కర్నూల్

కర్నూలుపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 23 : జిల్లాలో తెలుగుదేశంపార్టీ పరిస్థితిని చక్కదిద్ది 2019 ఎన్నికలకు సిద్ధపడేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి 3 వారాలకు ఒకసారి జిల్లాలో పర్యటించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు తగిన ప్రణాళిక సిద్ధమవుతోందని పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది. నంద్యాలలో భారీ మెజారిటీతో ప్రజలు విజయాన్ని అందించినా టిడిపి అధినేత చంద్రబాబుకు సంతృప్తి కలుగలేదని తెలుస్తోంది. పార్టీ నేతలు మొత్తం దృష్టి సారించి ఒకే మాటగా పని చేయడం వల్ల సాధ్యమైందని లేదంటే ఫలితం పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఉండేదని ఆయన పార్టీ నేతలతో పేర్కొన్నట్లు వెల్లడవుతోంది. నంద్యాల ఉపఎన్నికలో విజయం సాధిస్తామని నమ్మకం ఉన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల భారీ ఆధిక్యత సాధ్యమైందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఎన్నిక అంశం ఎలా ఉన్నా జిల్లాలో పార్టీ పరిస్థితిలో 2014 నాటి నుంచి కాస్తంత కూడా తేడా కనిపించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడవుతోంది. ఇందుకు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలే కారణమని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. సిఎం చంద్రబాబు ఇటీవల ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయం తెలుసుకోగా రాష్ట్రంలో సగటున 58శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని ఆయనే స్వయంగా చెప్పారు. ఇక జిల్లాల వారీగా చూస్తే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే 50శాతం కంటే తక్కువగా సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అభివృద్ధి పరంగా కూడా జిల్లా 10వ స్థానంలో నిలవడం కూడా చంద్రబాబును ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలును రాజధాని చేయాలని డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ప్రజలను శాంతింపజేసేందుకు ఆయన పెద్దఎత్తున హామీలు ఇచ్చారు. వీటిలో రెండు, మూడు మినహా ఇతర హామీలు ఏవీ ముందుకు సాగడం లేదు. అంతేగాక సాగునీటి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నా జిల్లా ప్రజలకు వాటి ద్వారా నేరుగా ప్రయోజనం లేకపోవడం వల్ల ప్రభుత్వంపై జిల్లా ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావడం లేదన్నది స్పష్టమవుతోందని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్న నంద్యాల ప్రాంతానికి మరింత ప్రయోజనం చేకూర్చడం, కోవెలకుంట్ల, అవుకు ప్రాంతాలకు ఒకింత ప్రయోజనం చేకూరుస్తుందే కానీ సాగునీటి ప్రాజెక్టులు ప్రజలను మెప్పించలేకపోతున్నాయని వారంటున్నారు. ప్రధానంగా నీటి సమస్య తీవ్రంగా ఉన్న పడమర ప్రాంతంపై ఇంతవరకూ దృష్టి సారించకపోవడంతో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. తుంగభద్ర జలాలను సద్వినియోగం చేసుకునేలా దిగువ కాలువ సమస్యలు పరిష్కరించడం, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణ పనులు చేపట్టడం, గుండ్రేవుల జలాశయం, వేదావతి ఎత్తిపోతల పథకం పనులకు వెంటనే ఆమోదం తెలిపి పనులు ప్రారంభించడం వంటివి చేస్తే ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తమవుతుందని వారు సూచిస్తున్నారు. వ్యక్తిగత సంక్షేమ పథకాలు, పరిశ్రమలు, విమానాశ్రయాలు మెప్పించలేవన్న విషయం ప్రజలు సిఎంకు చెప్పకనే చెప్పారని వారు అభిప్రాయపడుతున్నారు. ఇవి అభివృద్ధికి సూచికలే కానీ ప్రజలను సంతృప్తి పరిచేవి కావని వారు వెల్లడిస్తున్నారు. కాగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా జిల్లా ప్రజల్లో మార్పు రాకపోవడానికి జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలే కారణమని పార్టీ రాష్ట్ర కమిటీ స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సిఎం చంద్రబాబు తరచూ జిల్లాలో పర్యటించి అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించడం, సమస్యలు పెద్దగా లేని ఆర్డీఎస్ కుడి కాలువ, వేదావతి ఎత్తిపోతల పథకం నిర్మాణం, దిగువ కాలువ సమస్యలపై దృష్టి పెడితే జిల్లాలో సత్ఫలితాలు సాధ్యమన్న పార్టీ సీనియర్ నేతల సలహా మేరకు చంద్రబాబు పర్యటన కార్యక్రమం రూపొందుతోందని పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. స్వయంగా రంగంలోకి దిగనున్న చంద్రబాబు పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో మార్పు తీసుకురాగలరని పార్టీ నేతల్లో ధీమా వ్యక్తమవుతోంది.
కుక్కలను పట్టకున్నా డబ్బులే!
* ఫలితమివ్వని నియంత్రణ చర్యలు..* గడువు ముగిసినా 30శాతం ఆపరేషనే్ల..
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 23:‘కుక్కను కొడితే డబ్బులు రాలుతాయి’.. అన్నది సామెత. అయితే నగర పాలక సంస్థలో మాత్రం బ్లూ క్రాస్ సొసైటీ సభ్యులు కుక్కలను పట్టుకోకపోయినా డబ్బులు దండుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, ముఖ్య పట్టణాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకూ కుక్కకాటుకు గురైన వారున్నారు. దీంతో కుక్కలను నియత్రించాలని పెద్దఎత్తున ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్పొరేషన్, మున్సిపాలిటీలతో పాటు నగర పంచాయతీల్లో కుక్కలను నియంత్రించేందుకు నిర్ణయం తీసుకుంది. కుక్కలను చంపటం చట్టరీత్యా నేరం.. అలా కాకుండా వాటి సంతానాన్ని అరికట్టి కరిచినా ఎటువంటి ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేసి నియంత్రించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పంప్ హౌస్ దగ్గర కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, నగరంలోని పలు కాలనీల్లో ఉన్న కుక్కలను పట్టుకుని వచ్చి ఒక చోట వాటికి శస్తచ్రికిత్స(ఆపరేషన్) చేసి 3 రోజుల పాటు వారి ఆధీనంలో ఉంచుకుని ఆ తర్వాత ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో అక్కడే వదిలే విధంగా నిర్ణయం తీసుకుంది. కుక్కలను పట్టుకుని వచ్చి ఆపరేషన్ చేసి యదావిధిగా వదలటానికి ఒక్కో కుక్కకు రూ. 750 కేటాయించింది. ఏడాదిలోగా కుక్కలను నియంత్రించాలని గత ఏడాది జూన్‌లో అనంతపురానికి చెందిన ఇంటర్నేషనల్ యూనియన్ అండ్ బర్డ్స్ వెల్ఫేర్ సొసైటీకి బాధ్యతులు అప్పగించారు. అయితే ఆ సొసైటీ 9 నెలలకే చేతులెత్తేసింది. దీంతో నగరంలో కుక్కల నియంత్రణ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన బ్లూ క్రాస్ సొసైటీకి కుక్కల నియంత్రణ బాధ్యతను అప్పగించారు. ఈ సొసైటీకి చెందిన సభ్యులు మొదట ఉత్సాహంగా కుక్కలను పట్టుకుని వాటికి ఆపరేషన్లు చేశారు. ఆ తర్వాత కుక్కలను పట్టుకోవటంలో నిర్లక్ష్యం వహించారు. వాస్తవానికి నగరంలోని 51 వార్డుల్లో సుమారు 18వేలకై పైగా కుక్కలు ఉన్నాయని అధికారులే బహిరంగా చెబుతున్నా, రికార్డుల్లో మాత్రం కేవలం 5వేలు మాత్రమే ఉన్నాయని నమోదు చేయటం శోచనీయం. ప్రభుత్వం నిర్ణయించిన గడువు దాటినా ఇప్పటి వరకూ కేవలం 30శాతం మాత్రమే నియంత్రణ శస్తచ్రికిత్సలు చేశారు.
రోజుకు 50 కుక్కలకు ఆపరేషన్లు
- నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి
కుక్క కాటు వల్ల ప్రజలకు రేబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని, కావున బాధితులకు సకాలంలో చికిత్స చేయించడానికి ఏర్పాట్లు చేశాం. అలాగే రోజుకు 50దాకా కుక్కలను పట్టుకుని ఆపరేషన్ చేసి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితిలో కుక్కలను నియంత్రించి ప్రజల ఇబ్బందులను తొలగిస్తాం.
చంద్రఘంట అలంకారంలో శక్తిస్వరూపిణి
* రావణ వాహనంపై గరళకంఠుడు
శ్రీశైలం, సెప్టెంబర్ 23: శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం అమ్మవారికి శ్రీచక్ర అర్చన, నవవర్ణార్చనలు, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగ జపంలు, పారాయణాలు సాంప్రదాయబద్ధంగా అర్చక వేద పండితులు నిర్వహించారు. భ్రమరాంబదేవి శక్తిస్వరూపిణిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంకాల జపంలు, అనుష్టానములు, కుంకుమార్చన, నందిహోమం, రుద్రహోమం, సుహాసిని పూజ, కాలరాత్రి పూజలను అర్చక వేద పండితులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీభ్రమరాంబ దేవి చంద్రఘంట అలంకారంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు రావణ వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. నవదుర్గ రూపాల్లో మూడవ రోజు ఆదిపరాశక్తి శక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ దేవిని స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రావణ వాహనంపై ప్రత్యేకంగా అలంకరించి అలంకరణ పూజలను అర్చక వేద పండితులు శాస్త్రానుసారంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు, చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారికి వేద మంత్రోచ్ఛరణలతో మంగళవాయిద్యాల నడుమ మహామంగళహారతులు ఇచ్చి ఉత్సవ పూజలను నిర్వహించారు. అమ్మవారి తలపై అర్థచంద్రాకార చంద్రుడు ఘంటాకారంలో అలరారుతూ ఉండడం వల్ల అమ్మవారిని చంద్రఘంట దేవిగా పిలువబడుతోంది. రౌద్రరూపంలో పది చేతుల్లో అస్త్రాలను కలిగి ఉంటుంది. కుడివైపున పద్మం, బాణం, ధనుస్సు, జపమాల కలిగి ఉంటుంది. ఎడమవైపు త్రిశూలం, గద, ఖడ్గం, పంచముద్ర, కమండలాన్ని కలిగి ఉండి చంద్ర ధ్వనులతో రాక్షసులను సంహరించి ద్వైత్యులను అణచివేసిందని వేదాలు చెబుతున్నాయి. ఈదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే భయాలు తొలగి సుఖసంతోషాలు వస్తాయి. ఇలా ఈదేవిని పూజించడం వల్ల కష్టాలు తొలగుతాయని అర్చక వేద పండితులు చెబుతున్నారు. మరొకమారు స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా మహామంగళహారతులు ఇచ్చి వేద పండితులు, అర్చకులు వింజామరలు విసిరారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛరణలతో మంగళవాయిద్యాల నడుమ ఛత్ర చామరుల నడుమ విద్యుత్ దీపపుకాంతుల నడుమ అలంకరించిన ఉత్సవమూర్తులను గర్భాలయం నుంచి రాజగోపురం గుండా గ్రామోత్సవానికి తోడ్కొని వెళ్లారు. ఈగ్రామోత్సవంలో భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిలకించి స్వామి అమ్మవార్లకు అడుగడుగునా నారీకేళాల సమర్పణ, కర్ఫూర హారతులతో అడుగడుగునా నీరజనాలు పట్టి తమ భక్తిని చాటుకున్నారు. గ్రామోత్సవంలో కోలాటాలు, లంబాడీ గొరవయ్యల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, బ్యాండ్ మేళాల మధ్య కళాకారుల విన్యాసాల నడుమ గ్రామోత్సవం ఎంతో వైభవంగా శ్రీశైల మాడవీధుల్లో ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో ఇఓ నారాయణ భరత్‌గుప్త, ఆలయ అధికారులు, అర్చక వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.

2029 నాటికి దేశంలోనే అగ్రగామిగా ఏపి..
* 2న లక్ష గృహాలు ప్రారంభం:మంత్రి కాలవ
డోన్, సెప్టెంబర్ 23:రాష్ట్ర విభజనతో తల్లడిల్లిన నవ్యాంధ్రప్రదేశ్‌ను 2029 నాటికి దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ‘ఇంటింటికీ టిడిపి’ కార్యక్రమంలో భాగంగా శనివారం మంత్రి కాలవ మండల పరిధిలోని చిన్నమల్కాపురంలో పర్యటించారు. తొలుత కాలవ టిడిపి జెండాను ఆవిష్కరించి, అనంతరం ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి, ఆయా పథకాలు మీకు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. అనంతరం నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ ఆధ్వర్యంలో మంత్రి కాల్వ సమక్షంలో వైకాపాకు చెందిన పలువురు కార్యకర్తలు టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అందిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారం దిశగా కేంద్రానికి నివేదిక అందిస్తామన్నారు. పేదలందరికీ పక్కాగృహాలు, అర్హులందరికీ పింఛన్లు అందిస్తామన్నారు. ముఖ్యంగా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున లక్ష మంది నిరుపేదలకు గృహాలు అప్పజెబుతామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబును చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అలాగే అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాంతానికి ముఖ ద్వారమైన కర్నూలు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. హంద్రీనీవా ద్వారా జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదని, ప్రజల ఆశీర్వాదంతో 2019 ఎన్నికల్లోనూ గెలిచి మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కెఇ ప్రతాప్, ఎంపిపి టిఇ లక్ష్మిదేవి, జడ్పీటిసి సభ్యురాలు పద్మావతి, మున్సిపల్ వైస్ చైర్మన్ టిఇ కేశన్నగౌడ్, మాజీ జడ్పీటిసి సభ్యులు వలసల రామకృష్ణ, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు తిమ్మయ్య యాదవ్, సర్పంచ్ రవికుమార్, టిడిపి మండల అధ్యక్షుడు కొత్తకోట శ్రీనివాసులు, నాయకులు పాల్గొన్నారు.
జిల్లాను ప్రగతిలో ముందుంచాలి
* ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలి * ఇన్‌చార్జి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
కర్నూలు, సెప్టెంబర్ 23:జిల్లాను ప్రగతిలో ముందంజలో వుంచాలని ఇన్‌చార్జి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీకోసం, ఏఎంఎస్, తదితర మార్గాల ద్వారా అందే ప్రజా ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, తదితర శాఖల్లో పెండింగ్‌లో వున్న అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో టాప్ 10 జాబితాలో వున్న శాఖలపై ప్రతి రోజూ సమీక్షిస్తామన్నారు. అధికారులందరూ విజిట్ మేనేజ్‌మెంట్ సిస్టంను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్ర పర్యటనకు వెళ్లిన అధికారులు ఆయా ప్రాంత వివరాలు, ఫొటోలను యాప్‌లో పొందుపరచాలన్నారు. ఎన్టీఆర్ పింఛన్లు, ఉపాధి హామీ పథకం, పౌర సరఫరాలు, తదితర శాఖలు వెనుకబడి వుండటానికి కారణాలను కలెక్టర్ సమీక్షించారు. లబ్ధిదారులందరికీ ప్రతి నెల 10వ తేదీ లోపు రేషన్ సరుకుల పంపిణీ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ డిఎస్‌ఓ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. విఆర్‌ఓలు, ఐకెపి సిబ్బంది సంయుక్తంగా ప్రతి నెల 3వ తేదీ లోపు సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని డిఆర్‌డిఎ పిడి రామక్రిష్ణను ఆదేశించారు. ఉపాధి కూలీలకు వేతనాలు మంజూరు చేసి అడిగిన వారందరికీ పని దినాలు కల్పించాలని డ్వామా పిడి పుల్లారెడ్డిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు వైద్యులు ఈ-ఔషధిలో మందు ల జాబితా వివరాలను నమోదు చేయాలని డిఎంహెచ్‌ఓ డా. నరసింహులును ఆదేశించారు. సమావేశంలో జెసి-2 రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, జడ్పీ సిఇఓ ఈశ్వర్ పాల్గొన్నారు.
అభివృద్ధి పథంలో భారత్..
* హైకోర్టు జడ్జి ఎస్వీ.్భట్, ఎంపిలు రేణుక, టిజి
కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 23: వందేళ్ల క్రితం దేశ ప్రజలు నిరక్షరాస్యులుగా ఉండేవారని, కానీ నేడు ప్రతిఒక్కరూ చదువుకోవడంతో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఏపి, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎస్వీ.్భట్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని శనివా రం ముఖ్యఅతిథులు హైకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమచక్రవర్తి, ఎంపిలు బుట్టా రేణుక, టిజి.వెంకటేష్ ప్రారంభించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి భట్ మాట్లాడుతూ ఎంపి రేణుక ఆర్థిక సాయంతో ఏడాది వ్యవధిలోనే బార్‌కు నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎంపి రేణుక పలు సలహాలు ఇచ్చారని వాటిని రాజ్యాంగబద్దంగా అమలు చేస్తామన్నారు. వందేళ్ల క్రితం భారత్‌లో బ్రిటీషు కోర్టులు చిన్నవిగా ఉన్నాయని, నేడు కోర్టులు చాలా అభివృద్ధి చెందాయన్నారు. నేడు సమాజంలో న్యాయవ్యవస్థ, న్యాయవాదులపై చాలా గౌరవరం ఉందన్నారు. పార్లమెంటులో న్యాయ చట్టాలు తయారు చేస్తే వాటిని రాజ్యాంగబద్ధం గా అమలు చేయాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందన్నారు. జ్యుడిషియల్ ఆఫీసర్స్, న్యాయవాదులు సమాజాన్ని గౌరవించి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కర్నూలు న్యాయవాదులు చాలా మంచివారన్నారు. ఎంపి టిజి మాట్లాడుతూ బార్‌లో అదనపు భవనాలు నిర్మించేందుకు తన వంతు సహాయంగా రూ. 50 వేలు ప్రకటించానన్నారు. ముఖ్యంగా కక్షిదారులు కాసేపు విశ్రాంతి తీసుకునేలా గదులు నిర్మించాలని కోరారు. న్యాయవాదులకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఎంపి రేణుక మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పా టు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి భట్‌కు విజ్ఞప్తి చేశారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్‌బాషా మాట్లాడుతూ బార్ నూతన భవన నిర్మాణానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన ఎంపిలు రేణుణ, టిజిలకు ధన్యవాదులు తెలిపారు. అనంతరం జూనియర్ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తి ఎస్వీ.్భట్ లా పుస్తకాలు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సివి.శ్రీనివాసులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
మహానందిలో చంద్రఘంటదుర్గగా కామేశ్వరీదేవి
* గజవాహనంపై అమ్మవారి గ్రామోత్సవం
మహానంది, సెప్టెంబర్ 23: మహానందిలో మూడవ రోజున శ్రీకామేశ్వరీ అమ్మవారు చంద్రఘంట దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం మూలవిరాట్‌లైన శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వరుల స్వామివార్లకు విశేష ద్రవ్య అర్చనలు, పూలంగి సేవలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక యాగశాలలో నేటి ఉభయదాతలైన హైదరాబాద్‌కు చెందిన వారణాసి రామ్మోహన్‌రావు, విజయలక్ష్మీ దంపతులు, శ్రీనివాస సుధాకర్, మీనాక్షి సుబ్బలక్ష్మి రాధ దంపతులచే, మారేళ్ల బ్రహ్మానంద్, రుత్విక్ దంపతులచే, భవనాశి వెంకటరమణయ్య, మహానందికి చెందిన భవనాశి వెంకటరమణయ్య, మంజులవాణి దంపతులచే, నందికొట్కూరుకు చెందిన అంబాదాసు గారి ప్రభాకర్‌రావు, లలితమ్మ దంపతులచే, నంద్యాలకు చెందిన లక్కబోయిన ప్రసాద్, ఆదిలక్ష్మమ్మ దంపతులచే కలశపూజలు, చండీ హోమాలు వేద పండితులు వేద మంత్రాలతో నిర్వహించారు.
దసరా నవరాత్రుల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీకామేశ్వరీ అమ్మవారిని చంద్రఘంట దుర్గగా అలంకరించి సహస్ర దీపాలంకరణ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. నేటి ఉభయ దాతలచే వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, జ్వాలా చక్రవర్తిలతో పాటు ప్రత్యేక పండితులు సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. ప్రత్యేక పూజలతో పాటు అష్టవిధ మహామంగళహారతులు ఇచ్చి ఊంజల్ సేవను నిర్వహించారు.
గజవాహనంపై గ్రామోత్సవం..
మహానందిలో శనివారం శ్రీకామేశ్వరీ దేవి అమ్మవారు గజవాహనంపై చంద్రఘంట దుర్గ అలంకారంలో కొలువుదీరారు. ముందుగా గజవాహనంపై అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి నేటి ఉభయదాతలచే వేద పండితులు పూజాదికాలు నిర్వహించి నారీకేళ కూష్మాండ బలి ఇచ్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. స్వామివార్ల పల్లకీ ఆలయ పురవీధులలో విహరిస్తూ నంది సర్కిల్‌కు చేరుకున్నది. అక్కడ నంద్యాలకు చెందిన చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. గ్రామోత్సవం అనంతరం సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎఇఓ ధనుంజయ, పర్యవేక్షకులు పరుశురామశాస్ర్తి, వెంకటేశ్వర్లు, ఈశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలి
* ఈడి జయరావు
కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 23:ఆర్టీసీ కర్నూలు రీజియన్‌లో బస్సులను సకాలంలో నడిపి లాభాల బాటలోకి తీసుకెళ్లాలని ఏపిఎస్ ఆర్టీసీ ఈడి జయరావు డిపో మేనేజర్లకు సూచించారు. స్థానిక బళ్లారి రోడ్డు చౌరస్తాలోని ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాలలో శనివారం ఆర్టీసీ కర్నూలు రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్‌తో కలిసి ఈడి డిపో మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడి మాట్లాడుతూ ప్రయాణికుల సమయానుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలన్నారు. ప్రయాణికులతో ఆర్టీసీ కార్మికులు స్నేహభావంతో వ్యవహరించాలన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకుంటామనే నమ్మకం ప్రయాణికుల్లో కల్గించాలన్నారు. సమావేశంలో జోనల్ కళాశాల ప్రిన్సిపాల్ రజియా సుల్తానా, సిటిఎం బ్రహ్మానందరెడ్డి, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటండి
* అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ శరవనణ్
ఆత్మకూరు, సెప్టెంబర్ 23:ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అటవీ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ శరవనణ్ సూచించారు. పర్యావరణం అంశంపై శనివారం మండల పరిధిలోని నల్లకాల్వ గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం సమతుల్యం దెబ్బతింటుందని కావున ప్రజలు చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అడవులు అంతరించిపోతే కరవు కాటకాలు సంభవిస్తాయన్నారు. ప్రతిఒక్కరూ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ డిఎఫ్‌ఓ సెల్వం, స్క్వాడ్ డిఎఫ్‌ఓ ఆంజనేయులు, రెయిన్‌గన్ల సిబ్బంది పాల్గొన్నారు.
వేరుశెనగ పంటల పరిశీలన
కోడుమూరు, సెప్టెంబర్ 23:మండల పరిధిలోని చిల్లబండ, ఎర్రదొడ్డి గ్రామాల్లో క్షేత్ర ప్రదర్శన కింద సాగు చేసిన 5 రకాల వేరుశెనగ వంగడాల పంటలను శనివారం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ బృందం రైతులతో వేరుశెనగ పంటల సాగుపై మట్లాడారు. రైతులకు అందజేసిన 5 రకాల వేరుశెనగ వంగడాల ద్వారా సాగు చేసిన పంటలు అన్నీ ఆశాజనకంగా ఉన్నాయి. చిల్లబండ గ్రామంలో లక్ష్మీకాంతరెడ్డి సాగు చేసిన నూతన వేరుశెనగ కదిరి-9 రకం విత్తనాల ద్వారా పంటలు బెట్టరాకుండా అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. పంటలను పరిశీలించిన వారిలో బృందం సభ్యులు నూనెగింజల అభివృద్ధి అధికారి ధనుంజయ్య, మల్లికార్జునరావు, సాయిబాబాతో పాటు కోడుమూరు వ్యవసాయ అధికారి అక్బర్‌బాషా, ఎంపిఇఓలు విశాలాక్ష్మి, బిందు ఉన్నారు.
ఎస్‌ఆర్‌బిసి కాలువకు నీరు..
* ఆనందంలో రైతులు..
బనగానపల్లె, సెప్టెంబర్ 23 : ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్‌ఆర్‌బిసి కాలువలకు ఎట్టకేలకు నీరు చేరడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఆలస్యం కావడంతో రైతులు వచ్చిన అవకాశా న్ని సద్వినియోగం చేసుకునేందుకు పంట వేయాల్సిన, వేసిన పొలాలకు నీరు అందుంచుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఎస్‌ఆర్‌బిసి కాలువ లో శుక్రవారం రాత్రికి నీరు బన గానపల్లెకు చేరింది. అధికారులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద వదలిన నీరు 3 రోజులకు బనగా నపల్లెకు చేరుకుంది. బనగానపల్లె డివిజన్ పరిధిలో 50వేల ఎకరాలు, కోవెలకుంట్ల డివిజన్ పరిధిలో 48వేల ఎకరాలు, పాణ్యం, నంద్యాల డివిజన్ల పరిధిలో 80వేల ఎకరాలు సాగవుతోం ది. ఈసారి తొలకరి వర్షాలు కురవక రైతులు డీలపడ్డారు. 10 రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో పొలాలు పదునయ్యాయి. ఇప్పటికే వేసిన, వేయాల్సిన పంటలకు ఈ వర్షాలు ఊతం ఇచ్చినట్లైంది.
కాగా కృష్ణా, తుంగభద్ర నదులకు ఎగువన కర్నాటక, మహారాష్టల్రో భారీవర్షాలు కురవడంతో ఎగువ ప్రాజెక్టుల నుంచి నీరు దిగువకు విడుదలైంది. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 862 అడుగులకు చేరింది. ఎస్‌ఆర్‌బిసి కింద ప్యాకేజీ 26,27 వద్ద పనులు జరుగుతున్నందు న మట్టికట్టలు అడ్డువేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నీరు విడుదల చేయడంతో ఆ నీరు దిగువకు చేరేందుకు మట్టికట్టలను కొంతమేరకు తొలగించడంతో కాలువల్లో నెమ్మదిగా నీరు దిగువకు చేరుతుంది.
వ్యభిచార గృహ నిర్వాహకురాలి అరెస్టు
కర్నూలు, సెప్టెంబర్ 23:నగరంలోని వీకర్‌సెక్షన్ కాలనీలో ఉన్న ఎన్టీఆర్ బిల్డింగ్ సెంటర్ వద్ద వ్యభిచార గృహం నిర్వహిస్తున్న పూల లక్ష్మిని శనివారం అరెస్టు చేసినట్లు 3వ పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. సిఐ తెలిపిన వివరాలు.. ఈమె గతంలో గణేష్ నగర్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తుండగా 2016 మే 20వ తేదీ అరెస్టుచేశారు. పూల లక్ష్మి గత ఐదేళ్ల నుంచి వ్యభిచార గృహం నిర్వహిస్తూ నర్సాపురం, విజయవాడ, వైజాక్, తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను కొనుగోలు చేసుకొని వచ్చి వ్యభిచారం నిర్వహిస్తుండేదని తెలిపారు. లక్ష్మి ఇతర ప్రాంతాల నుంచి ఏజెంట్ల ద్వారా అమ్మాయిలను కొనుగోలు చేసి వ్యభిచారం నిర్వహించే వారని, కస్టమర్లను ఫోన్ ద్వారా పిలిపించుకునే వారని విచారణలో తేలిందన్నారు. ఈ నెల 10వ తేదీ డిఎస్‌ఆర్ లాడ్జిలో దొరికిన ఆమె అనుచరులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. కాగా ఈ నెల 14వ తేదీ అంతర్రాష్ట్ర వ్యభిచార గృహ నిర్వాహకురాలు వైజాక్‌కు చెందిన సోనులారున్‌ఖాతున్, ఆమె భర్త రసూల్‌ఖాన్‌లను అరెస్టు చేసి, వారి నుంచి ఐదుగురు బాధిత మహిళలు, ఇద్దరు బాలికలను విడిపించి స్వస్థలాలకు పంపినట్లు తెలిపారు. అరెస్టులో షీ టీమ్ ఎస్‌ఐ విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీశైలంలో ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీశైలం, సెప్టెంబర్ 23: శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం వారు భారత ప్రభుత్వపు దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక కేంద్రం తంజావూరు వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం పుష్కరిణి వద్ద గల భ్రామరీ కళామందిరంలో ఏర్పాటు చేసిన ప్రముఖ కవి పండితులైన శివలంకె ప్రకాశరావు కాకినాడ వారిచే దేవీ భాగవత ప్రవచనం, విచిత్రపళికండి కుండుచురి వారిచే మోహిణీ ఘట్టం ఇందిరా కామేశ్వరీ హాండ్‌నెట్టి సరళ మూర్తినగర్ హైదరాబాద్‌వారిచే గాత్రకచేరి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటితో పాటు ఆలయ సాంప్రదాయాల్లో భాగంగా సాంప్రదాయ కళల పర్యవేక్షనకు గాను దేవస్థానం వారు గ్రామోత్సవంలో ఏర్పాటు చేసిన నాదస్వరం, కోలాటం, చెక్క భజన, వీరప్పడోలు, నందికోల సేవ, పగటి వేషాలు, బుట్టబొమ్మలు, గజ్జెలు, కర్నాటక డోలు విన్యాసాలు, గొరువయ్య నృత్యాలు భక్తులకు ఎంతగానో ఆకర్షించాయి.
ఘనంగా స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 23 : నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని వేడుకలు ఇఓ కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నల్లమలలో వెలసిన నవనారసింహులను ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు పూజలు చేశారు. దిగువన వెలసిన శ్రీ ప్రహ్లాదవరదుడు, అమృతవల్లి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులు ప్రహ్లాదవరదుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లనుప్రత్యేకంగా ఆలయ ఆవరణంలో వుంచి ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలాచార్యులు, అర్చకులు సుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం ప్రధానార్చకులు మాట్లాడుతూ లోకం సుభిక్షంగా వుండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో కళకళలాడాలని కోరుతూ హోమం నిర్వహించామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. స్వాతి దర్శనానికి వచ్చిన భక్తులకు పావనా, కారంజ, మాలోల, యోగానంద ఆలయాల వద్ద అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేశారు. స్వాతికి కలినడకన వెళ్లి నవనారసింహులను దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాన్నది భక్తుల ప్రగాడ నమ్మకం. స్వాతి సందర్భంగా ఎగువ అహోబిలంలో, దిగువ అహోబిల ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి.
అహోబిలేసుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి...
పుణ్య క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తి భట్ కుటుంబసభ్యులతో శనివారం దర్శించుకున్నారు. ఆయన రాకను పురష్కరించుకొని ఆలయ ప్రధానార్చకులు, అర్చక బృందం, ఇఓ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎగువ బాలాలయంలో వున్న శ్రీ జ్వాలానరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను, దిగువ ఆలయంలో కొలువుదీరిన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తి అనుపమా చక్రవర్తి, నంద్యాల న్యాయమూర్తి ఇంతియాజ్ అహ్మద్, ఆళ్లగడ్డ న్యాయమూర్తులు నరేష్, దివాకర్, న్యాయవాదులు శివరామిరెడ్డి, నీలకంఠేశ్వరం, శివప్రసాదరావు, ఎపిపి రమాదేవి, సుబ్బారెడ్డి, రూరల్ ఎస్‌ఐ రామయ్య తదితరులు వున్నారు.

మల్లన్న సేవలో ఎండోమెంటు రెవెన్యూ చీఫ్ సెక్రటరీ
శ్రీశైలం, సెప్టెంబర్ 23: శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఎండోమెంటు రెవెన్యూ చీఫ్ సెక్రటరీ మన్మోహన్‌సింగ్ స్వామి అమ్మవార్లను దర్శించుకొని సేవ ఇంచుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని సేవించుకున్నారు. ఈసందర్భంగా ఆయన ఆలయ ఈవో నారాయణ భరత్‌గుప్తాతో కలసి ఆలయ మాడావీధులు, ఘంటామఠం, గోశాల, నీలకంఠ యాత్రిక వసతి సదుపాయం, వలయ రహదారి మార్గాన్ని పరిశీలించి శ్రీశైంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ప్రిన్సిపల్ సెక్రెటరికి అర్చక వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందించారు.
ఉమాదేవి అలంకారంలో వాసవీమాత
ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 23: పట్టణంలోని శ్రీ వాసవీ పరమేశ్వరీ ఆలయంలో మూడవరోజైన శనివారం శ్రీ వాసవీమాత శ్రీ ఉమాదేవి అలంకరంలో భక్తులకు దర్శనిచ్చారు. ఉదయం నుండి ఆలయంలోకొలువున్న శ్రీ వాసవీమాతకు పట్టణంలోని ఆర్యవైశ్యులు తరలివచ్చి పూజలు చేశారు. పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు తొమ్మండ్రు వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే విశ్వరూపానగర్‌లోని కాళికామాత ఆలయంలో అమ్మవారు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు చంద్రశేఖర్ ఆచారి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. దసరా పండుగ అధ్యక్షులు యాడికి గోపాలాచారి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
చంద్రఘంట అలంకారంలో చౌడేశ్వరీమాత
బనగానపల్లె, సెప్టెంబర్ 23: దేవీ శరన్నరవాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం మండల పరిధిలోని నందవరం శ్రీ చౌడేశ్వరీమాత చం ద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ పివి కుమార్‌రెడ్డి, ఈఓ రామానుజన్ పర్యవేక్షణలో ఉత్సవాలు వైభవంగా కొనసాగుతు న్నాయి. అర్చకులు ఉదయం నుంచి అమ్మవారికి విశేష అలంకరణ, పూజలు, కుంకు మార్చనలు, సహస్రనా మార్చనలు నిర్వహించారు. ఆలయంలో సాయం కాలం ప్రాకార రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
టిడిపితోనే సంక్షేమ కార్యక్రమాలు సాధ్యం : ఎమ్మెల్యే బ్రహ్మా
నంద్యాల, సెప్టెంబర్ 23: పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకొనేందుకు తెలుగుదేశం పార్టీ మెరుగైన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని మూలసాగరం వార్డులో కౌన్సిలర్ ఫాతిమాతో కలసి ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో పాల్గొని పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంకా పేదలకు రేషన్‌కార్డులు, పెన్షన్లు అందని వారు తగిన దరఖాస్తులు అందజేస్తే అందరికీ రేషన్‌కార్డులు, పెన్షన్లు, పక్కా గృహాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎవిఆర్ ప్రసాద్, కౌన్సిలర్లు కొండారెడ్డి, శివశంకర్ యాదవ్, అమానుల్లా తదితరులు పాల్గొన్నారు.