కర్నూల్

ప్రజాప్రతినిధుల సూచనలు సలహాలు పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 13: సమీక్షా సమావేశాలు, ఇతర ఏ సమావేశం జరిగినా ప్రజాప్రతినిధులు ఇచ్చే సూచనలు, సలహాలను అధికారులు పాటించాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ కోరారు. కర్నూలులో శుక్రవారం సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమావేశాల్లో చర్చ జరిగిన సందర్భంలో ప్రజాప్రతినిధులు అధికారులకు ఇచ్చే సూచనలు, సలహాలను పుస్తకాల్లో రాసి ఆ తరువాత వాటిని పట్టించుకోకపోవడం వల్ల అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక ప్రజాప్రతినిధులు పలు సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు ఇస్తారని వాటిని కూడా పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని, చర్చల సారాంశాన్ని పుస్తకాల్లో రాసి వౌనంగా ఉండటం కాదని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని, అక్కడి నుంచే వచ్చే సమాధానాలను ప్రతి ప్రజాప్రతినిధికి పంపాలని ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో తెలుగుగంగ అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి బ్రహ్మ సాగర్ జలశాయానికి సంబంధించిన సమస్యను ప్రస్తావిస్తూ గత సమావేశంలో కూడా తాను ఇదే విషయం సమావేశంలో చర్చకు తీసుకువచ్చానని అయితే ఇంతవరకు సమస్య పరిష్కారం కాకపోగా ఏ స్థితిలో ఉందో కూడా సమాచారం లేదని విమర్శించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ జల వనరుల శాఖ ఒక్కటే కాకుండా అన్ని శాఖల అధికారులు సమస్యల పరిష్కారం కోసం బాధ్యతాయుతంగా పని చేయాలని కోరారు. అపుడే ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం సాధ్యమై సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకుపోయిన విషయాన్ని అందరికీ తెలిపితే తాము సైతం సంబంధిత శాఖా మంత్రి అవసరమైతే ముఖ్యమంత్రితో చర్చించి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇక నుంచైనా అధికారులు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అలవాటు చేసుకోవాలని కోరారు. కాగా సాగునీటి సలహా మండలిలో ఎపుడూ ప్రస్తావించే అంశాలే మరో మారు చర్చకు రావడంపై వైకాపా సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చ సాగడమే కాని పరిష్కారం కావడం లేదని వారన్నారు. శ్రీశైలం జలాలను రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు అందించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంభిస్తోందని వారు ఆరోపించారు. ఒక్కో జిల్లాకు ఒక్కో విధంగా నీటిని అందించడం వల్ల ప్రజల మధ్య అభప్రాయ బేధాలు ఏర్పడి ప్రాంతీయ సమస్యగా తయారవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల్లో అవసరమైన జలాలను నిష్పక్షపాతంగా అందజేస్తే ప్రజలు సంతోషిస్తారన్నారు. కడప జిల్లాకు ఇటు కెసి కాలువ, అటు తెలుగుగంగ కాలువ ద్వారా అవసరమైన నీరు అందించడంలో ప్రతి ఏటా ప్రభుత్వం విఫలమవుతోందని మైదుకూరు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి కడప జిల్లా అధికారులను ఆహ్వానించకుండా తమను మాత్రమే ఆహ్వానిస్తే వాస్తవాలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. కాగా దిగువకు నీరు ఇవ్వడం కోసం శ్రీశైలం కుడి ప్రధాన కాలువ నుంచి అత్యధికంగా నీటిని వెలుగోడు జలాశయానికి తరలించడం వల్ల వెలుగోడు మండలంలోని పలు గ్రామాల లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దిగువకు నీరు ఇవ్వడం తనకూ సంతోషమేనని అయితే అందుకోసం ఎగువన ఉన్న ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. కృష్ణా జలాల అంశం చర్చకు వచ్చిన సందర్భంలో పట్టిసీమ అంశం ప్రస్తావనకు రాగా ఆ ప్రాజెక్టు కారణంగా గత ఏడాది ఏ ఇబ్బంది లేకుండా శ్రీశైలం జలాశయం నుంచి 75 టిఎంసిల నీటిని రాయలసీమకు అందించగలిగామని సాగునీటి శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని కారణంగా అటు కోస్తాంధ్రా, ఇటు రాయలసీమలో రైతులు మంచి దిగుబడులు సాధించి సంతోషించారని సాగునీటి అధికారులు వెల్లడించగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేయగా వైకాపా సభ్యులు కాగితాల్లో మాత్రమే లెక్కలు ఉన్నాయని, వాస్తవంగా నీరు అందలేదన్న వాస్తవం రైతులకు తెలుసునని పేర్కొనడం గమనార్హం. ఈ సమావేశంలో కలెక్టర్‌తోపాటు ఎంపిలు ఎస్పీవై రెడ్డి, టీజీ వెంకటేష్, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సాగునీటి సంఘాల అధ్యక్షులు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.