల లో డిప్లమా పూర్తి చేసి వ్యవసాయ రంగంలో ప్రావీణ్యం సంపాదించి తక్కువ ఖర్చుతో పంటలను సాగుచేసే విధానాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రతిభను గుర్తించి రానున్న కాలంలో చాలా మంది విద్యార్థులు వ్యవసాయ రంగ పాలిటెక్నిక్‌పై ఆసక్తి చూపేలా అనుభవజ్ఞులైన ప్రొఫెపర్లచే విద్యాబోధన వుంటుందన్నారు. డా.జి రామకృష్ణారెడ్డి మా తల్లిందండ్రులు భూమాదంపతుల హాయాం నుండి కళాశాలను అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణా విద్యాసంసంస్థల అధినేత డా. రామకృష్ణారెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపాల్ శాంతయ్య, అనంత కళాశాలల అధినేత అనంత రామసుబ్బారెడ్డి, టిడిపి నాయకులు మహేశ్వరరెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
దేవనకొండ ఏపిజిబిలో దోపిడీకి విఫలయత్నం..
దేవనకొండ, సెప్టెంబర్ 16: స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో దొంగలు చేసిన దోపిడీ యత్నం విఫలమైంది. శుక్రవారం రాత్రి ఈసంఘటన జరిగింది. ముసుగులు ధరించిన నలుగురు దొంగలు శుక్రవారం రాత్రి సిసి కెమెరాలను పక్కకు తిప్పి బ్యాంకు షట్టర్‌ను ఇనుప రాడ్లతో పైకి లేపి బ్యాంకులోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం దాదాపు అర్ధరాత్రి సమయంలో రెండు గంటలపాటు బ్యాంకులో నగదు, నగలు దోచుకునే ప్రయత్నంచేశారని పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారులు సేఫ్‌లాకర్ గది తాళాలు కూడా బ్యాంకులోనే వదిలి వెళ్ళడం వల్ల దొంగలు గదిని తెరుచుకొని నగదు, నగలు భద్ర పరిచిన బీరువాను తెరవడానికి వాటిని తాకగా అలారం మోగడంతో దొంగలు భయపడి అక్కడ నుంచి పారిపోయి ఉంటారని అధికారులు అంటున్నారు. ఈ విషయాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకులో దొంగ లు దోపిడీ ప్రయత్నం విఫలం కావ డం అందులో ఉన్న రూ. 2.2కోట్ల వి లువ చేసే నగలు, రూ. 25 లక్షల నగదు భద్రంగా ఉండడం వల్ల సం బంధిత అధికారులు, నగదు, నగలు భద్ర పరిచిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకు దోపిడీ యత్నం మెసెంజర్ నబీరసూల్ ఉదయం 7 గం టలకు బ్యాంకు తెరవడానికి వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. 7 గంటల తరువాత మెసెంజర్ మేనేజర్‌కు సమాచారం తెలుపగా రెండవ మేనేజర్ కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈవిషయం తెలిసిన వెంటనే డోన్ డిఎస్‌పి బాబా ఫకృద్దీన్, సిఐ విక్రమ సింహా, ఎస్‌ఐ గంగయ్యయాదవ్, రీజినల్ మేనేజర్ రామసుబ్బరావు, సీనియర్ మేనేజర్లు శ్రీనివాసులు, రాము, బ్రాంచి మేనేజర్ విజయ్‌భాస్కర్, సిబ్బంది బ్యాంకులకు చేరుకొని జరిగిన సంఘటన గురించి పరిశీలించారు. అలాగే విషయం తెలుసుకున్న ఎస్పీగోపినాథ్‌జెట్టి శనివారం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును సందర్శించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈసంఘటన దొంగలు పనేనన్నారు. బ్యాంకు అధికారులు సేఫ్‌లాకర్ గదికి సంబంధించిన తాళాలను బ్యాంకులోనే వదిలి వెళ్లడం వల్ల వారిపైన కూడా విచారణ చేస్తామన్నారు. సేఫ్ లాకర్ బీరువాల దగ్గర అలారం మోగి శబ్ధం రావడం వల్ల దొంగలు పారిపోయారని, ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొని ఉండవచ్చునని ఎస్పీ తెలిపారు. సిసి పుటేజీల ద్వారా వివరాలు సేకరించి అసలు దొంగలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
103 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లు
* ఉడుములపాడు, దినె్నదేవరపాడులో పరిశ్రమల కోసం 90 ఎకరాలు:కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు, సెప్టెంబర్ 16:జిల్లాలో 103 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ యూనిట్లకు ప్రోత్సాహకం మంజూరు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవన్‌లో శనివారం జిల్లా స్థాయి పరిశ్రమ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉడుములపాడు, దినె్నదేవరపాడు గ్రామాల్లో పరిశ్రమల స్థాపనకు 90 ఎకరాల స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్డీఓ, తహశీల్దార్లను ఆదేశించారు. వివిధ యూనిట్ల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలను స్వయంగా తనిఖీ చేసి సమర్పించిన నివేదికను కలెక్టర్ పరిశీలిస్తూ సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కల్లూరు పరిశ్రమల ఎస్టేట్‌లో నీటి వనరుల కోసం భూ గర్భ జలాలను అనే్వషించి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సంబంధిత ఉపసంచాలకులను ఆదేశించారు. బేతంచెర్ల డంపు యార్డు ప్రతిపాదనను పంపాలని తహశీల్దార్ అంజనాదేవిని ఆదేశించారు. అన్ని నియోజకవర్గాల్లో పరిశ్రమల పార్కుల అభివృద్ధి కోసం స్థలాల సమస్య వుంటే ప్రతి మంగళవారం నిర్వహించే ల్యాండ్ అక్విజేషన్ సమావేశం దృష్టికి తీసుకు రావాలని పరిశ్రమల జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు.
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు సరళీకృత ఆర్థిక విధానంలో మన రాష్ట్రం ముందుందన్నారు. ప్రతిపాదనను సమర్పించుకున్న ప్రతి పరిశ్రమను పరిశీలించి సింగిల్ డెస్క్ విధానం ద్వారా 7 నుంచి 21 రోజుల్లో మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి నుంచి ప్రతి నెల ప్రతిపాదించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వివిధ పరిశ్రమల యూనిట్లకు గత మే, జూన్ నెలల్లో 352 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లకు ప్రోత్సాహక మంజూరులో జారీ చేసి దాదాపు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. సమావేశంలో పరిశ్రమల మేనేజర్ సోమేశ్వరరెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, ఏపి వౌలిక సదుపాయాల కార్పొరేషన్ జోనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జిఆర్‌కె రెడ్డి, జిఎస్‌టి అధికారి గౌస్‌పీర, సిపిఓ ఆనంద్‌నాయక్, మున్సిపల్ కమిషనర్ హరినాథరెడ్డి, పరిశ్రమల శాఖ డిడి మదనమోహనజెట్టీ, ఆర్టీఓ జగదీశ్వరరాజు, డిటిసి సంధ్య, కుడా డిడి హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీల్లో రెయిన్ గేజ్ మీటర్ల ఏర్పాటుకు తీర్మానం
* జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్
కర్నూలుసిటీ, సెప్టెంబర్ 16:జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక రెయిన్ గేజ్ మీటర్ ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ తెలిపారు. జడ్పీ ఛాంబర్‌లో శనివారం స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో రెయిన్ గేజ్ మీటర్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ మంచి వర్షం కురిసి, దూరంలో ఉన్న గ్రామ పంచాయతీలో వర్షం కురవకపోయినా మండలమంతా మంచి వర్షం కురిసినట్లు అధికారులు వర్షపాతాన్ని నమోదు చేస్తున్నారన్నారు. ఈవిధంగా చేయడం వల్ల గ్రామ పంచాయతీల్లో వర్షాలు కురవకపోయినా కురినట్లుగా నమోదు చేయటం వల్ల ఆయా మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించడం లేదని, దీంతో ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు. ఇక రైతులకు రబీ సీజన్‌కు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను సకాలంలో పంపిణీ చేయాలని సూచించారు. అంతేకాకుండా ఈక్రాప్ విధానంలో రైతులకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని వెంటనే సరి చేయాలన్నారు. దేవనకొండ మండలంలోని గ్రామాల్లో గ్రావెల్ రోడ్లను 100శాతం పూర్తి చేసినా బిల్లులను ఎందుకు పెండింగ్ పెట్టారని అధికారులను ప్రశ్నించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్శరీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు చేయటం లేదన్నారు. జిల్లాలో కొంద రు ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలకు ప్రహరీ ఉన్నా లేదని రికార్డుల్లో నమోదు చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రహరీ లేని పాఠశాలలను గుర్తించి తక్షణమే నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సమావేశంలో జడ్పీ సిఇఓ ఈశ్వర్, డిప్యూటీ సిఇఓ ప్రతాప్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, జడ్పీటిసి సభ్యులు పాల్గొన్నారు.
శ్రీశైలం జలాశయంలో 840 అడుగుల నీటిమట్టం
* రైతాంగానికి శుభసూచకం:ఎంపి ఎస్పీవై రెడ్డి
నంద్యాల, సెప్టెంబర్ 16: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మకు జలకళ వచ్చిందని, దీంతో శ్రీశైలం జలాశయం వద్ద మట్టం 840కి చేరుకుందని నంద్యాల ఎంపి ఎస్పీవైరెడ్డి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాల వారు కృష్ణానదికి నీరు వదలకపోయినా, దేవుడి దయతో మన జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుతున్నట్లు ఆయన తెలిపారు. జూరాల నుండి 1,09,303 క్యూసెక్కులు, రోజా నుండి 79,880 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోందని, శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి జలాశయ నీటిమట్టం 839.5 అడుగులకు ఉందని, 61.79 టిఎంసిల నీరు ప్రాజెక్టులో ఉన్నట్లు ఎంపి తెలిపారు. ఆదివారం నాటికి 840 అడుగులకు చేరుకోవచ్చని మరో రెండు రోజుల్లో ఈ మట్టం 842కు చేరుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పోతిరెడ్డిపాడు స్పిల్‌వే వద్ద 840 అడుగులకు వెలుగోడుకు నీరు తీసుకోవచ్చని ఈ విషయాన్ని జల వనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎంపి తెలిపారు. నంద్యాలతోపాటు సీమ ప్రాం తానికి కృష్ణాజలాలు అందాలంటే మరికొన్ని రోజుల పాటు వరద వస్తే బాగుంటుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నంద్యాలకు వస్తున్నారని, ఆయన తనతోపాటు కృష్ణమ్మను కూడా నంద్యాలకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద కృష్ణా జలాల పరిస్థితిని కళ్లారా తిలకించేందుకు రైతులతో కలసి ఆదివారం తాను పోతిరెడ్డిపాడుకు వెళ్తున్నానన్నారు. మొత్తం మీద వరుణదేవుడు కరుణించడంతో శ్రీశైలం జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుందని, ఇది సీమ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొనే అవకాశం కల్పిస్తుందన్నారు. ఈసమావేశంలో ఎంపి ఎస్పీవైరెడ్డి అల్లుడు సజ్జల శ్రీ్ధర్‌రెడ్డి పాల్గొన్నారు.
అవుకులో నీట మునిగిన పంటపొలాలు
అవుకు, సెప్టెంబర్ 16 : మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శివవరం గ్రామ సమీపంలోని నక్కలవాగు, మునగవాణి వంకతో పాటు గ్రామసమీపంలోని మరొవంక ఉప్పొంగి ప్రవహించడంతో పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. వాగునీరు ముందుకెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఆ నీరంతా నిల్వగా మారి పంటలను ముంచెత్తాయి. వరి, జొన్న పంటలు సుమారు 750 ఎకరాల్లో నీట మునిగాయని శివవరం గ్రామానికి చెందిన రైతులు పుల్లారెడ్డి, శంకర్‌రెడ్డి వెల్లడించారు. గొల్లలేరు డ్రైన్‌కు చెందిన మట్టికట్ట వాగుల ప్రవాహానికి అడ్డుగా ఉండటంతో వాగులు, వంకల నుంచి ప్రవహించిన నీరు నిల్వగా మారి పంటలను ముంచెత్తాయని రైతులు పేర్కొంటున్నారు. 600 ఎకరాల్లో జొన్న పంట పూర్తిగా దెబ్బతినిందని, 150 ఎకరాల్లో వరి పంట పరిస్థితి కూడా అలాగే ఉందని తెలిపారు.
7.4 సెం.మీ వర్షపాతం నమోదు
మండలంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ భారీ వర్షం కురవడంతో 7.4 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో 17.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. మునుపెన్నడూ ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా సహజసిద్ధ జలపాతాల ద్వారా అవుకు రిజర్వాయర్‌లోకి వరంద నీరు పెద్దఎత్తున వచ్చి చేరింది.