కర్నూల్

ఎమ్మిగనూరులో సిండికేట్ బ్యాంక్ ఏటిఎంలో దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందవరం, సెప్టెంబర్ 21: ఎమ్మిగనూరు పట్టణంలో బుధవారం అర్థరాత్రి స్థానిక సిండికేట్ బ్యాంకు ముందు గల ఎటిఎంను దోపిడీ దొంగలు గ్యాస్ కట్టర్లతో కట్ చేసి సుమారు రూ.17లక్షలను దొంగతనం చేశారు. గురువారం ఉదయం సిండికేట్ బ్యాంకు స్వీపర్ బ్యాంకు దగ్గరకు వచ్చి చూడగా బ్యాంకు ముందు ఉన్న ఎటిఎం సెంటర్‌ను ధ్వంసం చేసిన విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపింది. వెంటనే బ్యాంకు సిబ్బంది బ్యాంకు దగ్గరకు వచ్చి జరిగిన దొంగతనం విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని బ్యాంకు పరిసర ప్రాంతాలను గాలింపు చర్యలు చేపట్టారు. ఎటిఎంలో జరిగిన దోపిడీ ఎలా జరిగిందనేది విషయంపై ఆరా తీశారు. సంఘటన స్థలాన్ని డిఎస్పీ శ్రీనివాసరావు, సిఐ ప్రసాద్, ఎస్‌ఐ హరిప్రసాద్, జగన్‌మోహన్‌యాదవ్‌లు పరిశీలించారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్ సిబ్బందిని తీసుకొచ్చి పరిసరాలను పరిశీలించారు. ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ దోపిడీ చేసిన దొంగలు దోపిడీ సమయంలో సిసికెమెరాను ధ్వంసం చేసి ముఖానికి నల్లటి ముసుగులు ధరించి గ్యాస్ కట్టర్ల ద్వారా ఎటిఎంను ధ్వంసం చేసి నగదును అపహరించి ఉండవచ్చని ఆయన తెలిపారు. ఈ పని అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా చేసి ఉండవచ్చన్నారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. అయితే దోపిడీకి గురైన సిండికేట్ బ్యాంకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఈ చోరీ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

శ్రీగిరిపై వైభవంగా
శరన్నవరాత్రులు ప్రారంభం
* శైలపుత్రి అలంకారంలో దర్శనమిచ్చిన భ్రామరి..
* భృంగి వాహనంపై విహరించిన స్వామి, అమ్మవార్లు..
శ్రీశైలం, సెప్టెంబర్ 21: శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు గురువారం దేవస్థాన అధికారులు, అర్చక వేదపండితులు సంప్రదాయబద్దంగా పూజలు చేసి ప్రారంభించారు. 9రోజుల పాటు భ్రమరాంబదేవి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవవరణ పూజలు, స్వామి, అమ్మవార్లకు ప్రతి రోజు సాయంత్రం గ్రామోత్సవం, వాహన సేవ లు జరుగనున్నాయి. అలాగే స్వామి అమ్మవార్లకు చండీయా గం, రుద్రయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు నాందిగా గురువారం ఉదయం 8 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, దీక్షా సంకల్పం, కంకణ పూజ, అఖండ స్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, చండీ కలశ స్థాపన కార్యక్రమాలను ఆలయ వేదపండితులు నిర్వహించారు. అనంతరం స్వామి వారి యాగశాల లో యాగశాల ప్రవేశం, గణపతి పూజ, అఖండ స్థాపన, వాస్తుపూజ, రుద్రకలశ స్థాపన కార్యక్రమాలను ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోసం నిర్వహించే ఈ ఉత్సవాల్లో దేశం సుభిక్షంగా ఉండి, సకాలంలో వర్షాలు కురిసి దేశంలోని ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని సంకల్పం పఠించారు. ఉత్సవాల్లో భాగం గా గురువారం సాయంత్రం అంకురార్పన, అగ్ని ప్రతిష్టాపన, అమ్మవారికి నవవరణ కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం రుద్రహోమం, చండీహోమం, రాత్రి 9 గంటల నుండి అమ్మవారికి సుభాషిని పూజ, కాళరాత్రి పూజ నిర్వహించారు.
శైలపుత్రి అలంకారంలో అమ్మవారు..
దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబాదేవికి మొదటి రోజైన గురువారం అమ్మవారిని శైలపుత్రి అలంకారంలో అలంకరింపచేసి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఈ దేవి ద్విభుజాలను కలిగి కుడి చేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది. నవదుర్గ రూపాల్లో ప్రథమ రూపమైన ఈ దేవిని పూజించడం వల్ల ముత్తయిదువలకు ఐదవతనం వృద్ధి చెందుతుంది.
భృంగివాహనంపై స్వామి, అమ్మవార్లు..
దసరా మహోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు సాయంత్రం సేవలో భాగంగా భృంగివాహన సేవను ఎంతో వైభవంగా ఆలయ అర్చక వేదపండితులు నిర్వహించారు. ఈ సేవలో భాగంగా అక్కమహాదేవి అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, భృంగివాహనంపై వేంచింపచేయించి ఆలయ అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శైలపుత్రిగా అలంకరించిన అమ్మవారిని, స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను, మేళ తాళాలతో, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవానికి తోడ్కొని వచ్చి ఎంతో వైభవంగా శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.
‘ఇంటింటికీ టిడిపి’కి విశేష స్పందన
* జడ్పీ చైర్మన్ రాజశేఖర్
జూపాడుబంగ్లా, సెప్టెంబర్ 21 : జిల్లాలో ‘ఇంటింటికీ టిడిపి’ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని భాస్కాపురం, పోతులపాడు, జూపాడుబంగ్లా గ్రామాల్లో గురువారం ‘ఇంటింటికీ టిడిపి’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ పార్టీని, ప్రభుతాన్ని ప్రజలకు చేరువ చేసి ప్రజా సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ‘ఇంటింటికీ టిడిపి’ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో భాగంగా సామాజిక పింఛన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇళ్ల మంజూరు, వంటి సమస్యలను తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సిఎం చంద్రబాబు జిల్లాలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో జిల్లాలో ఎన్నో కంపెనీలను ప్రారంభించారన్నారు. 9 నెలల్లో ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తిచేసి జాతికి అంకితం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. శ్రీశైలం రిజార్వాయర్ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా నీటిని తరలించి రాష్ట్రంలో 150 చెరువులను నింపారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా కనీస సీట్లు కూడా దక్కవన్నారు. మాండ్ర మాట్లాడుతూ 2014 నుంచి చంద్రబాబు రైతు సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పెట్టుకుని హంద్రీనీవా కాలువ వెడల్పు కోసం రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయించి పనులు పూర్తి చేశారన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి పవర్ లైన్ కోసం రూ. వంద కోట్లు విడుదల చేశారన్నారు. ముచ్చుమర్రి వద్ద ఉన్న 12 మోటార్లకు బదులు మరో 4 మోటార్లు ఏర్పాటుచేసే అవకాశం ఉందన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులతో నూతనంగ నిర్మించిన పంచాయతీ భవనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపిలు కె.మంజుల, ప్రసాద్‌రెడ్డి, నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ రమణారెడ్డి, టిడిపి నాయకులు మోహన్‌రెడ్డి, వెంకటేశ్వరయాదవ్, బాలమద్దిలేటి, శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.
మహానందిలో వైభవంగా
దసరా ఉత్సవాలు
* శ్రీశైలపుత్రిగా శ్రీకామేశ్వరీదేవి దర్శనం..
* చంద్రప్రభ వాహనంపై విహరించిన అమ్మవారు..
మహానంది, సెప్టెంబర్ 21: మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీకామేశ్వరీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా వేద పండితుల వేద మంత్రాలతో ప్రారంభమయ్యాయి. మొదటి రోజైన గురువారం ఉత్సవాల సందర్భంగా శ్రీకామేశ్వరీ సహిత మహానందీశ్వరుల స్వామివార్లకు ఆలయ ఇఓ చంద్రశేఖర్‌రెడ్డి, చైర్మన్ పాణ్యం ప్రసాదరావులు పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున మూలవిరాట్‌లకు విశేష ద్రవ్య అభిషేక అర్చనలు, మొదటి కాలార్చన పూజలు, మహామంగళహారతులు, సహస్ర నామార్చనలు మధ్యన వేద పారాయణం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఇఓ, చైర్మన్‌లతో పాటు నేటి ఉభయ దాతలైన నంద్యాలకు చెందిన డాక్టర్ మహేంద్రకుమార్‌రెడ్డి, బిందు, నాయని జగదీశ్వరప్రసాద్, విద్యానందదేవి, కర్నూలుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి, అపర్ణ, శిరివెళ్ళ మండలం గంగవరం సంజీవకుమార్‌రెడ్డి, మాధవి, విజయవాడకు చెందిన సోమశేఖర్‌రెడ్డి, రేణుక దంపతులచే వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్‌లతో పాటు ప్రత్యేక పండితులు వైద్యానంద శివాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. ముందుగా కలశపూజలు, శ్రీచక్రార్చన పూజలతో పాటు చండీహోమాలు నిర్వహించారు.
చంద్రప్రభ వాహనంపై అమ్మవారు..
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజున శ్రీకామేశ్వరీ అమ్మవారు శ్రీశైల పుత్రి దుర్గా అలంకారంలో చంద్రప్రభ వాహనంపై మహానంది పురవీధుల్లో విహరించారు. సాయంత్రం అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవను వేలాది మంది భక్తుల మధ్య కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పుష్ప అలంకృతులు చేసి అష్టవిధ మహామంగళహారతులు ఇచ్చి నారీకేళ, కుష్మాండబలి ఇచ్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి పల్లకీ ఆలయ ప్రదక్షిణగా తిరిగివచ్చి నంది సర్కిల్ వద్ద కొలువుదీర్చారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో శ్రీచక్రంపై సామూహిక కుంకుమార్చనలను నిర్వహించారు. దాతలను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
నందవరంలో..
బనగానపల్లె : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మొదటి రోజైన గురువారం మండల పరిధిలోని నందవరంలో వెలసిన శ్రీచౌడేశ్వరీమాత శ్రీశైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగ తొలుత అమ్మవారి ఉత్సవ విగ్రహానికి శైలపుత్రి అలంకారం చేసి భక్తుల దర్శనార్థం దీప మండలంలో ఉంచారు. ఆలయ ఈఓ విఎల్‌ఎన్ రామానుజన్, ఆలయ కమిటీ చైర్మన్ పివి కుమార్‌రెడ్డి కలశపూజ, గణపతి పూజలతో ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకూ భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇక పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో గాయత్రీమాతకు వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని కొండపేట శ్రీ వాసవీ అమ్మవారిశాలలో వాసవాంబ శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గామాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు బింగిమళ్ల సత్యంశెట్టి, జిల్లా పొలిటికల్ సంఘం చైర్మన్ దమ్మాల వెంకటసుబ్బయ్య, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టంగటూరు శీనయ్య, ఇతర సంఘం నేతల ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం కలశపూజ, గణపతి పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకారం చేసి భక్తుల దర్శనార్థం వుంచారు. పట్టణ శివారులోని రవ్వలకొండపై వెలసిన శ్రీ ఆనందాశ్రమంలోని గాయత్రీ పీఠంలో పీఠాధిపతులు జ్ఞానేశ్వరానంద, మాతా జ్ఞానేశ్వరీ ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. పలుకూరు శ్రీ రామేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు టి.్భస్కరయ్య ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. అంబాల తేజేశ్వరరెడ్డి, గ్రామస్థులు శ్రీపార్వతీదేవికి ప్రత్యేక పూజలు, కలశాభిషేకాలు, శ్రీచక్రపూజలు జరిపించారు. కాగా శుక్రవారం శ్రీచౌడేశ్వరీమాత బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. పట్టణంలోని వాసవాంబ శ్రీబాలత్రిపుర సుందరిమాత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
కొలనుభారతి క్షేత్రంలో..
పాములపాడు : దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా కొత్తపల్లి మండల పరిధిలోని నల్లమల అభయారణ్యంలో వెలసిన శ్రీ కొలను భారతి సరస్వతీ క్షేత్రంలో గురువారం శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖరశర్మ, వాసుశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అంగరంగ వైభవంగా నవరాత్రి పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ నవ్యాంధ్రలోని ఏకైక సరస్వతీ క్షేత్రం కొలను భారతి అన్నారు. ప్రాతఃకాలంలో చారుగోసిని తీర్థ జలాలతో అమ్మవారిని అభిషేకించి పంచామృత సహిత పంచసూక్తములతో అభిషేకాలను కొనసాగించారు. అమ్మవారు మొదటి రోజు శ్రీ బాలాత్రిపుర సుందరి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు.
పోలీసులకు నెమలి అప్పగింత
మంత్రాలయం, సెప్టెంబర్ 21: మంత్రాలయం మీసేవలో వచ్చి చేరిన జాతీయ పక్షి నెమలిని మీసేవ నిర్వాహకులు ఆర్‌ఇ రాజు పోలీసులకు గురువారం అప్పగించారు. నెమలి పైన విహరిస్తూ అకస్మాత్తుగా కిందపడి రామచంద్ర నగర్‌లో ఉన్న మీసేవలోని ఒక చెక్క అలమారులోకి దూరింది. అయితే మీసేవ రాజు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చి నెమలిని పోలీసు స్టేసన్‌కు తీసుకువెళ్లారు. ఎస్సై శ్రీనివాస్‌నాయక్ మాట్లాడుతూ శుక్రవారం అటవీశాఖ అధికారులకు నెమలిని అప్పగిస్తునట్లు తెలిపారు. జాతీయపక్షి నెమలిని సురక్షితంగా పోలీసులకు అప్పగించునందుకు మీసేవ రాజును పోలీసులు అభినందించారు.
6 పంపుల ద్వారా
హంద్రీనీవాకు నీరు విడుదల
నందికొట్కూరు, సెప్టెంబర్ 21:శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 865 అడుగులకు చేరుకోవడంతో గురువారం 6 పంపుల ద్వారా 2,025 క్యూసెక్కుల నీటిని హంద్రీనీవాకు విడుదల చేశారు. కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మల్యాల హంద్రీనీవా మొదటి ఎత్తిపోతల పథకం నుంచి ఒక్కో పంపు ద్వారా 350 క్యూసెక్కుల చొప్పున 6 పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. హంద్రీనీవా ప్రధాన కాలువలో కృష్ణా జలాలు పరుగులు తీసి అనంతపురం జిల్లా జీడిపల్లె రిజర్వాయర్‌కు చేరుకున్నాయని ప్రాజెక్టు ఈఈ పాండురంగయ్య తెలిపారు. కర్నూలు జిల్లాలోని క్రిష్ణగిరి, పత్తికొండ రిజర్వాయర్లు, చెరువులకు హంద్రీనీవా నీటిని మళ్లించి నింపుతున్నారు.