కర్నూల్

పడమర చెరువులు నిండేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 22:నిత్యం కరవు కాటకాలతో విలవిల్లాడే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 106 చెరువులకు కృష్ణా జలాలను అందించడం సాధ్యమేనా అన్న ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు సమావేశంలో శ్రీశైలం జలాశయం నుంచి తొలి విడతగా రాష్ట్రానికి 16 టిఎంసిలు కేటాయించగా అందులో హంద్రీ-నీవాకు కేవలం 5 టిఎంసిల జలాలను కేటాయించారు. మొత్తం హంద్రీ-నీవా పథకానికి 40 టిఎంసిల నీటిని కేటాయించాల్సి ఉంది. అయితే నీటి లభ్యతను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ-నీవా కాలువ ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లోని చెరువులను నింపాలని డిప్యూటీ సిఎం కెఇ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. తన హామీపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన కెఇ ఈ విషయంపై సిఎం చంద్రబాబుతో సైతం చర్చించారు. అయితే గత ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉండటం, 106 చెరువులకు నీటిని తరలిస్తే అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు నీటిని తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతానికి నీటిని తీసుకురాలేకపోయానని దీని కారణంగా మనస్థాపంతో తన పదవికి రాజీనామా చేయడానికి అనంతపురం ఎంపి జెసి దివాకరరెడ్డి సిద్ధపడటంతో ప్రస్తుతం డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి హామీపై ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి దిగువకు నీరు రావడం ఆలస్యమైంది. ఎట్టకేలకు గత వారం రోజుల నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు చేరడం ప్రారంభం కాగా మొదట హంద్రీ-నీవా కాలువకు మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల చేశారు. దీని ద్వారా జిల్లాలో క్రిష్ణగిరి, పత్తికొండ జలాశయాలకు నీరు విడుదల చేసేందుకు కెఇ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కెఇ ప్రయత్నాలు ఫలిస్తే 3 నియోజకవర్గాల్లోని భూములకు సాగు, తాగునీరు అందించడమే కాకుండా భూగర్భ జలాలు పెరిగితే పడమర ప్రాంతంలో నీటి సమస్యను ఎదుర్కొనడంలో ఇబ్బందులు తొలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే హంద్రీ-నీవా, సుజల-స్రవంతి పథకాలకు మొత్తం 40టిఎంసిల నీరు కేటాయించగా ఈ ఏడాది వంద శాతం నీటిని అందించే అవకాశాలు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఉప ముఖ్యమంత్రి కెఇ హామీ అమలుపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం నీటి లభ్యతను బట్టి 50 చెరువులకు నీరందించినా కెఇ లక్ష్య సాధనలో ముందడుగు వేసినట్లేనని ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. ఎంపి జెసి దివాకరరెడ్డి చర్యతో తాడిపత్రికి నీటిని అందిస్తున్న ప్రభుత్వం కెఇ కృష్ణమూర్తి విషయంలో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం అంగీకరిస్తే ఈ ఏడాది వీలైనన్ని ఎక్కువ చెరువులకు కృష్ణా జలాలను తరలించాలని కెఇ పట్టుదలతో పని చేస్తున్నట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. నీటి కోసం అర్రులు చాస్తున్న పడమర ప్రాంత ప్రజల కోరిక, కెఇ లక్ష్యం నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సిందే.
రైతు కంట కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి!
* పడిపోయిన ధర.. * క్వింటాల్ రూ. 400-500
* పొలాల్లో కుప్పలు కుప్పలుగా ఉత్పత్తులు..
ఆదోని, సెప్టెంబర్ 22: ఉల్లిధర ఒకేసారి తగ్గిపోవడంతో పంట పండించిన రైతులకు కంట కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లిధర తగ్గడంతో గిట్టుబాటు ధర లేక నష్టాలు వచ్చాయని పలు గ్రామాల ఉల్లి గడ్డలు పండించిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది రైతులకు లారీ బాడుగులు కూడా రాని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, కోసిగి, కౌతాళం, హొళగుంద, హాలహర్వి, చిప్పగిరి, మద్దికెర, ఆస్పరి, తుగ్గలి, దేవనకొండ, నందవరం, గోనెగండ్ల, పెద్దకడబూరు మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బోరుబావుల వద్ద రైతులు ఉల్లి పంటను పండిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా 35వేల ఎకరాల్లో ఉల్లి పంట రైతులు పడించారు. అయితే ఉల్లి పంట అమ్ముకోవడానికి మార్కెట్ సౌకర్యం లేదు. పండించిన ఉల్లి పంటను అమ్ముకోవడానికి రైతులు కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, తాడేపల్లె గూడెం, చెన్నై ప్రాంతాలకు లారీల్లో తీసుకెళ్లే పరిస్థితి ఉంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఉల్లిగడ్డలు క్వింటాల్ ధర రూ. 1500 నుంచి, రూ. 1800 వరకు ధర పలికింది. అయితే సెప్టెంబర్ రెండవ వారం నుంచి ఉల్లిగడ్డ ధర ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లిగడ్డల ధర రూ. 500 నుంచి రూ. 400లకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈవిధంగా ధర పడిపోవడంతో ఉల్లి రైతులకు భారీ నష్టాలు వస్తున్నాయి. లారీల బాడుగులకు కూడా సరిపోవడం లేదని కపటి రైతు రంగన్న, రామన్న, బైచిగేరి రైతులు ఈరన్న, బలరాంసింగ్, జయరామ్, శ్రీనివాసులు, ఆరేకల్ తిక్కన్న, కప్పటి రాముడు వాపోయారు. దూర ప్రాంతమైన తాడేపల్లె గూడెంకు తీసుకొళ్తే లారీ బాడుగ చేతి నుంచి కట్టే పరిస్థితి వచ్చిందని డాణాపురం రైతు ఈరన్న వాపోయాడు. మహారాష్ట్ర నుంచి అధికంగా ఉల్లిగడ్డలు రావడంతో ఈప్రాంతంలో ఉన్న ఉల్లి గడ్డలకు గిరాకి తగ్గి ధర కూడా పడిపోయిందని రైతులు అంటున్నారు. కొన్నిప్రాంతాల్లో అయితే ధర లేకపోవడం వల్ల ఉల్లిగడ్డలను పొలాల్లోనే వదిలి వేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం భారీగా ధర పలికిన ఉల్లిగడ్డలు ప్రజలకు కన్నీరు పెట్టించాయి. ఇప్పుడు ధర తగ్గి ఉల్లిగడ్డల రైతులు నష్టాలతో విలవిలలాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిగడ్డలను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పి ఇంత వరకు ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దింపలేదు. అందువల్ల రైతులు అతి తక్కువ ధరకు ఉల్లి గడ్డలను అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. కౌలు తీసుకున్న రైతులు అయితే అప్పులు మిగిలాయని, అప్పులు కట్టలేక ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలకంఠప్ప, అప్సర్‌బాషా, యువజన కాంగ్రెస్ నాయకులు మారుతి, తదితరులు మార్కెట్‌లో ఉల్లి రైతులను కలిసి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి అవసరం అయితే రైతులకు అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగి రైతుల వద్ద సరుకును గిట్టు బాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దొంగనోట్ల ముఠా అరెస్టు
నంద్యాలటౌన్, సెప్టెంబర్ 22: బండిఆత్మకూరు గ్రామంలో వంద రూపాయల నోట్లను జిరాక్స్ తీసి చె లామాణి చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పట్టణంలోని తాలుకా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో డిఎస్పీ గోపాలకృష్ణ మాట్లా డుతూ బండి ఆత్మకూరులోని ఒక ఇంటిలో ముద్దాయిలు జమాల్ బాషా, రషీద్, సుధాకర్, రాంప్రసాద్, వెంకటేశ్వర్లు, కరీముల్లా, మరో ముగ్గు రు బాలనేరస్థులు కలిసి వంద నోటు ను నకిలీగా జిరాక్స్ చేసి చెలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ. 11,900 నకిలీ నోట్లు, కంప్యూటర్, స్కానర్, ప్రింటర్‌ను సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ రమేశ్‌బాబు స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. సిఐ, ఎస్‌ఐ, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. అయితే నిందితుడు సుధాకర్ తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని పోలీ సుల ఎదుటనే బ్లేడుతో చేతిపై కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయ త్నించడంతో పోలీసులు అడ్డుకుని అతడిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనకు సంబంధం లేకపోయినా తనను అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.
బ్రహ్మచారిణీ నమోస్తుతే..
* మయూర వాహనంపై మల్లన్న దంపతులు
శ్రీశైలం, సెప్టెంబర్ 22 : శ్రీశైల మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం శ్రీ భ్రమరాంబాదేవి బ్రహ్మచారిణిగా దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీ చక్ర నవవరనార్చనలు, చండీహోమం, స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగం, పారాయణలు, నవ గ్రహ మం డపారాధనలు, నవగ్రహ జపానుష్టానాలు, బాల మూల మంత్రం, చండీ పారాయణం, చతుర్వేద పారాయణలు, సూర్య నమస్కారాలు, కుమారి పూజ లు, మధ్యాహ్న కాలార్చన, సహస్ర నామార్చనలు, సాయంకాల జపాలు, అనుష్టానములు సాంప్రదాయబద్దంగా అర్చక వేదపండితులు నిర్వహించారు.
బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారు..
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం శ్రీ భ్రమరాంబాదేవి ఉత్సవ మూర్తిని బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనం ఇచ్చారు. నవదుర్గ రూపాల్లో ద్వితీయ రూపమైన బ్రహ్మచారిణి అలంకరణలో అమ్మవారిని పూజించడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. బ్రహ్మచారిణి ఉపాసన వలన త్యాగ, వైరాగ్య, కలుగుతాయని దేవి భాగవతంలో చెప్పబడింది. అందుకే ఈ స్వరూపాన్ని సిద్దులు, యుతులు ఎక్కువగా ఉపాసిస్తారు. కాగా పూర్వం నారధుని ఉపదేశానుసారం పరమ శివున్ని భర్తగా పొందాలనే సంకల్పంతో బ్రహ్మచారిణిగా మారి కుడిచేతిలో రుద్రాక్ష మాల, ఎడమచేతిలో ఖమండలం కలిగి ఉంటుంది. స్కంథ మూలాలను, ఆకులను తింటూ కఠోర దీక్షతో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయడం వల్లనే బ్రహ్మచారిణిగా పిలువబడుతోంది. ఈమె దీక్షకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమై ఆమెకు వరాన్ని ప్రసాదిస్తాడు. ఈమెను పూజించిన సిద్ద వైరాగ్యం కలుగుతుంది. అమ్మవారి ఆలయ మార్గంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మందిరం నందు శ్రీ భ్రమరాంబాదేవిని బ్రహ్మచారిణిగా ప్రత్యక్షంగా అలంకరించి ఆలయ అర్చక వేదపండితులు నవరాత్రి పూజలను విశేషంగా నిర్వహించారు.
మయూర వాహన సేవలో స్వామి అమ్మవార్ల దర్శనం..
దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం శ్రీశైల మల్లన్న, భ్రమరాంబ దేవిలు మయూర వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకవేదపండితులు మహా మంగళహారతులు ఇచ్చి ఉత్సవ పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రాజగోపురం గుండా ఆలయ పురవీధుల్లోకి తోడ్కొని వచ్చి విద్యుత్ దీప కాంతుల నడుమ, డప్పు వాయిద్యాల నడుమ భేరీ నాదాలు మోగిస్తుండగా, ఆలయ పురవీధుల్లో ఎంతో వైభవంగా మయూర వాహనంపై గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఆలయ అర్చక వేదపండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇఓ నారాయణ భరత్ గుప్తా, ఆలయ అధికారులు, అర్చక వేదపండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గ్రామోత్సవంలో స్వామి అమ్మవార్లను తిలకించి ఆధ్యాత్మిక భావనతో శివనామ స్మరణ చేశారు.
బ్రహ్మచారిణిదుర్గగా కామేశ్వరి
మహానంది, సెప్టెంబర్ 22: మహానంది పుణ్యక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవార శ్రీకామేశ్వరీ అమ్మవారు బ్రహ్మచారిణి దుర్గగా దర్శనమిచ్చారు. ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, జ్వాలా చక్రవర్తిలతో పాటు ప్రత్యేక వేద పండితులు తెల్లవారు జామునే మూలవిరాట్‌లైన శ్రీ గంగా కామేశ్వరీ సమేత మహానందీశ్వరుల స్వామివార్లకు ప్రత్యేక అభిషేకార్చనలతో పాటు విశేష ద్రవ్యాభిషేకాలు, శ్రీచక్రార్చన పూజలు, సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక యాగశాలలో నేటి ఉభయదాతలైన నంద్యాలకు చెందిన యెలిశెట్టి కృష్ణమూర్తి, శ్రీదేవి దంపతులు, సుధాకర్, సాయిలీలా దంపతులు, డాక్టర్ రాజీవ్, డాక్టర్ ప్రశాంత్‌లక్ష్మీ దంపతులచే కంకణధారులను గావించి యాగశాల అర్చనలు, చండీహోమాలు నిర్వహించారు. శ్రీకామేశ్వరీ దేవి అమ్మవారిని బ్రహ్మచారిణి దుర్గగా కొలువుదీర్చి సహస్ర దీపాలంకరణ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. అలంకార మండపంలో నేటి ఉభయదాతలతో వేద పండితులు, వేద మంత్రాలతో ఈ దీపాలంకరణ నిర్వహించారు. అష్టావిధ మహావిధ మంగళహారతులు ఇచ్చి ఊంజల్ సేవను నిర్వహించారు.
సింహవాహనంపై గ్రామోత్సవం..
అమ్మవారిని బ్రహ్మచారిణిదుర్గగా అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఉభయదాతలతో, అధికారులతో ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి పల్లకీ ఆలయ పురవీధుల్లో విహరిస్తూ నంది సర్కిల్‌కు చేరుకుంది. అక్కడ వేలాది మంది భక్తుల మధ్య చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక యాగశాలలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించి ఉభయదాతలకు వేద ఆశీర్వచనం అందించారు. ఈకార్యక్రమాలలో ఎఇఓ ధనుంజయ, పర్యవేక్షకులు పరుశురామ శాస్ర్తి, ఈశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 22:నగరంలోని వివిధ ఆలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని ఎర్రబురుజులోనిఅమ్మవారి భక్త బృందం ఎ.సాయినాగన్న, అనంతయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీదుర్గామాత మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే మించిన్‌బజార్‌లోని పెద్దఅమ్మవారిశాలలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా, పూలబజార్‌లోని చిన్నఅమ్మవారిశాలలో అమ్మవారు శ్రీవైష్ణవిదేవిగా, వన్‌టౌన్‌లోని శ్రీకాళికాంబిక దేవాలయంలోని కాళికాంబిక అమ్మవారు, గీతామందిరంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు శ్రీబాలాత్రిపుర సుందరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శంచుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
హిమాలయ గురూజీ సేవలు పొందడం విద్యార్థుల అదృష్టం
* బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి..
* రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్
కర్నూలు, సెప్టెంబర్ 22:శాంతి ఆశ్రమం ట్రస్టు వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ హిమాలయ గురుదేవుల సేవలు పొందడం విద్యార్థులు చేసుకున్న పూర్వ జన్మ అదృష్టమని రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ కొనియాడారు. శాంతి ఆశ్రమ ట్రస్టు ఆధ్వర్యంలో కోల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని శుక్రవారం టిజి వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో చదువుకోవాలనే తపనను పెంచే ఉద్దేశ్యంతో కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలనే ఆలోచన చాలా గొప్పదన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి హిమాలయ గురుదేవులు ఈ అన్నదానం మహాయజ్ఞాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ మహత్తర అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కడో హిమాలయాల్లో సాధుజీవనం గడుపున్న హిమాలయ గురుదేవులు ఎటువంటి స్వార్థం లేకుండా జిల్లాలోని కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ముందుకు రావడం జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు. స్వామి చేపడుతున్న కార్యక్రమాలకు తన సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. శాంతి ఆశ్రమ ట్రస్టు చైర్మన్ సోమిశెట్టి వెంకటరామయ్య మాట్లాడుతూ విద్యార్థులను తమ కన్నబిడ్డల్లా భావించే తత్వం స్వామిలో ఉందని, సంకల్ప బలంతోనే తమ ట్రస్టు ద్వారా వేలాది మంది విద్యార్థులకు నిరంతరాయంగా మధ్యాహ్న భోజనం అందివ్వగలుగుతున్నామన్నారు. జిల్లాలో తమ ట్రస్టు కార్యక్రమాలు ఇప్పడిప్పుడే మొదలవుతున్నాయనే, తాము చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరి చేయూత అవసరమన్నారు. అనంతరం హిమాలయ గురుదేవులు ఎంపి టిజి వెంకటేష్, ఎస్వీ మోహన్‌రెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లును శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డా. అబ్దుల్‌హక్ ఉర్దూ యూనివర్శిటీ విసి ముజఫర్‌అలీ, విహెచ్‌పి జిల్లా అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, ఏఎస్‌ఓ రాజారఘువీర్, పోస్టల్ సూపరింటెండెంట్ కెవి సుబ్బారావు, ఏపిఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్‌బాషా, ప్రభు త్వ టౌన్ మోడల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ చెన్నయ్య, ట్రస్టు సభ్యులు ప్రతాప్, హరీష్, సుబ్బారావు, వినోద్, హరినాథరెడ్డి, సినీ నిర్మాత గూడూరు గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ కార్యక్రమాల్లో
లక్ష్యసాధనకు కార్యాచరణ ప్రణాళిక
* రెండు రోజుల్లో నివేదికలు ఇవ్వండి..
* అధికారులకు కలెక్టర్ సత్యనారాయణ ఆదేశం
కర్నూలు, సెప్టెంబర్ 22:అన్నిశాఖల్లో నిర్ధేశించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో లక్ష్యసాధన కు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రెండు రోజుల్లో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అభివృద్ధి లక్ష్యసాధనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా దాదాపు అన్ని విభాగాల్లో చివరి స్థానంలో వుందని, ఇకనైనా కార్యక్రమాల అమలులో లోటుపాట్లను గుర్తిం చి మరింత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి ఈ మేరకు లక్ష్యసాధనలో నిమగ్నం కావాలన్నారు. అధికారులు సక్రమంగా పని చేయకపోయి నా కేటాయించిన పారామీటర్‌ల లక్ష్యసాధనలో కారణాలు చెప్పినా చర్యలు తప్పవని హెచ్చరించారు. బరువు తక్కువ పిల్లలు, పోషకాహారలోపం, రక్తహీనత కలిగిన స్ర్తిల శాతం అధికంగా వుందని, దీనిని ఏ రకంగా నిరోధించి మెరుగుపరచుకోవాలో నివేదిక తయారు చేసుకుని రావాలని స్ర్తిశిశు సంక్షేమశాఖ పిడి జుబేదాబేగం, డిఎంహెచ్‌ఓ డా. నరసింహులును ఆదేశించారు. గ్రామాల్లోని ప్రజల్లో ఆహారపు అలవాట్లలో మార్పు తేవడం, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చంటి పిల్లలు, గర్భిణులకు పోషకాహారం అందించడం, సంబంధిత అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రతి బుధవారం సమీక్ష నిర్వహించుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆర్డీఓలు డివిజన్ స్థాయి లో కలెక్టర్‌గా వ్యవహరించి ప్రతి అంశంలో భాగస్వాములై సమీక్షించాలన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాలకు డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డిఇఓ తాహెరాసుల్తానాను ఆదేశించారు. ప్రతి శాఖ బయోమెట్రిక్, ఇ-ఆఫీ సు విధానాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. బడిప్లిలల ట్రాప్ అవు ట్స్, స్వచ్ఛ విద్యాలయ, బడిఈడు పిల్లల నమోదుపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ఎన్‌టిఆర్ గృహ నిర్మాణం కింద మంజూరు చేసిన గృహాలను వేగవంతం చేసి సంక్రాంతి నాటికి మొదటి విడతలో పూర్తిస్థాయి లో నిర్మాణాలు పూర్తి కావాలని హౌ సింగ్ పిడిని ఆదేశించారు. సమావేశం లో జెసిలు ప్రసన్న వెంకటేష్, రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, ఆర్డీఓలు, జడ్పీ సిఇఓ ఈశ్వర్, సామాజిక అడవుల డిఎఫ్‌ఓ యశోధబాయి, విద్యుత్‌శాఖ ఎస్‌ఇ భార్గవరాముడు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.
హంద్రీ జలాల సాధనే లక్ష్యం
* బిజెపి జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు
చిప్పగిరి, సెప్టెంబర్ 22: ఏబిసి కాల్వ ఆయకట్టు రైతుల మనుగడ కోసం హంద్రీ జలాల సాధన లక్ష్యమ ని బిజెపి జిల్లా అధ్యక్షుడు హరీష్ బా బు అన్నారు. జిల్లాకు రావాల్సిన హం ద్రీనీవా నీటి వాటాకై శుక్రవారం బిజెపి కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్త లు పెద్దఎత్తున అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని హంద్రీ కాలువ నుంచి పాదయాత్ర నిర్వహిం చారు. ఈ మేరకు చిప్పగిరికి చేరుకున్న పాదయాత్ర ముందుగా హంద్రీనీవా జలాలు వాటా సాధనకు స్థానిక రెవెన్యూ కార్యాల యానికి చేరుకుని వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా కార్యా లయంలో అధికారులు లేకపోవడంతో ఎంపిడిఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. అనంతరం చిప్పగిరిలో ని గోవింద స్వామి మఠం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌బాబు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు, ప్రజల కోసం చేపట్టిన పనులు ఏ ఒక్క టీ సరిగా జరగలేదన్నారు. జిల్లాలో తాగు, సాగునీటి సమస్యను పరిష్క రించడంలో ప్రభుత్వం విఫలమైంద న్నారు. జిల్లా నాయకుల్లో అధికార దర్పం తప్ప వారిలో జిల్లా అభివృద్ధి సాధన లో వెనకున్నారని, ప్రభుత్వం తీరును ఎండుగట్టారు. ఎబిసికి కేటాయించిన 2.5 టిఎంసిల తాగు సాగునీరును హంద్రీ కాల్వ నుండి అధికారికంగా విడుదల చేయాలని, హంద్రీ కాల్వ నుండి ఎబిసికి నీరు మళ్లించేందుకు చానల్ నిర్మాణం చేపట్టాలని డిమాం డ్ చేశారు. హంద్రీ నీరు ఎబిసికి ఇస్తే రైతులు కరవు కాటకాల నుండి బయటపడతారన్నా రు. జిల్లాకు రావాల్సిన నీటివాటాను రాబట్టకపోతే ఈ పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేపడు తామని, రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చ రించారు. బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నవీన్‌కిషోర్ మాట్లాడుతూ ఎబిసి కాల్వ నీటి వాట సాధనకు పాదయాత్ర చేపట్టారని ప్రభుత్వం సత్వరమే స్పందించకపోతే ఆందోళన లు తప్పవన్నారు. బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యు డు చిదానంద మాట్లాడుతూ పేదలకోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివధ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. రైతుల సంక్షేమమే బిజెపి ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు అన్నారు. కార్యక్రమంలో మహేశ్వరు లు, జగదీష్ వెంకటరాములు, వెంక టేశ్వరులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీశైలం, సెప్టెంబర్ 22: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మల్లన్న సన్నిధిలో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ కళారూపాలు నాదస్వరం, కోలాటం, చెక్క్భజన, నందికోలు సేవ, పగటి వేషాలు, బంజారా నృత్యాలు, డోలు విన్యాసాలు, గొరవయ్య నృత్యాలు భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బ్రామరీ కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి ఏర్పాటు చేసిన శివలంక ప్రకాశరావు కాకినాడ వారిచే దేవి భాగవత ప్రవచనం భక్తులను ఎంతో ఆకర్షించింది. అలాగే బెంగళూరు వారిచే భరతనాట్యం, రాధా సారంగపాణి అమీర్‌పేట, హైదరాబాదు వారిచే గాత్ర కచేరి భక్తులను ఎంతో అలరించింది. వీటిని భక్తులు అధిక సంఖ్యలో తిలకించి ఆధ్యాత్మిక భావనకు లోనయ్యారు.
మల్లన్న సేవలో డిఐజి శ్రీనివాసులు ...
శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను రాష్ట్ర డిఐజి శ్రీనివాసులు స్వామి అమ్మవార్ల గ్రామోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వీరి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవర్ల పూజలో, గ్రామోత్సవంలో పాల్గొన్నారు. శనివారం ఉదయం హారతి దర్శనానికి వెళ్లి స్వామి వార్లను దర్శించుకోనున్నారు. వీరితోపాటు స్థానిక సిఐ శ్రీనివాసమూర్తి ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
బ్రహ్మచారిణి అలంకారంలో చౌడేశ్వరీమాత దర్శనం
బనగానపల్లె, సెప్టెంబర్ 22: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం మండల పరిధిలోని నందవరం శ్రీచౌడేశ్వరీమాత ఆలయంలో అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మచారిణి దుర్గ అమ్మవారు పరమేశ్వరుడిని భర్తగా పొందేందుకు నారదుని ఉపదేశం ప్రకారం తపస్సు చేసిందని, తన కోర్కె తీరేంత వరకు ఎలాంటి ఆభరణాలు ధరించకుండా కఠిన బ్రహ్మచర్య దీక్ష చేసినందున అమ్మవారు కన్యాకుమారి, బ్రహ్మచారిణిగా పిలువబడిందని ప్రతీతి. కాగా శుక్రవారం నాటి పూజలకు డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి దంపతులు, వారి కుటుంబ సభ్యులు కెఇ హరిబాబు, కెఇ శ్యామ్‌కుమార్, కెఇ దివాకర్ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఇక ఆలయ ఇఓ విఎల్‌ఎన్ రామానుజన్, ఆల య కమిటీ చైర్మన్ పివి కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం నుంచి పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన, సహస్రనామార్చనలు జరిపించారు. అలాగే పట్టణంలోని శ్రీఅయ్యప్పస్వామి ఆలయంలో శ్రీ గాయత్రీమాతకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కొండపేట వాసవీ అమ్మవారిశాలలో వాసవాంబ శ్రీబాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి సాయంకాలం వరకూ ఆర్యవైశ్యులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆర్యవైశ్య పట్టణ సం ఘం అధ్యక్షుడు బింగిమళ్ల సత్యంశెట్టి ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ, వివిధ సాంస్కృతిక కార్యక్రమా లు ఏర్పాటుచేశారు. మండలంలోని పలుకూరు శ్రీ రామేశ్వరస్వామి ఆలయంలో శ్రీపార్వతీదేవికి రాజశేఖర్ దంపతులు, గ్రామస్థులతో అర్చకులు టి.్భస్కరయ్య కలశాలతో అభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహిచారు. ఈ పూజల్లో భవానీ భక్తులు కూడా పాల్గొన్నారు. ఇక శనివారం శ్రీచౌడేశ్వరీదేవి చంద్రఘంట అలంకారంలో, పట్టణంలోని వాసవీమాత శ్రీగాయత్రీమాత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
అండర్‌గ్రౌండ్ వంతెనకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
నంద్యాల రూరల్, సెప్టెంబర్ 22: నంద్యాల మండలం ఊడుమాల్పురం గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న రైల్వే ట్రాక్‌ను తొలగించి అండర్ గ్రౌండ్ వంతెనను నిర్మించేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రైల్వే శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీరు వీరమణి, తహశీల్దార్ జయరామిరెడ్డిలు తెలిపారు. శుక్రవారం ఊడుమాల్పురం గ్రామ పంచాయతీ రైతులతో రైల్వే, రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. రైతుల అభిప్రాయం సేకరించారు. కొంత మంది రైతులు ఇలాగే ఉండాలని, మరికొంత మంది రైతులు అండర్ గ్రౌండ్ వంతెన కావాలని కోరారు. రైతుల నివేదికను తీసుకొని ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. రైతుల అభిప్రాయం మేరకే ఇక్కడ అండర్ గ్రౌండు వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. చాలా కాలం నుండి ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాలని రైల్వే అధికారులు చెబుతున్నా రైతులు స్పందన లేకపోవడంతో వెనక్కు పోతోందన్నారు. అండర్‌గ్రౌండ్ వంతెన నిర్మాణం జరగాలని లేనిపక్షంలో ట్రాక్ గేటును మూసివేయాలనే నిబంధన ఉందని రైల్వే అధికారులు అంటున్నారు. రైతుల అభిప్రాయం సేకరించినట్లు వారు తెలిపారు. వీరి వెంట ఆర్‌ఐ శివప్రసాద్ రెడ్డి, విఆర్‌ఓ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ జయమ్మ, ఎంపిటిసి శ్రీనివాసరెడ్డి, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

గోడకూలి వ్యక్తి మృతి
ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 22: పట్టణంలోని పుల్లారెడ్డివీధిలో ప్రమాదవశాత్తు గోడ కూలి గడేకారి మోష (45)మృతి చెందినట్లు పట్టణ ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఏసునాధపురంకు చెందిన మోష, తన కుమారుడు ఉదయ్‌కిరణ్‌తో కలిసి పుల్లారెడ్డి వీధిలోని ఓ ఇంటిలో గడేకారి పనికి వెళ్లారు. మోష పాతగోడ వద్ద ఇసుక తీస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి ఇటుకలు మీద పడడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. హుటాహుటీన ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెం దినట్లు వైద్యులు తెలిపారన్నారు. కుమారుడు ఉదయ్‌కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
అక్రమ ఎర్రమట్టి తవ్వకాలపై దాడులు
* 4 ట్రాక్టర్లు సీజ్, కాంట్రాక్టర్లపై కేసు నమోదు
మంత్రాలయం, సెప్టెంబర్ 22: అక్రమగా ఎర్రమటి తవ్వకాలపై మైన్స్‌అండ్ జియాలజి డిపార్ట్‌మెంట్ డిడిఓ బాలసుబ్రమణ్యం, మైనింగ్ రాయల్టి ఇన్‌స్పెక్టర్ సురేష్‌బాబు వారి సిబ్బందితో కలసి శుక్రవారం దాడులు చేసి 4 ట్రాక్టర్లను, జెసిబిని సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంత్రాలయం సమీపంలోని సూగూరు రోడ్డులో ప్రభుత్వ అనుమతులు లేకుండా కాంట్రాక్టర్లు అక్రమగా ఎర్రమట్టిని తవ్వి రాఘవేంద్ర నగర్, జడ్పీపాఠశాల మైదానంలో వేసేందుకుగాను ఎర్రమటిని తరలిస్తున్నారు. అయితే సమాచారం అందుకున్న మైనింగ్ అధికారులు తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని జెసిబిని, 4ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములులో ఎలా ఎర్రమట్టిని తవ్వుతున్నారని మైనింగ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుకున్న ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు.
ముద్దాయికి జైలు శిక్ష
ఆదోనిటౌన్, సెప్టెంబర్ 22: మండలంలోని సంతేకూడ్లూరు గ్రామంలో ఒక మహిళలను దుర్బాషలాడి ఆమె దుకాణాన్ని ధ్వంసం చేసిన కేసులో ముద్దాయి కురువ విరుపాక్షికి నాలుగున్నర నెలల జైలు శిక్ష లేదా రూ.9వేల జరిమానా విధిస్తూ ఆదోని ఎజెఎఫ్‌సిఎం కోర్టు జడ్జి సాయిరామ్ తీర్పు చెప్పిన్నట్లు కోర్టు హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మన్న పేర్కొన్నారు. శుక్రవారం జడ్జి ఈ తీర్పు చెప్పినట్లు ఆయన తెలిపారు. 2012లో సంతేకూడ్లూరు గ్రామంలో ఈ సంఘటన జరిగిందని అప్పట్లో ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేశారని అన్నారు. కేసు విచారణ చేసిన జడ్జి ముద్దాయిపై నేరం రుజువు కావడంతో జైలు, జరిమానా తీర్పు చెప్పినట్లు ఆయన వివరించారు.