కర్నూల్

స్కందమాతగా శ్రీకామేశ్వరీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, సెప్టెంబర్ 25: ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన సోమవారం స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున స్వామి వార్లకు సుప్రభాతసేవ, విశేష ద్రవ్య అభిషేకాలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం సోమవారం ఉభయదాతలైన పాణ్యం చెందిన వసంతకుమార్, పద్మావతి దంపతులచే, కర్నూలుకు చెందిన శ్రీనివాస శర్మ, పద్మలచే, నంద్యాలకు చెందిన రవిప్రసాద్, సరిత దంపతులచే, నెల్లూరుకు చెందిన విజయకుమార్, సౌమిని దంపతులచే, గోపవరంకు చెందిన ఎవి కృష్ణారెడ్డి, నాగలక్ష్మి దంపతులు, మహేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, లింగమయ్యలచే వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారామ్‌భట్, జ్వాలా చక్రవర్తిలతోపాటు ప్రత్యేక వేదపండితులు దాతలను కంకణదారులను చేసి పూజ లు నిర్వహించారు. ప్రత్యేక యాగశాలలో కలశ పూజలు, చండీహోమాలు, కూష్మాండబలి, కలశ పూజలు, మహానివేదన కార్యక్రమాలు నిర్వహించారు.
సహస్ర దీపాలంకరణ..
దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని స్కందమాత దుర్గగా అలంకరించి అలంకార మండపంలో కొలువుదీర్చారు. ఉభయ దాతలతో వేదపండితుల వేదమంత్రాలతో సహస్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. వేద సమర్పణంతోపాటు అష్టావిధ మహా మంగళహారతులు ఇచ్చి తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు.
వ్యాఘ్ర వాహనంపై గ్రామోత్సవం..
మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ కామేశ్వరి అమ్మవారు స్కందమాత దుర్గగా అలంకరించి వ్యాఘ్ర వాహనంపై గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించా రు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున అమ్మవారిని స్కందమాతగా అలంకరించి వేదపండితుల వేదమంత్రాలతో అశేష జనవాహిని మధ్య గ్రామోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అలంకార మండపంలో పల్లకిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి ఉభయ దాతలతో కూష్మాండ, నాలికేళ బలులు ఇచ్చి గ్రామోత్సవం ప్రారంభించారు. ఉత్సవం అనంతరం సామూహిక కుంకుమార్చనలు, వేద ఆశీర్వచనాల నిర్వహించారు. కార్యక్రమాల్లో పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, పరశురామ శాస్ర్తి, ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
సంతానలక్ష్మి అలంకారంలో ..
అవుకు : దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజైన సోమవారం శ్రీవాసవీ కన్యాకపరమేశ్వరీమాత సంతానలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజలకు ఉభయదారులుగా బైసాని సత్యరాధాక్రిష్ణమూర్తి, కొండూరు లక్ష్మినారాయణ వ్యవహరించగా అమ్మవారికి పట్టుచీర సమర్పణ సేవలో నగరూరి క్రిష్ణయ్య దంపతులు పాల్గొన్నారు. ప్రసాద వితరణ సేవలో తాళేపల్లె సుబ్రహ్మణ్యం దంపతులు పాల్గొని పూజలు నిర్వహించా రు. అనంతరం మంగళహారతి ఇచ్చా రు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా వాసవీ కన్యకాపరమేశ్వరి మాత ఆలయంలో మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి వాసవీమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ముడియం జయచంద్రారెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బూర్గల సుబ్రహ్మణ్యం, యువజన సంఘం అధ్యక్షుడు మల్లెల సునీల్‌కుమార్, తల్లం నాగభూషణం, మేడం ఆంజనేయులు, అలువాల వెంకటసుబ్బయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.
శ్రీలలితాదేవి అలంకరణలో ..
నందికొట్కూరు : పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో సోమవారం అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అలాగే పట్టణంలోని శ్రీచౌడేశ్వరీదేవి, కోట ఆంజనేయస్వామి, వీరభద్రస్వామి, కాశీ విశే్వశ్వరస్వామి, సాయిబాబ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం
* ఎమ్మెల్యే ఐజయ్య
నందికొట్కూరు, సెప్టెంబర్ 25:టిడిపి పాలనలో కేవలం ప్రచారానికే ప్రాముఖ్యత ఇస్తున్నారని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. ప్రజలకు కనీసం తాగునీరు అందించలేని పాలకులు ఇంటింటికీ వెళ్లి ఏమి ఒరగబెట్టామని చెబుతారని ధ్వజమెత్తారు. పట్టణంలోని సాయిబాబాపేటలో సోమవారం ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో ‘వైఎస్‌ఆర్ కుటుంబం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంలో రెండు నెలలుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా సాయిబాబాపేట, హాజీనగర్, మారుతీనగర్, సుబ్బారావుపేట, కాలేజీ రోడ్డు ప్రాంతాలతో పాటు పలు కాలనీల్లో వర్షాకాలంలో ప్రజలు నీటికోసం ఇబ్బందులు పడుతుంటే ఇటు అధికారులుగానీ, అటు అధికారంలో వున్న ప్రజాప్రతినిధులు కానీ సమస్య పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా సమస్యలు పరిష్కరించి ప్రజల మధ్యకు వెళ్లాలని హితవు పలికారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, మాలమహానాడు తాలుకా అధ్యక్షుడు అచ్చన్న, శేషు పాల్గొన్నారు.
నేడు డోన్‌కు పిఎసి కమిటీ రాక
డోన్, సెప్టెంబర్ 25:మండల పరిధిలోని అబ్బిరెడ్డిపల్లె చెరువును పరిశీలించడానికి మంగళవారం డోన్‌కు ప్రజా పద్దుల సంఘం(పిఎసి) కమిటీ వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పిఎసి చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పర్యటిస్తారని పేర్కొన్నారు. కమిటీలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు వైకాపా, సిపిఐ, సిపిఎం, బిజెపితో పాటు వివిధ పార్టీల సభ్యులు పాల్గొంటారని వైకాపా జడ్పీటిసి సభ్యుడు శ్రీరాములు తెలిపారు. వారు చెరువులను పరిశీలించి వాటి అభివృద్దిపై నివేదిక ఇవ్వనున్నట్లు వారు వివరించారు.